|  
 
  
		   పెద్దల పెద్ద తప్పులు
 
				
		 
		                
 
 
 ఈ 
		కాలమ్‌లో ఒక్క వాక్యం కూడా నా మాటకాదు. కేవలం జరిగిన విషయాల్ని పత్రికల్లో 
		చదివింది చదివినట్టు చెప్పే ప్రయత్నం మాత్రం.
 మొన్న బీహార్‌లో వినయ్ బిహారీ అనే ఓ మంత్రిగారు మొబైల్ ఫోన్లలో సినీమాలు 
		చూడడంవల్లా, మాంసాహారం తినడం వల్లా మన:ప్రవృత్తిలో ఉద్రేకాల్ని రెచ్చగొట్టే 
		ధోరణి పెరుగుతుందని, తద్వారా స్త్రీల మీద దౌర్జన్యాలు పెరుగుతున్నాయని 
		అన్నారు. ఇలాంటి మాటే ఓ గోవా మంత్రిగారు అన్నారు. పాలీగంజ్ ఎమ్మెల్యే ఉషా 
		విద్యార్థి అన్నారు కదా? ''ఈ మంత్రిగారి భాషణ నాన్సెన్స్. మొబైల్ 
		ఫోన్లవల్లా, మాంసాహారం వల్లా రేపులు జరగవు. పిల్లల పెంపకం లోపం వల్ల 
		జరుగుతాయి'' అని. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితులు వారికి మంచి 
		బుద్ధి నేర్పాలన్నారు. పాట్నా విశ్వవిద్యాలయ విద్యార్థినాయకుడు ఈ మంత్రి 
		యువతకి క్షమాపణ చెప్పాలన్నారు. ''సొల్లు కబుర్లు చెప్పకు. నీపని నువ్వు 
		చూసుకోవయ్యా'' అని మంత్రికి హితవు చెప్పారు.
 కర్ణాటక 
		కాంగ్రెస్ శాసనసభ్యురాలు శకుంతలా శెట్టి -మొబైల్ ఫోన్లవల్ల సెక్స్ నేరాలు 
		పెరుగుతున్నాయన్నారు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ స్కూళ్లలో, కాలేజీలలో 
		మొబైల్ ఫోన్లు వాడకూడదన్నారు.
 షరున్ మోహిని 
		అనే మహిళా హక్కుల సంస్థ సభ్యురాలు -కారుల్లో మనుషుల్ని ఎత్తుకు పోతున్నారు 
		కనుక -కార్లను బహిష్కరించాలని అన్నట్టుంది వీరిమాట -అని ఎద్దేవా చేశారు. 
		చాలాకాలం కిందట అప్పటి ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారి దినేష్‌రెడ్డిగారు 
		ఆడపిల్లలు సరైన బట్టలు వేసుకోకపోవడం వల్ల అల్లరవుతున్నారన్నారు. ఆ మాట 
		అన్నందుకు ఆయన అల్లరయారు. చాలామంది సభ్య మహిళలు ఆయనమీద కాలుదువ్వారు.
 మొహం 
		కనిపించకుండా గుడ్డలు కట్టుకోవడం తప్పమ్మా అని పుణ పోలీసు కమిషనర్ ఒకాయన 
		ఆడపిల్లలకి హితవు చెప్పబోయారు. ''మేమేం ఉగ్రవాదులమనుకున్నారా? మా యిష్టం'' 
		అని మహిళలు ఆయనమీద విరుచుకుపడ్డారు.
 ఇదంతా 
		''మోరల్ పోలీసింగ్'' అంటారని తెలుసుకున్నాను. నైతికంగా పిల్లలు ఎలా 
		ప్రవర్తించాలో చెప్పనక్కరలేని 'పెద్దలు' పెద్దరికాన్ని నెత్తిన వేసుకుని 
		చెప్పబోవడం, చెప్పే సాహసం 'మోరల్ పోలీసింగ్' అని నాకు తెలిసింది.
 'పిల్లలు భయంకరమైన నేరాలు చేస్తున్నారు. వాళ్లమీద తీవ్రమైన చర్యలు 
		తీసుకోవాలి'' అన్నారు శక్తి మిల్స్‌లో 22 ఏళ్ల ఫొటో జర్నలిస్టుని దారుణంగా 
		రేప్ చేసిన కుర్రాళ్ల (వయసొచ్చిన వారు కాదు) కేసుని వాదించిన ప్రాసిక్యూటర్ 
		ఉజ్వల్ నిగమ్. మరో రెండు వారాల తర్వాత లోగడ ఇలాగే ఓ టెలిఫోన్ ఆపరేటర్‌ని 
		-వీళ్లలో కొందరు రేప్ చేసిన ఉదంతం బయటపడింది. అప్పుడు ఈ ఆడపిల్లలు ఎలాంటి 
		బట్టలు వేసుకున్నారో, వీళ్లని రేప్ చేసిన కుర్రాళ్ల దగ్గర మొబైల్ ఫోన్లు 
		ఉన్నాయో లేదో -ఉన్నా వాటిలో సెక్స్ సినీమాలు చూస్తున్నారో లేక ''హరిశ్చంద్ర'', 
		''మహాభారత్'' వంటి సినీమాలు చూస్తున్నారో మనకు తెలీదు.
 ఇప్పుడు మరొక ముఖ్య సంఘటన. నిన్నకాక మొన్న రాజమండ్రి సమీపంలో జరిగింది. 
		పోలీసులు 8 మంది యువకుల్ని అరెస్టు చేశారు. ఈ మధ్యనే ఈ కుర్రాళ్లు 60 ఏళ్ల 
		రిటైర్డ్ నర్సుని చంపి ఒకటిన్నర లక్షల నగదుని దోచుకున్నారు. వీరిలో ఒక 
		కుర్రాడు తన అమ్మమ్మని ఎలా దోచుకుని నగలు దక్కించుకోవాలో తన మిత్రులకు 
		చెప్పి పంపాడు. వీరంతా హాయిగా జెఎన్‌టియుసి లో చదువుకుంటున్న యువకులు. 
		ఇద్దరు బీయస్సీ, మరో ఇద్దరు బీటెక్ చదువుతున్నారు. ఒక కుర్రాడు విద్యార్థి. 
		వీరి దగ్గర 13 మోటారు సైకిళ్లు, 280 గ్రాముల బంగారు నగలు, వెరసి 11 లక్షల 
		ఆస్తి దొరికింది. అన్నట్టు వీరి ద్గగర రెండు మొబైల్ ఫోన్లు కూడా దొరికాయి.
 ఇప్పుడు -57 సంవత్సరాల కిందటి సంఘటన. మా ఆవిడ కాస్త పలచటి చీరె కట్టుకుని ఆ 
		రోజుల్లో హైస్కూలుకి వెళ్లిందట. వాళ్ల నాన్నగారు -శ్రీపాద రామకృష్ణారావుగారు 
		(ప్రముఖ కవి సి.నారాయణరెడ్డి గారి గురువులు) హైస్కూలు హైడ్మాష్టరు. ఆమెని 
		నిలదీసి ఇంటికెళ్లి ఆ చీరె మార్చుకురమ్మని -అప్పటికప్పుడు పంపేశారట.
 ఆ రోజుల్లో బిజెపి లేదు. కాని అప్పటికే బిజెపి ఆలోచనలున్న 
		ముసిలివాళ్లుండేవారని అర్థమవుతోంది. నిజానికి యిలాంటి బిజెపి బుద్ధులు -పాతతరం 
		వారికి -చాలామందికి ఉండేవని నాకిప్పుడు అనుమానంగా ఉంది. ఆ మాటకి వస్తే 
		పరాశరుడనే మహర్షి వున్నాడు. ఆయన అన్నాడు కదా -వయస్సొచ్చిన తోబుట్టువుని కూడా 
		పరాయి స్త్రీగానే పరిగణించాలి -అని. సందేహం లేదు. వీరంతా పురాణకాలపు మోరల్ 
		పోలీసులు.
 మొన్న గురుపూర్ణిమనాడు నాకు ఒకే ఒక విచిత్రమైన ఫోన్‌కాల్ వచ్చింది. 
		కైలాసపతిరావు అనే తెలంగాణా పెద్దమనిషి -మా మామగారి శిష్యుడు -వయ్ససు 78 
		ఏళ్లు -ఫోన్ చేశాడు. ''ఇవాళ గురుపూర్ణిమ. మా గురువులు -మీ మామగారు 
		గుర్తొచ్చారు. అలాంటి గురువులు అరుదు. హైస్కూలు పరీక్షల్లో మా అమ్మపోతే 
		పరీక్ష రాయలేకపోయాను. ఆయన చేరదీసి, స్వయంగా పూనుకొని, నన్ను ప్రోత్సాహపరిచి 
		పరీక్ష రాయించారు. ఆయనవంటి గురువుల వల్లే నా జీవితం బాగుపడింది. 
		గురుపూర్ణిమనాడు వారు గుర్తొచ్చి మీకు ఫోన్ చేశాను. మా చెల్లెమ్మ బాగున్నదా?'' 
		అన్నారు. మా ఆవిడా ఆయనా మా మామగారిదగ్గర ఒకే సమయంలో, ఒకే హైస్కూలులో 
		చదువుకున్నారు. ఇప్పుడు ఈ వాక్యాలు నావి. ఏమయినా నీతులు చెప్పే ''మోరల్ 
		పోలీసు'' చర్యలు దుర్మార్గం. ఇలాంటి మంత్రుల్ని, దినేష్‌రెడ్డి, పుణ కమిషనర్, 
		బతికుంటే మా మామగారి వంటివారిని ఇంకా వీలయితే పరాశర మహర్షిని దేశం నుంచి 
		బహిష్కరించాలి. బికినీతో ఏ ఆడపిల్లయినా ఎక్కడికయినా వెళ్లే స్వేచ్ఛని, అలాగే 
		వాళ్లకి నచ్చిన బట్టలు కట్టుకునే (లేదా విప్పుకునే) విసులుబాటుని కల్పించాలి. 
		అది వారి స్వేచ్ఛకు సంబంధించిన విషయం. అమ్మాయిల్ని రేప్ చేసే దుర్మార్గుల 
		ప్రవృత్తి? అది కోర్టులకు సంబంధించిన విషయం. చేతులు కాలినప్పుడు ఆకులు 
		కావాలి. కాని కాలడానికి కారణాలకీ, ఆకులకూ సంబంధం లేదు. అవసరం లేదు. అవసరాలను 
		సూచించినవారెవరయినా ''మోరల్ పోలీసులు''. చదువుకునే ప్రతీ కుర్రాడికీ 
		గవర్నమెంటు సబ్సిడీలిచ్చి అయినా మొబైల్ ఫోన్లు యివ్వాలి.
 ముఖ్యంగా రాజమండ్రిలో అరెస్టయిన 8 మంది చదువుకున్న కుర్రాళ్లకి మనదేశంలో 
		గొప్ప పదవుల్లోకి రాగల అన్ని అర్హతలూ ఉన్నాయని మనవి చేస్తున్నాను.
 మరొక్కమాట. వరసగా రెండు కాలమ్‌లు ఇలాంటి విషయాల మీద రాశాక -నా ఆలోచనల మీద 
		చాలామందికి అనుమానాలు రావచ్చు. కనుక ఈ వాక్యం చెప్పక తప్పదు. నేను బిజెపి 
		సభ్యుడినో, కార్యకర్తనో కాను.
 
 
 
		gmrsivani@gmail.com
 జూలై 21,   2014
 
		 ************* 
		 
		 
		Read all the 			columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా 			కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి					 |  |