Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

 XXX..!!

    నా ఆరోగ్య రహస్యం నేనెప్పుడూ తెలుగు ఛానల్స్‌ చూడను. అందువల్ల ముఖ్యంగా మనశ్శాంతి, అదనంగా ఆరోగ్యం కలిసివచ్చింది. కారణం ఛానల్స్‌లో జరిగేది ఎక్కువగా వ్యాపారం. సినిమాల సంగతి సరే. ఛానల్స్‌ కూడా ప్రేక్షకులకి కావాల్సిన ప్రోగ్రాంలు పంచే వ్యాపారాన్నే సాగిస్తున్నాయి. వాటిపని కేవలం అమ్మకం. మరొకపక్క ఈ వ్యాపారాన్ని జోరుగా సాగించే వ్యాపారులు -రాజకీయ నాయకులు. వారు కురిపించే వరాలు, చెప్పే నీతులు, మాట్లాడే 'నిజాయితీ', 'సేవ' వంటి మాటలు వారి నాయకత్వాన్ని బజారులో వ్యాపారంగా పెట్టిన దయనీయమైన దిగజారుడిని తలపిస్తుంది. నాకు తెలిసిన ఒక రాజకీయ నాయకుడు గత అయిదేళ్లలో మూడు రాజకీయ పార్టీలు, ముగ్గురు నాయకుల ఫ్లెక్సీలను తన ఆఫీసు ముందు మార్చడం నాకు తెలుసు. ఏ ఒక్కసారీ ఈ నాయకుడు సిద్ధాంతాల గురించి గానీ, సమాజానికి జరగాల్సిన మేలు గురించి గానీ మాట్లాడడానికి సాహసించలేదు. పాపం. అలాంటివి ఉంటాయని ఆయనకి తెలియదేమో! ఇలాంటి దిక్కుమాలిన వ్యాపారాలకి ఛానల్స్‌ వేదిక.

           అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఛానల్స్‌ చూశాను. అక్కడి వ్యాపారం ఇంకా రెచ్చిపోయి సాగుతుంది. ఆ విన్యాసాలు వర్ణనాతీతం. వారు అమ్మకానికి పెట్టే సరుకు, అమ్మే తీరు అనూహ్యం. అమ్మడంలో వారు చేసిన ప్రత్యేకమైన పరిశోధన, సాధించిన విజయాలు అత్యద్బుతం. ఉదాహరణకి మీరు వీపు గోక్కోవాలా? మూడు రకాలయిన సాధనాలున్నాయి. ఒకటి -వెన్నెముక చివరంటా పాకేది. రెండు వీపంతా సవరించేది. మూడు సేబుల్‌ పట్టుకుచ్చుతో మీ వీపుని పలకరించేది. మీకు అన్నీ లేదా కొన్ని -ఒకే ధరకి దొరుకుతాయి. నిరభ్యంతరంగా మూడు వారాలు మీ వీపు సుఖంగా గోకి చూసుకుని, నమ్మకం కుదిరితే ఉంచుకోవచ్చు. లేదా అప్పుడు వాపసు ఇచ్చినా మీకు పూర్తి మొత్తం ఇచ్చేస్తారు. మా మిత్రుడొకాయన -ఈ సదవకాశాన్ని వినియోగించుకుని -మూడేసి వారాలకు కొత్త 'గోకుడు' కుచ్చుల్ని తెచ్చుకుని -అప్పనంగా గోక్కొని తిరిగి ఇచ్చేస్తూంటాడు. ఆయన జీవితం -ఎప్పుడూ కొత్త కుచ్చు, కొత్త గోకుడు.

             ఒక్కొక్కప్పుడు అసలిలాంటి వస్తువులతో వ్యాపారం చెయ్యవచ్చా -అని మనకు ఆశ్చర్యం కలిగించే సరుకులు కనిపిస్తాయి. సోఫాలో మూడు గంటలసేపు మీరు సినిమా చూస్తూ కూర్చున్నారనుకోండి. సోఫా హాండిలు మీద మోపిన మీ మోచెయ్యి నొప్పెట్టకుండా చిన్న సిల్కు కుప్పె ఒకటి సిద్ధంగా దొరుకుతుంది. కారులో మైళ్ళకొద్దీ ప్రయాణం చేసినప్పుడు గంటలకొద్దీ కూర్చునే మీ మెడకింద చిన్న సిల్కు మెత్తని అమ్ముతారు. వాటికి లాభసాటి షరతులెలాగూ ఉంటాయి. నేనామధ్య అమెరికాలో నాలుగు బనీన్లు కొన్నాను. తీరా ఇంటికి-- తీసుకువచ్చి తొడుక్కుంటే బిగువయింది. మరేం పర్వాలేదన్నాడు మా మిత్రుడు. మాల్‌వారు మూడింటిని వాపసు తీసుకుని, నాలుగో బనీను నాకు ఉచితంగా ఇచ్చేసి -డబ్బుని పూర్తిగా వాపసు చేశారు! ఇది ఆయా వ్యాపారులు మీ మానసిక దౌర్బల్యం మీదా, మీ అవసరాల మీదా, మిమ్మల్ని తమ వేపు ఆకర్షించే సరసతని గట్టి పరిశోధన చేసి -మీ మనస్సునీ, మీ పర్సునీ ఆకట్టుకునే గొప్ప ప్రత్యేకత. వినియోగదారుడి మనస్సుని అకట్టే అన్ని కట్టుదిట్టాలను చేసి -అతను కూడా ఊహించలేని దశలో తన లాభాన్ని చేజిక్కించుకునే అతి గడుసయిన వ్యాపారి అమెరికా మనిషి. అప్పుడప్పుడు ఇలాంటి వస్తువుల అవసరం మన జీవితంలో ఉందా అని మనల్నే ఆశ్చర్యపరిచి, తీరా చూశాక -ఇది లేకపోతే ఎలాగ అని మనల్ని వ్యామోహంలో పడేసే అతి విచిత్రమైన వస్తువులు -అమెరికాలో బోలెడు.

         మా మిత్రుడి కొడుకు టేబిలుమీద -నోరు వెళ్లబెట్టి ఉన్న ఒక నక్క ముఖాన్ని చూశాను. దానిపని ఏమిటి? కేవలం అలంకరణా? నక్క అలంకరణ ఎలా అవుతుంది? ఇదెందుకని అడిగాను. ఆ కుర్రాడు నవ్వాడు. అతను కలం మూత తీసి రాసుకుంటూండగా హఠాత్తుగా ఏదో పిలుపువస్తే -తెరిచిన కలాన్ని ఆ నక్క నోటిలో అలాగే ఉంచవచ్చునట! తెరిచిన కలాన్ని మూయకుండా పరిగెత్తవలసిన సందర్భాలు మన జీవితంలో ఎన్ని వుంటాయి? మన సోమరితనానికీ ఒక సాకుని కల్పించే చక్కటి పరిశోధనాత్మక పరికరాలు అమెరికాలో బోలెడు! అసలు దాని అవసరాన్ని నువ్వు అర్థం చేసుకునే లోపల నిన్ను రెచ్చగొట్టే ఉత్సాహాన్ని కలిగించడం గొప్ప వ్యాపారి మేధాసంపత్తికీ, గడుసయిన వ్యాపార దక్షతకీ నిదర్శనం.

          ఇప్పుడు అసలు కథకి వస్తాను. ఈ మధ్య మన తెలుగు ఛానల్స్‌లో అనుకోకుండా ఒక వ్యాపార ప్రకటనని చూశాను. నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అందమయిన అమ్మాయిలు -ఒక బస్సు స్టాపు దగ్గర నిలబడ్డారు. అందరి కుర్రాళ్లలాగే వీళ్లూ అమ్మాయిల్ని కొంటె చూపులు చూస్తున్నారు. ఇది మన సినిమాల్లో, నగరాల్లో బోరుకొట్టే దృశ్యం. నా అలవాటు ప్రకారం ఛానల్‌ దాటిపోబోయాను. అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ఈలోగా బస్సొచ్చింది. నిలబడిన అమ్మాయిలలో ఒకరు చేతిలో మడతపెట్టిన చేతికర్రను తెరిచింది! మైగాడ్‌ -ఈ అమ్మాయి గుడ్డిది! నేను కుర్చీలో ముందుకు వొంగాను. నలుగురిలో ఒక అబ్బాయి నాలాగే బిత్తరపోయాడు. ఆ అమ్మాయి ముందుకు అడుగేసింది. ఈ కుర్రాడు ఆ అమ్మాయికంటే ఒకడుగు ముందుకువేసి -వచ్చి ఆగిన బస్సు గేటు దగ్గర తన ముణుకులు వంచి మెట్టుగా నిలబడ్డాడు రోడ్డుమీద కూర్చుని. గుడ్డి పిల్లకి ఇది తెలీదు. తెలియాల్సిన అవసరమూ లేదు. గుడ్డి పిల్లకి అది అవసరమైన ఉపకారం. ఆమె కాలు అతని మోకాలిమీద వేసి బస్సెక్కింది. బస్సు వెళ్లిపోయింది. ఒక్క క్షణంలో ఆ దృశ్యం మూడ్‌ పూర్తిగా మారిపోయింది. సంఘటనలో పోకిరీతనం పోయి -ఒక ఉదాత్తత, ఒక అనూహ్యమైన మానవతా విలువల ప్రదర్శన జరిగిపోయింది. కుర్రాడు ఆలోచించి చేసినది కాదు. అమ్మాయి అర్థం చేసుకుని కృతజ్ఞత చెప్పినదీ కాదు. దానికో పేరుంది -సంస్కారం.
సంస్కారం ప్రతిఫలాన్ని కోరదు. అదొక అపూర్వమైన శక్తి. తర్వాతి షాట్‌లో ఆమె కాలు మచ్చపడిన పాంటు ఉతుకుతున్న దృశ్యం. ప్రకటనకారుడు చెప్తున్నాడు -XXX ''డిటర్జెంట్‌ సోప్‌ -సంస్కారవంతమైన సోప్‌'' -అని.

      
మంచి, పరువైన ఆలోచన మనల్ని వెంటాడుతుంది. మనస్సులో పదే పదే కదులుతుంది. వ్యాపారమంటే రెచ్చగొట్టడం కాదు. ఊదరగొట్టడం కాదు, మెడలు వంచడం కాదు. బుజ్జగించడం కాదు. లొంగదీసుకోవడం కాదు. మతలబు చెయ్యడం కాదు. ఊరించడం కాదు. గోల కాదు. గోకడం కాదు. దువ్వడం కాదు. మన ఆలోచనకి మర్యాదగా దాని అవసరాన్ని తెలిసేటట్టు చెయ్యడం. మంచి ఆలోచన వ్యాపారం చెయ్యదు. మర్యాదగా 'చెప్తుంది'. అంతే దాని పని. నీ అవసరం, విచక్షణ దాన్ని కొనుగోలు చేస్తుంది.

      మరునాడు మా ఆవిడని అడిగాను -బట్టలు ఉతకడానికి ఏ సబ్బు వాడుతావని. ఎప్పుడూ అడగని నా ప్రశ్నకి మా ఆవిడ ఆశ్చర్యపోయింది. ''ఏమిటి విషయం?'' అంది. ''ఏం లేదు. ఈసారి సబ్బు కావల్సి వచ్చినప్పుడు XXX డిటర్జెంట్‌ సబ్బు కొను'' అని సిఫార్సు చేశాను. వ్యాపారంలో సంస్కారం కొత్త కొనుగోలుదారుడిని సంపాదించిపెట్టింది.
           


      gmrsivani@gmail.com   
               మార్చి 10, ,   2014          

*************

Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage