దాదాపు 13 సంవత్సరాల క్రిందట విడుదలైన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి 'సిరివెన్నెల తరంగాలు' పుస్తకం మార్కెట్లో లభ్యం కానందున, అశేష అభిమానుల కోరిక మీద ఆ పుస్తకాన్ని సీరియల్ గా ప్రచురించడం జరుగుతోంది. ఇందుకు ప్రత్యేక అనుమతి నిచ్చిన 'కౌముది'కి ఆత్మీయ మిత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.

(క్రిందటి సంచికనుంచి కొనసాగింపు)
28

చిన్ని తండ్రీ. నిను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా
అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంత తగిలేను రా
అందుకే అమ్మ ఒడిలోనే దాగుండిపోరా

ఏ చోట నిమిషం కూడా ఉండలేడు
చిన్నారి సిసింద్రిలా చిందు చూడు
పిలిచినా పలకడు వెతికినా దొరకడు
మా మధ్య వెలిసాడు ఆ జాబిలి
ముంగిట్లో నిలిపాడు దీపావళి
నిలిచుండాలి కలకాలము ఈ సంబరాలు

ఆ మువ్వగోపాలుడిలా తిరుగుతుంటే
ఆ నవ్వే పిల్లంగ్రోవై మోగుతుంటే
మనసులో నందనం విరియగా ప్రతి క్షణం
మా కంటి వెలుగులే హరివిల్లుగా
మా ఇంటి గడపలే రేపల్లెగా
మా ఈ చిన్ని రాజ్యానికి యువరాజు వీడు

చందమామా చూశావటోయ్ అచ్చం నీలాంటి మా బాబుని
నేల అద్దాన నీ బింబమై పారాడుతుంటే

(సిసింద్రీ చిత్రంలో రాజ్ సంగీత సారధ్యంలో స్వర్ణలత పాడినది)

                     ***


రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు
నన్నుజూసి అంతా అంటారు
క్షేమమేనా అబ్బీ అంటే నా వాళ్ళవుతారు
పాదమాగిన చోటే సొంతూరు
ఆదరించిన వాళ్ళే అయినోళ్ళు
కాదు పోరా అంటే రారా అంటది రేపింకో ఊరు

గాలి లాలిపాడే నేలతల్లి ఒళ్ళో - ఆదమరచి నేను నిద్దరోతాను
వెన్నుతట్టి లేపే పిట్టపాట వింటూ - మేలుకొని నేను సూర్యుడౌతాను
అష్టదిక్కుల మధ్యన నేను దిక్కులేనివాడినికాను
చుట్టుపక్కల ఉండేవాళ్ళే చుట్టపక్కాలనుకుంటాను
గడ్డిపువ్వులు కూడా నాకు నవ్వులెన్నో నేర్పించాయి
గుడ్డి గవ్వలు కూడా నాకు ఆడుకొందుకు పనికొచ్చాయి
దుఃఖమంటే మాత్రం అర్ధం నాకు చెప్పలేదు ఎవరూ..

ఆయి! ఆయి! అంటూ ఊయలుపుతాను చిన్నితల్లి నీకు అమ్మనౌతాను
అమ్మలాగ నాకు అన్నంపెట్టు చాలు ఆయువున్నదాక అమ్ముడౌతాను

నువు వరస కలుపుకుంటే నీ కొడుకునవకపోను
నాకు చేతనైన సేవ నీకు చేయలేకపోను
మన సొంతం అంటూ వేరే ఏ బంధం లేదంటారు
మనమంతా మానవులమే ఆ బంధం చాలంటారు
అనుకోడంలోనే అంతా ఉందని పెద్దలు అంటారు

(తారకరాముడు చిత్రానికి కోటి సంగీత సారధ్యంలో బాలు పాడినది)

             ***

సీతాకోక చిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా!
పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా!
పొత్తిళ్ళల్లో చిట్టి పుత్తడిబొమ్మను పొదుపుకున్న ముద్దుగుమ్మ అమ్మ..
పొందేటి ఆనందమేదో తెలియాలంటె
ఎత్తాలి తను ఆడజన్మ - బ్రహ్మ...

కుహూ కుహూ కూసే కోయిలా - ఏదీ పలకవే ఈ చిన్నారిలా
మిల మిలా మెరిసే వెన్నెలా - ఏదీ నవ్వనే ఈ బుజ్జాయిలా
అందాల పూదోటకన్నా చిందాడు పసివాడె మిన్న
బుడత అడుగులే నడిచేటి వేళలో
పుడమి తల్లి కెన్ని పులకలో

గలగలా వీచే గాలిలా సాగే పసితనం తీయని ఒక వరం
ఎదిగిన ఎదలో ఎప్పుడూ నిధిలా దాచుకో ఈ చిరుజ్నాపకం
చిరునవ్వుతో చెయ్యి నేస్తం - చీమంత అయిపోదా కష్టం
పరుగు ఆపునా పడిపోయి లేచినా
అలుపు సొలుపు లేని ఏ అలా

(సొగసు చూడతరమా చిత్రంలో రమణీ భరద్వాజ్ సంగీత సారధ్యంలో అనురాధా శ్రీరామ్ పాడినది)


                       ****


లాలిజో లాలిజో ఊరుకో పాపాయీ
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
తెలుసా ఈ ఊసు - చెబుతా తల ఊపు
కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
ఆలినే కాదంది కాకితో కూడింది
అంతలో ఏవైంది అడగవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి

మాయనే నమ్మింది బోయతో పోయింది
దెయ్యమే పూనిందో రాయిలా మారింది
వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే
తప్పిదం తెలిసింది - ముప్పునే చూసింది
కన్నులే విప్పింది - గండమే తప్పింది
ఇంట్లో చోటుందా చెప్పవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి

పిల్లలూ ఇల్లాలూ ఎంతగా ఏడ్చారో
గుండెలో ఇన్నాళ్ళూ కొండలే మోశారో
నేరం నాదైనా భారం మీపైనా
తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా
తల్లిలా మన్నించు - మెల్లగా దండించు
కాళిలా మారమ్మా - కాలితో తన్నమ్మా
బుద్దిలో లోపాలూ దిద్దుకోనీవమ్మా

(ఇంద్రుడు చంద్రుడు చిత్రానికి ఇళయరాజా సంగీత సారధ్యంలో బాలు పాడినది)

                        *** 
 

(కొనసాగింపు వచ్చేసంచికలో)