దాదాపు 12 సంవత్సరాల క్రిందట విడుదలైన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి 'సిరివెన్నెల తరంగాలు' పుస్తకం మార్కెట్లో లభ్యం కానందున, అశేష అభిమానుల కోరిక మీద ఆ పుస్తకాన్ని సీరియల్ గా ప్రచురించడం జరుగుతోంది. ఇందుకు ప్రత్యేక అనుమతి నిచ్చిన 'కౌముది'కి ఆత్మీయ మిత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.

(క్రిందటి సంచికనుంచి కొనసాగింపు)
23

అతడు: లలిత ప్రియకమలం విరిసినది కన్నుల కొలనిని
ఆమె: ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని
అతడు: అమృతకలశముగ ప్రతి నిముషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది

​అతడు: రేయీ పవలూ కలిపే సూత్రం సాంధ్యరాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
ఆమె: నేలా నింగీ కలిపే బంధం ఇంద్రచాపం
కాదా మన స్నేహం ముడివేసే పరువం
అతడు: కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
ఆమె: కోటి తలపుల చివురులు తొడిగెను
తేటి స్వరముల మధువులు చిలికెను
అతడు: తీపి పలుకుల చిలుకల కిల కిల
తీగ సొగసుల తొణికిన మిలమిల
ఆమె: పాడుతున్నది ఎదమురళి
రాగఝురి తరగల మృదురవళి
అతడు: తూగుతున్నది మరులవని
లేత విరి కులుకుల నటనగని
ఆమె: వేల మధుమాసముల పూల దరహాసముల
మనసులు మురిసెను​


ఆమె: కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగా
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
అతడు: తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజా కుసుమం
ఆమె: మనసు హిమగిరిగ మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా
అతడు: మేని మలుపుల చెలువపు గమనము
వీణపలికిన జిలిబిలి గమకము
ఆమె: కాలి మువ్వగ నిలిచెను కాలము
పూల పవనము వేసెను తాళము
అతడు: గేయమైనది తొలిప్రాయం
రాయమని మాయని మధుకావ్యం
ఆమె: స్వాగతించెను ప్రేమపథం
సాగినది ఇరువురి బ్రతుకురధం
అతడు: కోరికల తారకల సీమలకు
చేరుకొనె వడి వడి పరుగిడి

​(​​రుద్రవీణ చిత్రానికి ఇళయరాజా సంగీత సారథ్యంలో జేసుదాస్, చిత్ర పాడినది)

                                ***

పల్లవి: శ్రీనాథుళ్ళో శృంగారం నువ్వై పుట్టిందో
ప్రాణం ఉంటే బంగారం నీలా ఉంటుందో
ఒంపుల్లో ఉందే ఒయ్యారి నెమలి
చంపేస్తూ ఉందే నా గుండె నమిలి
నువ్వే సరేనంటే సమస్తాన్ని సమర్పిస్తానే నారీ
శిల్పం ఎలా చెక్కాలో చెప్పే పాఠం నీ రూపం కాదా
నాట్యం ఎలా ఉండాలో నేర్పే శాస్త్రం నీ నడకే కాదా
నీ దేహంతో స్నేహం చేసే చీరా రైకా ఐతే గానీ
సంపూర్ణంగా నీ సౌందర్యం వర్ణించే మార్గమే తెలిసేనా జాణా
నిన్నే ప్రతినిత్యం ప్రబంధంలా పఠిస్తున్నా చిన్నారీ
కనుచూపే విరితూపై తనువున ఆవిరి రేపే
కలిగిన ఈ మైమరపే తొలివలపై జత కలిపే

  

లేలే అనే పొద్దుంది - నీరెండల్లే! నవ్వే పెదవుల్లో 
లాలీ అనే రేయుంది - నీలాలే జీరాడే నీ జళ్ళో
పాపం నీ నడుమే లేకుంటే - నాజూకుండే చోటేదంట
జన్మం పండి నీ చర్మంపై ముత్యాల జల్లయిందే చెమట -
వనితా నిన్నే స్మరిస్తున్నా వరిస్తున్నా - తరిస్తా ఒళ్ళో చేరి

(సుబ్బరాజు గారి కుటుంబం చిత్రానికి కీరవాణి సంగీత సారథ్యంలో కీరవాణి పాడినది)

                              ***

పల్లవి: సౌందర్యలహరి సౌందర్యలహరి

సౌందర్యలహరి స్వప్నసుందరి - నువ్వే నా ఊపిరి
శృంగారనగరి స్వర్ణమంజరి - రావే రసమాధురి
వన్నెచిన్నెల చిన్నారి నీ జంట కోరి
ఎన్ని జన్మలు ఎత్తాలే ఈ బ్రహ్మచారి
కల నుంచి ఇల చేరి కనిపించు ఓ సారి...
 
పాలచెక్కిళ్ళు దీపాల పుట్టిళ్ళు
అదిరేటి అధరాలు హరివిల్లులు
ఫక్కున చిందిన నవ్వులలో లెక్కకు అందని రతనాలు
యతికైన మతిపోయే ప్రతి భంగిమ
ఎదలోనే పురివిప్పి ఆడింది వయ్యారి

నీలికన్నుల్లు - నాపాలి సంకెళ్ళు
నను చూసి వలవేసి మెలివెయ్యగా
ఊసులు చెప్పిన గుసగుసలు శ్వాసకు నేర్పెను సరిగమలు
కలగంటి తెలుగింటి కలకంఠిని
కొలువుంటె చాలంట నాకంట సుకుమారి

 

(పెళ్ళిసందడి చిత్రానికి కీరవాణి సంగీత సారథ్యంలో బాలు, చిత్ర, కోరస్ పాడినది)

                             ***

పల్లవి: ఎవరూ చూడని ఏకాంతంలో
ఎవరూ చేరని ఈ సమయంలో
రసవేగమై రవళించనీ ఎదలో లయ
జతలీలలో శృతిమించనీ కరిగే ప్రియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
 

విడువకు విడిగా అనే కదా నిను వేడుతోంది ప్రాయం
నీ ఎదసడిగా అయ్యా కదా అని పాడుతోంది ప్రాణం
ఒట్టేసి మళ్ళీ ఆ మాటే చెప్పనా
నువ్వే లేక నేనిన్నాళ్ళు వున్నానన్న మాటే
నాకు నమ్మాలంటే కష్టంగా ఉంది
నువ్వంటూ నాక్కనిపించాక నాలో నేనే లేనే - అన్న
సాక్ష్యం ఎంతో ఇష్టంగా ఉంది

 

కరగని శిలలా అవ్వాలిగా మనవైపు చూస్తే లోకం
కరగని కలగా అయ్యిందిగా మనమేలుతున్న కాలం
ఇలా ఇద్దరం అయిపోదాం ఒక్కరం
ఎండాకాలం వానాకాలం శీతాకాలం ఏమోగాని
కారాగారం కానీ కౌగిలి
నవ్వేవాళ్ళు ఏడ్చేవాళ్ళు వాళ్ళు, వీళ్ళు అంతా చేరి
నువ్వూ నేనే అవుదాం నెచ్చెలీ

(శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రానికి కీరవాణి సంగీత సారథ్యంలో కీరవాణి, చిత్ర పాడినది)

                                     ****

అతడు: కన్నుల్లో నీ రూపమే - గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే - నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే

ఆమె: మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా
అతడు: నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
ఆమె: గిలిగింత పెడుతున్న నీ చిలిపి చూపులతో
ఏమో ఎలా వేగడం

అతడు: అదిరేటి పెదవుల్ని బ్రతిమాలుకున్నాను
మదిలోని మాటేదని
ఆమె: తల వంచుకుని నేను తెగ ఎదురు చూసాను
నీ తెగువ చూడాలని
అతడు: చూస్తూనే రేయంతా తెలవారి పోతుందో
ఏమో ఎలా ఆపడం
( నిన్నే పెళ్ళాడతా చిత్రానికి సందీప్ చౌతాలా సంగీతసారధ్యంలో హరిహరన్ , చిత్ర పాడినది)

                                         ****

ఆమె: చినుకుతడి స్పృశించే లీలలా
చిలిపి చలి సృజించే జ్వాలలా
మధుమురళి రమించే గాలిలా
మొదటి విరి సుమించే వేళలా
మోయలేని హాయిలో మేలుకున్న రేయిలో
మౌనరాగం మధుపరాగం సాగనీ ఇలా


అతడు: కనబడకుంటే ఓ క్షణమైనా కునుకుండదే
ఆమె: ఎదురుగ ఉంటే నా మదిలోన కుదురుండదే
అతడు: చూస్తూనే ఉండాలి నిను కనుమూసి ఉన్నా
ఆమె: రెప్పల్లో కట్టేయి నన్ను కాదందునా
అతడు: నిదరేదో నిజమేదో తేలీతేలని లాలనలో
ఆమె: మౌనరాగం మధుపరాగం సాగనీ ఇలా


ఆమె: ప్రతి నడిరాత్రి సూర్యుడు రాడా నీ శ్వాసతో
అతడు: జతపడగానే చంద్రుడు కాడా నీ సేవతో
ఆమె: ఆవిర్లు చిమ్మింది చూడు పొగమంచు పాపం
అతడు: వేడెక్కే చల్లారుతుంది కలిపే క్షణం
ఆమె: పగలేదో రేయేదో తెలిసీతెలియని లాహిరిలో
అతడు: మౌనరాగం మధుపరాగం సాగనీ ఇలా

 

(ప్రియరాగాలు చిత్రానికి కీరవాణి సంగీత సారథ్యంలో హరిహరన్, చిత్ర పాడినది)
                          ****

అతడు: ఎద నట్టింటను మెట్టిందొక మధుకథ
నర్తించెను మత్తిల్లిన సుమసుధ - రూపెత్తిన ఆనందం ఆగేనా?

ఆమె: దివి లక్షింతల అక్షింతలు కురియగ
నిద్రించని విద్యుల్లత విరియగ - చేపట్టిన వాసంతం వాడేనా?
అతడు: శుభమూర్తం పిలిచింది సురద్వారం తెరిచింది నవరాగం రాగా

అతడు: నీలివనిలో తారకా - ఈ అవనికే జారగా
గాలి అలలే గానకళలై రేయి హృదయం పాడదా
ఆమె: వాలుకనులే కోరగా - పూల కలలే చేరగా
తేనె తడిపే వేళ తలపే హాయి లయలో ఆడదా
అతడు: వెలుగు నిజమైనా - వలపు ఋజువైనా
కళ్ళు మూసే చూడనీ వరాన్ని రెప్ప విడితె కల ఔనో

ఆమె: మల్లె మురిసే వేళగా - వెల్లివిరిసే వేడుకా
ప్రాణలతకు ప్రణయ శృతిలో మేలు కొలుపై చేరదా
అతడు: ఇంద్రధనువే మాలగా - పేద ఎదపై వాలగా
భావి బ్రతుకు దేవి కొరకు పూజ గదిగా మారదా
ఆమె: ఇలకు ఇకపైనా విరుల జడివానా
మౌనమైన రాగమాలపించు మరుల ఝరుల మురిపాన

(ప్రార్థన చిత్రానికి దేవేంద్రన్ సంగీత సారధ్యంలో బాలు, జానకి పాడినది)

(కొనసాగింపు వచ్చేసంచికలో)