దాదాపు 13 సంవత్సరాల క్రిందట విడుదలైన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి 'సిరివెన్నెల తరంగాలు' పుస్తకం మార్కెట్లో లభ్యం కానందున, అశేష అభిమానుల కోరిక మీద ఆ పుస్తకాన్ని సీరియల్ గా ప్రచురించడం జరుగుతోంది. ఇందుకు ప్రత్యేక అనుమతి నిచ్చిన 'కౌముది'కి ఆత్మీయ మిత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.

(క్రిందటి సంచికనుంచి కొనసాగింపు)
29

నేలమ్మా.. నింగమ్మా
నీరమ్మా.. నిప్పమ్మా
గాలమ్మా.. కనరమ్మా సంబరం..
మీ అందరి అందాలు
ఒక్కటయిన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం.. సంగమం.. || నేల||

అవని అందము కుదురు లేనిది
ఏడాది కొక్కటే వసంతమన్నది
ఋతువు మారినా చెదిరిపోనిది
అమ్మాయి మేనిలో అందాల పెన్నిధి
తుళ్ళకే అలా గంగవెల్లువా!
సొగసు పొంగులో ఈమె సాటివా?
వయ్యారి వంపులు నీ వంటికున్నవా? || నేల||

కలికి కళ్ళలో కలల మెరుపుతో
నువ్వు తెల్లబోదువే నీలాల గగనమా
చిలక సొంపులో అంత మైకమా?
చిరుగాలీ నువ్వలా స్థంభించిపోకుమా!
చెలియతనువులో ఉడుకు తాకితే
చలికి వణకవా సూర్యబింబమా!
ఆ మంచు మంటతో జాబిలిగ మారవా || నేల||
(ఆడదె ఆధారం చిత్రానికి శంకర్ గణేష్ సంగీత సారథ్యంలో బాలు పాడినది)
 ------------------------------

నేలమ్మా.. నింగమ్మా
నీరమ్మా.. నిప్పమ్మా
గాలమ్మా.. ఎవరమ్మా కారణం..
మీరంతా సాక్షులుగా
ఒక్కటయిన దాంపత్యం భగ్గుమంది - ఎవరు దీనికి కారణం || నేల||

పూటపూటకి అగ్ని పరీక్షా
ముగించు ఇకనైనా ఓ నిప్పమ్మా!

ఇన్ని నాళ్ళ తరుణి ఓర్పుని
ఒళ్ళోన సేద తీర్చు ఓ నేలమ్మా!
గంగవెల్లువా! కౌగిలించుకో
పొంగుతున్న ఈ కన్నీరు తీసుకో
ఇల్లాళ్ళ ఘోషవై ఇల్లిల్లు ముంచిపో

చోటు ఉన్నదా ఆకాశమా
ఈ గుండె శూన్యమంత నింపడానికి
శ్వాస తీసుకో చిరుగాలమ్మా
తుఫాను గాలిగ చెలరేగడానికి
అబలవై ఇలా అణిగి ఉండక
ఆదిశక్తివై అవతరించంగా
ఇంకెన్ని ఉసురులు కావాలి చెప్పమ్మా? || నేల||

(ఆడదె ఆధారం చిత్రానికి శంకర్ గణేష్ సంగీత సారధ్యంలో వాణీ జయరాం పాడినది)

-------------
ఊరుకో ఊరుకో బంగారు కొండా!
నల్లకలువ కళ్ళు ఎర్రబారనీకుండా
దాయి! దాయి! దాయి! దమ్మనీ
చేయి జారిపోయిన జాబిల్లినీ
తేలేని తల్లినీ ఏడిపించకుండా!

ఇంకిపోని గంగలా కంటి నీరు పొంగినా చల్లబడకుందే ఎడారి
ఎదలో జ్నాపకాల జ్వాలలో రేపులన్ని కాలినా మొండి ఊపిరింకా మిగిలుంది

చల్లనీ నీ కళ్ళలో కమ్మని కల నేను
చెమ్మగిల్లనీకుమా కరిగిపోతాను || దాయి||

గుక్కపట్టి ఏడ్చినా ఉగ్గు పట్టవేమని
తప్పు పట్టి తిట్టే వారేరీ తండ్రీ!
అమ్మ వట్టి మొద్దురా జట్టు ఉండద్దురా
అంటు ఊరడించే నాన్నేరీ?

చెప్పరా ఆ గుండెలో చప్పుడే నేనని
జన్మలెన్ని దాటైనా చేరుకుంటానని!
(ఆత్మబంధం చిత్రానికి కీరవాణి సంగీత సారధ్యంలో బాలు, చిత్ర పాడినది)
-------------------
చిన్నా! చిరు చిరు నవ్వుల చిన్నా!
కన్నా! చిట్టిపొట్టి చిందుల కన్నా
నీ ప్రేమపోత పోసి కన్నానురా!
నిను శ్రీరామరక్షలాగ కాపాడగా
నీలో ఉన్నా.. నీతో ఉన్నా... ॥ చిన్నా॥

అటు చూడు అందాల రామచిలకని
చూస్తోంది నిన్నేదొ అడుగుదామని - నీ పలుకు తనకు నేర్పవా అని
ఇటు చూడు చిన్నారి లేడిపిల్లని
పడుతోంది లేస్తోంది ఎందుకో మరి - నీలాగ పరుగు చూపుదామని
కరిగిపోని నా తీపికలలని
తిరిగిరాని నా చిన్నతనముని - నీ రూపములో చూస్తూ ఉన్నా.. ॥ చిన్నా॥

తూనీగ నీలాగ ఎగరలేదురా
ఆ తువ్వాయి నీలాగ గెంతలేదురా - ఈ పరుగులింక ఎంతసేపురా
నీ ఆట ఈ పూట ఇంక చాలురా
నా గారాల మారాజ కాస్త ఆగరా - నీ వెంట నేను సాగలేనురా
ఎంత వెతికినా దొరకనంతగా
ఎంత పిలిచినా పలకనంతగా - వెళ్ళిపోకమ్మా రారా కన్నా.. ॥
(ప్రియరాగాలు చిత్రానికి కీరవాణి సంగీత సారధ్యంలో చిత్ర పాడినది)
-------------------------
 
చిలకా! ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళ సూత్రం అంగడి సరుకా కొనగలవా చెయిజారాక
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక ||చిలకా||

బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే
వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే
అమృతమే చెల్లించి ఆ విలువతో
హలాహలం కొన్నావే అతితెలివితో
కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే ||చిలకా||

అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో
మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో
ఆనందం కొనలేని ధనరాశితో
అనాథగా మిగిలావే అమవాసలో
తీరా నువు కనుతెరిచాక తీరం కనపడదే ఇంక ||చిలకా||


(శుభలగ్నం చిత్రానికి యస్వీ కృష్ణారెడ్డి సంగీత సారధ్యంలో బాలు పాడినది)
                        *** 
 

(సమాప్తం)