జైహింద్

                                                                              Video Courtesy: YTv
         
            ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 సంవత్సరాలయింది. ఒక వ్యక్తి జీవితంలో అది వృద్ధాప్యం. ఒక వ్యవస్థ జీవనంలో అది పరిణతి. ఈ 67 ఏళ్లలో ఏం జరిగింది? ప్రజాస్వామ్యాన్ని ఆసరాగా చేసుకుని దేశాన్ని దోచుకునే బెల్లింపునీ, చాకచక్యాన్నీ పెంచుకునే శక్తులు రెచ్చిపోయి, మెజారిటీని బలం చేసుకుని రెచ్చిపోయే రోజులొచ్చాయి.

           ఈ దేశంలో మకుటాయమానంగా నిలవగల ఒక కార్పొరేట్‌ సంస్థ అధిపతి సహారా సుబ్రతా రాయ్‌ దేశానికి కోట్ల రూపాయలు బాకీపడి గత రెండు నెలలుగా జైల్లో ఉన్నారు. అలాంటి పనిచేసిన మరొక కార్పొరేట్‌ సంస్థ అధిపతి సత్యం రామలింగరాజు- కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఒక కేబినెట్‌ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి కూతురు జైలుకెళ్లి వచ్చారు. ఒక రాష్ట్రం ప్రతిపక్ష నాయకుడు 11 నెలలు జైల్లో ఉన్నారు. ఒక గవర్నరు రాజ్‌భవన్‌లో శృంగారం నడిపారు. ఒక 87 ఏళ్ల గవర్నరు అధికార దుర్వినియోగానికి బర్తరఫ్‌ అయారు. ఒక ముఖ్యమంత్రి (జయలలిత) తాను పదవిలో ఉండే అర్హతలేదని కోర్టు శాసిస్తే ఒక అనుచరుడు (పన్నీర్‌ శెల్వం) ను కుర్చీలో కూర్చోపెట్టి పాలనను సాగించారు. మరోనాయకుడు లల్లూ ప్రసాద్‌ ఇదే కారణానికి వంటింట్లో ఉన్న తన భార్య (రాబ్రీ దేవి)ని అందలం ఎక్కించారు. తను విదేశీ పౌరురాలన్న కారణానికి ఓ పార్టీ అధ్యక్షురాలు ప్రధానమంత్రినే కుర్చీలో కూర్చోపెట్టి వెనుకనుంచి అవినీతి పాలనని కొనసాగించారు. సుప్రీం కోర్టు తిరస్కరించిన ఒక అవినీతి పరుడయిన న్యాయమూర్తిని ప్రధాని హైకోర్టు న్యాయమూర్తిని చేశారని ఒక మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తే వెల్లడించారు.
             గూండాలూ, రేపిస్టులూ, కుట్రదారులూ, అవినీతిపరులూ గర్వంగా శాసనసభల్లో బారులు తీరారు. బట్టలిప్పుకుని కుర్చీలమీద వీరంగం చేశారు. కాస్త అవినీతిని కొనసాగిస్తే తప్పులేదని నాయకులు ఉద్యోగులకు హితవు చెప్పారు. ఈ పాలక వ్యవస్థకి దశాబ్దాలుగా వెన్నెముకలాగ నిలిచిన ఐయ్యేయస్‌లు నాయకుల అవినీతితో రాజీపడి తలలువొంచుకుని దయనీయంగా జైళ్లకు బారులు కట్టారు. ఈ దేశపు ధనాన్ని ఎందరో నాయకులు, పెద్దలు విదేశీ బాంకులకు తరలించారు. మైనారిటీలను మైనారిటీ నాయకులే దోచుకున్నారు. చట్టం అంటే భయం పోయిన నరరూప రాక్షసులు నిరాటంకంగా రేపులు చేసి, హత్యలు చేస్తున్నారు. నీతికి నిలబడే ఐయ్యేయస్‌లు ఆరు నెలలలో 40 సార్లు బదిలీలవుతున్నారు. ఐపీయస్‌లు మానభంగాలు చేసి కోర్టు బోనుల్లో నిలబడుతున్నారు. మానభంగాలు కుర్ర చేష్టలని పెద్ద పెద్ద నాయకులు కితాబులిస్తున్నారు. ప్రతిపక్షాల నాయకుల్ని నిర్ధాక్షిణ్యంగా మనుషుల్ని పంపి రేపులు చేయిస్తామని బహిరంగంగా నాయకులు బెదిరిస్తున్నారు. అలా బల్లగుద్దిన నాయకులతో ఆయా పార్టీల నాయకులు గ్రూపు ఫొటోలలో నిలబడుతున్నారు. వెయ్యి రూపాయల లంచం తీసుకున్న ఉద్యోగి అరెస్టవుతున్నాడు. కోట్లు దోచుకున్న నాయకుడు పదవుల్లో కూర్చుంటున్నాడు. 'సుజలాం సుఫలాం మలయజ శీతలాం..' అంటూ గర్వంగా ఈ దేశ స్వాతంత్య్రాన్ని ఆహ్వానించిన సగటు మనిషి ఈ అవ్యవస్థలో దారి తెలీక కకావికలవుతున్నాడు. ఇది దయనీయమైన పరిస్థితి.

       మహామహుల, త్యాగధనుల సదుద్దేశాలలోనే వంకరదారులు వెదికి, ఆ దారుల్ని రాజమార్గం చేసుకున్న నాయకమ్మణ్యుల స్వైరవిహారం పత్రికల్లో దైనందిన వార్తా విశేషాలవుతున్నాయి. ప్రపంచంలో 177 అవినీతిపరమయిన దేశాల జాబితాలో మన దేశం 94వ స్థానంలో ఉంది. అయితే ఈ శుభతరుణంలో -ఈ చీకటి కథలనే తలుచుకు కృంగిపోనక్కరలేదు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యమయిన భారతదేశం చాలాకారణాలకి గర్వంగా తలయెత్తుకునే స్థితిలోనే ఉంది. ఎవరు ఏం చేసినా, చెయ్యకపోయినా -ఈ వ్యవస్థ ఏనాడూ ప్రజాస్వామ్యం మీద విశ్వాసాన్ని కోల్పోలేదు. (ఒక్కసారి -ఒకే ఒక్కసారి తన పదవిని, పాలనని కాపాడుకోవడం కోసం ఇందిరాగాంధీ భయంకరమైన తప్పటడుగువేసి ఎమర్జెన్సీని విధించారు). అయితే దేశం తన ప్రతిఘటనను ప్రకటించి ఎదిరించింది.

         ఎన్ని అసంతృప్తులూ, అపశృతులూ ఉన్నా వ్యవస్థలో ప్రజాస్వామ్య ధర్మానికి ఈ దేశం తిలోదకాలివ్వలేదు. ఈ ఒక్క విశేషం చాలు ఈ వ్యవస్థ పరిణతికీ, 'సమాజ ధర్మం' పట్ల విశ్వాసానికీ తలమానికంగా నిలవడానికి. మనతో పాటే స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్న పొరుగుదేశం -పాకిస్థాన్‌ 1958 నుంచి కనీసం మూడుసార్లు సైనికాధిపతులు ప్రజాస్వామికంగా ఎన్నికయిన వ్యవస్థని తొలగించి -మిలటరీ పాలనని చేపట్టారు. కొన్ని దశాబ్దాల పాటు మిలటరీ పాలకులు నిరంకుశంగా ఆ దేశాన్ని పాలించారు. ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రధానిని ఒక మిలటరీపాలకులు ఉరి తీయించారు. ఇవికాక పాలక వ్యవస్థని కూలదోయడానికి ఎన్నోసార్లు పితూరీలు జరిగాయి. ప్రధాని కావలసిన బేనజీర్‌ భుట్టోని పట్టపగలే దారుణంగా హత్య చేశారు. ఇప్పటికీ ఆ దేశంలో తమ దేశీయులే దారుణంగా దాడులు జరిపి మారణకాండని సృష్టించే కథలు ప్రతిదినం చదువుతున్నాం. ఒక వ్యవస్థ పరిణతి చాలని స్థితికి ఇది నిదర్శనం.

         శాస్త్రీయ పరిజ్ఞానంలో, అంతరిక్ష యానంలో, పురోగతిలో, కళలలో, తాత్విక చింతనలో, ఉదాత్తతలో -భారతదేశం ఇప్పటికీ ప్రపంచ దేశాలలో కరదీపికగా ఉంది.
అన్నిటికంటే తలమానికంగా నిలిచే గొప్ప పరిణామం -గొప్ప పరిణతి -ఇటీవల వోటరు ప్రదర్శించినది. ప్రజాస్వామ్యం పేరిట చదువురాని నేలబారు మనిషి చేతిలో వోటుని ఉంచితే ఎలా దుర్వినియోగం చేసుకోవచ్చునో -తెలివైన దోపిడీదారు దాదాపు 65 సంవత్సరాలు పథకాలు వేశాడు. కాని, ఆ దశని వోటరు దాటాడు. నానాటికీ పెచ్చురేగిపోతున్న అవినీతి నాయకుడిని ఎలా గద్దె దించాలో, ఎందుకు గద్దె దించాలో, ఆ శక్తి తన చేతుల్లో ఎంత ఉందో వోటరు గుర్తుపట్టాడు. తన అసంతృప్తినీ, ఆగ్రహాన్నీ, తనకు జరిగే అన్యాయాన్నీ, నయవంచననీ, నాయకుల బుకాయింపునీ నిర్దాక్షిణ్యంగా, క్రూరంగా ఎదుర్కొన్నాడు. నిర్ద్వంద్వంగా సమాధానం చెప్పాడు.

           ఈ దేశంలో కనీవినీ ఎరగని అవినీతికి, ఆత్మవంచనకి, దోపిడీకి, స్వార్థపరత్వానికి ఆటపట్టయిన ప్రభుత్వాలను, పార్టీలను సోదిలోకి లేకుండా తుడిచిపెట్టాడు. దశాబ్దాలుగా బొర్రలు పెంచుకుని నీతివాక్యాలు చెప్తూ, కాలికింద గోతులు తవ్వే నాయకులకు నిలువనీడలేకుండా చేశాడు. అడ్రసులే గల్లంతు చేశాడు. రాష్ట్రాలలో ఆ పార్టీల ఉనికినే సమూలంగా తుడిచిపెట్టాడు. ఇది వోటరు విజ్ఞతకీ, కోపానికీ, నిస్సహాయతను ఆయుధంగా మలుచుకునే విచక్షణకీ నివాళి. ఇవాళ అవినీతిపరుడిని రోడ్డుమీద నిలిపే మాధ్యమాలు తోడు నిలిచాయి. వోటరు తన శక్తిని గ్రహించాడు. తన కోపాన్ని ప్రదర్శించాడు.
          తనకి లంచం ఇచ్చిన పార్టీలనుంచి ఉదారంగా నొల్లుకుని -లంచం ఇచ్చినందుకే నిర్దాక్షిణ్యంగా వాళ్లని సాగనంపాడు. 67 ఏళ్ల భారతదేశం -దారి మళ్లే రోజులు వచ్చాయి. పదవి 'అవకాశం' కాదని, కాకూడదని, అయితే క్షమించేదిలేదని వోటరు హెచ్చరించే రోజులొచ్చాయి. గడుసుగా అవకాశాన్ని చూపి, ఆశలు కల్పించి వోట్లు నొల్లుకునే నాయకుల్ని వోటరు గమనిస్తున్నాడని నాయకులు గతుక్కుమనే రోజులు వచ్చాయి. ఇది భారతదేశానికి శుభసూచకం. బురదలోంచే పవిత్రమైన పుష్పం వికసిస్తుంది. 67 ఏళ్ల బురదలోంచి 'ఆశ' అనే పుష్పానికి భారతీయుడు ఎదురుచూస్తున్నాడు. పరిణతి, విచక్షణ, సామాన్య మానవుడి అవగాహన, ఎట్టి పరిస్థితులలోనూ సమాజ ధర్మానికి విడాకులివ్వని ప్రజాస్వామ్యపు మూలాల పరిరక్షణ ఈ దేశం గర్వంగా సాధించిన విజయం. 67వ మైలురాయి ఈ జాతి గర్వపడే భవితకు మార్గ నిర్దేశం చేస్తుందని ఆశిద్దాం.

                                           జైహింద్‌!

 


      gmrsivani@gmail.com   
           ఆగస్టు 18 ,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage