హిందుత్వ బడ్జెట్ 

               
             ఈ మధ్య బిజెపి ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్‌ మీద జరిగిన విమర్శలలోకల్లా నాకు బాగా నచ్చిన విమర్శ -అది బొత్తిగా హిందుత్వ వాసన కొడుతున్న బడ్జెట్‌ అన్నది.
              మన దేశంలో ఎందరో మేధావులు ఉన్నారు. మతాతీత దృక్పథంతో రాజకీయాలతో ప్రమేయం లేని తటస్థులు ఉన్నారు. మతం అంటే మండిపడే పాత్రికేయులున్నారు. వారంతా మహానుభావులు. వారిని దృష్టిలో పెట్టుకోకుండా ఈ ప్రభుత్వం హిందుత్వ బడ్జెట్‌ ప్రతిపాదించడం అన్యాయం. కుట్ర.
           ఏమిటా హిందుత్వ ఛాయలు? ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన చాలా స్కీములకు లోగడ ఉన్న పార్టీలు -భారతీయ జన సంఘ్‌ నాయకులు శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ, దీన దయాళ్‌ ఉపాధ్యాయల పేర్లు పెట్టడం. ఈ రెండు పేర్లలోనూ దేవుడు లేడు. కాని ఆ నాయకులలో హిందుత్వం ఉంది.
           మనకి జవహర్‌ రోజ్‌గార్‌ యోజనావుంది. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇందిరా ఆవాస్‌ యోజనా వుంది. ఇందిరాగాంధీ జూలాజికల్‌ పార్క్‌ వుంది. మన అదృష్టవశాత్తూ ఈసారి కాంగ్రెస్‌ పదవిలోకి వచ్చి వుంటే 'రాబర్ట్‌ వాద్రా' మంచినీటి పధకం, రాహుల్‌ గాంధీ శిశుసంక్షేమ పధకం వంటివి వచ్చేవి. అయితే ఇవన్నీ హిందుత్వానికి సంబంధం లేని మతాతీత వ్యవస్థకు సంకేతాలు. వీటిని ఈ మేధావులు ఎవరూ ఆక్షేపించలేదని మనం గుర్తుంచుకోవాలి.
              గంగానదిని స్వచ్ఛంగా వుంచే ప్రణాళిక ఆర్‌ఎస్‌ఎస్‌ ఆదర్శం. మిగతా మతాలవారికి అది మురికికూపంలాగ ఉన్నా ఆక్షేపణ లేదు. ఈసారి ప్రభుత్వం అందుకొక మంత్రిత్వ శాఖనే ఏర్పరిచింది. అరుణ్‌జైట్లీగారు 'నమామి గంగా' పధకానికి 2037 కోట్లు కేటాయించారు. ఇది రూఢిగా హిందుత్వ పక్షపాతం.
                మనకి హజ్‌ యాత్రకి ప్రభుత్వ సహాయ పధకాలున్నాయి. కాని వైష్ణోదేవి యాత్రకికాని, అమర్‌నాధ్‌ యాత్రకికాని లేవు. ఎందుకని? మనది హిందుత్వ వ్యవస్థకాదు కనుక, పై మతాలనే ప్రోత్సహిస్తాం.
                  కాగా, గంగానదికి హరిద్వార్‌, కాన్పూర్‌, వారణాశి, అలహాబాదు, పాట్నా, ఢిల్లీలలో స్నానఘట్టాల ఏర్పాటుకి, అభివృద్ధికి నూరుకోట్లు కేటాయించారు. గంగానదికే ఎందుకు చేయాలి? -ఈ దేశంలో కోట్ల మంది స్నానాలు చేస్తూంటారు కనుక. మరి చేపల చెరువు, పాటిబండ పాలెం, మస్తాన్‌ రెడ్డికాలువ, కట్టవారి పల్లెల్లో స్నాన ఘట్టాలు ఎందుకు చెయ్యకూడదు? అరుణ్‌ జైట్లీ గారికి బొత్తిగా గడుసుదనం లేదు. మంచి జరగాల్సిన, జరపాల్సిన చోట కాస్త ఎదుటివారినీ తృప్తిపరచాలి. ఈ కార్యక్రమానికి 'నమామి గంగా' అనికాక 'నమామి ప్రియాంక' అని పేరు పెడితే ఏం కొంపమునిగిపోయింది? హిందుత్వ విమర్శ తమ దగ్గరికి వచ్చేదా?
               గుజరాత్‌లో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహ ప్రతిష్టకు 200 కోట్లు కేటాయించారు. అయ్యా, ఈ దేశ ప్రధాని గుజరాత్‌ వాస్తవ్యులు. ఆయన తన రాష్ట్రం నుంచి వచ్చిన ఓ గొప్ప నాయకునికి ఒక స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మనకి ఆక్షేపించే అవకాశం లేదు. నన్నడిగితే రాయ్‌ బెరైలీలో రాజీవ్‌గాంధీ విగ్రహానికి నూరుకోట్లు కేటాయించి దానికి 'ఖత్రోచీ స్మారక యోజనా పధకం' అని పెడితే తీరిపోయేదని. అప్పుడు ఎవరినయినా నోరెత్తమనండి. మన హిందుత్వం మూలాలు 'ఇటలీ'లో ఉన్నవని మనం మరిచిపోకూడదు.
               ఇక, మన వారసత్వాన్ని ప్రతిపాదించే పవిత్ర యాత్రాస్థలాల అభివృద్ధికి నిధులని ప్రకటించారు. ఇందులో ప్రమాదవశాత్తూ మధుర, గయ, కాంచీపురం ఉన్నాయి. అదీ ఆర్థికమంత్రి చేసిన అపరాధం. ఈ జాబితాలో అమృతసర్‌ ఉంది. వేలంకన్ని ఉంది. అజ్మీర్‌ ఉంది. సాంచీ, సారనాధ్‌లు ఉన్నాయి. అయినా ఇది హిందుత్వ పక్షపాతం.
              ఇంకా భయంకరమైన నేరాన్ని అరుణ్‌జైట్లీ గారు తనకి తాను ప్రచారం చేసుకునే ప్రయత్నం చేశారన్న విమర్శ ఉంది. ఈశాన్య భారతదేశంలో 24 గంటలూ ప్రసారాలను చేసే ఛానల్‌ని ప్రారంభిస్తూ -అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగే అభివృద్ధి కనుక ఆ ఛానల్‌కి 'అరుణ ప్రభ' అని నామకరణం చేశారు. అయితే అరుణ్‌ జైట్లీగారు ప్రతిపాదించే ఛానల్‌పేరు 'అరుణ ప్రభ' అనడం విమర్శలకి దారితీస్తుందని వారు మరిచిపోయారు. ఈ దేశంలో కోడిగుడ్లమీదా ఈకలు వుంటాయని, వాటిని పీకే సమర్ధులు, మేధావులు ఉంటారని వారి అనుభవం వారికి నేర్పకపోవడం విచారకరం. ఇంత కుండబద్దలు కొట్టినట్టుగా తను చేసే పనికి తన పేరే పెట్టుకోవడం బొత్తిగా విచక్షణా రహితం. ఈ ఛానల్‌కి 'చిదంబర ప్రభ' అనో, 'గులాం నభీ ప్రభ' అనో, అదీ యిదీ కాకపోతే ఏకంగా 'సోనియా ప్రభ' అనో పెడితే ఎవరికీ ఆక్షేపణ ఉండేదికాదు.
             ఈ ఈ కారణాలకి బిజెపి బడ్జెట్‌ బొత్తిగా హిందుత్వ వాసన కొడుతోందని విమర్శలు వినిపించాయి. ఈ విమర్శల నుంచి బయటపడడానికి ఒకటి రెండు సూచనలు. కనీసం ఒక ప్రణాళికకయినా 'మావో రోజ్‌గార్‌ యోజనా' అని పేరు పెట్టండి. 'కామ్రేడ్‌ వెంకయ్య అభివృద్ధి పథకం' అనండి.
             మదరసాల అభివృద్ధి కేవలం కంటి తుడుపు పని. ఒక్క ప్రణాళికకి ''హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్‌ విద్యావిధాన పధకం'' అనండి. శ్యామ్‌ప్రసాద్‌, దీనదయాళ్‌ ఉపాధ్యాయ వంటి నాయకుల పేర్లు చాలామంది వినలేదంటున్నారు. ఈ మధ్య ప్రపంచ ప్రఖ్యాతిని సాధించిన వ్యక్తి 'అజ్మల్‌ కసాబ్‌ ప్రజా సంక్షేమ పధకం' అని నామకరణ చెయ్యండి. గంగా, యమున వంటి దిక్కుమాలిన నదుల అభివృద్ధిని కొంతకాలం అటకెక్కించండి. ఉప్పుటేరు, చేపలగూడెం, దివాన్‌ కాలువ వంటి అభివృద్ధి పనులు ప్రారంభించమనండి.
                ఒక ముఖ్య విషయం. మనది భారతదేశం. ఈ దేశంలో ప్రముఖ విశ్వాసం -హిందూమతం. ఆ కారణానికే ఇక్కడ 'శ్రీరామ' అంటే బూతుమాట అని మరిచిపోకూడదు. మోడీగారికి ఎన్ని గొప్ప గొప్ప ఆలోచనలున్నా 'రా' అన్నా 'మా' అన్నా గొడవలో పడతారని హెచ్చరిస్తున్నాను -ఒక హిందువుగా. నేను హిందువుని. ఆ కారణానికే ఇటలీని నెత్తిన పెట్టుకోగలను. కాని హిందుత్వాన్ని ససేమిరా సహించలేను.

  


      gmrsivani@gmail.com   
           జూలై 14,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage