Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you
using iPad ( any iOs Device)? Try direct MP3,
Click
here
ఎన్నిక(ల)లు!
నేను తేలికగా 51 సంవత్సరాలుగా సినీరంగంలో
ఉన్నాను. రచనలు చేశాను. నటించాను. గొప్ప గొప్ప సినీమాలను చూశాను. కళ్లముందు
పంచ రంగుల కలల్ని ఆవిష్కరించే అతి ఆకర్షణీయమైన మాధ్యమం సినీమా అని మొన్న
మొన్నటిదాకా నమ్మాను. కాని ఆ నమ్మకం ఇప్పుడిప్పుడే సడలిపోయింది. సినీమా కంటే
-కళ్ల ముందు వెయ్యి రంగుల కలల్ని ఆవిష్కరించగలిగిన శక్తీ, సామర్థ్యం వున్నది
రాజకీయరంగమని, ఏ నటుడూ రాజకీయ నాయకునికి సాటిరాడని ఇప్పుడిప్పుడే
రుజువవుతోంది.
సినీమా 'కళ'గా కాక వ్యాపారంగా మారిపోయి చాలా ఏళ్లయింది. కాని దాన్ని తలదన్నే
వ్యాపారం -రాజకీయం. వ్యాపారంలో లాయకీలన్నీ యిప్పుడిప్పుడు రాజకీయ నాయకులు
ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేష్
పోఖ్రాల్‌గారి సతీమణి రేణూ పోఖ్రాల్ స్పష్టంగా చెప్పింది. ''మీరు టీవీల్లో
చూస్తూంటారు కదా? ఒక వస్తువు కొంటే రెండోది ఉచితం అని. అలాగే నేనూ ఓ ఆఫర్
యిస్తున్నాను. ఇది డబుల్ కా దమ్. నాకు ఓటు వెయ్యండి. రాష్ట్ర
ముఖ్యమంత్రిని ఉచితంగా పుచ్చుకోండి'' అన్నారు. గమనించాల్సిన విషయం -రమేష్
పోఖ్రాల్ బిజెపి అభ్యర్థి. రేణూ పోఖ్రాల్ కాంగ్రెస్.
కుటుంబాల్లో ఇలాంటి పంపకాలు మనకి కొత్తకాదు. ధర్మాన ప్రసాదరావుగారు మంత్రిగా
ఉన్నంతవరకు కాంగ్రెస్ మనిషి. కేసులొచ్చి ఈ మధ్య కండువా మార్చారు. వారి
తమ్ముడు వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థి. అంటే రాష్ట్రంలో ఏ కండువా పదవిలోకి
వచ్చినా గ్రూపు ఫొటోలో వారి కుటుంబ సభ్యులొకరు ఉంటారు. ఈ మధ్య పేపర్లో,
టీవీల్లో ముఖాలు చూడడం మానేశారు ప్రజలు. మెడలో కండువాలే చూస్తున్నారు. ఏది
ఎప్పుడు మారుతుందో నాయకులకీ ఒకప్పుడు అంతుబట్టడం లేదు కనుక. ఏమిటీ? ఏదో మాట
వినిపిస్తోంది? సిద్ధాంతాలా? తప్పు బాబూ! అలాంటి బూతు మాటలు రాజకీయ నాయకుల
విషయంలో మాట్లాడకండి.
వసుంధరా
రాజే బిజెపి. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్. అలనాడు మహారాణీ విజయరాజే
సింధియా బిజెపి. ఆమె కుమారుడు మాధవరావు సింధియా కాంగ్రెస్. కొందరు
దంపతులున్నారు. ఇంట్లో ఏమోగాని రాజకీయాల్లో వారు ఒకే కండువా మీదే నిలుస్తారు.
ఉదాహరణకి -కొండా సురేఖ, మురళి దంపతులు. వారింట్లో ప్రస్థుతం నాలుగు రకాల
కండువాలున్నాయి. ముందు చెయ్యి గుర్తు కండువాలు. తర్వాత ఫ్యాన్ గుర్తు.
తర్వాత మళ్లీ చెయ్యి, తీరా వారు చెయ్యిచ్చాక ఇప్పుడు కారు గుర్తు.
సిద్ధాంతాలా? అదిగో మళ్లీ....
చంద్రబాబుగారంటే నాకభిమానం. హైదరాబాద్‌ను ఆకాశంలో నిలిపిన నాయకులు. ఆయన
మొన్న ఒక సభలో ''మీకు కూలీగా పనిచేస్తాను. నాకు ఓటు వెయ్యండి'' అని ప్రజల్ని
దేబిరించారు. అయ్యా! ప్రజలు కూలీలకు ఓటు వెయ్యరు. నిజాయితీగా సేవచేసే
నాయకులకు వేస్తారు. మీదగ్గర నిజాయితీ ఉన్నదా? మీరు కూలీల స్థాయికి
రానక్కరలేదు. కూలీలు హీనులని నా ఉద్దేశం కాదు. నిజంగా సమాజానికి సేవచేసే
వ్యక్తి ఉదాత్తంగా చెయ్యాలి. గర్వంగా చెయ్యాలి. గర్వపడేటట్టు చెయ్యాలి.
ఇక నేను కేసీఆర్ గారికి ప్రత్యేకాభిమానిని. వారి బూతులు, తిట్లు, వారి
లాజిక్ నాకు మార్గదర్శకం. ''మొన్న ఓ సన్నాసి అంటున్నడు. కేసీఆర్ కుటుంబంతో
రాజకీయాల్లో దిగిండని. ఏం? నువ్వూ దిగరాదు? నువ్వు గంగలో దిగుతవా? నిన్ను
దిగొద్దని ఎవుడన్నా ఆపినాడా? మళ్లీ ఆ మాటెత్తితే నాలుక్కోస్తా. నిన్న ఆ
గెడ్డం మాసినోడు -ఎవుడాడు?'' పక్కాయన్ని చూస్తాడు. ఈయనకి జ్ఞాపకం రాక కాదు.
జ్ఞాపకం ఉంచుకోవలసినంత ప్రాముఖ్యం ఆ గెడ్డపోనికి లేదని. పక్కవాడందిస్తాడు-
''పవన్‌కళ్యాణ్''
''తెలంగాణాలో ప్రచారం చేస్తాడంట. నువ్వు ఆ బుడ్డర్ ఖాన్
ఏసాలేసుకోక ఎందుకీసోయి? ఎందుకీ లత్తుకోరు కబుర్లు? నోరు ముయ్యాల. లేదా
గుడ్డలిప్పి ఖమ్మందాకా వెంటబడి తంతాం'' ఇది కేవలం నమూనా సంభాషణ మాత్రమే.
జగన్‌గారు నాకు
ఆఖరు అభిమాన నాయకులు. వారి హయాంలో రాష్ట్రంలో పూరిపాకలు తీసేసి అందరికీ
పెంకుటిళ్లు కట్టిస్తామన్నారు. ఇది నిజంగా గొప్పసేవ. పూరిపాకలేని ఆంధ్రదేశం
అరచెయ్యి పట్టనంత వైకుంఠం.
ఇక కాంగ్రెస్ రాకుమారుడు రాహుల్
కేసీఆర్‌ని 'చాకూమార్‌హై' అని అభివర్ణించారు. తెలంగాణా యిస్తే కాంగ్రెస్‌లో
చేరుతానన్న కేసీఆర్ తెలంగాణాను ఇవ్వనిచ్చి, తీరా యిచ్చాక -సకుటుంబంగా వచ్చి
అమ్మతో గ్రూపు ఫొటో తీయించుకుని ఆమె మొహం చాటు చేసేసరికి ప్లేటు
ఫిరాయించారని -చాకుతో దొంగదెబ్బ తీసే మనిషి అని అభివర్ణించారు. కాంగ్రెస్‌లో
మరో మహానుభావుడున్నారు. వారి మాటల్ని పార్టీ అధినాయకత్వం విన్నదో, విన్నా
రహస్యంగా ఆనందిస్తుందో మనకు తెలియదుగాని వారు నరేంద్రమోడీ ''పశువు'' అన్నారు.
లత్కోరు సాబులు, సన్నాసులు, హిట్లర్లు, పశువులు, చాకూమార్‌లు, అభినవ
శిశుపాలురు -నా ఎరికలో ఇంత 'రుచి'కరమైన ఎన్నికని నేను చూసి ఎరగను.
చాలా సంవత్సరాల కిందట -దక్షిణాఫ్రికాలో ఎన్నికలు జరిగినప్పుడు ఒక అభ్యర్థి
ఎన్నికల సభలోకి ఎదుటి పార్టీ అభ్యర్థి వచ్చి వేదిక ఎక్కాడట. ఈ పార్టీవారు
ముందుకు దూకబోయారు. కేకలు వేయబోయారు. ఆ ప్రత్యర్థి వారిని ఆపాడు. మైకు
అందుకున్నాడు. ప్రేక్షకులతో అన్నాడు. ''నేనూ ఈ ప్రత్యర్థి శత్రువులం కాము.
మా మధ్య వైరం లేదు. స్పర్ధలేమీ లేవని నిరూపించడానికే నేను ఈ వేదిక మీదకి
వచ్చాను. మేమిద్దరం మీకు సేవచెయ్యాలనే ఆదర్శంతో ఎన్నికలో పోటీ చేస్తున్నాం.
ఆయన సిద్ధాంతాలవి. నా సిద్ధాంతాలివి. ఆయనకొక ప్రణాళిక ఉంది. నాకొక ప్రణాళిక
ఉంది. మీకేది నచ్చితే వారిని ఎన్నుకోండి. మీరు ఎన్నికచేసిన వ్యక్తే పదవిలోకి
వస్తాడు''.
ప్రేక్షకులు షాక్
అయారు. కాని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇప్పుడిప్పుడు ఎన్నికల పోటీలో
ఎదుటి వ్యక్తి బుడ్డర్ ఖాన్, సన్నాసి, లత్తుకోరు మనిషి, పశువు -అని
పిలుచుకునే రోజులు వచ్చాయి. కారణం -ఎవరికీ సేవ ముఖ్యం కాదు. సాధించుకునే
పదవి, దానివల్ల వచ్చే ప్రయోజనం ముఖ్యం.
సేవకి ప్రజలు అర్పించే నివాళికి ఒక
అద్భుతమైన సన్నివేశాన్ని చెప్పి ముగిస్తాను. కలకత్తా వీధిలో మదర్ ధెరెస్సా
వెళ్తోంది. ఎదురుగా కమ్యూనిస్టులు సమ్మె చేస్తూ ఊరేగింపుగా వస్తున్నారు.
ఆమెను చూసి ఊరేగింపులో
చాలామంది బయటికి వచ్చి -దేవుడినీ, దైవత్వాన్నీ నమ్మని వీరు నడిరోడ్డు మీద
చెప్పులు తీసి -ధెరెస్సాకి నమస్కారం చేసి ఊరేగింపులో కలిసిపోయారు.
మానవసేవ మతాతీతమయింది. కులాతీతమయింది. మతాలు,
కులాలు, మైనారిటీలు, మెజారిటీలు -యివి ఈనాటి రాజకీయాలకు పెట్టుబడులు.
సంస్కారానికి ఈ పోరులో మొదటి విడాకులు.