'ప్రధాని' సమస్య

           
         అసమర్ధుడైన 'మంచి' ప్రధాని గద్దె దిగి, సమర్ధుడైన 'అంత మంచి' కాని ప్రధాని గద్దెని ఎక్కే రోజులు వచ్చాయి. ఈ కాలమ్‌ ప్రధాని ఎవరో తేలిన తర్వాత మీరు చదువుతున్నా -నేను తేలకముందు రాసినది. ఎన్నికల ఫలితాలు ప్రకటించే సమయంలో నేను ఆకాశంలో ఉంటాను. మన ప్రధాని ఎవరో టోక్యో, జపాన్‌లో వింటాను.
         కాని ప్రధాని మోడీ కాబోతున్నాడని మాధ్యమాలన్నీ వక్కాణిస్తున్నాయి. మోడీ నిజానికి అంత గొప్పగా ప్రజాదరణ పొందిన నాయకుడు కాడు. 2002 లో 2000 మంది ముస్లింల ఊచకోత వెనుక ఆయన ప్రభుత్వ హస్తం, ఆయన హస్తమూ పరోక్షంగా ఉందని ఆయా మైనారిటీల, కొన్ని పత్రికల అభియోగం. కాని అందుకు రుజువులేవీ లేవని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. తర్వాత అలాంటి ఘోరమైన దాడులే ముజాఫర్‌నగర్‌లో జరిగాయి. అయితే ఆ ప్రభుత్వమో, నాయకులో ఫోకస్‌లో లేరు కనుక -ఆ 'అరాచకానికి' అంత ప్రచారం రాలేదు.
           మోడీని ఎదిరించే పార్టీలన్నీ మొదట 2002 అల్లర్లనే పెట్టుబడిగా చేసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌. తమ అవినీతికి లక్ష సాక్ష్యాలు దొరికినా, తమ మంత్రులు, నాయకులు నెలల తరబడి జైళ్లలో ఉన్నా -ఒక్క మతపరమైన హింసాకాండ ఎదుటి నాయకుడిమీద కాలుదువ్వడానికి వారి పెట్టుబడి.
        అయితే ఈసారి దేశంలో డబ్బై శాతం పైగా ఓటు వేశారు. మాధ్యమాల ఊహాగానాల ప్రకారం వారిలో సగం పైగా నరేంద్రమోడీని నాయకుడిగా ఎన్నుకొన్నారు. గమనించాలి. ఈ దేశంలో సగం మంది కాదు. ఓటు చేసినవారిలో సగం మంది. మిగతా పార్టీలన్నీ కుక్కలు చింపిన విస్తరి అయాయి. అనూహ్యమైన మెజారిటీని సాధించి మోడీ, అతి నీచమయిన స్థాయికి దిగజారి కాంగ్రెస్‌ చరిత్రని సృష్టించాయి. నిన్నకూడా -మోడీ ప్రధాని అవుతారన్న నమ్మకం కలిగాక కూడా -ఒకవర్గం వారిని చూసి భయపడుతున్నారంటున్నారు కొందరు పాత్రికేయులు.
         ఈ దేశంలో రాజకీయాలకు ఆత్మవంచన పెట్టుబడి. మోడీని ఎప్పుడు దుయ్యబట్టాలన్నా 2002 సంఘటన ఒక్కటే చాలు. ఆయన మత ఛాందసమని చెప్పేపార్టీలు మతాన్ని ఆధారం చేసుకుని ఎంత నిర్వాకాన్ని చేశాయో దేశం చూసింది. నిన్న సునీల్‌ అలఘ్‌ అనే పారిశ్రామికవేత్త అంటున్నాడు: పొగిడి బిజెపి కన్నా -తిట్టి సంజయ్‌ఝా, మణిశంకర్‌ అయ్యర్‌ మోడీకి చాలా ఉపకారం చేశారని. ఆయన 'టీ' వృత్తిని కెలికి -కొన్ని లక్షలమంది ఓటర్లని ఆయనకి పోగుజేసి ఇచ్చారు ఒక్క మణిశంకర్‌ అయ్యరే.
          తేల్చుకోవలసినదల్లా -ఇంత విపరీత ప్రజాభిప్రాయం ఉండగా దేశం మోడీని ప్రధానిగా ఎన్నిక చేయడంలో, ఒక చరిత్రని సృష్టించడంలో కారణం ఏమిటి? ఏమిటి మోడీలో మైనారిటీల పట్ల (ఒకవేళ ఉందని సుప్రీం కోర్టుని కాక ఈ ప్రజాభిప్రాయాన్ని నమ్మినా) అసహిష్ణుతని దాటి ప్రధానిగా ఎన్నుకున్నారు? సాధికారికమైన ప్రకటనకి ముందే ఈ విచికిత్సని జరిపి విమానం ఎక్కాను. ఇక్కడ మొదటివాక్యం -మరొక్కసారి. అసమర్థుడైన మంచివాడి నిర్వాకాన్ని ఈ దేశం పదేళ్లు చూసింది. నోరెత్తకుండా చాపకింద నీరులాగ తను అనుకొన్నదాన్ని మూర్ఖంగా నిర్వహించిన సోనియా గాంధీ -దేశంలో చరిత్రని సృష్టించే కోట్ల అవినీతి కుంభకోణాల పర్వాన్ని నిర్వహించడాన్ని వోటరు అసహ్యించుకున్నాడు. తాడూ బొంగరం లేని -దేశ సమస్యలకే ఒక నిర్దిష్టమయిన అభిప్రాయంలేని రాహుల్‌ గాంధీ (ఉదా: ఒక్క టైమ్స్‌ నౌ ఇంటర్వ్యూ చాలు) బుకాయింపుని, బొత్తిగా అనుభవం చాలని వాగుడుని దేశం వింది. కేవలం తమ ప్రయోజనాలే లక్ష్యంగా గాంధీ కుటుంబానికి బ్రహ్మరధం పట్టే షిండేలు, కపిల్‌ సిబల్‌లు, బేణీ ప్రసాద్‌ వర్మలు, చిదంబరంలు -మొదలయినవారి ఆత్మగౌరవం లేని బానిసత్వాన్ని చూసి ఈసడించుకుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చినా నోరుమూసుకున్న వెన్నెముకలేని రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వాన్ని అసహ్యించుకుంది. ధరలు ఆకాశాన్నంటాయి. పరిశ్రమలు ఛిన్నాభిన్నమయాయి. జాతీయాదాయం పడిపోయింది. ఇంత దరిద్రమైన నేపథ్యంలో -అక్కడ నరేంద్రమోడీ గుజరాత్‌లో పది సంవత్సరాలలో తన రాష్ట్రాన్ని ఆర్థికంగా, పాలనాధోరణిలో మన్నికయిన స్థాయిలో నిలిపి -2002 తర్వాత హిందూ ముస్లింలు సామరస్యంతో బతికే అవకాశాన్ని కల్పించడాన్ని ఓటరు గుర్తించాడు. ఇదీ నరేంద్ర మోడీవేపు ఇంతమంది మొగ్గుచూపడానికి కారణం.
        వోటరు సుప్రీం కోర్టు తీర్పుని అర్థం చేసుకున్నాడు. గత కొన్ని నెలలలో 3 లక్షల కిలోమీటర్లు -అంటే భూమిని ఏడుసార్లు ప్రదక్షిణం చేసినంత దూరం తిరిగి, 5187 సభల్లో మాట్లాడి -25 రాష్ట్రాలలో 477 ఎన్నికల మీటింగులలో ప్రసంగించి, దేశంలో ప్రతి నాలుగుమంది ఓటర్లలో ఒకడిని వ్యక్తిగతంగా కలిసి మోడీ ప్రసంగించాడు. 60 సంవత్సరాల అరాచకాన్ని భరించిన మీరు 60 నెలలు తనకి అవకాశం ఇవ్వమన్నాడు. ఒక్కసారి కూడా మతం ప్రసక్తి తీసుకురాలేదు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రతీసారీ మతం ప్రసక్తి తీసుకురాకుండా మాట్లాడలేదు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి గురించే మాట్లాడాడు. నరేంద్రమోడీ ఎంత దౌర్భాగ్యుడో సోనియాగాంధీ ప్రసంగించింది. ఎంత నీచుడో ప్రియాంక గాంధీ వక్కాణించింది. ఆయన ప్రధాని అయితే 24 వేల మంది ప్రాణాలు కోల్పోతారని రాహుల్‌గాంధీ వాక్రుచ్చారు. కొన్నివేల గంటలు, కొన్ని కోట్లమంది ప్రతీఅక్షరాన్ని విని, చూసి, బేరీజు వేసుకొన్న నేపథ్యంలో మోడీ ధోరణిలో, బాడీ లాంగ్వేజీలో, ఆత్మవిశ్వాసంలో, చిత్తశుద్ధిలో వారికి నిజాయితీ కనిపించింది. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ప్రభృతుల బాడీ లాంగ్వేజీలో వారి అసమర్థత, బుకాయింపు, ఆసహిష్ణుత, ఓడిపోతామన్న భయం కనిపించింది. నటుడిగా 40 సంవత్సరాలు కెమెరా ముందు నిలబడినవాడిగా కెమెరాలు మోసం చెయ్యలేవు. కెమెరా బూతద్దం. నిజం నిప్పు అవుతుంది. అబద్ధం తాచుపామవుతుంది. కాగా, మీలో నిజాయితీ లేకపోతే మీ బట్టలు ఊడదీసి నిలబెడుతుంది. ఆ విధంగా రెండు వర్గాలు మోడీ ప్రచారంలో పాల్గొన్నాయి. 1. ఆయన ఆత్మ విశ్వాసాన్ని చాటే పార్టీ ప్రచారం, 2. ఆయన్ని నీచస్థాయికి దిగదొక్కే మణిశంకర్‌ల, ఝాల, గాంధీల ప్రచారం.
        నేను మోడీని చూడలేదు. కలుసుకోలేదు. నేను గుజరాత్‌లో విజయాలను చూడలేదు. వోటు వేసిన 85 శాతం ప్రజలూ చూడలేదు. మరేం చూశారు? నిస్సహాయతతో కృంగిపోయిన వ్యవస్థలో, నిజాయితీగా తమ అండని నిలుస్తాననే ఒక గొంతుని గుర్తుపట్టారు. ఎంత నిజాయితీ? గుజరాత్‌ అంత నిజాయితీ. స్థంభంలోంచి వచ్చిన ఉగ్రనరసింహుడి అవతారానికి ప్రహ్లాదుడి భక్తి ఎంత కారణమో హిరణ్యకశుపుడి దుర్మార్గమూ, రాక్షసత్వమూ అంతే కారణం. పదేళ్ల కాంగ్రెస్‌ అరాచకం కూడా మోడీ విజయానికి పెట్టుబడి. ఇక్కడ ఒక గొప్ప కథ గుర్తుకొస్తుంది. బెకెట్‌ రెండో హెన్రీ రాజుకి తొత్తు. ఒక దశలో తనని ప్రేమించిన అమ్మాయిని రాజు కోరికకి ఎరగా యిచ్చేస్తాడు. దేశపు మత గురువు చచ్చిపోయాడు. అతని చేతిలో ఖజానా ఉంది. రాజు తన చెప్పుచేతల్లో ఉన్న బానిసని మత గురువుని చేశాడు -ఇతను వద్దని మొత్తుకున్నా. మతగురువు దేవునికి, దైవత్వానికి ప్రతినిధి. దేవుని సన్నిధిలో ఓ తొత్తు ఉదాత్తమయిన మతగురువుగా పరివర్తన చెందాడు. అత్యంత ఆత్మస్థైర్యంతో దేవునికి తనని తాను సమర్పించుకున్నాడు. రాజుకి శత్రువయాడు. అతని హత్య కథకి ముగింపు. తాను చేపట్టే పాత్ర, స్థానం ఆ వ్యక్తిలో ఎంతటి మార్పును తీసుకురాగలవో చెప్పే ఓ గొప్ప ఉదాహరణ.
         రేపు ప్రధాని గద్దెని ఎక్కబోతున్న మోడీ కేవలం తనకు వోటు వేసిన వారికే కాదు దేశానికంతటికీ ప్రధాని. ఆయనతో విభేధించినవారూ, వోటు వెయ్యనివారూ, ఆయన గురించి కేవలం విన్నవారూ, ఆయన పట్ల ఆశలు పెంచుకున్నవారూ -అందరూ ఉన్నారు. బానిస దేవుడికి ప్రతినిధి అయి -ఆకాశాన్ని నిలిచిన కథ బెకెట్‌. చిత్తశుద్ధి, ఆత్మస్థైర్యం గల నాయకుడు ఇన్ని కోట్ల ప్రజానీకం ఆశల్ని, ఆకాంక్షల్నీ నెరవేరుస్తాడన్న అపూర్వమైన విశ్వాసానికి ప్రతీక ఆయన ఎన్నిక.
బాధ్యత ఉదాత్తతని ఇస్తుంది. విశ్వాసం మామూలు మనిషిని దేవుడిని చేస్తుంది. ప్రపంచంలోనే తన ఎన్నికల ప్రచారంలో చరిత్రని సృష్టించిన మోడీ కేవలం నేలబారు నాయకుడు కాదు. రాబోయే 60 నెలలు ఆ నిజాన్ని నిరూపిస్తాయని, నిరూపించాలని ప్రపంచంలోకల్లా పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కోరుకుంటోంది. అందుకనే ఆయనకి పట్టం గట్టింది. నేను మోడీ ప్రధాని అయిన పది రోజుల్తరవాత మన దేశం వస్తాను. ఆయన పాలనను పదిరోజులు నష్టపోతున్నాను.
      


      gmrsivani@gmail.com   
           మే 19,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage