తెగిపోయిన జ్ఞాపకాలు

           
 రెండు రాష్ట్రాలుగా విడిపోయిన రెండింటిలో ఎన్నో సమస్యలు, ఎన్నో సౌకర్యాలు, మరెన్నో సర్దుబాట్లు తప్పనిసరికావచ్చు. తప్పదు. ఈ దేశం రెండుగా విడిపోయినప్పుడు -సరిహద్దుల్లో ఒక అమ్మాయి చదువుకునే బడి పొరుగుదేశంలో ఉండిపోయింది. ఆమె ప్రతీరోజూ స్కూలుకి వెళ్లిరావాలి. అంటే సరిహద్దుదాటి పొరుగుదేశానికి వెళ్లాలి. ఆమెని ఇటు ఉద్యోగులు అప్పగిస్తే అటుపక్క ఉద్యోగులు ఆమెని స్కూలు దగ్గర వదిలిపెట్టి మళ్లీ సరిహద్దుకి తీసుకువచ్చి అప్పగించేవారు. ఒకావిడ పుట్టిల్లు పొరుగు దేశంలో ఉండిపోయింది. నాకు సంబంధించినంతవరకూ నా గొప్ప జ్ఞాపకాలన్నీ పొరుగు రాష్ట్రంలో ఉండిపోయాయి. నా మిత్రులు, నా తొలి ఉద్యోగమూ, ఆనాటి స్మృతులూ అన్నీ తెలంగాణాలోనే ఉన్నాయి.

        53 ఏళ్ల కిందట నాకు హనుమకొండలో పెళ్లయింది. శుభలేఖ ముద్రించడానికి పట్టణాల లిస్టులో ఆ వూరుని పట్టుకోలేకపోయాను. చాలా శ్రమపడ్డాక -అది హనుమకొండగా కాక హన్మకొండగా ఉండడం గమనించాను. పలుకుబడిలో జరిగిన వికృతిరూపం. మన ప్రియతమ ప్రధాని నెహ్రూ కన్నుమూసిన రోజున అప్పటి సమాచార, పౌర సంబంధాల మంత్రి పీ.వీ.నరసింహారావుగారి శ్రద్ధాంజలి రికార్డు చేయడం మరిచిపోలేను. తదాదిగా హైదరాబాద్‌లో హైదర్‌గూడాలో వారింటికి, ప్రధానిగా రిటైరయాక ఢిల్లీలో వారింటికి వారి చివరిరోజుల వరకూ వెళ్తూండేవాడిని. ఆయనే నన్ను ఆత్మకథ వ్రాయమని ప్రోత్సహించారు -నాకు 'ఇన్సైడర్‌' కాపీని యిస్తూ. 62 సంవత్సరాల కిందట మొదటిసారిగా హైదరాబాద్‌ వచ్చినప్పుడు పంజగుట్ట తర్వాత నగరం లేదు. అప్పుడు శ్రీనగర్‌ కాలనీ లేదు. అప్పుడు నా చిన్ననాటి మిత్రుడి యింట్లో ఉన్నాను. సాయంకాలం ఆరుగంటలనుంచే నక్కల అరుపులు వినిపించేవి.
             ప్రతీయేటా గాంధీ మైదానంలో ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌కు వెళ్లడం పిల్లల సరదా. వాళ్లు కేరింతాలు కొడుతూ ఆడుతూంటే ఒక పక్క బెంచీ మీద కూర్చుని వేడి వేడి సమోసాలు తినడం మంచి జ్ఞాపకం. హిమాయత్‌ నగరమొగిలో చాలా గలీజుగా ఉన్న ఇరానీ హొటల్‌ ఉండేది. అక్కడ ఇరానీ ఛాయ్‌ అద్భుతం. తెలంగాణా వారు ఎప్పుడు తారసపడినా మొదటి చూపులోనే మా ఆవిడని తమ బిడ్డని చేసేసుకునేవారు. ''మా పోరిని షాదీ చేసుకున్నవు బిడ్డా. మంచిగ చూసుకోవాలె'' అనేవారు. హైదరాబాద్‌ అంతా ఓ పెద్ద కుటుంబంలాగ అందులో ఒకింత స్థలం పంచుకోడానికి వచ్చినట్టు అనిపించేది.
             1956 లో ఆంధ్రా విశ్వవిద్యాలయ ఆంధ్రాభ్యుదయోత్సవాలకు ఇద్దరు అనుంగు మిత్రులు -దాశరధి, సి.నారాయణరెడ్డి వచ్చారు. ఠీవిగా వారు చదివిన కవితలు, ఆ తరహా కవిత వినడం అదే మొదటిసారి. ఇద్దరితో కలిసి పనిచేసే అవకాశం నాకు తర్వాత కలిసివచ్చింది. ఒకరితో రేడియోలో, మరొకరితో సినీమాలో. మిత్రులు మోదుకూరి జాన్సన్‌, నిడదవోలు మాలతి, కొలకలూరి ఇనాక్‌, కొండముది శ్రీరామచంద్రమూర్తి మేమంతా ఈ కవితలకు ముగ్దులయిన క్షణాలు విలువైనవి.
మాట్లాడని మల్లెమొగ్గ మాదిరిగా నడిచిరా
నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగ వలె విడిచిపో
                           ఇక సినీమా. ఒకరోజు దాశరధి, అన్నపూర్ణా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దుక్కిపాటి మధుసూదనరావుగారు గగన్‌ మహల్‌ రోడ్డులో ఒక కారు షెడ్డుని ఇంటిగా తీర్చిదిద్దిన నా ఇంటికి వచ్చారు -నన్ను సినీమా రాయమంటూ. నాకేమీ తెలీదు మొర్రో అంటూంటే దాశరధిగారు బలవంతంగా కారులో కుదేశారు. రోజూ అబిడ్స్‌ తాజ్‌మహల్‌లో ఫలహారం. అప్పుడప్పుడు అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం స్టూడెంటు లీడర్‌ జైపాల్‌రెడ్డి మమ్మల్ని పలకరించేవారు. తాజ్‌మహల్‌ ప్రొప్రయిటరు (పేరు గుర్తులేదు) పలకరించేవారు. నా జీవితం పెద్ద మలుపు తిరిగి, ఆశలు ఆకాశంలో తేలిపోతున్న రోజులవి. ఆ రోజుల్లో హైదరాబాద్‌ చలి వణికించేది. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌ పక్కన పేవ్‌మెంటు మీద రుచికరమైన మిరపకాయ బజ్జీలు వేసేవారు. ఒక్కో సాయంకాలం నేనూ మా ఆవిడా ఆరేళ్ల బాబుని (ఇప్పుడతని వయస్సు 53!) ఎత్తుకుని టాంక్‌బండ్‌కి నడిచి సిమ్మెంటు బెంచీమీద కూర్చునేవాళ్లం. ఆ రోజుల్లో ట్రాఫిక్‌ ఇంత ముమ్మరం లేదు. అప్పటికి నాకు పెళ్లయి 14 నెలలు. నా భవిష్యత్తు కలలన్నీ ఆమెముందు విప్పేవాడిని. నా ఏకైక ప్రేక్షకురాలు అప్పట్లో నా భార్యే. నన్ను విన్నందుకు బహుమతిగా మేమిద్దరం టాంక్‌బండ్‌ మధ్యలో ఉండే బ్రూక్‌ బాండ్‌ కంపెనీ బంకుదాకా నడిచి వేడి వేడి టీ తాగేవాళ్లం.
              కొన్ని సాయంకాలాలు బస్సులో కోటీకి వచ్చి అక్కడినుంచి సుల్తాన్‌ బజారుదాకా పేవ్‌మెంట్ల దుకాణాలను చూసుకొంటూ -అక్కర్లేని, అర్థంలేని చిన్న చిన్న సామాన్లని కొనుక్కుంటూ నడిచేవాళ్లం. సుల్తాన్‌ బజారు నుంచి బర్కత్‌పురాకి పావలా యిస్తే రిక్షా. మా రెండో అబ్బాయి -కాస్త బొద్దుగా ఉండేవాడు. రిక్షా ఎక్కితే కళ్లు సంతోషంతో మెరిసేవి. ఇద్దరూ నేలమీద కూర్చున్నట్టున్న రిక్షాలో మా కాళ్ల దగ్గర కూర్చునేవారు. ఇద్దరి మధ్యా ఒకే సంవత్సరం వార. ఒకేలాగ ఉండేవారు. తలలు తట్టి పేర్లు చెప్పమంటే -'సుబ్బు' 'కిట్టు' అనేవారు. అవి మధ్యతరగతి జీవితంలో అమూల్యమైన క్షణాలు.
                 ఇవాళ మన రాజకీయనాయకుల ధర్మమా అని హిందూ ముస్లింల మధ్య మైనారిటీల పేరిట అంతరాలు పెంచారు గానీ -ఆ రోజుల్లో హిందువెవరో ముస్లిమెవరో తెలిసేదికాదు. అందరూ తెలంగాణా, ఉర్దూ యాసతోనే తెలుగు మాట్లాడేవారు. వారి ఆప్యాయతలూ, ఆదరణా అబ్బురంగా ఉండేది. శాంతియుతంగా, సామరస్యంతో అంతా జీవించే ఆనందమయమయిన రోజులవి.
          ప్రతీ ఒకటవతేదీన జీతం చేతికి రాగానే ఇంటికి వెళ్తూ దారిలో ఇరానీ కేఫ్‌లో కేకులు కొనేవాడిని. నెలల తరబడి జరిగే ఈ పనిని కేఫ్‌ యజమాని గుర్తించాడు. ఒక్కోసారి -నన్ను గుర్తుపట్టి రెండుకేకులు ఎక్కువ యిచ్చేవాడు. 207 రూపాయల జీతగాడికి అది గొప్ప వితరణ. మా ఆవిడా పిల్లలూ జీతంకోసం కాక, కేకులకోసం ఎదురుచూసేవారు. ఆ రోజుల్లో ఆలిండియా రేడియోలో నౌఖరి. జావీద్‌ (నిజానికి పేరు సరిగ్గా గుర్తులేదు) సారంగీ వాదన, జి.ఎం.ఖాన్‌ (ఈ పేరు వేరే కారణానికి బాగా గుర్తుంది) వాయించే తబలా నాకేమీ అర్ధమయేదికాదు. ఇద్దరూ గొప్పవాద్యగాళ్లని చెప్పేవారు. ఆఫీసు మూసాక డ్యూటీ ఆఫీసర్‌గా మాదే సర్వాధికారాలు. ఒకనాటి ఉదయం జి.ఎం.ఖాన్‌ కోసం ఒక ఆఫ్ఘన్‌ వడ్డీవ్యాపారి వచ్చాడు. అతన్ని చూసి ఖాన్‌ స్టూడియోలోకి పారిపోయాడు. ఖాన్‌ అతనికి చాలా డబ్బు బాకీపడ్డాడట. నిలదీయడానికి వచ్చాడు. అతన్ని బయటికి పిలవమంటాడు. నేను ఒప్పుకోలేదు. తగాదా పెట్టాడు. నేను భీష్మించుకున్నాను. ఉర్దూలో నన్ను తిట్టుకుంటూ ఈ వ్యాపారి వెళ్లాడు. తర్వాత ఖాన్‌ వచ్చి చక్కని ఉర్దూలో నాకు కృతజ్ఞత చెప్పుకున్నాడు. నాకు ఒక్కమాట అర్థంకాలేదు. కాని ఒక కళాకారుడిని కాపాడినందుకు నాకు గర్వమనిపించింది. తర్వాత అతను పాకిస్థాన్‌ వెళ్లిపోయి స్థిరపడ్డాడని తెలిసింది.
          తెలంగాణా విడిపోడానికి లక్ష కారణాలు ఉండవచ్చు. కాని నా జీవితంలో అతి ముఖ్యమయిన దశలో ప్రధాన పాత్రని వహించిన తెలంగాణా ఎప్పుడూ బంగారు జ్ఞాపకాలతో నన్ను పలకరిస్తూనే ఉంటుంది.

    


      gmrsivani@gmail.com   
           జూన్ 9,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage