Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here Are you
using iPad ( any iOs Device)? Try direct MP3,
Click
here
దేవుడు క్షమించుగాక!
గత
సోమవారం శ్రీలంక నెదర్లాండ్‌ల ఆట ముగించే సమయానికి ముందుగానే టీ20 క్రికెట్
ఆటలో ఓడించింది. ఇంకేం చెయ్యాలో తెలీక నాకు చాలా యిష్టమైన ఛానల్ 'టైమ్స్
నౌ'కి వెళ్లాను. అప్పుడే శ్రీరామ సేన నాయకులు ప్రమోద్ ముతాలిక్ గారి
వీరంగాన్ని చూసే అదృష్టం కలిగింది. అయ్యో! కాస్తముందుగానే ఈ అదృష్టాన్ని
పుంజుకోలేకపోయానే అని బాధపడుతూ ఈ వినోద ప్రదర్శనని తిలకించాను. చాలామందికి
ప్రమోద్ ముతాలిక్ ఎవరో తెలీకపోవచ్చు. కర్ణాటకలో భారతీయ సంప్రదాయ వైభవాన్ని
కాపాడడానికి కంకణం కట్టుకుని, తనని తానే నియమించుకున్న ఓ నైతిక సైన్యాధిపతి
ప్రమోద్ ముతాలిక్. వీరి ఆదర్శం ఈ దేశపు నైతిక విలువల్ని కాపాడడం. మన
సంస్కృతీ వైభవాన్ని కాపాడడం. మీరీపాటికే ఈ మహానుభావుడిని గుర్తుపట్టకపోతే
నేనర్థం చేసుకోగలను. ఆయన సాధించిన గొప్ప విజయాలను ఒక్కసారి స్మరించుకోవడం
మన జన్మకి సార్ధకం. జనవరి 2009లో మంగుళూరు పబ్‌లో నా మనుమరాళ్ల వయస్సున్న
అమ్మాయిల్ని తరిమి తరిమి చావగొట్టడం ఒక్కటి చాలు. వాళ్లు చేసిన నేరం ఆ
సమయంలో తమ స్నేహితులతో పబ్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం. వారి ద్వారా
మనదేశానికి దిగుమతి అయిన పాశ్చాత్య నాగరికతలోని అవలక్షణాలు మన మతాన్ని
కలుషితం చేస్తున్నాయని వీరి ఉద్దేశం. కెమెరాల ముందే ఆయన తీసుకొచ్చిన రౌడీలు
నిర్దాక్షిణ్యంగా ఆడపిల్లలను వెంటబడి కొట్టారు. దెబ్బలతో కొందరు ఆడపిల్లలు
ఆసుపత్రిలో చేరారు. వారు తమ మిత్రులతో ఏం చేస్తున్నారో తెలీదుకాని -వాళ్లు
నిస్సహాయంగా పరుగులు తీస్తూ -నేలమీద దొర్లి ఏడుస్తున్న దృశ్యాలు అతి
దయనీయంగా, జుగుప్సాకరంగా కనిపించాయి. ప్రమోద్ ముతాలిక్‌ను అటుతర్వాత చాలా
నేరాల కింద అరెస్టు చేశారు.
హిందూ మతాన్ని, దాని అభ్యున్నతినీ ఆవిధంగా కాపాడిన ప్రమోద్ ముతాలిక్ మళ్లీ
2014లో గోమతేశ్వరుడిలాగ తలయెత్తాడు. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో బిజెపి తరఫున
పోటీ చెయ్యడానికి టిక్కెట్టును సంపాదించుకున్నాడు. కేవలం 4 గంటల్లో పార్టీ
అధినాయకత్వం ఏమనుకుందో కాని అంతే హఠాత్తుగా ఆయన్ని బయటికి పంపించారు.
దేశభక్తుడైన ముతాలిక్ గుండె పగిలింది.
''నేనేం తప్పుచేశాను?'' అని
దీనంగా, కిండర్ గార్డెన్ స్కూలు విద్యార్థిలాగ ప్రశ్నించాడు ముతాలిక్.
మతం పేరిట అమ్మాయిల్ని చావగొట్టిన ఘనతకి రావలసిన గుర్తింపు రాలేదన్న వేదన
వారి ముఖంలో ద్యోతకమైంది.
ఇదీ -ఆనాటి 'టైమ్స్ నౌ' కార్యక్రమానికి
నేపథ్యం. గునుస్తున్న ముతాలిక్‌ని ఓ పత్రికా ప్రతినిధి అడిగాడు: 'ఆనాడు
ఆడపిల్లల్ని చావగొట్టిన ఘనకార్యానికే తన టిక్కెట్టు గల్లంతయిందని, ఆనాటి తన
చర్యకి ఈనాడు విచారిస్తున్నారా?' అని. మొదట నెమ్మదిగా సమాధానం ప్రారంభించారు
ముతాలిక్ -అది అయిదేళ్ల కిందటి సంఘటన అంటూ. అంతలో రెచ్చిపోయి, పుంజుకుని -సరిగ్గా
మేడమ్ మాయావతిలాగే -ఇది తనంటే కిట్టనివారు, ఛానల్స్, ముఖ్యంగా 'టైమ్స్
నౌ' తన మీద దుమ్ము రేపుతున్నారని కాలుదువ్వారు. ఆయనకి ఇంగ్లీషుకాని,
హిందీకాని సరిగ్గా రాదు -ముఖ్యంగా కోపాన్ని, కసినీ చెప్పుకోగలిగినంత
బొత్తిగా రాదు. వచ్చిందల్లా కన్నడభాష. అయితే భాషకి కూడా లొంగనంత ఉద్రేకంగా
-హెచ్చరికలు చేస్తూ అన్నిభాషల కలగాపులగంగా తన అక్కసుని వెళ్లగక్కారు.
ఈ దశలో మన తెలుగు
సినిమాల్లో విలన్ పక్కనే నిలబడే రౌడీలను తలపించే పిక్కబలం ఉన్న వస్తాదులు
ముందుకు తోసుకొచ్చారు. తమ కోపాన్నీ, ఉద్రేకాన్నీ మిళాయిస్తూ, సరిగ్గా సినిమా
ధోరణిలో ''బాస్! అందుకే ఇలాంటి ఛానల్స్‌కి మీరు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని
మేం చెప్తూంటాం'' అని కసురుకున్నారు. వెంటనే బాస్ వెనక్కి తగ్గి, తన
ధోరణిని సర్దుకున్నాడు. ఇప్పుడు బాస్ వెనక ఇంతసేపూ నిలబడిన రౌడీ శిష్యుడు
ముందుకు దూసి -కేవలం రోడ్డుమీది ఆకతాయి జనానికి మాత్రమే చెల్లే భాషలో 2009
నాటి తమ దాడిని భయంకరంగా సమర్ధించాడు. మొదట నాసిరకం హిందీలో ప్రారంభించి,
తర్వాత నాటు కన్నడ భాషలోకి ప్రవేశించి -పోను పోను -మనకి అర్థంకాని తుళు,
ఇంగ్లీషు భాషల కషాయంగా తన ఉద్రేకానికి రూపుదిద్దాడు. అతని నోటి వెంట వచ్చే
భాషకాక, అతని వీరంగం, కళ్లూ, కండలూ తిరిగిన విన్యాసం -అయిదేళ్ల కిందట వారు
చేసిన దాడి ఈ సమాజానికి, ఈ దేశానికీ, ఈ సంస్కృతికీ -వెఱసి మన మతానికి ఎంత
ఉపకారమో తెలియజేశాడు. ఇది వారి సంస్కార వైభవానికి పట్టాభిషేకం.
ఇంకా కథ అక్కడితో ముగియలేదు. ముందురోజు ఒక
పత్రికా సమావేశంలో ముతాలిక్ కళ్లనీళ్లతో తనకి పార్టీ టిక్కెట్టుని
నిరాకరించడం -ఎంత అన్యాయమో, బాధాకరమో, ఎంత షాకో వివరించారు, దుర్మార్గుడి
కన్నీరు ఎంత అసహ్యంగా, అపహాస్యంగా ఉంటుందో ఆ క్షణంలో తెలియవచ్చింది. ఆ
రాత్రే టైమ్స్ నౌ ఛానల్‌లో చర్చకి తన చెంచాలతో వేంచేశారు ఈ దేశభక్తుడు.
కేవలం పది నిముషాలలో వీరిని ఆర్నాద్ గోస్వామి ముక్కలు ముక్కలుగా చీల్చేశాడు.
గోస్వామి అడిగిన ప్రతీ ప్రశ్నకీ ముతాలిక్‌గారు కేవలం 30 సెకెన్ల వ్యవధితో
నాలుగే నాలుగు మాటల్ని పదేపదే వక్కాణించారు.
'మీ లెక్చర్లు వినడానికి నేనిక్కడికి రాలేదు'
(మిగతా పానల్ వ్యక్తులు వారిని అలనాటి దేశభక్తి గురించి ప్రశ్నించినప్పుడు.)
'మీరెవరు నన్నడగడానికి, ఇది ప్రజాస్వామ్యం! (అర్నాద్
గోస్వామి ఈయన దేశానికి సిగ్గుచేటు. రాజకీయాలకి రాచపుండు -అన్నప్పుడు)
'నేను జైల్లో 15 రోజులు ఉన్నాను' (ఆయన చేతుల్లో అవమానాలు పాలయి,
గాయపడిన ఆడపిల్లలు, భయంతో తర్వాత జరగబోయే పరిణామాలకి భయపడి నేరారోపణ
చెయ్యడానికి ముందుకు రాలేకపోయారని -పానల్‌లో పెద్దలు సూచించినప్పుడు.)
ఆ రోజుల్లో -దేశభక్తుల కాలంలో జైలు ఒక
దేవాలయం. ఈ రోజుల్లో జైలు ఒక సాకు. నేరస్థులకూ, రాజకీయ నాయకులకూ -జైలు ఒక
సర్టిఫికేట్!
'ప్రజలు నన్నే సమర్థిస్తున్నారు' (పార్టీ తనని
ఎందుకు తొలగించిందని పానల్ పెద్దలు అడిగినప్పుడు) అచిరకాలంలో దేశమంతా చూసే
టెలివిజన్‌లో సంజాయిషీ చెప్పడం పబ్బుల్లో ఆడపిల్లల్ని చావగొట్టినంత సులభం
కాదని గ్రహించిన ముతాలిక్, ఆయన చెంచా అక్కడినుంచి లేచి వెళ్లిపోయారు.
రాతియుగంనాటి ఆలోచనా స్రవంతితో ఈ దేశాన్ని
ఉద్దరిస్తున్నామని కంకణం కట్టుకున్న ప్రమోద్ ముతాలిక్ వంటి నాయకమ్మణ్యులు
మనకి ఈ దేశంలో చాలా రాష్ట్రాలలో, చట్టసభల్లో బట్టలిప్పుకుని దర్శనమిస్తారు.
నేటి తరానికి ఇలాంటి నాయకుల చర్యలు, బెదిరింపులు భయంకరమైన ప్రమాదకరమని వీరు
ఎప్పటికప్పుడు మనకి గుర్తు చేస్తుంటారు. కాని వీరి వెనుక పశుబలం ఉంది.
అంతకుమించి డబ్బు ఉంది. బుకాయింపు ఉంది. అన్నిటికీ మించి వారిని సమర్థించే
నాయకత్వం ఉంది. కొద్దిలో తప్పిపోయింది కాని -వీరు తప్పనిసరిగా రాబోయే
అయిదేళ్లపాటు మనకి పార్లమెంటులో దర్శనమిచ్చి -దేశభక్తి గురించీ, భారతీయత
గురించి మనకి ఉపన్యాసాలిచ్చేవారు. దేవుడుని నెత్తికెత్తుకుని -పిల్లల్ని
చావగొట్టే ఇలాంటి వీరులు -సాగితే చట్టసభలదాకా ప్రయాణం చేసే అన్ని వసతులూ
సమకూర్చుకుని ఉన్నారు మనదేశంలో. 'దేవుడు, మతం' వీరి కొంగుబంగారం. 2014లో
వీరి ఉనికి ఎండగట్టే ప్రజాభిప్రాయం నిలదొక్కుకుంటోందని నాలుగుగంటలు ఆలశ్యంగా
నయినా ఆ రాజకీయ పార్టీ తేలుకొని తేల్చుకోవడం ఈ దేశానికి శుభసూచకం.
ఈ తరం
పిల్లల్ని చదువుకోనివ్వండి. సంస్కారాన్ని నేర్పండి. ఇలాంటి రౌడీ మూకనుంచి
వారి ఉనికిని కాపాడండి. తమకేది శ్రేయస్సో, ఈ దేశానికి ఏం కావాలో నిలదీసి
చెప్పేతరం ఇప్పటికే దూసుకు వస్తోంది. అందుకు -శుభసూచకం -సురేష్ కల్మాడీలు,
సుబ్రతోరాయ్‌లూ జైళ్లలో కూర్చోవడం. నేరస్థుల స్థాయీ బేధాల్ని అడ్డంగా నరికే,
నరకాల్సిన, నరకడానికి సిద్ధపడే తరం ముందుకు వస్తోంది.
మొదట మన
దేవుడినీ, మతాన్నీ ఇలాంటి గూండాలనుంచి కాపాడుకుందాం.