దాదాపు 12 సంవత్సరాల క్రిందట విడుదలైన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి 'సిరివెన్నెల తరంగాలు' పుస్తకం మార్కెట్లో లభ్యం కానందున, అశేష అభిమానుల కోరిక మీద ఆ పుస్తకాన్ని సీరియల్ గా ప్రచురించడం జరుగుతోంది. ఇందుకు ప్రత్యేక అనుమతి నిచ్చిన 'కౌముది'కి ఆత్మీయ మిత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.

(క్రిందటి సంచికనుంచి కొనసాగింపు)
25

కుర్ర తరంగం

సాధారణంగా సినిమాలలో టీజింగ్ సాంగ్స్ ఉంటాయి. నిజానికి ఈ టీజింగ్ అనేది సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఉంటుంది. ఆ వయసులో అల్లరి సహజం అయితే నిజ జీవితంలో కుర్రాళ్ళు సినిమాల్లోని పాటలను ఎరువు తెచ్చుకుని టీజింగ్ చేస్తే, ఆ కుర్రాళ్ళకి సరఫరా  చెయ్యడానికా  అన్నట్టు సినిమాల వాళ్ళం పాటలు రాస్తూ ఉంటాం.

అమ్మాయిల వెంట పడే అబ్బాయిలు, తమ సంఖ్య ఎక్కువైతే అమ్మాయిలే అబ్బాయిల్ని అల్లరి చెయ్యటం జరుగుతూ ఉంటుంది. ఈ రోజే కాదు అనాది నుంచీ ఈ వయసులో ఒకరినొకరు ఆట పట్టించుకోవడం అన్నది ఉంటూనే ఉంది. అయితే ఈ టీజింగ్లో భాషగానీ, భావ వ్యక్తీకరణ కానీ మోతాదు మించితే అవతలి వ్యక్తి హృదయం బాధ పడుతుంది. ఇది చిన్న ముల్లులా ఒంటిని గుచ్చితే బాగుంటుంది కానీ పెద్ద గునపంలా గుండెల్లో పొడిస్తే బాగోదు. ఈ వార చూసుకుంటూ మేము పాట రాయవలసి ఉంటుంది. ఈ టీజింగ్ సాంగ్స్ అనే కోవలో ఈ తూకాన్ని నేనెంత వరకు సాధించగలిగాను అనేది మీలాంటి రసహృదయులు తేల్చడానికి కొన్ని పాటల్ని చేర్చాను.

 

***

పల్లవి: గోదారి రేవులోన రాదారి నావలోన నామాటె చెప్పుకుంటు ఉంటారంట
నా నోట చెప్పుకుంటె బాగోదో ఏమో గాని నాలాంటి అందగత్తె నేనేనంట
పూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగ పున్నాలు పూయునంట కన్నుల్లో
కాసింత కోపమొస్తె ఊరంత ఉప్పెనొచ్చి ఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట || గోదారి||

పాట అంటె నాదెగాని కోయిలమ్మదా - ఒట్టి కారుకూతలే
ఆట అంటె నాదే కాని లేడిపిల్లదా - పిచ్చి కుప్పిగంతులే
పొలాల వెంట చెంగుమంటు సాగుతూ పదాలు పాడితే
జిగేలుమంటు కళ్ళు చెదిరి ఆగవా జులాయి గాలులే
ఏ చిన్న మచ్చలేని నా వన్నె చిన్నె చూసి చంద్రుడే
సిగ్గుతో మబ్బుచాటు చేరుకోడ

నాకు పెళ్ళి ఈడు వచ్చి పెద్దవాళ్ళకి ఎంత చిక్కు తెచ్చెనే
రాకుమారి లాంటి నాకు జోడు వెతకడం వాళ్ళకెంత కష్టమే
ఫలాని దాని మొగుడు గొప్పవాడని అనాలి అందరూ
అలాని నాకు ఎదురు చెప్పకూడదు ఏ మహానుభావుడు
నాకు తగ్గ చక్కనోడు నేను మెచ్చు ఆ మగాడు
ఇప్పుడే ఎక్కడో తపస్సు చేస్తువుంటాడు

(రుక్మిణి చిత్రానికి విద్యాసాగర్ సంగీత సారధ్యంలో సుజాత పాడినది)
***

అతడుఃలేచిందే లేడికి పరుగు కూచుంటే ఏమిటి జరుగు
తోచిందే వేసేయ్ అడుగు డౌటెందుకు
ఆమెః లేడల్లే ఎందుకు ఉరుకు పడిపోతే పళ్ళు విరుగు
చూడందే వెయ్యకు అడుగు జోరెందుకు
మనకన్నా చిన్నవాళ్ళు
మంజ్రేకర్ టెండుల్కర్లు లేరా మనకెగ్జాంపులు
అతడుః తుటాల ఫాస్టు బాలు చూస్తేనే గుండె గుభేలు
మనసత్తా సో సింపులు సో సింపులూ
ఆమెః ఎవరి జాతకం వారిది సారు రేఖలేనిదే నెగ్గరు ఎవరూ
రాసివున్నదా చూసుకో గురూ నేటి స్వీపరే నెక్స్ట్ స్పీకరు
లక్కుంటే లకీరుతో లక్ పతిలౌతారు
లైఫంటే నసీబులో స్టారే మాస్టారు

తాపీ తాబేలు తీరు ఆపేసే హాల్ట్ బోరు
టేకాఫే టాపు గేరు నా నేచరు

కుందేలై గెంతువారు కుదేలయేతీరుతారు
లాకప్ కో హాస్పిటల్కో గెస్టవుదురు

ట్రైలెద్ఢాం కొండకొనకు పోయేదేముంది మనకు
ఆఫ్ట్రాలో వెంట్రుక మన స్టేకు
ఏదో ఒకటుంది తలకు అది కాస్తా తెంచుకోకు
టోటల్ గా సున్నా అయిపోకు గోవిందా గోవిందా

ఇంటలెక్చువల్ లెక్చర్లేల అడుగు అడుగునా మేధావుల్లా
మైథాలాజికల్ పిక్చర్లోలా పొడుగు పొడుగునా పద్యాలేల
చర్చలతో చెడామడా తర్జన బర్జనలా
జంక్షన్లో ఎడాపెడా అర్జున గర్జనలా
(మనీ చిత్రానికి శ్రీ సంగీత సారధ్యంలో బాలు పాడినది)
***

ఆదివారమొక సెంటర్లో సోమవారమొక షాపింగ్ లో
ఎదురుపడ్డ నాడనుకున్న ఎవరా మైనా
యానివర్సిరీ ఫంక్షన్ లో యూనివర్శిటీ జంక్షన్ లో
అనూపానూ తెలియాలన్నా ఏదేమైనా
ఫైనలియర్ బిపిసి , ఫాదరేమో పరదేశీ
పెద్దదిక్కు ఎవరూ లేరయా
ప్రేమనగరు వాణిశ్రీ లేతఫిగరు భాగ్యశ్రీ
అంది బ్రదరు మైనే ప్యార్ కియా
ఓ మైనా నా మైనా నా వన్నెల జాణా, నా మానస వీణా, పరువాల కోనా

అటు మొన్నే పైటవేసి లవ్ లో అడుగేసి ఏనాడో వచ్చునంది ఏబిసి
ఎల్ కె జి ఏజి నుంచే రీసెర్చి చేసి పిహెచ్ డి పుచ్చుకుంది బీటేసి
నాకు లైనేసి లవ్ లీ గా లాగేసి సోకులిచ్చింది వాటేసి
లైను చెరిపేసి లేలెమ్మని ఎగదోసి లేచిపోదాం రారమ్మంది
ఆ ఫిగరు ఆ వగరు ఏం పొగరు ఏ ఫికరు ఎరుగదు చూడు గురూ!

నన్నేరా ఎంచుకుంది విన్నారా అంతా వీనస్ పై ఆశవద్దు కామ్రేడ్స్
వండేలో క్యూలు కట్టి ఉన్నారా ఇంకా వేకెన్సీ లేదు కాదా నా ఫ్రెండ్సు
ఘొల్లుమనకండి , చెల్లెల్లా చూడండీ, చూపు మార్చండీ ఇకనుండి
బాధపడకండీ బ్రదరిన్ లా అనుకోండీ, కట్నమేదైనా ఇవ్వండీ
ఈ జగమే మాయ గురూ, లేరెవరు, రారెవరు అనుకో ఓ లవరూ..!!
(ప్రయత్నం చిత్రానికి విద్యాసాగర్ సంగీత సారధ్యంలో బాలు పాడినది)
***
వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే
హంపి లోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడలయ్యావో ఏమో వయ్యారి

ఖర్మ కాలి రావణుండు నిన్ను చూడలేదు గాని
సీత ఊసునే తలచునా పొరబడి
భీష్ముడున్న కాలమందు నువ్వు పుట్టలేదు గాని
బ్రహ్మచారి గా బతుకునా పొరబడి
ఇంట గొప్ప అందగత్తె ముందుగానే పుట్టి వుంటే
పాత యుద్ద గాధలన్నీ మారి ఉండేవే
పొరపాటు బ్రహ్మది గాని సరి లేనిదీ అలివేణి

అల్లసాని వారిదంతా అవకతవక టేస్టు గనక
వెళ్ళిపొయెనే చల్లగా ప్రవరుడు
వరూధినిని కాక నిన్నే వలేసుంటే కళ్ళు చెదిరి
విడిచి పెట్టునా భామని బ్రాహ్మడు
ఒక్కసారి నిన్ను చూస్తే రెప్ప వెయ్యలేరు ఎవరూ
కాపురాలు గంగకొదిలి వెంట పడతారే
ముసలాడి ముడతలకైనా కసి రేపగలదీ కూన

(సూర్య ఐ.పి.యస్ చిత్రానికి ఇళయరాజా సంగీత సారధ్యంలో బాలు పాడినది)

(కొనసాగింపు వచ్చేసంచికలో)