| 
		
		 దాదాపు 
		13 సంవత్సరాల క్రిందట విడుదలైన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి 'సిరివెన్నెల 
		తరంగాలు' పుస్తకం మార్కెట్లో లభ్యం కానందున, అశేష అభిమానుల కోరిక మీద ఆ 
		పుస్తకాన్ని సీరియల్ గా ప్రచురించడం జరుగుతోంది. ఇందుకు ప్రత్యేక అనుమతి 
		నిచ్చిన 'కౌముది'కి ఆత్మీయ మిత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి 
		కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. 
		(క్రిందటి 
		సంచికనుంచి కొనసాగింపు)27
 
			
				
					
						
						హాస్యతరంగం 
						గుళ్ళో రామయ్యో ఇల్లా 
						రావయ్యో!గువ్వల చెన్నయ్యో.. బస్తీ చూడయో
 అబ్బో బెమ్మాండం.. అనుకుంటారయ్యో!
 మళ్ళీ మనూరికి పోనీ పోరయ్యా!
 అలా హంగామా చెయ్యకు దేవయ్యో
 తీరిగ్గా ఊరంతా చూద్దాం రావయ్యో!
 రైఠో బుల్లెమ్మా.. పోదాం పదవమ్మో!
 భేషో బ్రమ్మయ్యో.. అంటా చూడమ్మో!
 
 ఇదిగో డబ్బు .. ఆ బాబుల కివ్వు
 చిరిగిన లాగులు వేసుకు తిరిగితె ఎట్టా అని చెప్పు...
 చాల్లే ఆపు.. అవి జీన్సోయ్ బాబు
 పట్నాల్లో ఇది ఫాషన్‌లే నువ్వు తప్పంటే తప్పు
 అయితే నే కూడా .. నా బట్టలు చింపుకునేదా
 అంత పనొద్దయ్యో జనమంతా భయపడిపోరా
 పక్కకి పోవయ్యో పోలీసాయనా
 పెళ్ళాం పిల్లలే లేరా నాయనా
 ఆయనకేం ఆపదరాదు.. ఆపకు రావయ్యా
 నువ్వట్టా రాస్తారోకో ..చెయ్యకు దేవయ్యా..
 
 ఊరికి మధ్య ఈ అడివేంటమ్మా?
 లేళ్ళూ పుల్లూ కుందేళ్ళూ ఓ చోటే ఉన్నాయి
 అడివేం కాదు.. ఇది జూ అంటారు
 మనుషులనిక్కడ జంతువులకి చూపిస్తూ ఉంటారు
 
 బొమ్మల కొలువల్లె నిలబెట్టారే ఈళ్ళెవరు?
 గతకాలంలోని మన ఘనతను చాటెవాళ్ళు
 మన ఎన్.టి.ఆరే వీళ్ళను పిలిపించారు
 బద్రం బాబయ్యో! అసలే పెద్దోళ్ళు
 జాగర్తండయో.. చెర్లో పడతారు
 రంగుల రాట్నం. రంజుగ ఉందమ్మో
 ఇందరున్నారు.. ఈ సందడి ఏందమ్మో..
 మీ ఊళ్ళో జాతరలాంటిదె ఫ్రెండు
 టవునోళ్ళ తిరనాళ్ళ ట్రెజర్ అయిలాండూ..
 (దేవుడు చిత్రానికి శిర్పి సంగీత సారధ్యంలో బాలు, చిత్ర 
						పాడినది)
 
 ***
 
 
 అమృతాంతరంగం
 
 పేరు పెట్టడం వరకూ బాగానే వుంది కానీ ఇది మిసిలీనియస్ 
						కేటగిరి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ పైన ఉన్న ఎనిమిది తరంగాలకు 
						ఉన్నటువంటి నిర్ధిష్టమైన షేపూ, అంచులు దీనికి లేవు. మనుషుల 
						మధ్య ఉన్నటువంటి అనేక రకమైన బాంధవ్యాలూ, చుట్టరికాలూ, మమతలూ, 
						తల్లికొడుకుల అనుబంధం, తండ్రీ కొడుకుల అనుబంధం, 
						అన్నాచెల్లళ్ళ మధ్య ప్రేమ ఇలా ఏదైతే రెండు శరీరాల కలియక అని 
						పరిధిని దాటి విస్తరించిన మమత, ప్రేమ, అనురాగం, సరాగం - 
						ఏవిధమైన ఎమోషన్ ఉన్నా అన్నీ ఈ అమృతాంతరంగంలో చేర్చడం 
						జరిగింది.
 "ఎవరూ రాయగలరు అమ్మ అను మాట కన్న కమ్మని పాట" అన్న పాటలో 
						అమ్మ మమకారం గురించి రాశాను. అలాగే వివిధ బాంధవ్యాల మీద 
						నాలుగైదు పాటలు ఇందులో చేర్చాను.
 ఈ విభాగంలో చేరిన చిలుకా ఏతోడు లేకా అనే పాటకి నాకు 1994 
						సంవత్సరపు నంది అవార్డు లభించింది. ఇది శుభలగ్నం 
						చిత్రంలోనిది. అది నా అయిదో నంది. ఇలాగే శాంతరస ప్రధానంగా, 
						కరుణరస ప్రధానంగా ఉన్న పాటలనికూడా ఈ విభాగంలో చేర్చడం 
						జరిగింది.
 
 
 ఎవరు రాయగలరూ.. అమ్మ అన్న మాటకన్నా కమ్మని కావ్యం
 ఎవరు పాడగలరూ.. అమ్మ అనురాగం కన్న తియ్యని రాగం
 అమ్మేగా.. అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
 అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
 
 అవతారమూర్తి అయినా అణువంతే పడుతాడు
 అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు
 అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
 అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
 
 శ్రీరామ రక్ష! అంటూ నీరు పోసి పెంచింది
 దీర్ఘాయురస్తు! అంటూ నిత్యం దీవించింది
 నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
 నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
 
 (అమ్మ రాజీనామా చిత్రానికి చక్రవర్తి సంగీత సారధ్యంలో 
						చిత్ర పాడింది)
 
 ***
 
 నోరార పిలిచినా పలకనివాడినా
 మనసున మమతలున్న మనిషిని కానా
 నేలమీద మనలాగె ప్రాణులెన్ని ఉన్నా
 పిలిచేందుకు పలికేందుకు
 చుట్టరికాలతోచుట్టుకునేందుకు
 ఎన్నెన్నో అందమైన వరసలు మనవేలే కన్నా
 
 ఎవ్వరికి ఏమీ కాని ఏకాకినై ఉన్నా
 నా పేరు ఇన్నాళ్ళు ఒంటరి సున్నా
 అంకుల్ అంటు నాకు దగ్గరైంది
 లేత అంకెలాంటి చిన్ని బంధం
 అల్లుడంటు నన్ను అల్లుకుంది
 పూల సంకెలంటి అనుబంధం
 బావనయ్యాను, మరిదినయ్యాను - మావయ్యనయ్యాను, మనవణ్ణి అయ్యాను
 ఎంత మంది చెంతకొచ్చారో ఎన్ని పేర్ల కొత్త జన్మనిచ్చారో
 తీరిపోని ఋణమందుకున్న ఇంతకన్న ధనముండదన్నా
 మునుపెరుగని అనుభవమని మైమరుపున ఉన్నా
 
 పదుగురు పంచుకోని ఆనందమేదైనా
 పచ్చికైన పెంచలేని ఎడారివాన
 ఆడమగ జంట ఆలుమగలుగ మారి
 అంతే చాలు అని అంటారా
 అమ్మానాన్నలుగ, అత్తామామలుగ
 పేరుపొందాలనుకోరా
 తాతయ్యనవ్వాలి మీసాలు దువ్వాలి
 అవ్వ నేనవ్వాలి గవ్వలా నవ్వాలి
 అనే ఆశ తోడు ఉండగా
 పైనపడే ఈడుకూడా పండగ
 అయినవాళ్ళు ఉన్న లోగిళ్ళలో
 ఆయువాగిపోదు నూరేళ్ళతో
 తరతరముల తరగని కథ
 చెబుతుందిరా చిన్నా
 
 (అల్లుడుగారు వచ్చారు చిత్రంలో కీరవాణి సంగీత సారధ్యంలో 
						ఎస్.పి.బాలు పాడినది)
 
 
 
 
 
		(కొనసాగింపు 
		వచ్చేసంచికలో)     |