కథలూ - కళలూ 

               
           ఇటీవల విశాఖ కళాభారతిలో ఆంధ్రా మ్యూజిక్‌ అకాడమీ 'నృత్య వైశాఖి' ఉత్సవాన్ని జరిపింది. కొన్ని నెలల కిందట ఇదే సంస్థ రాజస్థానీ జానపద నృత్య కార్యక్రమాన్ని నిర్వహించింది. భారతదేశంలో అటు మణిపూర్‌, గౌహతి నుంచి ఇటు తిరువనంతపురం దాకా వెల్లివిరిసే భారతీయ కళా వైశిష్ట్యాన్ని ప్రతిఫలించే కార్యక్రమం ఇది. అయితే ఈ కాలమ్‌ ఈ కార్యక్రమాల గురించి కాదు. ఆయా నృత్యాలలో ప్రతిఫలించిన ఇతివృత్తాన్ని గురించి మాత్రమే. భారతదేశం తూర్పు పొలిమేరల్లో ఉన్న మణిపురి కళాకారులు ఏ విషయాన్ని తమనృత్యాలలో చెప్తారు? ఆశ్చర్యం. దాదాపు మధ్య ప్రాచ్యం నుంచి -అంటే ఒరిస్సా కవి (జయదేవుని) రాసిన అష్టపది 'జయజగదీశ హరే' అనే దశావతారాలను నృత్యం చేశారు! మరి ఒరిస్సా నుంచి వచ్చిన కళాకారులు? రామాయణ శబ్దం -రావణుడు సీతను అపహరించడం, జఠాయువు వారించబోవడం, అతని వధ -ఇదీ ఇతివృత్తం. పంచభూతాలకు నివాళి ''పుష్పాంజలి'' మరొక ఇతివృత్తం.
ఇటు తిరువనంతపురం -అంటే దక్షిణాదినుంచి -అంటే సేతువునుంచి వచ్చిన సంస్కృతిని ప్రతిఫలించే 'మోహిని ఆట్టం' ఇతివృత్తం ఏమిటి? ఊరేగింపులో వచ్చిన స్వామిని భక్తురాళ్లు రకరకాలుగా వర్ణించుకుని తమకు తెలిసిన దేవుళ్లను తలచుకుంటారు -సూర్యుడా? గణేశుడా? కాదు పద్మనాభుడని గుర్తుపట్టి పులకించి నివాళులర్పిస్తారు. గమనించండి -వారి స్పురణకు వచ్చిన తొలిదేవుడు కర్మసాక్షి -సూర్యుడు.
             రెండు భరతనాట్య కార్యక్రమాలు. ఒక నృత్యం 'శ్రీకృష్ణ దర్శనం'. మరొక కార్యక్రమం -విచిత్రంగా సూర్యునికి నివాళి. హరికేశనల్లూర్‌ ముత్తయ్య భాగవతార్‌ అద్భుత ఖమాస్‌ రాగ వర్ణం ''మాతే మరకతమణి సంజాతే..'' అంటూ మధుర మీనాక్షికి నివాళి.
                   ఇక అటు ఈశాన్య సరిహద్దులనుంచి వచ్చిన కళాకారుల ఇతివృత్తం ఏమిటి? వీరిది గిరిజన నృత్యం. అంటే అత్యంత ప్రాచీనమూ, ప్రాథమికమూ. దీన్ని 'సత్రియా నృత్యం' అన్నారు. ఏమిటి వీరి పాటల్లో, ఆటల్లో కథ? శ్రీకృష్ణుడు -భాగవతం. 500 సంవత్సరాల కిందట ఆనాటి వైష్ణవ ఆరామాలలో రూపుదిద్దుకున్న ఇతివృత్తాలివి. అప్సర నృత్యం, గోపి నృత్యం వంటివి అపూర్వంగా ఈ జాతి వైభవాన్ని ప్రతఫలిస్తాయి.
            ఇంతకంటే విభ్రాంతిని కల్గించిన కార్యక్రమం -నెలల కిందట ఇదే సంస్థ నిర్వహించిన రాజస్థాన్‌ జానపద నృత్య వైభవం. ఎక్కడో రాజస్థాన్‌ ఎడారుల్లో నివసించే వ్యక్తులు సామూహికంగా పండగ చేసుకోవాలంటే ఏం పాడుకుంటారు? అసలు వీళ్లెవరు? పేరే చెప్తుంది వీరెవరో. బుట్టేఖాన్‌, చంపాఖాన్‌ బృందం. వీరంతా ముస్లింలు. మంగనియార్‌ జాతివారు. చుక్కనీటికి మొహంవాచిపోయే ఎడారుల్లో జీవించే వీరినీ ఆనందపరిచే కళలున్నాయి. వాటి ఇతివృత్తాలు? అశోకవనంలో సీతను విశ్లేషిస్తూ పాటలు పాడతారు. ఆడవారు ఎడారిని ఆరాధిస్తారు. తమ మొగాళ్లను క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తారు. వీళ్లలో బుంగన్‌ఖాన్‌ ఒక ప్రత్యేకమైన (చిడతల వంటిది -దాన్ని కర్‌తాళ్‌ అంటారు) వాద్యాన్ని వాయిస్తూ మైమరిచిపోయే దృశ్యం అపూర్వం. నృత్యం చేసే స్త్రీలు ముస్లింలు. కాని వారి కట్టూ బొట్టూ రాజస్థాన్‌ వైభవాన్ని ప్రతిఫలించేవి. ఒకమ్మాయి నృత్యం చేస్తూ వెనక్కి వొంగి నేలమీద ఉంచిన నాణేల్ని తనకంటి రెప్పలతో అందుకుంటుంది. (ఇప్పుడు స్థనాల్ని ప్రదర్శించాలికదా మన సినీమాల్లో అయితే!) ఎక్కడా అసభ్యత లేదు. ఈ అమ్మాయి మన ఇంట్లో తిరిగే ఆడపిల్ల మర్యాదకు ఏ విధంగానూ తీసిపోదు. ఈ అమ్మాయి ప్రతీ విన్యాసానికీ సభికులకి నమస్కారం చేస్తుంది. బుట్టేఖాన్‌ తన్మయత్వంతో హార్మొనీ వాయిస్తూ సీతమ్మ గురించి గానం చేస్తూంటే -ఏమి ఈ జాతి వైభవం! అని వొళ్లు పులకరిస్తుంది. (ఈ మాట చెప్తూ ఇంటర్నెట్‌కి వెళ్లి యూట్యూబ్‌ చూశాను. ఈ పాటల్ని 3 లక్షల 33 వేల మంది ఇప్పటికి చూశారట.)
         ఏమిటి ఈ దేశ సంస్కృతి వైభవం? సానియా ముస్లిం అమ్మాయా? పాకిస్థానీ కోడలా? ఫలానా కుర్రాడు ఆంధ్రా కుర్రాడా? అతనికి తెలంగాణా డబ్బు చెల్లించాలా? ఆంధ్రా అడ్రసు ఉన్న నీళ్లనీ, కావేరీ అడ్రసు ఉన్న నీళ్లనీ గుర్తులు పెట్టుకోడానికి మల్లగుల్లాలు పడుతున్న ఈనాటి నేపథ్యంలో కేవలం 'విలువలు' ప్రాతిపదికగా ఆసేతు హిమాచలం ఈ జాతిని ఏకీకృతం చేసిన దేమిటి? పురాణం. ఇతిహాసం. అవి ప్రతిపాదించే శాశ్వత విలువలు. రామాయణం. భాగవతం. ఇవి ఒక దేశ మతానికి ప్రతీకలు కావు. శాశ్వతమైన విలువలకు అద్దం పట్టే ఇతిహాసాలివి. లేకపోతే ఇన్ని శతాబ్దాలు నిలువవు. ఒక మానవ సముదాయపు శాశ్వత విలువలకు ప్రతీకలు.    

              మతం నల్లమందుగా, అక్కరలేని అనర్థంగా, అర్థంలేని ఆటంకంగా, ఒక వికారంగా పరిణమించిన ఈనాటి తెలివైన సమాజంలో రాజస్థాన్‌ ముస్లిం, అతని కూతురు సీత గురించి పాడేపాట, అటు అస్సాం గిరిజనుడు చేసే దశావతార నృత్యం, అక్కడెక్కడో మణిపూర్‌లో ఒరిస్సా పాటకి నృత్యం -ఎంత అద్భుతమైన భావసమీకరణ!
ఇప్పటికీ భద్రాచలం వెళ్తే గోసవీడు షేక్‌హసన్‌ సాహెబ్‌ కొడుకు నన్ను కలిసి పలకరిస్తాడు. వాళ్ల నాన్న అత్తాకోడలంచు పంచె కట్టుకుని, తన నాదస్వరం మీద ఆంజనేయుడి బొమ్మని పెట్టుకుని 'నాద తనుమనిశం..' అంటూ త్యాగరాజ కీర్తనని హైదరాబాద్‌ రేడియోలో వాయించడం నాకు గుర్తు. మొన్న కేసీఆర్‌ గారు టాంక్‌బండ్‌ మీద ఎన్నో పనికిరాని విగ్రహాలున్నాయన్నారు. రేపట్నుంచీ హైదరాబాద్‌ రేడియోలో త్యాగరాజ కీర్తనలు ఎవరూ పాడరేమో!
               జేసుదాస్‌ 'వాతాపిగణపతిం భజే..' అంటూ హంసధ్వనిని ఆలాపిస్తే ఎవరికి మతం జ్ఞాపకానికి వస్తుంది? దీక్షితార్‌ క్రిస్టియన్‌ కాడు. ఏసుప్రభువు మానవుల్ని మానవులుగా ప్రేమించవద్దని చెప్పలేదు. బడే గులాం ఖాన్‌ తుమ్రీలో ''సయ్యా గయా పరదేశ్‌..'' అంటూ గానం చేస్తే పరవశించిన భారతీయులు ''బాబూ ఈ 'సయ్యా' ముస్లిమా, తమిళ అమ్మాయా, గుజరాతీయా?' అని అడగలేదు.మరే దేశంలోనూ, మరే మతంలోనూ, మరే సంస్కృతిలోనూ, మరే కళల్లోనూ లేని అద్భుతమైన భావసమైక్యతను సాధించిన సంస్కృతి -భారతీయ సంస్కృతి. ఇంటిముంగిట పెట్టే ముగ్గుల్లో, పొద్దుటే చేసుకునే కాలకృత్యాల్లో, పసిబిడ్డకు తినిపించే గోరుముద్దల్లో ('చందమామ రావే జాబిల్లిరావే' అని తల్లులకు 750 సంవత్సరాల కిందటే తాయిలం ఇచ్చాడు పదకవితా పితామహుడు అన్నమయ్య), కళాకారుల మాటల్లో, పాటల్లో, ఆటల్లో, ఆలోచనల్లో -అన్నిటిలోనూ భావసమైక్యతను రంగరించిన వైభవం, వారు సాధించిన ఫలితం -అనన్యసామాన్యం.
           ఎదుటివాడు చేసే మంచిపనిలో వాడి మతాన్ని, పక్కవాడు అన్నమాటలో వాడికులాన్నీ, ఆకలి తీర్చుకునే అవసరంలో డబ్బునీ, అంతస్థుల్నీ మన అసమగ్రమైన తెలివితేటలతో, స్వలాభాపేక్షతో గీతలు గీసుకుంటున్న నేపథ్యంలో శతాబ్దాల కిందటే ఓ బుట్టేఖాన్‌నీ, ఓ రాఘవరాజ్‌ భట్‌నీ, ఓ సవాహన్‌బీ దేవినీ, సరోదీ సైకియాలో గిరిజనుల ఉత్సవ సంప్రదాయాన్నీ నిక్షిప్తం చేసి, భౌగోళికమైన ఎల్లల ప్రమేయం లేని భావ సమైక్యతను సాధించిన ఈ సంస్కృతి మూలాలను యిదివరకటికంటే యిప్పుడు యువత తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
            శతాబ్దాల పాటు ఈ జాతికి శాంతియుతమైన సహజీవనాన్ని అలవాటుచేసిన ఈ కళలు ఎంతగొప్పవి? ఎంత ముందుచూపు గలవి? జాతిని ఏకీకృతం చెయ్యడానికి, ఒక దేశ సమష్టి ఆలోచనా విధానాన్ని ప్రోదుచేసిన ఇతిహాసాలు, పురాణాలూ ఎంత గొప్ప పునాదులు? మనదేశంలో ఈస్టిండియా కంపెనీలు, బుడతకీచులు వచ్చి దిక్కుమాలిన వ్యాపారాలు చేసి, దోచుకుని, మనకి అక్కరలేని చదువుల్నీ, ఉద్యోగాల్నీ, డబ్బునీ అలవాటు చేశారు. (ఆనాటి వారికి డబ్బు తెలీదు. కరెన్సీని కళ్లతో చూడలేదు. అవసరమూ లేదు. తమ తమ వృత్తులతో, నైపుణ్యంతో, సామర్థ్యంతో సమాజం సమష్టిగా జీవించడమూ, వారి సామరస్యమూ ఆనాటి జీవన విధానం.) అందుకు కళలు దోహదం చేశాయి. కాదు. కళలను అలా మలుచుకున్నారు. ఈ జీనియస్‌ ప్రపంచంలో మరే సంస్కృతికీ లేదు. (గ్రీసు, ఈజిప్టు, ఇటలీ వంటి దేశాలలో ఏ కాస్తో కనిపిస్తుంది.) 2014 నాటి 'విశాఖ ఉత్సవ్‌' అందుకు గొప్ప సాక్ష్యం.
          సద్గురు శివానందమూర్తిగారి చూపు గొప్పది. ఉదాత్తమైనది. ఆదర్శం అపూర్వమైనది. ఈనాటి యువతకి ఈ ఆలోచన, ఆదర్శం అందేటట్టు చేయాలన్న సంకల్పమే ఈ విశాఖ ఉత్సవ్‌. వారికి ఈ జాతి ఎల్లవేళలా రుణపడి ఉంటుంది.


  


      gmrsivani@gmail.com   
           జూలై 28,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage