అధికారం - అభిమానం

               
          నేను ఎక్కడికి వెళ్లినా -అది ఎయిర్‌ పోర్టయినా, రైలు స్టేషనయినా, మరేదయినా -నన్ను చూడగానే కుర్రాళ్లు, ఆఫీసర్లు పరుగున వచ్చినా చేతిలో సూట్‌కేసుని అందుకుంటారు. చిరునవ్వుతో పలకరిస్తారు. రైలు స్టేషనయితే విఐపి రూంలో కూర్చోపెట్టి 'కాఫీ కావాలా సార్‌?' అని అడుగుతారు. ఈ పని మరొకరికీ చేస్తారు. నిజానికి ఆ 'మరొకరికి' మరింత భయంగా చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. నిజానికి వీరెవరూ నాకీ మర్యాద చెయ్యనక్కరలేదు. కాని చేస్తారు. కారణం -వారికి నా పట్ల గల అభిమానం. మిగతావారికి చెయ్యడానికి కారణం -వారి అధికారం. అయిదేళ్ల తర్వాత వారి పెట్టెలు వారే మోసుకోవాలి. కాని నాకిచ్చే మర్యాద నేను జీవితమంతా కష్టపడి సంపాదించుకున్నది. వాళ్లు అభిమానంతో యిస్తున్నది. అధికారం మన స్వేచ్ఛను భంగపరిచే శక్తి. అభిమానం తమ ఆనందాన్ని ప్రదర్శించే మర్యాద.
             నిజానికి వారికా అధికారం ఇచ్చింది మీరూ, నేనూ. ఆ ఆలోచనవారిని మరింత ఒదిగేటట్టు చేయాలి. వారు అనుభవించే ప్రత్యేక మర్యాదలు -వారు మనకి చెయ్యగల, చెయ్యవలసిన బాధ్యతల్ని దృష్టిలో పెట్టుకుని మనం కల్పించింది. ఎంపీగారు పార్లమెంటుకి వెళ్లాలి. అది మనకి ఉపయోగం. మనకంటే ఒకడుగు ముందు వెళ్లడం న్యాయం. క్యూలో అతనికి మినహాయింపు. ఆయన గొప్పతనానికి కాదు. ఆయన అవసరానికి. అవసరాన్ని అవకాశం చేసుకుని, ప్రత్యేక మర్యాదల్ని హక్కులుగా భావించే చాలామందిని మొన్ననే ఓటరు నిర్దాక్షిణ్యంగా గద్దెదించాడు.
           ఓ తెల్లవారుఝామున హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ఒకాయన పెద్ద పెద్ద కేకలు పెడుతూంటే విమానాశ్రయం అంతా షాక్‌ అయి చూసింది. ఆయన రాజకీయ నాయకుడు. రాత్రి తాగిన మందు దిగక -పొద్దుటే నిద్రమత్తులో ఎయిర్‌ పోర్టుకి వచ్చారు. వ్యక్తుల్ని తణిఖీ చేసే ఉద్యోగి ఉత్తర హిందూదేశంవాడు. ఈయన గొప్పతనం తెలీదు. జేబులు తణిఖీ చేస్తున్నాడు. అతనిమీద ఒంటికాలుతో లేచాడు. అదీ సీను. అమెరికాలో మన రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంగారిని రెండుసార్లు ఇలా తణిఖీ చేసిన విషయం విన్నాం. ఆయన చెప్పలేదు. మరెవరో చెప్పారు.
           నిజానికి ఆ ఉద్యోగి చేసేది బాధ్యత. మనకి ఉపకారం. మన శ్రేయస్సు, ప్రయాణీకుల శ్రేయస్సు దెబ్బతినకుండా జాగ్రత్త. నిజానికి ఈ నాయకుడు -ఏమయినా విచక్షణ ఉంటే అతణ్ణి ప్రోత్సహించాలి. కాని మన నాయకుల ఫద్|ష లోనే ఆ దరిద్రం ఉంది. అధికారం జన్మహక్కుగా భావించే మధ్యంతర సిరిమంతులు వీరు. చిన్న చేతి సంచీని ఎయిర్‌ పోర్టు ఉద్యోగి తీసుకురాగా -చేతులూపుకుని ఆలశ్యంగా విమానం ఎక్కే ఎందరో రాజకీయ నాయకుల్ని నాకు తెలుసు.
         ఇది ఢిల్లీదాకా వర్తిస్తుంది. ఈ నాయకులకంటే వారి చెంచాల వీరంగం వర్ణనాతీతం. మర్యాదని పాటించే నాయకుల అనుచరులు -ఈ అరాచకానికి పూనుకోరు. నాయకులకే మర్యాద తెలియకపోతే చెంచాలకేం తెలుస్తుంది?
           మొన్న టీవీలో చూశాను. గుజరాత్‌ గవర్నరు -కమలా బేణీవాల్‌ అనే ముసలావిడ -తన హయాంలో అహమ్మదాబాదు నుంచి తన సొంతవూరు జైపూర్‌కి వెళ్లడానికి కేవలం 53 సార్లు గవర్నమెంటు విమానాన్ని వాడారట. 277 గంటలు విమానంలో ప్రయాణం చేశారట. పదవిలో 500 రోజులు ఇలాంటి పర్యటనల్లో గడిపారట. మరొక అద్భుతమైన నాయకురాలు -మన మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌. ఆమె తమ్ముడు ఈ మధ్యనే ఒక హత్యకేసులో అరెస్టయారు. (పరవాలేదు. అంత పెద్ద నాయకురాలి తమ్ముడు అంత పెద్దవాడు కాకపోవచ్చు. కాలేకపోవచ్చు. తప్పులేదు.) కాని ఆవిడ తన హయాంలో విదేశీ ప్రయాణాలకు -సకుటుంబంగా వెళ్లడానికి కేవలం 18.08 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. తన అయిదేళ్ల పదవిలో 22 దేశాలు -12 విదేశీ యాత్రలు -205 కోట్లు ఖర్చయింది. ఇది మరొక రకమయిన అధికార దుర్వినియోగం. ఇప్పుడు మూడు ఉదాహరణలు చెప్పి -ఈ కాలమ్‌ ముగిస్తాను. ఈ విషయాన్ని లోగడ చెప్పినట్టు గుర్తు. అయినా మరోసారి చెప్పుకుంటే తప్పులేదు. కాగా మంచికి పునరుక్తి దోషం అంటదు.        

      ఇవాళ ముఖ్యమంత్రుల వెనక ఎంతమంది వంధిమాగధులు, చెంచాలు తిరుగుతూంటారో మనం చూస్తున్నాం. సంవత్సరాల కిందట ఒక ముఖ్యమంత్రిగారికోసం రాధారీ బంగళా బయట చాలామంది వేచి ఉన్నారు. లోపల్నుంచి ముఖ్యమంత్రి రావడం ఆలశ్యమవుతోంది. కారణం -ఆయన లాల్చీకి బొత్తాం తెగిపోతే ఒక నౌఖరు ఆయన వొంటిమీద చొక్కాకి బొత్తాం కుడుతున్నాడు! (ఒక ముఖ్యమంత్రి ఈ మధ్యనే 800 జతల బట్టలు కొన్నవార్త పేపర్లో వేశారు!) ఈ ముఖ్యమంత్రి పేరు టంగుటూరి ప్రకాశం. ఆయన జేబులో డబ్బుండదని బయట ఒకాయన ఆయన రైలు టిక్కెట్టుకి డబ్బు ఒక సహచరుడికిచ్చి ''ఆయన డబ్బు పుచ్చుకోరు. టిక్కెట్టు కొని జేబులో పెట్టమ''ని చెప్పి వెళ్లాడు!
               చాలా సంవత్సరాల కిందట -నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపన్యాసానికి వెళ్లాను. మరో ఉపన్యాసకులు వావిలాల గోపాలకృష్ణయ్యగారు. ఆయన చేతిలో ఒక జత బట్టలున్న ఖద్దరు సంచీ. సభ అయాక నేను ఎక్కిన కారులో ఆయన్ని తీసుకెళ్లి బస్సుస్టాండులో దింపాం. మరొక్కసారి -ఆయన ఎమ్మెల్యే. ఈ తరం ఎమ్మెల్యేలకి రూటు బస్సులలో ప్రయాణం ఎలావుంటుందో ఎరగరేమో! వారు అంత:పురాలలో పుట్టివుండరు. అయిదేళ్ల తర్వాత అక్కడ ఉండరు. కాని వారి ఫద్|ష అది.
         మరొకాయన సాయంకాలం 7 గంటలకి తన ఆఫీసు మెట్లు దిగుతున్నాడు. రెండో ఫ్లోరు దగ్గర ఒకావిడ ఒంటరిగా నిలబడి ఉంది. ఎందుకు? లిఫ్టు పనిచెయ్యడం లేదు. ఆయన బాస్‌. ఆమె వద్దని వారిస్తున్నా ఆమెతో ఆగి, స్వయంగా ఆమె కారుదాకా వచ్చి ఆమెని కారెక్కించి మరీ వెళ్లాడు. ఆయన పేరు జే.ఆర్‌.డి. టాటా. ఆవిడ సుధ. తర్వాత ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి గారిని పెళ్లాడి సుధామూర్తి అయారు. మరో కథ.
         కేరళలో తుంబ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఒక సైంటిస్టు పనిచేస్తున్నా డు. ఆఫీసుకెళ్తే రాత్రి ఏ పదిగంటలకో ఇల్లు చేరుతున్నాడు. పిల్లలకి సినీమాకి వెళ్లాలని ముచ్చట. ఓ రోజు -ఉండబట్టలేక భార్య చెప్పిం ది. ఆయన బాధపడిపోయాడు. ఆ సాయంకాలం పిల్లల్ని రెడీగా ఉంచమన్నాడు. అయిదుగంటలకి వచ్చేస్తానన్నాడు. ఆఫీసుకి వెళ్లి బాస్‌తో చెప్పాడు -ఆ సాయంకాలం 5 గంటలకి ఇంటికి వెళ్లి పిల్లల్ని సినీమాకి తీసుకువెళ్తానని. బాస్‌ ఆనందపడ్డాడు. నిజానికి ఉద్యోగం అయిదువరకే. ఆయన పర్మిషన్‌ అడగనక్కరలేదు. ఆ రోజూ ఎప్పటిలాగే పనిలో మునిగిపోయాడు సైంటిస్టు. వాచీ చూసుకునేసరికి రాత్రి తొమ్మిదయింది. భార్య, పిల్లలు గుర్తుకొచ్చి సిగ్గుపడిపోయాడు -మాట చెల్లించలేనందుకు. దిగాలుగా ఇంటికి వచ్చాడు. భార్య ఒక్కతే ఉంది. ''పిల్లలేరీ?'' అన్నాడు. ''సినీమాకు వెళ్లారు'' అందావిడ. ఆశ్చర్యపోయాడు. ''ఎవరు తీసుకెళ్లారు!'' అడిగాడు. ''సాయంకాలం మీ బాస్‌ వచ్చి పిల్లల్ని సినీమాకు వెంటబెట్టుకు వెళ్లారు'' అన్నది భార్య. సైంటిస్టు నిర్ఘాంతపోయాడు. ఆ బాస్‌ పేరు అబ్దుల్‌ కలాం. తర్వాత ఈ దేశానికి రాష్ట్రపతి అయారు. అంతేకాదు. పైన చెప్పిన ఇద్దరూ ఈ దేశంలో 'భారతరత్న'లయారు.
           అధికారాన్ని హక్కుగా భావించడం కుసంస్కారం. దుర్వినియోగం. గవర్నరుగారి విచ్చలవిడితనం దోపి డీ. విచక్షణారాహిత్యం. ప్రశ్నించవలసినంత దుర్మార్గం. ఎదిగినకొద్దీ ఒదిగే పెద్దరికం విస్తరిస్తుంది. విశ్వరూపం దాలుస్తుంది. ఉదాత్తమౌతుంది. వ్యక్తుల్ని ఆకాశాన నిలుపుతుంది. అభిమానం ఎన్నికలలో దొంగదారిన దక్కించు కునే దొంగ సొమ్ముకాదు. పదవుల్ని అడ్డం పెట్టుకుని కొల్లగొట్టే మధ్యంతర సిరికాదు. అవసరమయితే కష్టపడి, నష్టపడి ఎదుటి వ్యక్తి మనసెరిగి మసిలే మహానుభావుల కొంగుబంగారం. అందుకు ఉదాహరణగా -రెండు పేర్లు -జె.ఆర్‌.డి.టాటా, అబ్దుల్‌ కలాం.
 


      gmrsivani@gmail.com   
           ఆగస్టు 4 ,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage