దాదాపు 12 సంవత్సరాల క్రిందట విడుదలైన సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి 'సిరివెన్నెల తరంగాలు' పుస్తకం మార్కెట్లో లభ్యం కానందున, అశేష అభిమానుల కోరిక మీద ఆ పుస్తకాన్ని సీరియల్ గా ప్రచురించడం జరుగుతోంది. ఇందుకు ప్రత్యేక అనుమతి నిచ్చిన 'కౌముది'కి ఆత్మీయ మిత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.

(క్రిందటి సంచికనుంచి కొనసాగింపు)
24

 

అతడుః అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే 
ఆమెః అబ్బాయీ నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే
 
అతడుః ముద్దిమ్మంది బుగ్గ
  - వద్దంటూ అడ్డం రాకే నువ్వు

సిగ్గేలేని సిగ్గా 
ఆమెః ముద్దిమ్మంటే బుగ్గ
 అగ్గల్లే వస్తే ఆపేదెట్ట

హద్దూ పద్దు లేదా..

అతడుః మోజు లేదనకు
ఆమెః ఉందనుకో ఇందరిలో యెలా మనకు
 ..తూగిపొమ్మనకూ
అతడుః చీకటిలో ఇద్దరమే ఉన్నమనుకో
 
ఆమెః చూడదా సహించని వెన్నెల ఊరించినా కన్నులా
 
అతడుః కళ్ళు మూసేసుకో హయిగా
          ॥అమ్మాయి॥
ఆమెః పారిపోను కదా
అతడుః అది సరే అసలు కథ అవ్వాలి కదా..యేది ఆ సరదా
ఆమెః అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా
 
అతడుః అందుకే అటు ఇటు చూడకు సుఖాలను వీడకు
 
ఆమెః తొందరేముందిలే విందుకు
   ॥అమ్మాయి॥
 

(క్షణక్షణం చిత్రానికి కీరవాణి సంగీత సారధ్యంలో బాలు, చిత్ర పాడినది)

***


జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా 

నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె 

అల్లాడిపోదా రేయి ఆపుమా ॥జాబిలమ్మ॥

 
చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా
చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా
ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా
హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా
మరి అంత దూరమా కలలుకన్న తీరమా ॥జాబిలమ్మ॥
 


మనసు చూడవమ్మా కొలువుందో లేదో నీ బొమ్మా
మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా
ప్రాణమున్న పాలరాతి శిల్పమా మా ప్రేమ నీడ చేరుకోని పంతమా
తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహమంటె ద్వేషమా
ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా ॥జాబిలమ్మ॥

(పెళ్ళి చిత్రానికి ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీత సారధ్యంలో బాలు పాడింది)

 

***

 

 

అతడుః మేఘాలు తాకింది హాయ్ హైలెస్సా
నవరాగంలా నవ్వింది నా మోనాలిసా!
ఈగాలి రేపింది నాలో నిషా
చెలరేగాలి రమ్మంది 'హల్లో' అంటూ
ఒళ్ళో వాలే అందాల అప్సరస

 

ఆమెః మేఘాలె తాకింది హాయ్ హైలెస్సా
నవరాగంలా నవ్వింది నీ మోనాలిసా
ఈ గాలిరేపింది నాలో నిషా
అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ
అల్లేసింది నీమీద నా ఆశ ॥ ॥

 

అతడుః తొలిసారి నిను చూసి మనసాగక -
పిలిచానె చిలకమ్మ మెల్ల మెల్లగ
తెలుగంత తియ్యంగ - నువు కలిశావె స్నేహంగా
 

ఆమెః చెలిమన్న వలవేసి నను లాగగా -
చేరాను నీ నీడ చలచల్లగా
గిలిగింత కలిగేలా తొలి వలపంటె తెలిసేలా 

అతడుః కునుకన్న మాటే నను చేరకా
తిరిగాను తెలుసా ఏం తోచకా ॥మేఘాలె॥

 

ఆమెః తొలిపొద్దు వెలుగంత చిరువేడిగా
నిలువెల్ల పులకింత చిగురించగా
దిగులేదో హాయేదో గుట్టు చెరిపింది ఈ వింత

అతడుః ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా -
నిజమేదో కలయేదో మరిపించగా
పగలేదో రేయేదో రెండు కలిసాయి నీ చెంత

 

ఆమెః ప్రేమంటె ఇంతేనేమో మరి
దానంతు ఏదో చూస్తే సరి! ॥మేఘాలె॥

 

(ప్రేమించుకుందాం రా చిత్రానికి మహేష్ సంగీత సారథ్యంలో బాలు, చిత్ర పాడినది)

(కొనసాగింపు వచ్చేసంచికలో)