దాదాపు 13 సంవత్సరాల క్రిందట విడుదలైన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి 'సిరివెన్నెల తరంగాలు' పుస్తకం మార్కెట్లో లభ్యం కానందున, అశేష అభిమానుల కోరిక మీద ఆ పుస్తకాన్ని సీరియల్ గా ప్రచురించడం జరుగుతోంది. ఇందుకు ప్రత్యేక అనుమతి నిచ్చిన 'కౌముది'కి ఆత్మీయ మిత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.

(క్రిందటి సంచికనుంచి కొనసాగింపు)
27

హాస్యతరంగం


ఇది వ్యంగ్యంకాదు. పూర్తిగా నవ్వుకోవడానికి. మంచి మంచి సందర్భాలు వచ్చాయి. కొసరాజుగారు చాలా మంచి హాస్యం రాశారు. ఎంత బాగా రాశారంటే ఆయనలాగ హాస్యాన్ని మళ్ళా పండించగలమా అనిపిస్తుంది. నాకు వచ్చిన అదృష్టం ఏమిటంటే కొసరాజుగారు డీల్ చేసిన ఎన్నో సిచ్యుయేషన్స్ నాకు మళ్ళా వచ్చాయి. పొరుగింటి మీనాక్షమ్మ లాంటి పాటని నేను మళ్ళీ రాయటం, అరెరె జేబులో డబ్బులు పోయాయి లాంటి పాట, దోషి - నిర్దోషి సినిమాలో విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో పేకాట మీద రాయటం జరిగింది. అటువంటి నాలుగైదు హాస్యగీతాలు ఈ విభాగంలో పొందు పరిచాను.

ఏయ్ మూర్తి డబ్బులు కరెక్ట్‌గా పెట్టి టేబుల్ దగ్గర కూర్చో
లేకపోతే చేతులు ఇరిగిపోతాయ్ - కట్ ఫర్ సిక్స్
వాడి పేక చూస్తావేంట్రా
మన పేక ఎపుడైనా చూసుకోవచ్చు కదోయ్!
ఆకార్డు నాక్కావాలి మిడిల్ డ్రాప్ చేస్కో లేకపోతే కేసు పెడతా
ఒరేయ్ నీ డ్రాప్‌రా
షో! షో! షో!

అమ్మ దీని తస్సాదియ్యా గుమ్మం దాకా వచ్చిందయ్యా షో! షో! షో!
నమ్ముకున్న ముక్క రాక సొమ్ము కాస్త దోచిందయ్యా షో! షో! షో!

కోసే దాక ఆశే పోక చూసేశాక ఎ.సి. పేక భేషో! శహభాషో!
వేసై బాసు ఇస్పేటాసు నొక్కేసావో, లెక్కేసావో షో! షో!
చూసెయ్ బోసు ఏదీ పర్సు డీలే నాది
డీలా నీది షో! షో!
జోకర్ వాటము పట్టానమ్మా చేతుల తీటకు చెడ్డానమ్మా! రమ్మీ నిన్ను నమ్మి

లెక్కెట్రా! లెక్కెట్రా!
కొట్టక కొట్టక ఆట కొడితే గాత్రం అంటావ్, ఒరేయ్
ఏం బాస్! కౌంటా
జీవితమే పెద్ద కౌంటు బ్రదర్ - ఏమీ చెయ్యలేము

ఆఠీన్ రాణి అందిందహో! బ్యూటీ బోణి అయ్యిందహో షో! షో
డైమండ్ జాకీ తన్నిందయ్యో ఆటకి బాకీ అంటానయ్యా షో! షో!
అపుడే చెయ్యకు బాబు డ్రాపు ముంచుకు వస్తే యం.డి. సేఫ్ ఆడు, వేటాడు

ఒరేయ్ వాడు విపరీతంగా ఒణికిపోతున్నాడు
డీల్ అనుకుంటా డ్రాప్ అయిపోరా
చెప్పటాల్లేవబ్బాయ్

పారై లేక పీకే పేక ముంచిందయ్యా పీకల్దాకా
ఆఖరుదాకా జోకరు రాక షేకొచ్చింది లైఫే లేక షో! షో!
బొమ్మల కొలువే ముక్కలు మొత్తం తగ్గదు గురువా లెక్కకు మాత్రం
ఈ షో! ఏమి దశో!
భజగోవిందం, భజగోవిందం, గోవిందం భజగోవిందం
గోవిందా! గోవిందా!
(దో షి నిర్దోషి చిత్రానికి విద్యాసాగర్ సంగీత సారధ్యంలో బాలు, ఎస్.పి.శైలజ పాడినది)


                           ****

బావా బావా పన్నీరు! బాసికమెప్పుడు కడతారు
మనవలనెత్తే మన్మధరావుకి మనుగుడుపులకై కంగారు
తాంబూలాలిచ్చే సారండీ!
తాతాశ్రీ పెళ్ళికి ఆహ్వానాలిచ్చేశారండీ!
తన్నుకు చావండి - తాంబూలాలిచ్చేసారండీ!

పళ్ళూడిన పెళ్ళికొడుక్కి బొడ్డూడని పెళ్ళికూతురు
కళ్ళారా చూసి అందరూ కడుపారా నవ్విపోదురు
అయం ముహూర్తస్సుముహూర్తోస్తు అనండర్రా నాలుగక్షింతలేస్తూ
ఖళ్ళూ ఖళ్ళూ దగ్గులే తాళాలు మేళాలు
హాచ్చ్!
తుమ్మేది పెళ్ళికొడుకే కనక దోషం అట్టే ఉండదు కానీ పంతులూ
కాటికి పొయ్యే వృద్ద జంబూకం కాశీయాత్రకి తయ్యారు
పాడెకు బదులుగ పల్లకి తెమ్మని కాశీ యాత్రకి కబురంపాడు
ఒహోం ఒహోం ఛీం అని మోద్దాం రారండి
తాతశ్రీ పెళ్ళికి తరలి రారండీ
వీధీ వీధీ తిప్పేరు వీసెడు గంధ పూసేరు.

బావా బావా పన్నీరు! బా సికమెప్పుడు కడతారు
మనవలనెత్తే మన్మధరావుకి మనుగుడుపులకై కంగారు
తాంబూలాలిచ్చేసారండీ! ఆహ్వానాల (వి)చ్చేశారండి
తాతాశ్రీ పెళ్ళికి లగ్గాలు పెట్టేశారండీ - తన్నుకు చావండి

(బావాబావా పన్నీరు చిత్రానికి చక్రవర్తి సంగీత సారధ్యంలో బాలు, కోరస్ పాడినది)
                        ****

రావుడు మెచ్చిన ఉడతా నీకు
మావిడి పిందెలు పెడతా
కొమ్మెక్కి కూకున్న ఉడతా దిగి
రానంటె నీ ఎంట పడతా
నువు ఊ కొట్టి ఆలకిస్తే నిన్ను జోకొట్టి కతలు సెబుతా
నువు సెవ్వులు అప్పగిస్తే కొత్త రామాయణాలు ఇప్పుతా
నోరావలిస్తావు ఔరా అంటావు వింటే ఆ వింత!

కోనేటి పక్కుంది ఓ పాత కోట
పల్నాటి కాలంది ఆ కోట గోడ
ఎన్నెన్ని యుద్దాలు సూసిందో అయినా
ఇన్నాళ్ళు కాస్తైన సెక్కు సెదిరేనా
ఉన్నట్టుండి కుప్పకూలిది నిన్న
ఉప్పెనేం రాలేదు సెప్పేందుకైనా

భూకంపవూ లేదు పిడుగులూ పళ్ళేదు
మరేటయిందనుకుటున్నవూ?
నీలాటిరేవుకి అమ్మలక్కలు సేరి
నీలాపనిందల మీటింగులెడితే
ఇన్లేక ఇన్లేక పానాలు సాలిచ్చి ఇరిగిపోయేనంట

పొలిమేరలో ఉన్న పొలేరమ్మ పుంత
పొద్దుపోతెసాలు భూతాల సంత
అద్దరాత్రిపూట దెయ్యాలపాట
గుండెలవిసి పొయ్యె గజ్జెల మోత
తెలిసినోళ్ళు ఆ సాయికె పోరు
తెలియకుండ పోతే తెల్లారి రారు

అట్టాటి సోటికి నిన్న రాతిరి పొరుగూర్నించి ఓ పోరగాడు వస్తా వస్తా..
సిమ్మ సీకట్లోని సందళ్ళు ఇంటా, సంగతేంటో సూడబొయ్యాడంట
పెశిడెంటు పేరయ్య, పెద్దింటి పోలమ్మరసపట్టులో ఉంటె సూశాడంట
ఇన్నాళ్ళుగా ఆ దెయ్యాల భాగోతం అందుకోసవంట

(మామా బాగున్నావా చిత్రానికి విద్యాసాగర్ సంగీత సారధ్యంలో ఎస్.జానకి పాడినది)
 

(కొనసాగింపు వచ్చేసంచికలో)