ఓ ఉద్యమం అస్తమయం
29 సంవత్సరాల కిందట ఓ 16 ఏళ్ల కుర్రాడికి మిత్రులు రమణయ్య రాజాగారు
రాజాలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం యిస్తున్నప్పుడు నేను ఆడియన్స్‌లో ఉన్నాను.
మాండలిన్ శ్రీనివాస్ గురించి అప్పటికి నేను వినలేదు. రాజాగారికి
మతిపోయిందా అనుకున్నాను. ఈ కుర్రాడిని శ్రీశ్రీ, బాలమురళీకృష్ణ, వెంపటి
చినసత్యం, బాపు, టంగుటూరి సూర్యకుమారి, బెజవాడ గోపాలరెడ్డి వంటి దిగ్గజాల
స్థాయిలో ఈయన నిలుపుతున్నాడేమిటి? అని నా ఆశ్చర్యం. కాని వారందరికీ దీటుగా
నిలిచే స్థాయిలో తన స్థానాన్ని అప్పటికే సుస్థిరం చేసుకున్నాడని
తర్వాత్తరవాత ఎన్నోసార్లు ఆతని కచ్చేరీలు వింటూ ముగ్దుడినవుతూ పదే పదే
అనుకుని లెంపలు వేసుకున్నాను. ఆ కుర్రాడు అప్పటికి పదకొండేళ్ల కిందటే తనకంటే
పొడుగ్గా వున్న మాండలిన్‌ని మెడలో వేసుకు తిరిగేవాడు. మరో సంవత్సరానికి-
అంటే ఆరేళ్లప్పుడు -సంగీతాన్ని నేర్చుకోవడం ప్రారంభించి 9వ యేట గుడివాడలో
మొదటి కచ్చేరీ చేశాడు. ఆనాటి సభలో ఆయన కచ్చేరీ ప్రారంభించేటప్పుడు 15 మంది
ఉన్నారు. పూర్తయేసరికి కేవలం 4 వేలమంది ఉన్నారట -ముక్కుమీద వేలేసుకుని
దిగ్బ్రమతో ఆ కుర్రాడి ప్రతిభని చూస్తూ.
తమిళనాడులో తెలుగువాడి పాండిత్యం అంతగా చెల్లదు -అది తెలుగు పాండిత్యం కనుక.
మద్రాసు సంగీతోత్సవాలలో ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ అనే తెలుగు సంస్థ ఈ తెలుగు
కుర్రాడికి -కుర్రాడు కదా అనీ, తెలుగువాడనీ మధ్యాహ్నం ఒంటిగంటకి చాన్స్
యిచ్చారు. ఎవరూ సభలో ఉండని సమయమది. శ్రీనివాస్ కచ్చేరీ ప్రారంభించగానే
సభలోకి ఆ సంస్థ అధ్యక్షులు ప్రముఖ వైణిక శిఖామణి ఎస్.బాలచందర్‌గారు వచ్చారు.
ఆయన వెనుకనే పద్మభూషణ్ శేషగోపాలన్. ఆయన వెనుకనే సంగీత ప్రపంచమంతా గడగడలాడే
విమర్శకుడు 'సుబ్బుడు' వచ్చారు. శ్రీనివాస్ వణికిపోయాడు. అయితే విశ్వాసం
తన సంగీతం మీద. ఖరహరప్రియలో ''చక్కని రాజమార్గము'' వాయించాడు. కీర్తన
అవుతూనే వేదిక మీదకి బాలచందర్ వచ్చి మైకు అందుకున్నారు. బాలచందర్ ముక్తసరి
మనిషి. కాని ఆరోజు పొంగిపోతూ ప్రసంగించారు. శేషగోపాలన్ స్టేజిమీదకు వచ్చి
తనచేతి ఉంగరం తొడిగారు కుర్రాడికి. మరునాడు 'సుబ్బుడు' అతని మీద ప్రత్యేక
వ్యాసమే రాశారు.
అతని 15వ యేట కంచి పరమాచార్య సమక్షంలో కచ్చేరీ చేశారు. పరమాచార్య
ఆశీర్వాదంతో కంచి పీఠం ఆస్థాన విద్వాంసుడయారు. 28వ యేట భారత ప్రభుత్వం ఆయనకి
పద్మశ్రీ బిరుదాన్ని ఇచ్చి సత్కరించింది. బహుశా ఇంత చిన్న వయస్సులో ఆ
సత్కారం పొందిన ఒకే ఒక్క విద్వాంసుడు శ్రీనివాసేనేమో! 1985లో శ్రీకృష్ణ
గానసభలో ఆయన కచ్చేరీకి పుంభావ సరస్వతి ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి వచ్చి
పరవశించి, ఆయనకి 'సంగీత బాల భాస్కర' బిరుదాన్ని ఇచ్చి సత్కరించింది. ఇవి
ఆయనకి దక్కిన పురస్కారాలలో నమూనాలు మాత్రం.
చిన్న వయస్సులోనే ప్రపంచమంతా స్వైర విహారం చేశారు శ్రీనివాస్. కచ్చేరీలో
ఆయనచుట్టూ మురుగభూపతి, విక్కూ వినాయక్‌రాం వంటి దిగ్గజాలు కూర్చుండగా, ఆయన
ప్రతిభకు ఉర్రూతలూగుతూ వారు పక్కవాద్యాలు వాయిస్తూండగా శ్రీనివాస్ కచ్చేరీ
పద్మవ్యూహంలో అభిమన్యుడి విహారాన్ని తలపిస్తుంది.
190 సంవత్సరాల కిందట మన దేశంలోకి ఒక విదేశీ వాద్యం ప్రవేశించింది. దానిపేరు
వయొలిన్. ఇవాళ వయొలిన్ లేని కచ్చేరీని మనం ఊహించలేము. కర్ణాటక,
హిందుస్తానీ సంగీతంలో దాన్ని లొంగదీసుకుని అమృతధారల్ని కురిపించిన ఎందరో
మహానుభావులు మన కళ్లముందు కదులుతారు. ద్వారం వెంకటస్వామి నాయుడు, భువనేశ్వర్
మిశ్రా, పరూర్ వెంకట్రామయ్య, మైసూరు చౌడయ్య, ఎమ్.ఎస్.గోపాలకృష్ణన్, లాల్‌గుడి,
ఎల్.సుబ్రహ్మణ్యం -యిలాగ. ఈ వాద్యాన్ని మన దేశానికి తీసుకువచ్చిన ఘనత
ముత్తుస్వామి దీక్షితార్ సోదరులు బాలూసామి దీక్షితార్‌కి దక్కుతుంది. 39
సంవత్సరాల కిందట అలాంటి మరో సింహాన్ని -మాండలిన్‌ని -జూలుతో పట్టుకుని -కర్ణాటక
సంగీతంలోని గమకాలు, రవ్వ సంగతులు పొల్లుపోకుండా లొంగదీసిన ఘనత శ్రీనివాస్‌ది.
శ్రీనివాస్ గొప్ప భక్తుడు. కంచి పరమాచార్య, సత్యసాయిబాబా, మదర్ థెరెస్సా,
ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి- మొదలయిన వారి చిత్రాలు ఆయన డ్రాయింగు రూము
గోడలనిండా పలకరిస్తాయి. శ్రీనివాస్ గొప్పతనం -తనకు సహకారం అందించే గొప్ప
విద్వాంసుల ప్రతిభకు ఆనందిస్తూ అభినందిస్తాడు. తన వాద్యాన్ని తన్మయుడయి
వాయిస్తాడు. అతని కళ్లు ఓ అలౌకికమైన ఆనందాన్ని పొందుతూంటాయి. ప్రపంచమంతటా
జకీర్ హుస్సేన్, విక్కూ వినాయక్‌రాం, వి.శెల్వ గణష్, హరిప్రసాద్
చౌరసియా, పండిత జస్‌రాజ్ వంటి దిగ్గజాలతో కచ్చేరీలు చేశారు. మైకేల్ బ్రూక్,
ట్రే గన్, నిగెల్ కెన్నెడీ, మైకేల్ నైమాన్, జాన్‌మెక్‌లాఫిన్ వంటి
పాశ్చాత్య సంగీత దిగ్గజాలతో కలిసి కచ్చేరీలు చేశారు. 1992 బార్సిలోనా
ఒలింపిక్స్ ప్రారంభోత్సవ సభల్లో కచ్చేరీ చేశారు. ఒక వింత, గొప్ప సంఘటన.
2005లో లాస్ ఏంజిలిస్‌లో జాన్ మెక్‌లాఫిన్ బ్రదంతో కచ్చేరీ చేశాక,
అభిమానులు క్యూలో నిలబడ్డారు ఆయన ఆటోగ్రాఫ్ కోసం. ఒక పొట్టి వ్యక్తి ఆయన
సంతకం తీసుకుని వెళ్తూండగా శ్రీనివాస్ చూసి ''ఆయన చిత్ర దర్శకులు స్టీవెన్
స్పీల్ బర్గ్‌లాగ ఉన్నారు కదూ?'' అన్నారట పక్కాయనతో. ఆయన నవ్వి: ''ఉండడం
కాదు సార్. ఆయన స్పీల్ బర్గే!'' అన్నారట. ఇజ్రాయిల్‌లో ముత్తుస్వామి
దీక్షితార్ రాసిన కామాక్షి మీద కీర్తనని వాయించి కళకి కులం, మతం, భాషల
ఎల్లలు లేవని నిరూపించారు.
నేనెప్పుడూ ఇలా స్మృతి వ్యాసం రాయలేదు. ఇలాంటి సందర్భాలలో సాధారణంగా నా
అనుభవాలనే ఉటంకిస్తాను. కాని కేవలం వ్యక్తి అనుభవాలకు పరిమితంకాని వైభవం
శ్రీనివాస్‌ది. ఒకసారి విశాఖ కళాభారతిలో కచ్చేరీ అయాక ఆత్మీయుడినై వేదిక
మీదకి వెళ్లి మనసారా అభినందించాను. నా చెయ్యి పుచ్చుకుని ''నేను మీ
అభిమానిని సార్!'' అన్నాడు కళ్లనిండా ఆనందాన్ని పూరించి. ఏనాడూ అభిరుచిని
అటకెక్కించని కళాకారుడు. కచ్చేరీ ముందు ఎప్పుడు పలకరించినా నాకిష్టమయిన రాగం
వాయించమని అడుగుతాను. నేను అడిగానని చెప్పి మరీ వాయిస్తారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా మాసపత్రిక ''సురభి'' ఎడిటర్‌గా ఉన్న రోజుల్లో దేశ
స్థాయిలో ప్రాముఖ్యాన్ని సాధించిన తెలుగు ప్రముఖుల ఇంటర్వ్యూలు చేశాను. ఆ
సందర్భంలో దాదాపు రెండున్నర గంటలు నాతో ఆత్మీయంగా కూర్చుని పాదాభివందనం చేసి,
తన రికార్డులు ఇచ్చి పంపారు. పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణిగారు పోయినప్పుడు
ఆయన ఇండియాలో లేరనుకుంటాను. వస్తూనే నాకు ఫోన్‌చేసి ''నాకు వారి
కుటుంబీకుల్ని తేలీదు. ఒక మహనీయుడు వెళ్లిపోయారు. మీ శ్రీమతికీ, వారి
కుటుంబానికీ నా సానుభూతిని తెలపండి'' అన్నారు.
ఈ సంవత్సరం మా శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ఉత్సవానికి ఆయన కచ్చేరిని
పెట్టాలనుకున్నాం. ఆరోజు వేరే ప్రోగ్రాం ఒప్పుకున్నందుకు చాలా బాధపడిపోయారు.
నాతో క్షమాపణలు చెప్పారు. మా అబ్బాయితో : ''మీ నాన్నగారంటే నాకు చాలా గౌరవం.
వచ్చేయేడు తప్పక కచ్చేరీ చేస్తాను'' అన్నారు. కాని ఆ యేటికి వేళమించిపోయింది.
శ్రీపాద పినాకపాణి ఆయన విద్వత్తుని గురించి చెప్పిన మాటలు
వేదాక్షరాలు.''ద్వారం వెంకటస్వామి నాయుడు తర్వాత -అంతర్ముఖుడై వాద్యాన్ని
పలికించే మాంత్రికుడు శ్రీనివాస్'' అన్నారు. గొప్ప వినయ సంపద, సంగీతం
జీవలక్షణాన్ని పట్టుకునే ఆర్ద్రత, పెరిగినకొద్దీ వొంగే ఇంగితం గల గొప్ప
సంస్కారి శ్రీనివాస్. సంగీతంలో కొత్త వాద్యాన్ని లొంగదీసుకోవడం,
సంప్రదాయవాదుల్ని, ముఖ్యంగా తమిళనాడు పండితుల్నీ, సామాజికుల్నీ వొప్పించడం
సామాన్యమైన విషయం కాదు. అయిదేళ్ల బాలమేధావి జీవితం 45 ఏళ్లకే ముగియడం సంగీత
ప్రపంచానికి దురదృష్టం. మాండలిన్‌కి మారుపేరుగా నిలిచిన శ్రీనివాస్ సంగీత
ప్రపంచంలో గొప్ప అధ్యాయం. గొప్ప ఉద్యమం. ఆయన మృతి గొప్ప ప్రతిభకు క్రూరమయిన
ముగింపు.
gmrsivani@gmail.com
సెప్టెంబర్
29 , 2014
*************
Read all the columns from Gollapudi గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
|
|