అశ్లీలం - -బూతు

                    సృష్టిలో చాలా అసహ్యకరమైన దృశ్యం -నగ్నత్వం. అందునా మిక్కిలి అసహ్యకరం -స్త్రీ నగ్నత్వం. కనుకనే ప్రపంచంలో కళాకారులు వారు శిల్పులయినా, చిత్రకారులయినా, ఫొటోగ్రాఫరులయినా స్త్రీ నగ్నత్వాన్ని దృశ్యరూపం చెయ్యడాన్ని ఛాలెంజ్‌గా తీసుకుంటారు. చూడడానికి హృద్యంగా, అశ్లీలమనిపించకుండా, సౌందర్యంలాగే స్ఫురించేలాగ కళను ప్రతిఫలించడం కళాకారుడి సవాలు. ప్రపంచంలో అతి అసహ్యకరమైన దృశ్యాన్ని అతి హృద్యంగా మలచడం పెద్ద గ్రాఫ్‌.గొప్ప ప్రతిభకు నిదర్శనం. వీనస్‌ని చూసినప్పుడో, నగ్నంగా కనపించే దేవకన్యల్ని చూసినప్పుడో ఆవేశం కలుగదు. అలౌకికమైన ఆనందం కలుగుతుంది. కారణం అది కళాకారుడి విజయానికి గుర్తు కనుక. దృశ్యంలో తప్పనిసరయిన అశ్లీలతకి అతి కష్టమయిన, క్లిష్టమయిన ముసుగు వేసి సభా, సమాజ మర్యాదను కల్పించడం ఉత్తమ కళ లక్ష్యం.


                మరొక విధంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలో అసభ్యకరమైన దృశ్యానికి సంస్కారమనే అద్భుతమైన అంగీని తొడిగేది కళ. నేను గమనించిన విచిత్రమైన విషయం ఏమిటంటే -ప్రపంచంలోని అన్ని దేశాలలో కళకి పరాకాష్టగా స్త్రీ నగ్నత్వాన్ని ప్రదర్శిస్తే -ఒక్క ఇటలీలో నిజానికి కళలకు కాణాచి అయిన ఇటలీలో తమ శిల్పాలలోగాని, చిత్రాలలోగాని, ఎక్కడా స్త్రీ నగ్నత్వాన్ని ప్రదర్శించరు. ఒక్క పురుషుని నగ్నత్వాన్ని మాత్రమే చూపుతారు. మైకెలాంజిలో ప్రపంచ ప్రఖ్యాత శిల్పం 'డేవిడ్‌' నగ్నంగానే కనిపిస్తాడు. దృష్టిని సంస్కారవంతం చేసేది కళ. దానికంటే పై స్థాయి మరొకటి ఉంది. దృష్టిని సంస్కారం స్థాయిని దాటించి ఆరాధించే స్థాయిలో నిలిపేది -ఆ జాతి సంస్కృతి. ఆ జాతి విశ్వాసం. ఆ జాతి దృక్పథం.


               ఆ మధ్య ఒకాయన -ఆయన రచయిత -శ్రీవేంకటేశ్వరుని సుప్రభాతాన్ని వెలివేయాలని టీవీలో చెప్తున్నారు. ఎందుకని? స్వామిని ''కాంతా కుచాంభురుహ కుట్మల లోల దృష్టే..''అంటున్నాం కనుక -చిన్నపిల్లలు దీని అర్థాన్ని వెదికి చెడిపోతారని. సాక్షాత్తూ అమ్మవారిని తలుచుకునేటప్పుడు మానవునికి కేవలం 'బూతు' మాత్రమే స్పురిస్తుందని మనవాళ మహర్షి గ్రహించకపోవడం చాలా దారుణం. ఎమ్‌.ఎఫ్‌.హుస్సేన్‌కి మనం ఇచ్చినస్వాతంత్య్రం మనవాళ మహర్షికి ఇవ్వలేని స్థాయికి వచ్చింది మన సంస్కారం.


             పసివాడు తల్లిపాలు తాగుతున్నాడు. తల్లి స్థన్యం యిస్తోంది. పసివాడికి ఆ స్త్రీలో సెక్స్‌ స్పురిస్తుందా?తల్లి కనిపిస్తుందా? దృష్టిలో ఆర్ద్రత ఉంటుందా? కామం ఉంటుందా?


                 మళ్లీ ఎమ్‌.ఎఫ్‌.హుస్సేన్‌ సాహెబ్‌గారి ప్రసక్తి. భరతమాతకు బట్టలిప్పి, బట్టల్లేని సీతని బట్టల్లేని హనుమంతుడి చంకనెక్కించి తన తల్లికీ, చెల్లికీ మాత్రం బట్టలు తొడిగిన ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు ఎమ్‌.ఎఫ్‌.హుస్సేన్‌ గారిని ఈ దేశం అత్యంత ఉన్నతమయిన భారతరత్న తప్ప పద్మవిభూషణ్‌తో సహా అన్ని పురస్కారాలను ఇచ్చి నెత్తిన పెట్టుకుంది. ఆయన్ని ఈ దేశానికి రప్పించి మన పెద్దరికాన్ని చాటలేదని అపూర్వ కళాభిమానులు, మేధావులు, మతాతీత బురఖాలు వేసుకున్న పెద్దలు గింజుకున్నారు.


             రెండు గొప్ప సంఘటనల్ని ఇక్కడ ఉదహరిస్తాను. 150 సంవత్సరాలు పైగా మనల్ని పాలించిన బ్రిటిష్‌ పాలకులు మన సభ్యత, సంస్కారం, మనోభావాలకు ఏ చిన్న విఘాతం కలిగినా క్షమించలేదు. ఇది 1923 నాటిమాట. ఆచంట జానకిరామ్‌ తన ''నా స్మృతిపథంలో'' అనే పుస్తకంలో పేర్కొన్నారు.


             అప్పట్లో కౌతా శ్రీరామశాస్త్రిగారు నడిపే 'శారద' ప్రముఖ మాసపత్రిక ముఖ చిత్రాన్ని అప్పటి ప్రముఖ చిత్రకారుడు ప్రమోద్‌ కుమార్‌ చటర్జీ అద్భుతంగా సరస్వతీదేవి చిత్రాన్ని చిత్రించారు. మరిచిపోవద్దు. చిత్రంలో ఉన్నది ఈ జాతి పూజించే సరస్వతీదేవి. అయితే ఈ పత్రికల్ని బట్వాడా చెయ్యడానికి ఆనాటి తపాలాశాఖ తిరస్కరించింది. కారణం -ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి దివ్య మాతృ స్వరూపిణి అయిన సరస్వతికి అంశుకోత్తరీయం లేదు. అంటే పైటలేదు. అందువల్ల ఈచిత్రం అసభ్యమన్నారు. అభ్యంతరకరమన్నారు. ఎవరు? బ్రిటిష్‌ పాలకులు? కాని స్వతంత్ర భారత దేశంలో మనం ఘనతవహించిన ఎమ్‌.ఎఫ్‌.హుస్సేన్‌గారి కళావైదగ్ద్యాన్ని నెత్తిన ఉంచుకుంటోంది మన ప్రభుత్వం.


              మరో సంఘటన. నిజానికి ఇది ఇప్పటికీ చరిత్ర. బ్రిటిష్‌ ప్రభుత్వ చరిత్రలో ఇది ఒకే ఒక అశ్లీలానికి సంబంధించిన కేసు. ప్రముఖ బ్రిటిష్‌ ఉద్యోగి సి.పి.బ్రౌన్‌ 17వ శతాబ్దంలో రాజాస్థానంలో రాజవేశ్యగావున్న ముద్దుపళని 'రాధికా సాంత్వనము' వ్రాతప్రతిని సేకరించి, పరిష్కరించి 1855లో దేశాన్ని వదిలిపోతూ ఓరియంటల్‌ లైబ్రరీకి ఇచ్చివెళ్లారు. 1889 లో వెంకటనరసు అనే ఆయన అనుచరుడు ఆ పుస్తకాన్ని ప్రచురించాడు. 1907 లో ఈ పుస్తకం పునర్ముద్రణ అయినప్పుడు ఇది నాటుగా, రెచ్చగొట్టే విధంగా, అసభ్యంగా, బూతుగా, నిస్సిగ్గుగా, అశ్లీలంగా ఉన్నదన్న విషయం బ్రిటిష్‌ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఏం చెయ్యాలి? సమాజంలో సగటు మనిషి భావాలను ఇది దెబ్బతీస్తోందని గ్రహించారు. ఇంతవరకూ ఇలాంటి సమస్య బ్రిటిష్‌వారికి రాలేదు. దీన్ని బహిష్కరించాలని కోర్టులో దావా వచ్చింది. బ్రిటిష్‌ పాలకులు లండన్‌లో న్యాయ నిపుణులను సంప్రదించారు. ప్రజల విశ్వాసాలను దెబ్బతీసి, వారి సామాజిక శీలాన్ని భంగపరిచే హక్కు తమకు లేదని నిపుణులు భావించగా ''రాధికా సాంత్వనము పుస్తకాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం బహిష్కరించింది. 1947లో టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ బహిష్కరణను తొలగించడం, వావిళ్ల రామస్వామి శాస్త్రులు -అదే వృత్తికి సంబంధించిన మరో గొప్ప గాయనీమణి, పండితురాలు బెంగుళూరు నాగరత్నమ్మ పరిష్కరించిన పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది.

            ఇంతకూ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే -భారతీయుల మనోభావాలను దెబ్బతీసే, వారి హుందా జీవితాన్ని భగ్నపరిచే ఏ అశ్లీలాన్నయినా, అసభ్యాన్నయినా -నిర్దుష్టంగా గుర్తుపట్టి దాన్ని దూరం చేసేందుకు భేషరతుగా విదేశీ పాలకులు ఆనాడు చర్యలు తీసుకున్నారు. భారతీయులు మనోభావాలు దెబ్బతినకుండా హుందాగా బట్టలు వేసుకోండమ్మా అని తల్లులకు, చెల్లెళ్లకూ విజ్ఞప్తి చేస్తున్నానని ఓ పెద్దమనిషి పార్లమెంటులో అంటే సభ్య మహిళలూ, చానల్స్‌ ఆయన్ని నిలదీసి -అది అశ్లీలమయిన మాట అని అతనిచేత క్షమాపణ చెప్పించారు. మగాడి పశుత్వాన్ని ప్రశ్నించక, ఆడదాని స్వేచ్ఛని ప్రశ్నిస్తారేం అని వీరి వాదన. పశుత్వం విచక్షణా రాహిత్యం. ఈ దేశంలో స్త్రీ సంయమనానికి, విచక్షణకీ పెట్టింది పేరు. కనుకనే ఓ పెద్దమనిషి మహిళలకు మర్యాదగా ఈ దేశపు అత్యున్నత శాసనసభ -పార్లమెంటులో విజ్ఞప్తిని చేయడం. విదేశీయులు అశ్లీలం మనల్ని బాధించకుండా చర్యలు తీసుకున్నారు. అశ్లీలం వద్దమ్మా అంటే స్వదేశీయులు క్షమాపణలు చెప్పించుకున్నారు.


             దీనికో పేరుంది -మెజారిటీ విలువలు.
            దీనికి మరో పేరుంది -అభివృద్ధి.
           దీనికే మరో భయంకరమైన పేరుంది -అభ్యుదయం.

                                                                 
          

      gmrsivani@gmail.com   
       సెప్టెంబర్ 01  ,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage