మంచి -
మతం
సరిగ్గా ఏభై సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారి నట జీవితాన్ని పెద్ద
మలుపు తిప్పిన ''నిప్పులాంటి మనిషి'' సినీమా రాశాను. క్లైమాక్స్‌లో పోలీసు
ఇనస్పెక్టర్ (ప్రభాకరరెడ్డి) అంటాడు -ముగ్గురు వీరుల్ని -విజయ్ (ఎన్టీఆర్),
షేర్ ఖాన్ (కైకాల), డిసౌజా (రేలంగి) -చూసి: ''ఒకరు హిందువు, ఒకరు ముస్లిం,
ఒకరు క్రిస్టియన్'' అని.
హీరో సమాధానం: ''మంచితనానికి మతం లేదు ఇనస్పెక్టర్. కన్నీరు ఎవరు కార్చినా
అది కష్టానికి గుర్తే...'' ఇది నా కిష్టమయిన, నేను రాసిన డైలాగ్.
ఇప్పుడు మూడు ఉదాహరణలు -ముగ్గురు 'మదరిండియా' లను గురించి.
సరిగ్గా 57 సంవత్సరాల కిందట చరిత్ర సృష్టించిన 'మదరిండియా' మెహబూబ్ ఖాన్‌ది.
రాధ చదువూ సంధ్యాలేని ఒక గ్రామీణ మహిళ. ఇద్దరు కొడుకులు. చిన్నవాడు ఆవేశి.
అవినీతి మీద తిరగబడే ఉద్రేకి. సమాజ ధర్మానికి ఎదురు తిరిగి నేరం చేయబోతే
తల్లి తుపాకీతో కొడుకుని కాల్చి చంపింది. ఇదీ కథ.
ఇందులో మతానికి సంబంధించిన ఉపకథ -రాధ పాత్రని నటించిన మహానటి ముస్లిం
నర్గీస్ . ఆమె కొడుకుగా నటించిన నటుడు సునీల్‌దత్ పంజాబీ. దేశ విభజనలో
జరిగిన మారణ హోమంలో సునీల్ దత్ కుటుంబాన్ని యాకూబ్ అనే ముస్లిం తన ఇంట్లో
ఉంచుకుని కాపాడాడు. ఇది మతాతీతమైన మానవతా చర్య. దరిమిలాను నర్గీస్ -సునీల్‌దత్‌లు
భార్యాభర్తలయారు.
రెండో 'మదరిండియా' మొన్న మొన్నటి కథ. పశ్చిమ బెంగాలులో 24 పరగణాల జిల్లాలో
ఓ బస్సు కండక్టరు -పేరు నజీర్. నలుగురు స్నేహితులతో తప్పతాగి, స్కూల్లో
చదువుకుంటున్న 7 ఏళ్ల పిల్ల మూత్ర విసర్జనకి స్కూలు బయటికి రాగా -ఎత్తుకుపోయి
సామూహికంగా మానభంగం చేశారు. స్పృహ తప్పిన ఆ పిల్లని తుప్పల్లో వదిలిపోయారు.
తాగుడు మైకంలో తను చేసిన ఘనకార్యాన్ని తల్లిముందే వర్ణించాడు ఈ ప్రబుద్ధుడు.
విన్న తల్లి -అయినూర్ బీబీ ముందు పరుగున వెళ్లి ఆ బిడ్డను ఆసుపత్రిలో
చేర్చింది. సరాసరి డైమండ్ హార్బర్ పోలీసు స్టేషన్‌కి వెళ్లి తన కొడుకుమీద
ఫిర్యాదు చేసి అరెస్టు చేయించింది. ఇది తాజా 'మదరిండియా'.
మూడో కథ -ఇంకా అపూర్వం. 54 సంవత్సరాల కిందట జరిగిన కథ. కేరళలో కోజీకోడ్‌లో
ముక్కమ్ అనే పల్లె. అక్కడ ప్రారంభమయింది ఈ కథ. రెండు కుటుంబాలు -హిందూ,
ముస్లిం -చాలా స్నేహంగా ఉంటున్నాయి. వారి పిల్లలు -కాంచన, మొయిద్దీన్.
కలిసి పెరిగారు. కలిసి చదువుకున్నారు. మనసులూ కలిశాయి. కుటుంబాలు ఈ ప్రేమను
వ్యతిరేకించాయి. స్నేహితులు శత్రువులయారు. మొయిద్దీన్ మరో పెళ్లికి
అంగీకరించకపోవడంతో అతన్ని ఇంటినుంచి పంపేశారు. కాంచన కూడా మరోపెళ్లికి
ఇష్టపడలేదు. ఈ ఇరవై సంవత్సరాలూ మొయిద్దీన్ ఏం చేశాడు? తాగి తందనాలాడి
దేవదాసు కాలేదు. బట్టలు చింపుకుని దేశాలు పట్టుకుని తిరగలేదు. స్థానికంగా
ఒక గ్రంథాలయాన్ని ఏర్పరిచాడు. పేదల కోసం సహాయ కార్యక్రమాలను నిర్వహించాడు.
మహిళల సాధికారత (అది లేని కారణంగానే కాంచన తనకి దక్కలేదు.) కోసం సంస్థని
ప్రారంభించే కృషి చేశాడు.
నిర్వీర్యతలోంచి నిజమైన ఆటవిడుపు ఆరోగ్యకరమైన
ఆలోచన ద్వారానే సాధ్యం.
ప్రపంచంలో కల్లా గొప్ప అందకత్తె, సంపన్నురాలు మార్లిన్ మన్రోకి జీవితం
బోరుకొట్టింది. ఆత్మహత్య చేసుకుంది. బిర్లాలు, టాటాలు, అంబానీలు చేసే సేవా
కార్యక్రమాలు సమాజం కంటే ముందు వారికి చాలా అవసరం -గొప్ప జీవితం గొప్పగా
బోరుకొడుతుంది కనుక. టాటా స్థాపించిన ఎన్నో వైజ్ఞానిక సంస్థలు వారి ఉనికికి
ఒక అర్థాన్నీ, జీవితానికి పరమార్థాన్నీ కల్పిస్తాయి. సమాజానికి
స్ఫూర్తినిచ్చాయి. జీవితం విలువ తెలియని వారే ప్రేమ వైఫల్యం వంటి
అసందర్భమైన సమస్యల్లోంచి తేరుకోలేక దేవదాసులవుతారు. మొయిద్దీన్
వైఫల్యంలోంచి స్ఫూర్తిని ఎంచుకున్నాడు. నిస్సహాయతలోంచి నిజమైన లక్ష్యాన్ని
గుర్తుపట్టాడు. అలా రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. 22 సంవత్సరాల తర్వాత -(అప్పటికి
కాంచనకి 41, మొయిద్దీన్‌కి 44) ముక్కమ్‌కి ఆనుకుని ఉన్న నదిలో 1982లో వరదలు
వచ్చి, ఒక పడవలో వెళ్తున్న మొయిద్దీన్ పడవ బోల్తాపడగా కన్నుమూశాడు. ఇది
తెలిసిన కాంచన ఆరుసార్లు ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించింది. కొన్ని
నెలలు ఆసుపత్రిలో ఉంది. అక్కడా చచ్చిపోడానికి ప్రయత్నాలు చేసింది. కాని చావు
కలిసి రాలేదు. గ్రామం వారి కర్తవ్య దీక్షకు చలించిపోయింది. వారికి జరిగిన
అన్యాయానికి కన్నీరు కార్చింది. వారిలో మొయిద్దీన్ తల్లి కూడా ఉంది.
పాతికేళ్ల తర్వాత మొయిద్దీన్ తల్లి కాంచనను వెదుక్కుంటూ వచ్చి -''నా కొడుకు
లేకపోయినా నువ్వు నా కోడలివే. నా యింటికి రా'' అంటూ కాంచనను తీసుకువెళ్లింది.
కాంచన మొయిద్దీన్ లేని అత్తవారింటికి చేరి తన ప్రియుడు తలపెట్టి, బతికున్న
రోజుల్లో నిర్వహించే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. గ్రామమంతా కాంచనను
నెత్తిమీద పెట్టుకుంది. ఆమెకిప్పుడు 67 సంవత్సరాలు. ముక్కమ్ గ్రామానికి ఆమె
'మదరిండియా'.
సమాజ ధర్మాన్ని ఉల్లంఘిస్తున్న తన కొడుకుని ఒక తల్లి కాల్చి చంపింది.
పశువులాగ ప్రవర్తించిన ఒక కొడుకుని ఒక తల్లి జైలుకి పంపింది.
పెద్ద మనస్సుతో పెళ్లికి అంగీకరించలేని ఒక తల్లి ఆలశ్యంగానయినా తన తప్పుని
సవరించుకుంది. ఇక్కడ మంచితనమే ఉంది. మతం లేదు. మానవత్వమే ఉంది. మతం లేదు.
నిర్దుష్టమైన బాధ్యతే ఉంది. రాజీకి ఆస్కారం లేదు. అంతకుమించి మతం లేదు.
నిజానికి ఇదే ఏ మతమైనా చెప్పేది. దీనికో పేరుంది -విశ్వమానవ మతం.
ప్రేమ సఫలం కావడం జీవితం కాదు. వైఫల్యాన్ని ఉద్యమం చేసుకోవడం, మమకారాన్ని
బలహీనత స్థాయిలోనే నిలపకుండా సమాజ ధర్మాన్ని కాపాడడంలో గుండెను దిటవు
చేసుకోవడం చరిత్ర.
అందుకు సమాజ
చైతన్యంలో ఇంతకన్న అపురూపమైన ఉదాహరణలు దొరకవనుకుంటాను.
మరొక్కసారి నా 'నిప్పులాంటి
మనిషి'లో నా కిష్టమయిన డైలాగ్:
''మంచితనానికి మతం లేదు. కన్నీరు ఎవరు కార్చినా అది కష్టానికి గుర్తే.''
gmrsivani@gmail.com
సెప్టెంబర్
22 , 2014
*************
Read all the columns from Gollapudi గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
|
|