(పాఠకులకు గమనికః క్రింది
వ్యాసంలో కొంతభాగం మాత్రమే సాక్షి దినపత్రిక , అక్టోబర్ ౩౦ తేదీ సంచికలో
వచ్చింది)
కన్యాశుల్కంలో అగ్నిహో త్రావధాన్లు భార్య వెంకమ్మ సెలవులకి తన కొడుకుతో
వచ్చిన గిరీశాన్ని ‘‘మీరిద్దరూ ఇంగ్లీషులో మాట్లాడుకోండిబాబూ!’’ అని
అడుగుతుంది. వారి మాటల్లో ఓ ఆంగ్ల కవిత - రెండు లైన్లు, దొర్లాయి:
A
boy stood on the burning deck
whence
all but he had fled
ఈ కవిత వయస్సు 188 సంవత్సరాలు. బ్రిటిష్ కవయిత్రి ఫెరీసియా డరోతియా హేమర్స్
రాశారు. ఇది కాస్బియాంకా అనే కుర్రాడి కథ. ఈ రెండు శతాబ్దాల్లో ఈ కవితని
చదవని ఇంగ్లీషు కుర్రాడు లేడు. 1798లో నైలు యుద్ధంలో వాస్తవం గా జరిగిన
సంఘటన ఈ కవితకి మూలం. యుద్ధంలో వాళ్ల నాన్న ఓ షిప్పుకి కమాండర్‌గా ఉన్నాడు.
యుద్ధం జరుగుతోంది. ఈ కుర్రాడిని తండ్రి తను వచ్చేదాకా షిప్పుపై డెక్ మీద
నిలబడ మని చెప్పి వెళ్లాడు. షిప్పుకి నిప్పంటుకుంది. ముని గిపోతోంది. మంటలు
లేచాయి. తండ్రి చచ్చిపో యాడు. సిబ్బంది అంతా నీటిలోకి దూకేశారు. కాని
పదేళ్ల కుర్రాడు తండ్రి చెప్పిన మాటకు కట్టుబడి డెక్కు మీదే నిలబడ్డాడు.
మంటల్లో కాలిపోయాడు.
ఈ కవిత ఇన్ని
శతాబ్దాలు పిల్లలకి పాఠ్య గ్రంథం ఎందుకయింది? ఒక విలువ కోసం పదేళ్ల కుర్రాడు
తన ప్రాణాన్నే వదులుకున్నాడు కనుక.
చావు భయంకరమైన మూల్యం. కాని ఒక
విలువకి పట్టాభిషేకం.
అందుకే ఒక జాతికి 188 సంవత్సరాలు తలమానికంగా నిలిచింది, ‘కాస్బియాంకా ఆన్
ది బర్నింగ్ డెక్’.
దురదృష్టం ఏమిటంటే- కొన్ని రూపాయల లాభం కోసం విలువల్ని తాకట్టు పెట్టిన
కథల్ని - మొన్న హుద్‌హుద్ తుపానులో నేను చూశాను. తుపాను మర్నాడు నిస్సహాయంగా
లేచిన వినిమయదారులకు పెట్రోలు లీటరు 200కి అమ్మి కొందరు సొమ్ము చేసుకున్నారు.
ఉచితంగా పాల పాకెట్లను జోడుగుళ్లపాలెంలో లారీ నుంచి పంచుతూండగా
అట్టపెట్టెలతో పాలపాకెట్లను దోచుకున్న వారిని స్వయంగా చూశాను.
జపాన్‌లో డిపార్టుమెంటు
స్టోరులో నిప్పంటుకుంటే లోపలవున్నవారు - ఒకరి తర్వాత ఒకరుగా బయటికి
నడుస్తారు. పరుగులు పెట్టరు. కేకలు వెయ్యరు. వొళ్ళు కాలితే? మనిషే కాలితే?
కాలవచ్చు. కానీ పరుగులు తీయడంవల్ల మొన్ననే పాట్నాలో దసరా ఉత్సవాలలో 32 మంది
నిస్సహాయంగా చచ్చిపోవడాన్ని చూశాం. ఇలాంటిది ఏనాడూ జపాన్‌లో జరగదట. ఎంత
దయనీయమైన స్థితిలోనయినా ఏ ఒక్కరూ తమకి అవసరమయిన ఒక్క పాల పేకెట్‌నే
తీసుకుంటారు. ఇది అపురూపమైన సామాజిక నీతి.
విపత్తుకి లాజిక్
లేదు. కానీ విపత్తుని ఎదుర్కొనే మనస్తత్వానికి లాజిక్ ఉంది. సాధించగలిగితే
అద్భుతమయిన ఫలితం ఉంది.
హుద్ హుద్ గురించి నేను చెప్పిన ఈ
అవినీతిని చదివిన ఓ మిత్రుడు నాగేంద్రరావు టోక్యో నుంచి నాకో ఈమెయిల్ పంపారు.
విషయం ఇది: తుపాన్ పరిస్థితులు చక్కబడ్డాక వినిమయదారులందరూ కలసి 200కి లీటరు
పెట్రోలు అమ్మిన వ్యాపారిని ఎందుకు నిలదీయరు?
ఎందుకు వెలివేయరు? ‘‘ఇతను
నేరస్థుడు. మన అవసరాలతో వ్యాపారం చేసి మనల్ని దోచుకున్నాడు’’ అని ఆ పెట్రోలు
బంకు ముందు ఓ పోస్టరు పెట్టండి. అతని దగ్గర సరుకు కొనకండి. ‘‘నువ్వు దొంగ’’
అని వేలెత్తి చూపండి. అందరికి తెలిసేలాగ చేయండి.
ఏనాడయినా కొన్ని
వేలమంది వినియోగదారుల శక్తి ముందు పదిమంది వ్యాపారుల అవినీతి వీగిపోతుంది.
వ్యాపారి తలవొంచకమానడు.
చక్కబడిన పరిస్థితులలో దొంగని ఎండగడితే అతను మారకపోవచ్చు. కానీ మిగతావారికి
అది తప్పక గుణపాఠం అవుతుంది. ఏనాడయినా
"సమాజం తిరగబడడం
గొప్ప శకునం".
ఇదే 150 సంవత్సరాల కిందట ఒకాయన చేసి చూపించాడు.
ఆయన పేరు గాంధీ. బ్రిటిష్ ప్రభు త్వాన్ని భారత ప్రజలు గద్దెదించారు. అది
చరిత్ర.
కాని ఎవరు పూనుకుంటారు?
మధ్య తరగతి మనిషి అవినీతితో ప్రతిరోజూ రాజీ పడుతున్నాడు. శక్తి లేక కాదు.
గతి లేక. వ్యవధి లేక. ఓపిక లేక. ‘నాకెందుకులే!’ అని నెగిటివ్ ఆలోచనతో.
అన్నిటికీ మించి సామాజిక స్పృహ లేక. అవకాశం ఉన్నా నిలబడే మనస్తత్వం, ధైర్యం
లేక. మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ అనే లాయరు ఆ రోజు అర్ధరాత్రి దక్షిణాఫ్రికాలో
మారిస్ పీటర్స్‌బర్గ్ స్టేషన్‌లో తెల్ల నౌఖరు రైలులోంచి బయటికి గెంటాక
ప్లాట్ ఫారం మీద లేచి ఒళ్ళు దులుపుకుని మూడో క్లాసు టిక్కెట్టు కొనుక్కుని
ప్రయాణం సాగించి ఉంటే అద్భుతమైన లాయరుగా దక్షిణాఫ్రికాలో జీవనం సాగించేవాడు.
మహాత్ముడయేవాడు కాదు.
అవినీతికి తలవొంచే
మనిషే వ్యాపారికి అవకాశం. వ్యక్తి గతమయిన ప్రయోజనం బలహీనత. వ్యవస్థాగతమైన
ప్రయోజనం ఉద్యమం. ‘వ్యక్తికి బహు వచనం శక్తి’ అన్నాడు శ్రీశ్రీ.
పెట్రోలు ఖరీదు చేసిన వ్యక్తి బలహీనుడు కావచ్చు. కాని నలుగురూ కలిస్తే
ఉద్యమం అవుతుంది. వ్యాపారికి హెచ్చరిక అవు తుంది. మా మిత్రుడు చెప్పింది -
దేశ స్వాతంత్య్ర ఉద్యమం కాదు. మీ పేటలో, మీ వాడలో- మీ అవసరాన్ని అవకాశం
చేసుకున్న వ్యాపారి పట్ల నిరసన. ఒక్కసారి- ఒక్కరు- ఒక్కచోట చేస్తే ఇది
కార్చిచ్చు అవుతుంది. దేశంలో దావానలంలాగా వ్యాపిస్తుంది.
ఈ ప్రయత్నానికి వ్యక్తిగతమయిన నిజాయితీ పెట్టుబడి.
వ్యక్తి కోపాన్ని సామూహికంగా ప్రదర్శించడం ఆయుధం. ఆ సామూహిక శక్తి
అణ్వస్త్రం.
దీన్ని ఆచరణలో సాధించిన ఓ పదేళ్ల కుర్రాడి పేరు కాస్బియాంకా. ఓ పెద్ద
ప్రజాస్వామ్యం పేరు- భారతదేశం. ఈ 67 సంవత్సరాలలో మనకేమయింది? వ్యవస్థని
తాకట్టు పెట్టే పాల పాకెట్ అయింది మన జీవితం. ఎవరికి దక్కింది వారు దోచుకునే
కుక్కలు చింపిన విస్తరి అయింది మన దేశం. అన్యాయంగా నీకు దొరికిన - లేదా
దక్కించుకున్న పాల పాకెట్ ఏనాడయినా నీ అవసరానికి, నీ ప్రయోజనానికి బాసటగా
నిలిచే, నిలవగల వ్యవస్థ ఔదార్యాన్ని ఫణంగా పెడుతోంది. ఇది నేలబారు మనిషికి
తెలియాలి. అతని రక్తంలోకి ఎక్కాలి. ఆ పని ఓ చిన్న దేశం - జపాన్ - చేసి
అణ్వస్త్ర దాడితో విశీర్ణమైన దేశాన్ని పునర్నిర్మించుకుని ప్రపంచాన్ని
శాసిస్తోంది.
ఇది వ్యక్తి శీలాన్ని మలిచిన ఒక వ్యవస్థకి
కిరీటం.
అక్టోబర్ 30 , 2014
gmrsivani@gmail.com
*************
Read all
the columns from Gollapudi గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ
క్లిక్ చేయండి
|