Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

ఉపశమనం!

                  
       ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలాన్ని తట్టుకుని భరించడానికి భగవంతుడు రెండు ఉపశమనాల్ని ఇచ్చాడు. మామిడికాయ, మల్లెపువ్వు. ఆంధ్రు డు భోజనప్రియుడు. మామిడికాయతో చెయ్యగలిగినన్ని వంటకాలు, చూపించగలిగినన్ని రుచులు మరే విధంగానూ సాధ్యంకావు. వేసవికాలంలో తలనిండా మల్లెపువ్వులు తురుముకోని ఆడపిల్ల కనిపించదు.
      ఇప్పుడిప్పుడు తెలుగువాడి గుండెలు మండిపోతున్నాయి. కాంగ్రెస్‌ చేసిన ఈ దుర్మార్గాన్ని, అరాచకాన్ని తట్టుకోడానికి భగవంతుడు రెండు ఉపశమనాల్ని ఇచ్చాడు. మొదటిది -అప్పుడే జరిగిపోయింది. బాధ్యతగల, ఆత్మాభిమానంగల నాయకులంతా ప్రాణంలేని 'బొందె'ని వదిలిపోయినట్టు పార్టీని వదిలిపోయారు. ఈ నిష్క్రమణం వారి వారి స్వార్థాలకయి నా అలా వెళ్లడం గొప్ప ఉపశమనం.
          రెండో ఉపశమనం -ఎన్నికలు. పార్టీని నేలబారు వోటరు పాతరవేసే అవకాశం. పేదవాడి గుండెలు ఎప్పుడూ రగులుతూనే ఉంటాయి. భగవంతుడు వారికి రెండు ఉపశమనాల్ని ఇచ్చాడు. ఆత్మాభిమానం, ఆకలి. ఆకలి ఉపశమనం ఏమిటని అనిపించవచ్చు. తెల్లారిలేస్తే ఆకలిని జోకొట్టడానికి నిత్యం శ్రమించే పేదవాడికి యింకే పనయినా చెయ్యడానికి అవకాశమూ లేదు, వ్యవధీ లేదు. ఆకలి అతని ఆవేశాలకూ, ఆలోచనలకూ ఆనకట్ట.
          జీవితంలో మనకు ఎదురయే ఏ కష్టం నుంచయినా విముక్తి కలిగించేది -దాని పరిష్కారమే కానక్కరలేదు. మన దృష్టి. హెలెన్‌ కెల్లర్‌ మూగది. గుడ్డిది. చెమిటిది. కాని ప్రపంచంలో ఈ మూడు ముఖ్యేంద్రియాలనూ నష్టపోయిన ఎందరికో మార్గదర్శకం అయింది.
             పాలకుల అసమర్థత, ఎలక్ట్రిసిటీ సిబ్బంది నిర్వాకం కారణంగా చెమటలు కక్కే కరెంటు కోత నరకాన్ని అనుభవించే క్షణాల్లో వొడినిండా మల్లెపువ్వుల్ని పోసుకుని దండగుచ్చే మా ఆవిడని చూసి ఆటవిడుపుని తెచ్చుకుంటాను. ఆమె యిప్పటి నరకాన్ని మరిచిపోడానికి మరి కాస్సేపటిలో విచ్చుకునే మల్లెపువ్వులను ఆశ్రయించిన అదృష్టవంతురాలు.
               చాలా సంవత్సరాల కిందట ఆస్కార్‌ బహుమతిని, ఉత్తమ నటుడి అవార్డుని గెలుచుకున్న హాలీవుడ్‌ చిత్రం -''మై లెఫ్ట్‌ ఫుట్‌'' ఎప్పుడూ జ్ఞాపకం వస్తూంటుంది. డేనియల్‌ దే లివిస్‌ అనే -మరీ అందంగాలేని నటుడు (''గాంధీ'' చిత్రం తొలిభాగంలో గాంధీ, ఫాదర్‌ చార్లెస్‌ ఆండ్రూస్‌ పేవ్‌మెంటు మీద నడుస్తూంటే ఎదిరించిన అల్లరిమూకలో ప్రథముడు) అపూర్వంగా నటించిన చిత్రం. పుట్టుకతోనే శరీరంలో నరాలు బిగుసుకుపోయిన 'స్పాస్టిక్‌' అవలక్షణంతో ఉన్న వ్యక్తి.
         అతి దీనమయిన, తన మనోగతాన్ని చెప్పుకోలేని దయనీయమైన జీవితం అతనిది. అతను క్రమంగా కదిలే తన ఎడమకాలు బొటనవేలుని స్వాధీనం చేసుకుని ఆ బొటనవేలితో తన జీవితాన్ని ఆవిష్కరించే ఆత్మకథని రాశాడు. దానిపేరు, సినిమా పేరు -'మై లెఫ్ట్‌ ఫుట్‌'. ఈ సినీమాని చూడనివారు వెంటనే ఇంటర్నెట్‌కి వెళ్లి చూడాలి. పరిస్థితులు సానుకూలపడని దురదృష్టానికి ఉపశమనం -పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చుకోవాలనే సంకల్పం, తెచ్చుకునే కృషీ.
             మరొక మహానుభావుడు ఉన్నాడు. అతను పసితనంలో ఆకలిని మరిచిపోడానికి పార్కులో కడుపునిండా మంచినీళ్లు తాగి, మరిపించడానికి గట్టిగా పాటలు పాడి, గెంతులు గెంతి -ఆ గెంతుల్ని కళగా మలిచాడు. ఉపాధికోసం బారుల్లో పాటపాడుతూ -కేవలం కాలే కడుపు కారణంగా గొంతుపోయిన తన తల్లిని తాగుబోతులు అల్లరి చేస్తూంటే ఆమెని కాపాడడానికి పసితనంలోనే స్టేజిమీదకు దూకి ఆమె పాడిన పాటలు పాడి సభికుల్ని మెప్పించాడు. తను కళాకారుడు కావడం -కళకోసం కాదు, పట్టెడన్నం కోసమని చెప్పాడు.
                కష్టానికి కన్నీటికి కొత్తకోణాన్ని, కొత్త రుచినీ మప్పిన మహానటుడు -చార్లీ చాప్లిన్‌.జీవితం ఎవరికీ వొడ్డించిన విస్తరి కాదు. మన సామర్థ్యం, వాతావరణం, సమాజం, కుటుంబం, పరిస్థితులూ -యివన్నీ సమష్టిగా జీవితాన్ని ఒక ఛాలెంజ్‌గానో, ఒక పరీక్షగానో నిలపవచ్చు. చికిత్స కు రెండే రెండు సాధనాలు -తట్టుకునే సంకల్పబలం, చిత్తశుద్ధి. విజయానికి ఏనాడూ దగ్గర తోవలేదు. వ్యక్తిగతమైన కష్టానికి నిస్పృహ కాలకూటవిషం. నిర్వీర్యత అపజయానికి తొలిమెట్టు.
            క్రిస్టొఫర్‌ రీవ్‌ చాలా అందమైన, అద్భుతమైన నటుడు. కిందటి శతాబ్ది ఎనిమిదో దశకంలో 'సూపర్‌ మాన్‌' చిత్రాలలో ప్రపంచ ప్రఖ్యాతిని సాధించాడు. 1995లో ఒకానొక చిత్రంలో గుర్రపు స్వారీ చేస్తూ కిందపడి మెడనుంచి కిందభాగమంతా స్పర్శని కోల్పోయి పక్షవాతంతో మూలనబడ్డాడు. కాని అంతటితో ఆగిపోలేదు. కృంగిపోలేదు. తనలాంటి దురదృష్టవంతుల్ని ఆదుకునే చికిత్సకోసం, అందించవలసిన వైద్య సదుపాయంకోసం కంకణం కట్టుకుని ఒక సంస్థని -క్రిస్టోఫర్‌ రీవ్‌ పెరాలిసిస్‌ ఫౌండేషన్‌ని ప్రారంభించి -42.5 మిలియన్ల డాలర్ల నిధులను పోగుచేసి -అలాంటి దురదృష్టవంతుల చికిత్సకు తమ దేశచట్టాన్ని, ఇన్సూరెన్స్‌ విధానాలను తిప్పిరాయించి, మరో 9 ఏళ్లు జీవించి తన 54వ యేట కన్నుమూశాడు. అతను నిజమైన సూపర్‌మాన్‌. అతని పెట్టుబడి -అకుంఠితమైన ఆశాభావం, కష్టాన్ని అవకాశంగా మార్చుకునే పాజిటివ్‌ దృక్పథం.

      ఏతావాతా, వేసవితాపం నన్ను బాధపెట్టదు. మల్లెపువ్వు నాకు ఉపశమనాన్ని యిస్తుంది. నానాటికీ పెరిగిపోతున్న కాంగ్రెస్‌ మీద ఏహ్యభావం నన్ను హింసించదు. రాబోయే ఎన్నిక, నా చేతిలో వోటు నాకు ఊరటనిస్తుంది.

 


      gmrsivani@gmail.com   
           మే  03,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage