ముద్దుకి వేలం

   

                                      

              

            ఈ మధ్య కెనడాలో 49 ఏళ్ల సినీతార ముద్దుని వేలం వేయగా 48 లక్షల రూపాయలు వచ్చింది. ఆ ముద్దుని ఎల్టన్‌ జాన్‌ ఎయిడ్స్‌ సంస్థ విరాళం కోసం వేలం వేశారు. ఇంగ్లండ్‌ మోడల్‌, నటీమణి ఎలిజబెత్‌ హర్లీ ఈ ముద్దుని పెట్టుబడి పెట్టింది. ప్రముఖ భారత కెనేడియన్‌ వ్యాపారవేత్త జూలియన్‌ భారతీ 48 లక్షలు చెల్లించి ముద్దుని కొనుక్కుని పదిమంది మధ్య ముఖ్యంగా భార్య సమక్షంలోనే ఎలిజబెత్‌ హర్లీని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఈ ముద్దుకి సామాజికమయిన ప్రయోజనం ఉంది కనుక -ఆయన బార్య అంతగా బాధ పడలేదట.

             ఆ మధ్య ఓ హాలీవుడ్‌ సినీమా వచ్చింది. చాలా అనురాగంతో, ఆత్మీయంగా వున్న భార్యాభర్తలు. ఆర్థికమయిన ఇబ్బందుల్లో వున్నారు. ఓ పార్టీలో ఓ ధనవంతుడితో మాటామాటా వచ్చింది. ఆ ధనవంతుడు -ఈయన భార్య తనతో ఓ రాత్రి గడిపితే కొన్ని లక్షలు ఇస్తానన్నాడు. ధనవంతుడి వికారమా? అహంకారమా? వినోదమా? మానవ బలహీనతల మీద తిరుగుబాటా? అవసరానికీ వ్యక్తిగత విలువలకీ మధ్య అతి పల్చటి తెరలున్నాయని నిరూపించడానికా? ఏదయినా కానీ. ఒక రాత్రే కదా? భార్యభర్తలు తర్జనభర్జనలు పడ్డారు. అవసరం నిలదీస్తోంది. అవకాశం బులిపిస్తోంది. తేల్చుకోవలసిందల్లా తమ మధ్య మానసికమైన ఒప్పందం. అంతకన్న ఆ వ్యవస్థలో పెద్ద నిలదీసే అడ్డంకులు లేవు -వుంటే ఈ సినీమాయే ఉండేదికాదు కనుక. చివరికి ఇద్దరూ అంగీకరించారు. ''ఈ సినీమా పేరు అసభ్యకరమైన బేరం''. ఇంగ్లీషులో చెప్తే ముద్దుగా ఉంటుంది.The Indecent Proposal..!!

              ఈ రెండు ఉదాహరణలూ మనకి విడ్డూరంగా, అసందర్భంగా, ఒక వికారంలాగా ఉంటాయి. ఆ ఆడవాళ్లు చేసిన రెండు పనులూ మనదేశంలో సామాజిక విలువలకూ, వ్యక్తిగత మర్యాదకూ సంబంధించినవి కనుక.    అలా చేయడం ఊహించలేనంతగా చెలియలికట్టని దాటడం కనుక.

               అయితే ఆ దేశాలకి ముఖ్యంగా ఎలిజబెత్‌ హర్లీకి పెద్ద ఇబ్బంది లేదు. ఆవిడ ఇప్పటికి కనీసం నాలుగుసార్లు పెళ్లి చేసుకుంది. మొదటి భర్త ఇంగ్లీషు నటుడు హ్యూగ్‌ గ్రాంట్‌. తీరా పెళ్లయిన చాలా ఏళ్లకి హ్యూగ్‌ గ్రాంట్‌ బ్రాడ్వేలో ఒక వ్యభిచారి సాంగత్యంలో పట్టుబడ్డాడు. అయినా ఎలిజెబెత్‌ హర్లీ ఆయన్ని అర్థం చేసుకుని క్షమించింది. మరో అయిదేళ్లకి ఇద్దరూ విడిపోయారు. మరో రెండేళ్లకి కొడుకుని కన్నది. ఆ కుర్రాడి తండ్రి నేను తండ్రిని కాదన్నాడు. మరికొన్ని నెలలలోనే ఇండియాలో ప్రముఖ బట్టల వ్యాపారి కొడుకు అరుణ్‌ నాయర్‌తో ప్రేమ వ్యవహారం నడిపింది. వారిద్దరికీ భారతీయ సంప్రదాయం ప్రకారం జోధ్‌పూర్‌లో పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుడు ఎల్ట్‌న్‌ జాన్‌ హాజరయాడు. మరో ఎనిమిదేళ్లకి ఆ భర్తతో విడిపోయి ప్రపంచ ప్రఖ్యాత క్రికెట్‌ ఆటగాడు షేన్‌వార్న్‌తో సఖ్యతని కలుపుకుంది. సరిగ్గా అయిదు నెలల తర్వాత వార్న్‌తో విడాకులు తీసుకుంది. కనుక 'నీతి' కాస్త 'విసులుబాటు'కి -అప్పటి ఇష్టాయిష్టాలకీ సంబంధించిన విషయం విదేశాలవారికి. తత్కారణంగా ప్రజాసంక్షేమానికి ముద్దుని ఫణంగా పెట్టడం పెద్ద ఆక్షేపణీయంకాదు. ఎల్టన్‌ జాన్‌ పేరిట ఏర్పరిచిన ఈ సంస్థకి తనకి చేతనయిన మార్గంలో ఉదారంగా విరాళాన్ని సేకరించిన పెద్ద మనసు ఎలిజబెత్‌ హర్లీది. లేదా కలిసివచ్చిన ఖరీదయిన ముద్దు ఎలిజబెత్‌ హర్లీది.

                  ఇక సినీమా. వ్యక్తి శీలాన్ని, ఆర్థికపరమయిన దైన్యాన్ని త్రాసులో ఉంచితే ఏది జయిస్తుంది? ఈ మధ్య హైదరాబాద్‌లో చిన్న చిన్న వేషాలు వేసే చిన్నకారు బెంగాళీ నటి వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. సంసారంలో ఆర్థికపరమైన యిబ్బందులు, డబ్బు అవసరం దృష్ట్యా తాను ఈ పనిలో దిగవలసి వచ్చిందని స్పష్టంగా చెప్పుకుంది. ఈ కోణంలో ఆలోచిస్తే ''ది ఇండీసెంట్‌ ప్రపోజల్‌'' అనే సినీమా మరీ అంత 'ఇండీసెంట్‌' అనిపించదేమో!

                 చీకటి గదుల్లో ఏంజరిగినా ముద్దుల్నీ, శీలాన్నీ ఘరానాగా వేలం వేసే స్థాయికి యింకా మనదేశం అభివృద్ధిని సాధించలేదు.

                   బాగా బతికిన రోజుల్లో అంటే సిల్క్‌ స్మిత వైభవం, సెక్స్‌ ప్రదర్శన జోరుగా సాగే రోజుల్లో తమిళనాడులో ఒకానొక షూటింగ్‌లో ఒక భక్తుడు ఆమెకు ఏపిల్‌ పండుని ఇచ్చాడు. ఆ ఏపిల్‌ని ఆమె కసక్కున కొరికింది. కొరికిన ఎంగిలి ఏపిల్‌ని వేలం వేస్తే లక్షలు వచ్చాయి. ఎంగిలి ఏపిల్‌ని కొనుక్కున్న అభిమాని దాన్ని ఏం చేశాడో తెలీదు. ఒక మోజుకి, మైకానికి ధర కట్టిన సందర్భమిది.

                సత్యజిత్‌రే 'అశని సంకేత్‌' సినిమా బెంగాలులో భయంకరమైన కరవుని గురించి. ఒక మహా కావ్యం. ఒకానొక సీనులో ఓ భద్రమహిళ తన ఇంట్లో పనిచేసే పనిమనిషి చాటుగా వ్యభిచారం చేసి కొంగులో చారెడు నూకలు తీసుకు వెళ్తూంటుంది. భద్రమహిళని చూసి కృంగిపోదు.

               వెళ్తున్న పనిమనిషిని చూసి ''సిగ్గులేదూ?'' అంటుంది భద్ర మహిళ చీదరించుకుంటూ.
పనిమనిషి ఆగి ''ఉందమ్మా. కాని ఆకలి కూడా ఉంది'' అని వెళ్లిపోతుంది.
వెయ్యి తుపాకుల తూటాలు సంధించిన వొణుకు నరాల్లో కదులుతుంది -ఆ మాట విన్నప్పుడు.

                 ఆకలికి నూకలు, అవసరానికి రూకలు, విరాళానికి ముద్దులూ, కుటుంబ పోషణకి పడక సుఖాలు -వేర్వేరు స్థాయిల్లో అవసరాల్ని మాత్రమేకాక, ఆ వ్యవస్థ విలువల్నీ సమీక్షిస్తాయి.

                       అన్నట్టు ఈ ''ఇండీసెంట్‌ ప్రపోజల్‌''ని తెలుగులో ఎవరో కాపీ కొట్టారు. విశేషమేమంటే తీరా ప్రజలు చూశారు. ఏతావాతా అవినీతికి చిన్న ముసుగు, అవసరానికి చిన్న సాకు, బరితెగించడానికి 'సేవ' అనే లేబుల్‌ -యివాళ చెల్లిపోయే పెట్టుబడులు.

               హైదరాబాద్‌లో దొరికిపోయిన బెంగాలీ చిన్నతారకి గడుసుదనం లేదుగాని, ఆ రాత్రి ఆదాయాన్ని ఆమె గర్వంగా కేన్సర్‌ నివారణ సంస్థకి విరాళంగా ప్రకటించి ఉంటే ఆమె త్యాగానికీ, ఎలిజబెత్‌ హర్లీ ఔదార్యానికి కాస్త దగ్గరతోవ కనిపించేదేమో!

                   ఏమయినా ఔదార్యం పేరిట 'అవినీతి' అనే ముసుగుని తొలగించిన వింత పెట్టుబడులు ఈనాటి సమాజపు పురోగతి. లేకపోతే మనం ముద్దు వేలం గురించి ఎప్పుడయినా విన్నామా?   

                                                                 
          

      gmrsivani@gmail.com   
       సెప్టెంబర్ 15  ,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage