Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

బూతు పురాణం!

                 

కాంగ్రెసుని దారుణంగా దుయ్యబట్టే కార్యక్రమాన్ని ఈ మధ్య ఛానల్లో చూశాను. ఇటీవల కాంగ్రెసు మీద ఎవరు దుమ్మెత్తిపోసినా అది ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తోంది సమృద్దిగా. ఆ అమ్మాయికి పాపం -తెలుగురాదు. ఆ విధంగా టీవీ ఏంకరు కావడానికి మొదటి అర్హతను సంపాదించుకుంది. ఆమె మాటకన్నా - మాట్లాడే విషయం రాణిస్తోంది కనుక - ప్రేక్షకులు ఆమెని భరిస్తున్నారు. ఉన్నట్టుండి ఈవిడ "కాంగ్రెసు 'స్వకుచ మర్ధనం చేసుకుంటోంది ' అంది. నేను తుళ్ళిపడ్డాను. ఆ మాట అర్ధమేమిటో రాసిన రచయితకి అర్ధం కాలేదని మనకి  అర్ధమౌతుంది. ఏంకర్ కి అర్ధంకాదన్న విషయం మనకు తెసిందే. ఈ అమ్మాయికి తెలియడం లేదని మనకి బాగా తెలుస్తోంది. 'స్వకుచమర్ధనం ' అంటే ఎవరి స్థనాల్ని వాళ్ళు పిసుక్కోవడం. రాసినవాడికీ, చెప్పేవాడికీ అర్ధంకాని బూతు వినేవాడికీ అర్ధం కాదన్న ధైర్యం ఈ చానల్ కి పెట్టుబడి కావచ్చు. ఆ విధంగా ఈ ఛానల్ చాలా ప్రముఖమైనదే. ఈ మధ్యకాలంలో మనకి అజ్నానమే శ్రీరామరక్ష. అర్ధంకాని బూతు పవిత్రమైన ఆలోచనే కిందే లెక్క. అయితే స్వకుచ మర్ధనాన్ని దృశ్యంగానే చూస్తూ ఆనందించే నేటి సినిమా ప్రేక్షకులకు  ఇది మరీ అంత అభ్యంతరమైన బూతుగా కనిపించకపోవచ్చు.

నా చిన్నతనంలో "బాలరాజు" సినీమాలో శివరావు 'నా అప్పడాల కర్రా, నా ఆవకాయబద్దా!' అన్నాడని మా అమ్మ బుగ్గలు నొక్కుకుంది. ఇది కనీసం 65 సంవత్సరాల కిందటిమాట. బూతు వీధిన పడి మనతరంలో చాలా ఏళ్ళయింది.

మా ఆవిడ ఓ డీ.యీ.వో గారి కూతురు. ఆవిడ జీవితంలో ఏనాడూ చుడీదార్  వేసుకోలేదు. దాని ఊసెత్తితే తిట్టేవారట మేష్టరుగారు. ఓసారి ఒళ్ళు కనిపించే చీర కట్టుకుందని (అప్పుడాయన స్కూలు హెడ్మాష్టరుగారు) వెంటనే ఆమెని ఇంటికి పంపించేశారంటా  చీర మార్చుకు రమ్మని. ఆమెకి తెలిసిన దుస్తులు వోణీ, పరికిణీ, చీర. అయితే ఇది 50 ఏళ్ళ కిందటిమాట. ఇప్పుడు 70 ఏళ్ళ తెలుగు మహిళలూ చుడిదార్ లలో కనిపిస్తున్నారు. శుభం.

బూతు కార్యం జంతు ప్రవృత్తి. సంఘర్షణ మానవ నైజం కాదు. కానీ శృంగారం కళ. శృంగారాన్ని బూతు స్థాయికి సాగదీసి, మనకి ఆ దురభిప్రాయాన్ని అమ్మి ఖరీదు చేసుకునే వ్యవస్థ ఒక్కటే ఉంది - సినిమా. దాని చెల్లెలు - టీవీ.

అల్లసాని పెద్దన కంటే అందంగా సెక్స్ ని చెప్పినవారు నాకు కనిపించరు. ప్రవరాఖ్యుడనే అందగాడిని చూసిన వరూధిని అనే  గాంధర్వ కన్య.. 'ఏడ్చె కలస్వనంబుతో మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందగన్ ' అన్నాడు.

ఆ మధ్య ఎవరో వ్యాసం రాశారు - పోతన రచనల్లో శృంగారాన్ని గురించి. ఆయన స్పృశించినంత శృంగారం మరెవరూ చేయలేదట. సరస్వతిని కూడా "చనుకట్టుబయిబడనేల ఏడ్చెదో గాటభరాజువైరి?" అన్నాడు.

చాలాసార్లు టీవీల్లో వినిపించే మరొక మాట ఉంది స్థనశల్య పరీక్ష అని. ఇది బాగా అలవాటయి - బూతు అరిగిపోయి పాతబడింది. స్థనశల్య పరీక్ష అంటే స్థనాలలో ఎముకని వెదకడం. ఎముక ఉండదు. ఉండే ఆస్కారం లేదు. లేనిచోట ఉండనిదాన్ని వెదకడం - స్థన శల్య పరీక్ష.

అజ్ఞానానికి ఒక సుఖం ఉంది. అర్ధంకానిది పవిత్రంగా ఛలామణీ అయిపోతుంది. అయితే తమకి అర్ధంకానిదంతా అనర్ధమనే తెలివితేటలు విజ్రుంభించే వ్యవస్థలో మనం ఉన్నామిప్పుడు - అది దేవుడయినా, మామయినా, సంస్కృతి అయినా, సంప్రదాయమయినా, పెళ్ళయినా, పెళ్ళామయినా. ఒక్కసారి బరితెగించాక ఎక్కడికి పోతామన్న పట్టింపు లేదు.

ప్రస్తుతం మనం బూతుకు పరిమితమౌదాం. ఓడ్ర మహిళ గురించి శ్రీనాధుడు చెప్తూ

మకరధ్వజుని కొంప ఒక చెంప కనుపింప

చీరగట్టినదయా చిగురు బోడి - అన్నాడు.

ఇది పచ్చి బూతు. కానీ అనడం బాగుంది. గొప్పగా ఉంది. అసభ్యానికి కవిత్వ స్థాయి వచ్చేసరికి 'పరువు ' పెరిగింది.

ఏ సమాజంలోనూ, ఏ పరిస్థితులలోనూ, ఏ కారణంగానూ విలువలు రాజీపడవు.పడకూడదు. అదే మన సంస్కృతి బలం. కానీ సందర్భం, ఔచిత్యం, చిన్న ముసుగు, సూచన - ఇవన్నీ ఆ విలువకి ఎంతో కొంత పెద్దరికాన్ని ఇస్తాయి.

బూతుకార్యం జీవలక్షణం. అయితే బూతు ప్రసక్తి సమాజంలో కాస్త 'అంటు '. మాంసం తింటూ పేగులు మెడకి చుట్టుకోం కదా! బాబూ! ఇప్పుడు చుట్టుకుంటున్నాం. అందుకే ఈ కాలం.

ఉండవలసిన చోట దాన్ని ఆపినా, ఇవ్వగలిగినంత గడుసుదనం ఉన్నా, అసభ్యతను మరిపించే ఉద్దతి ఉన్నా - బూతుకి సామాజిక గౌరవం వస్తుంది.

"లేపమంటావా? నువ్వు లేవనంటావా?" అనడానికీ

"ఆరేసుకోబోయి పారేసుకున్నాను" అనడానికీ తేడా ఉంది. మొదటిది రెచ్చగొడుతుంది. రెండోది కితకితలు పెడుతుంది.

ఆఖరుగా బూతుమీద ఈ కాలం కి మరో పేరుంది - దీన్నే స్థనశల్య పరీక్ష అంటారు.


      gmrsivani@gmail.com   
               ఏప్రిల్  14,   2014          

*************

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage