Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 
Are you using iPad ( any iOs Device)? Try direct MP3, Click here

 'నపుంసక ' పుంసత్వం ..!

                రాజకీయ సిద్ధాంతాలు, సామాజిక బాధ్యత, ప్రజా సంక్షేమం, నైతిక విలువలు వంటి పదాలు రాజకీయ రంగంలో బూతుమాటలయి ఎన్నాళ్లయింది? ఈ మధ్య ఏ నాయకులయినా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? పోనీ, అసలు ఇలాంటి మాటలకు వీరికి అర్థం తెలుసా? ముందు ముందు రాబోయే వారాలలో వీటి వెక్కిరింతని మరింతగా చూడబోతున్నాం. నేను రాజకీయ జంతువుని కాను. ఒక మామూలు కాలమిస్టుని. రాజకీయ సిద్ధాంతాలు కాక, రాజకీయ మనుగడకోసం ఇప్పుడిప్పుడు ఎంతమంది కప్పదాట్లు వేస్తున్నారో ప్రతిదినం మనం పత్రికల్లో వినోదాన్ని చూస్తున్నాం. సల్మాన్‌ ఖుర్షీద్‌గారు 'నపుంసకత్వం' అనే మాటని నరేంద్రమోడీ పరంగా వాడారు. అది తప్పని కాంగ్రెస్‌ యువరాజు అంతే బాధ్యతారహితంగా వక్కాణించారు.


                   ఈ నపుంసకుడి గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. 2002 మారణహోమం తర్వాత ఈ నాయకుడు నరేంద్రమోడీ తన పార్టీ మారలేదు. న్యాయస్థానంలో పోరాడి -కనీసం తాత్కాలికంగానయినా న్యాయస్థానం చేత నిర్దోషి ననిపించుకున్నారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌.కె.అద్వానీ, సుష్మాస్వరాజ్‌ కనీసం పార్టీలు మారలేదు. మిగతా విషయాలెలావున్నా -ఇవాల్టి నేపథ్యంలో ఇది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. పార్టీ నాయకులు సాధారణంగా పార్టీలు మారరని సమర్థించుకోవచ్చు. కాని ఆఖరికి నీలం సంజీవరెడ్డిగారు కూడా పార్టీని మార్చారే! ఆనాటి జనతా కాంగ్రెస్‌ని కొందరయినా జ్ఞాపకం తెచ్చుకోగలరనుకుంటాను. ఇప్పుడిప్పుడు పాలక కాంగ్రెస్‌లో దాదాపు అందరు నాయకులూ పార్టీలు మారుతున్న కథల్ని వింటున్నాం. ఈ జాబితాని ఉటంకించకపోవడానికి కారణం -ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ జాబితాని పూర్తిగా చెప్పడమే అవుతుందని.

                ఏ కారణానికయినా 'తల్లి తెలంగాణా' పార్టీ హఠాత్తుగా 'తండ్రి తెలంగాణా' పార్టీలో కలిసిపోయింది. ఊహించలేనంత హఠాత్తుగా చాలామంది నాయకులు పార్టీలను మార్చేస్తున్నారు. రాజకీయాలలో తమ ఉనికి కాపాడుకోవడమే ఈ దూకుడు లక్ష్యం అని అందరికీ అర్ధమౌతోంది. మరి రాజకీయ సిద్ధాంతాల మాటేమిటి? అసలు అలాంటివి ఉన్నాయా? ఒకాయన ఆ రోజుల్లోనే 'రాజకీయాలలో సిద్ధాంతాలకు చోటులేదు!' అని వక్కాణించారు. ఆయన పేరు బాలధాకరే.

               2002లో గుజరాత్‌ మారణకాండని ఖండిస్తూ నరేంద్రమోడీని దుయ్యపట్టి ఎన్డీఏ కూటమి లోంచి వెళ్లిపోయిన ఎల్‌పీజీ పార్టీ అధినేత రాం విలాస్‌ పాశ్వాన్‌గారు పన్నెండేళ్ల తర్వాత చిరునవ్వుతో, తనకొడుకుతో సహా పార్టీ అధ్యక్షుడితో గ్రూప్‌ ఫొటోకి నిలబడ్డారు -అదే నరేంద్రమోడీ నాయకత్వాన్ని అంగీకరిస్తూ. రాజకీయ లబ్ధికి సిద్ధాంతాల ఆనకట్టలేదు. ఈ కారణానికయినా మోహన భగవత్‌, నరేంద్రమోడీలు పార్టీలు మారనందుకు -వారి పుంసత్వాన్ని అంగీకరించాలి. ప్రస్తుతం ఢిల్లీలో రాజ్యమేలుతున్న శరద్‌ పవార్‌, చిదంబరం, జైపాల్‌రెడ్డి, సుశీల్‌ కుమార్‌ షిండే ప్రభృతులు పార్టీలు మారి వచ్చినవారేనని మనం గుర్తుంచుకోవాలి. మరొక్కసారి -నేను రాజకీయ పక్షిని కాను. ఇప్పటి రాజకీయ వలసలు వ్యక్తి శీలానికి కాక, సామూహిక నపుంసకత్వానికి (ఆ మాటని సల్మాన్‌ ఖుర్షీద్‌ గారి ధర్మమా అని వాడుతున్నాం కనుక) నిదర్శనమని ఒప్పుకోవాలి.

               ఎప్పుడో అయిదు తరాల కిందటి తమ పెద్దల దేశభక్తి అనే పెట్టుబడిని ఆసరా చేసుకుని -కేవలం ఆ ఇంగువ కట్టిన గుడ్డతో రాజ్యమేలుతున్న -ఏ విధంగా చూసినా అవినీతి, అసంబద్ధ పరిపాలనకూ -గత అయిదు సంవత్సరాలలో చరిత్రను సృష్టించిన నేటి ఢిల్లీ పెద్దల చెప్పుచేతల్లో ఉన్న మంత్రివర్యులకు మరొకరి 'నపుంసకత్వం' గురించి మాట్లాడే హక్కు లేదు! కనీసం ప్రస్థుతం బరిలో నిలిచిన ఆ వంశపు ఆఖరి వారసుడు -వారి యువరాజు -ఆ విషయాన్ని గ్రహించి సల్మాన్‌ ఖుర్షిద్‌గారి ఉవాచను వ్యతిరేకించారు. ఒక్కొక్కప్పుడు ఆఖరి క్షణాల్లో వికసించే విజ్ఞత -మాటల కసరత్తు చేసే అనుయాయుల దూకుడుకన్న కాస్త రుచిగా ఉంటుందేమో!

              అసలు ఈ లోపం ఎప్పటికప్పుడు పదవుల్ని నిలుపుకోవాలన్న ఈ తరం నాయకుల యావకు నికృష్టమైన ఉదాహరణలు. లేకపోతే రాజీవ్‌ గాంధీ హంతకుల్ని బేషరతుగా విడుదల చేస్తామని -తమకా హక్కులేదని తెలిసికూడా ఒక రాష్ట్ర రాజకీయ పార్టీ చర్యకి మూలకారణం -కేవలం స్థానిక ప్రత్యర్థి పార్టీ మీద ప్రజాస్పందనని మూటగట్టుకోవాలనే తాపత్రయం కాకమరేమిటి? బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌గారు మూడో ప్రత్యామ్నాయానికి నడుం కట్టడంలో అర్థం ఏమిటి? ఐతే ఇలాంటి కసరత్తులకి ఇది కేవలం ప్రారంభం. ముందుంది ముసళ్ల పండగ. ఎన్నికల రంగం ముందుంది. ఈ నాయకులు -తమ దేశభక్తి, సిద్ధాంతాల ఆవశ్యకత, త్యాగం, ప్రజాశ్రేయస్సు గురించి మనల్ని ఊదరగొట్టే రోజులు ముందున్నాయి. మారిన కొత్త పార్టీ నీతిని -అంటే ఇప్పుడిప్పుడే వారు తీర్థం పుచ్చుకున్న కొత్త పార్టీ నీతిని -మరో ముప్పై రోజుల్లోనే వీరు మనకి బోధపరుస్తారు. మన చెవుల్లో చక్కని పువ్వులు పెడతారు.

              ఆఖరుగా ఒక్క నాయకుడిని గుర్తుచేసి ఈ కాలమ్‌ని ముగిస్తాను. ఒకానొక రాజకీయ పార్టీ తన ప్రయోజనాన్ని సాధించాక - ఇక ఆ పార్టీకి ముగింపు రాయాల్సిన క్షణం వచ్చిందని ఈ నాయ కుడు పార్టీ నాయకులకు -1947 ప్రాంతాలలోనే చెప్పాడు. ఏ లక్ష్యానికి ఈ పార్టీ పోరాటం సాగించిందో -దేశ స్వాతంత్య్రాన్ని సాధించాక ఆ పార్టీ గౌరవంగా తన చరిత్రని ముగించాలని హితవు చెప్పారు. ఆ ఒక్క కారణానికే ఈ పార్టీ భారత చరిత్రలో మకుటాయమానంగా మిగిలిపోతుందన్నారు. కాని నాయకులకు ఆ మాట రుచించలేదు. అప్పుడా నాయకుడు ఏం చేశాడు? పార్టీకి రాజీనామా చేసి మరొక కుంపటి పెట్టలేదు. పార్టీనుంచి బయటికి వచ్చి, నాయకులతో ఆత్మీయతల్ని నిలుపుకుని, రాజకీయాలనుంచి శాశ్వతంగా బయటపడి, సమాజ నైతిక పరివర్తనకు ఉద్యమాన్ని తన ఆఖరి ఊపిరివరకూ కొనసాగించాడు. ఆయన పేరు మహాత్మాగాంధీ.

              అప్పటి తరానికి రాజకీయ రంగం ఒక సాధన. ఒక పనిముట్టు. ఒక పవిత్రమైన యజ్ఞం. ఈ తరానికి అది వ్యాపారం. పెట్టుబడి. అధికారం, డబ్బు అనే మత్తుని కొనుగోలు చేసే దగ్గర తోవ. ఆ రోజుల్లో జైళ్లలో భోగరాజు పట్టాభి సీతారామయ్య, బాలగంగాధర తిలక్‌, రాజగోపాలాచారి, గాంధీ, నెహ్రూ వంటివారున్నారు. ఇప్పుడు జైళ్లలో ఏ. రాజా, కనిమొళి, సురేష్‌ కల్మాడీ, చార్లెస్‌ శోభరాజ్‌, మొద్దు శీను, రాజా భయ్యా వంటి వారున్నారు. అప్పటివారికి పార్టీ ఒక సాధనం. అందుకనే ఆ రోజుల్లో ఒక్కసారయి నా, ఒక్కరయినా పార్టీ నుంచి బహిష్కరించిన కథ మనం వినలేదు. ఇవాళ పార్టీ వ్యాపారం. లాభం పొందడానికి రకరకాలయిన దుకాణాలున్నాయి. వాడుకునే వ్యాపారులున్నారు. ఖరీదు చేసే బేరాలున్నాయి. అన్నిటికీ మించి పంచుకునే తాయిలాలున్నాయి. అందుకే లాభసాటి దుకాణాలను ఈ వ్యాపారాలు ఇప్పుడిప్పుడే వెదుక్కుంటున్నారు.
 


      gmrsivani@gmail.com   
               మార్చి 03, ,   2014          

*************

Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 


KOUMUDI HomePage