బరితెగించిన బూతు
ఈ వ్యాపార ప్రకటనని
ఇప్పుడిప్పుడు టీవీ ప్రేక్షకులు రోజూ చూస్తూనే ఉంటారు. ఇంటి హాలులో -పడకగదిలోకాదు
-ఒక యువతిమీద ఒక కుర్రాడు సోఫాలో పడుకుని ఉన్నాడు. హఠాత్తుగా వీధి తలుపు
చప్పుడయింది. అమ్మాయి స్నేహితుడిని మీద నుంచి కిందకి తోసేసింది. కుర్రాడికి
పారిపోయే అవకాశంలేదు. తండ్రి చర్రున లోపలికి వచ్చేశాడు. అమ్మాయి సమాధానం
చెప్పలేక బిత్తరపోయి నిలబడింది. కుర్రాడు ఒకచేతిలో బూట్లు, సగం విడిన బట్టలు,
మరొక చేతిలో ఒక సెల్ ఫోనుతో గోడకు అంటుకుపోయి నిలబడ్డాడు. అమ్మాయి తండ్రి
కళ్లబడ్డాడు. తర్వాత సీను ఏమిటో ఎవరయినా ఊహించగలరు. కాని వ్యాపారి గడుసువాడు.
తండ్రి ప్రియుడిమీద విరుచుకు పడలేదు. అతని చేతిలో సెల్‌ఫోన్ తండ్రిని
ఆకర్షించింది. దాన్ని చూసి మురిసిపోయాడు. కూతురు తెల్లబోయింది. విటుడు
జారుకున్నాడు. ఇదీ ప్రకటన! సందేశం -అయ్యా, మీరు చేస్తున్న వ్యభిచారాన్ని
కూడా మరిపించగల గొప్ప సాధనం -మా సెల్ అని ప్రకటన. తమకు గుర్తు వచ్చి ఉండాలి.
''ఈ ఛానల్‌లో ఏదైనా అభ్యంతరకరమైన ప్రసారాలు జరిగితే ఫలానావారికి తెలియజేయండి''
-అని ఒక్క స్క్రోల్ నడుస్తూంటుంది ఆయా ఛానళ్లలో. మరి ఇది ఎవరికీ అభ్యంతరం
లేనట్టుంది!
ఈ మధ్య
దిలీప్ కుమార్ ఆత్మకథ చదివాను. ఆయన సినీ పరిశ్రమలో 70 సంవత్సరాలు
పనిచేశారు. గత 16 సంవత్సరాలుగా పరిశ్రమకి దూరంగా ఉన్నారు. అయినా ఆయన పరపతి
తగ్గలేదు. 450 పేజీల పుస్తకం వెనక ఆయన మాటల్ని -కేవలం రెండు వాక్యాల్ని
ప్రచురించారు. ''నటులు సహేతుకమైన సామాజిక బాధ్యతని కలిగి ఉండాలని నేనెప్పుడూ
నమ్ముతాను. కోట్ల ప్రజల అభిమానాన్ని -సమాజంలో ఒక స్థాయిని, ఒక గౌరవాన్నీ
చూరగొన్న నటుడు సమాజానికి తప్పనిసరిగా రుణపడతాడు.'' ఇదీ ఆ వాక్యం.
బూతుని ఆకర్షణగా తర్జుమా చేసిన నేటితరం సినీమా వ్యాపారానికి ఈ మాటలు
విడ్డూరంగా కనిపించవచ్చు. ఆయన గొప్ప చిత్రంగా రాణించిన 'గంగా జమునా'లో హీరో
హీరోయిన్ల మధ్య సాన్నిహిత్యాన్ని గురించి రాస్తూ -''అలాంటి సందర్భాలలో
శారీరకమైన సాన్నిహిత్యాన్ని చూపకూడదని నేను తెగేసి చెప్తాను.'' అంటూ ''ఆరుగురు
అమ్మాయిలు, అయిదుగురు అబ్బాయిలు ఉన్న కుటుంబానికి పెద్దగా ఎటువంటి
అసభ్యతనైనా నేను గర్హిస్తాను. అలాంటి సందర్భాలలో నా మనసులో కదిలే మొదటి
ఆలోచన నేను అలాంటి అసభ్యకరమైన సన్నివేశాన్ని చేస్తే నా చెల్లెలు ఎటువంటి
వ్యగ్రతకి గురి అవుతుంది -అన్నది''.
ఆయనతో ఏడు సినీమాలు
చేసిన వైజయంతిమాల (ఆమె కూడా ప్రస్థుతం ఎనభయ్యో పడిలోనే ఉన్నారు) వ్రాస్తూ -ప్రేమ
సన్నివేశాలలో చూడముచ్చటగా చిత్రీకరించారేకాని ఎక్కడా శారీరకమైన సంబంధాన్ని
సూచనగా నయినా రానిచ్చేవారు కాదు -అని పేర్కొన్నారు ఆయనను అభినందిస్తూ. తోటి
నటులతో ఆయన కలిసినప్పుడు -ఒక్కసారయినా మాట తూలడం కాని, చవకబారు మాట
మాట్లాడడం కాని, తేలికపరిచే మాటలు మాట్లాడడం కాని చేసేవారు కారని చెప్పారు.
ఆయన ఎప్పుడూ లతా మంగేష్కర్‌ని తన చిన్న చెల్లెలుగా పేర్కొనేవారు. ఈ
పుస్తకంలో ఆయన గురించి వ్రాస్తూ లతామంగేష్కర్ చెప్పిన రెండు సందర్భాలు -ప్రముఖ
సంగీత దర్శకులు కళ్యాణ్‌జీ ఇంట్లో భోజనం చేసినప్పుడు -భోజనం తర్వాత తాంబూలం
-కిళ్లీల పళ్లెం తెచ్చిపెట్టారట. ఆమె పక్కనే కూర్చున్న దిలీప్ కుమార్‌కి
కిళ్లీ ఇవ్వబోయారట. ఉత్తర దేశపు సంప్రదాయం -తండ్రి కొడుక్కి కిళ్లీ యిస్తే
తనతో సమ ఉజ్జీగా అంగీకరించినట్టు. తనతో సమంగా భోగాలను పంచుకునే అర్హత
సంపాదించాడని గుర్తించినట్టు. ఇక స్త్రీ అయితే ఇద్దరే మగాడికి కిళ్లీ
ఇవ్వాలి. భార్య తన హక్కుగా, వేశ్య తనని ఆహ్వానిస్తూ. రెండు వ్యక్తిగతమైన
విషయాలు. ''నువ్వు ఇవ్వకూడదమ్మా -ఇంకెప్పుడూ ఆ పని చెయ్యకు'' అని ఆమెని
మందలించారని ఈ పుస్తకంలో ఆమె గుర్తుంచుకున్న ఒక సందర్భంగా పేర్కొన్నారు.
మరొక అపూర్వమైన సందర్భం -1974లో రాయల్ ఆల్బర్ట్ హాలులో మరిచిపోలేని
లతామంగేష్కర్ కచ్చేరీ. దిలీప్‌కుమార్ స్టేజి మీదకు వచ్చి ఆమె పాడబోయిన
పాటల జాబితా అడిగారట. ఆమె పాడనున్న మొదటి పాట: ''ఇన్హీ లోగోన్నే లే లేనా..'
(వీళ్లే నా పరువుని, మర్యాదనీ దోచుకున్నారు -నా దుపట్టా (కొంగు)ని నానుండి
దొంగిలించి) దాదాపు ఇదీ అర్థం. ఇది 'ఫకీజా'లో ఆమె పాడిన, చాలా ప్రాచుర్యం
పొందినపాట. ''ఎందుకీపాట ముందు పాడాలనుకుంటున్నావు?'' అంటూ అభ్యంతరం పలికారట.
అంత గంభీరమయిన సందర్భంలో తన చెల్లెలు ఇలాంటి చిన్నబుచ్చే పాట పాడరాదని ఆయన
ఉద్దేశం -అన్నారు లతామంగేష్కర్.
అభిరుచికీ,
మర్యాదకీ, సెక్స్‌కీ, గౌరవానికీ, కుటుంబంలో పెద్దరికానికీ -చేసేపని ఎటువంటి
అపశృతినీ కలిగించరాదని నమ్మిన -ప్రస్థుతం తొంభయ్యో పడిలో ఉంటూ దేశంలో భారత
రత్నలుగా గౌరవించబడుతున్న ముగ్గురు సినీ కళాకారులు -దిలీప్‌కుమార్, లతా
మంగేష్కర్, వైజయంతి మాల భావాల్ని -వారి మాటల్లోనే వింటున్నాం.
ఈ 450 పేజీల ఆత్మకథలోనూ ఎక్కడా -ఒక్కసారయినా
ఆయన తీసుకున్న డబ్బు ప్రసక్తి రాలేదు. ఎవరో నిర్మాత రెట్టించి అడిగితే ''మరీ
వ్యాపారిలాగ మాట్లాడకు'' అని మందలించారట.
డబ్బుకోసం, విజయంకోసం
మర్యాదనీ, అభిరుచినీ, సంస్కారాన్ని -అన్నింటినీ తాకట్టు పెట్టేసే -ఏ విధమైన
కమిట్‌మెంటులేని రోజుల్లో మనం బతుకుతున్నాం. సెల్ ఫోన్ అమ్మడానికి
వ్యభిచారాన్ని పెట్టుబడిగా చూపే ప్రకటనని -మన ఇళ్లల్లోకి చొచ్చుకు వచ్చే
మాధ్యమంలో మనం భరిస్తున్నామంటే -ఈ సమాజాపు విలువలను ఎంతా రాజీపరుస్తున్నామో
అర్థమౌతుంది.
వ్యాపారంలో నియతి ఒకరు విధించేది కాదు. ఒకరు నిర్ణయించేది కాదు. ఒకరు
నిర్దేశించేదికాదు. అదే సెల్‌ఫోన్ అమ్మకానికీ, సినీమాకీ తేడా. కాని
సినీమాని సెల్‌ఫోన్ అమ్మకం స్థాయికే తెచ్చే రోజుల్లో -టీవీ ప్రకటన -ఎవరికీ
చీమకుట్టినట్టయినా ఉండకపోవడంలో ఆశ్చర్యం లేదు.
ఒక జీవితకాలం
ఈ సమాజాన్ని ప్రభావితం చేసి -ఇప్పటికీ కోట్లాది అభిమానుల మన్ననలు
పొందుతున్న ఒక సినీ నటుడి జీవితాన్ని చదువుతున్నప్పుడు -నాలాంటి వారికి ఒక
పవిత్రమైన రంగంలోకి అడుగుపెట్టిన తొలి రోజుల జ్ఞాపకాలు ఒక్కసారి గుండెలను
పొంగించి, గర్వపడేటట్టు చేస్తాయి.
కోట్లమందిని ఆకర్షించే మాధ్యమంలో అభిరుచిని
నిలుపుకోవడం కూడా సామాజిక బాధ్యతే!
gmrsivani@gmail.com
జూన్ 30, 2014
*************
Read all the columns from Gollapudi గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
|
|