ఈ దేశంలో ప్రభుత్వాలు కూలాలంటే - ఓట్లు అవసరం లేదు, నోట్లు అవసరం లేదు, ఆమరణ
దీక్షలు అవసరం లేదు, ర్యాలీలు అవసరం లేదు. చాణిక్యుడికి కూడా అందని రాజనీతి
ఒకటుంది. అది అతి సాదా సీదా వస్తువు. చూడడానికి చిన్నదేకాని కొంపలు ముంచుతుంది.
ప్రభుత్వాల్ని దించుతుంది. దాని ఫేరు ఉల్లిపాయ.
ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు తమ దక్షతకి బోరలు
విరుచుకుంటున్నారు కాని - ఈ విషయాన్ని ఈ దేశంలో గుర్తించిన ఒకే ఒక్క రాజకీయ
నాయకురాలు - ఇందిరాగాంధీ. అలనాడు 1980 లో - చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని గద్దె
దించడానికి ఇందిరాగాంధీ ఉల్లిపాయని సంధించబోయారు. ఆ సంవత్సరంలో మేలో
మహారాష్ట్రలో రైతులు జరిపిన ర్యాలీలో కాల్పులు జరిగి ఇద్దరు కన్నుమూశారు. 27
మంది గాయపడ్డారు. అయితే - చరణ్ సింగ్ గారు గద్దె దిగడానికి ఉల్లిపాయ అవసరం కూడా
ఆనాడు లేకపోయింది. ఇక 1998 లో సుష్మా స్వరాజ్ గారి మంత్రిత్వ శాఖలో ఉల్లి ధరలు
ఆకాశాన్నంటిన కారణంగా ప్రభుత్వం పరపతినీ, దరిమిలాను పదవినీ పోగొట్టుకుంది.
ప్రస్తుతం అలాంటి సూచనలు ఈ ప్రభుత్వానికి కనిపిస్తున్నాయి. నక్సలైట్లు,
మావోయిస్టులు, తెలంగాణాలు, టూజీలు, ఆదర్శ స్కాంలూ, ప్రసార భారతి లల్లీలూ
చెయ్యలేని పని - ఒక్క ఉల్లిపాయ చేయగలదు. అది ఈ దేశంలో చరిత్ర.
ఒకనాడు సాహెబ్ సింగ్ వర్మ అనే మంత్రిగారు ఓ మాట అన్నారు వేదికమీద:
పేదవాళ్ళు ఉల్లిపాయ తిని బతకరు - అని. అంతే. ఉల్లి మహిమ ఆ మంత్రిగారికి
తెలియలేదు. వెంటనే ఆయన మంత్రి పదవి ఊడింది - ఆ ఒక్క కారణంగాకారణంగా.
దేశంలో పప్పు దినుసులు ధరలు పెరిగాయి. కందిపప్పు ధర పెరిగింది. చక్కెర ధర
పెరిగింది. ఎల్పీజీ ధర పెరిగింది. పెట్రోలు ధర పెరిగింది. అయినా ప్రజలు ఇంత
కలవర పడలేదు. కాని ఉల్లిపాయ ధర కిలో నూరు రూపాయలు కాగానే దేశం అట్టుడికిపోయింది.
తప్పిపోయిన బిడ్డ గురించి బెంగ పెట్టుకున్నట్టు - ఒకాయన "నేను ఉల్లిపాయ తిని
ఇరవై రోజులైంది" అని టీవీలో వాపోయాడు.
నాలుగయిదు వారాల కిందటి వరకూ ఉల్లిపాయ ఈ దేశంలో పదిరూపాయలకి అమ్ముడుపోయింది. ఈ
నాలుగు వారాల్లో - గుండెని జాగ్రత్తగా పట్టుకోండి - 700 శాతం పెరిగింది. దేశంలో
దినసరి ఆధాయం 20 రూపాయలు కూడా లేని నేలబారు మనిషి - కిలో
నూరురూపాయల ఖరీదు చేసే ఉల్లిపాయని కొనుక్కుని ఎలా తినగలడు?
మా ఆవిడ ముల్కీ. తెలంగాణాలో పెరిగిన అమ్మాయి నా భార్య. అక్కడ పేదవాడి సాధారణ
ఆహారం "గొడ్డుకారం" అంటుంటుంది. కేవలం ఉల్లిపాయ, ఎండుమిరపకాయ, చింతపండు, ఉప్పు
- ఈ నాలుగు దినుసులూ ఏ విధంగా చూసినా ఖరీదయినవి కావు. అవి వారికి అమృతప్రాయం.
మించి మదుబాటులో, తాహతుకి తగ్గ ఆహారం. నేనూ అప్పుడప్పుడు కారానికి
మోజుపడుతూంటాను. కాని ఇప్పుడది కూడా నేలబారు మనిషికి కరువైపోయింది.
అదృష్టవశాత్తూ మానవుడి ప్రాధమిక అవసరాలు - నీరూ, గాలీ ప్రకృతి అందజేస్తుంది.
వీటిలో నీరు అప్పుడే వ్యాపారమయిపోయింది. మరి కొన్ని సంవత్సరాలు గడిస్తే 'గాలీ
వ్యాపారమైనా ఆశ్చర్యం లేదు. ఇక మనిషిని బతికించే అతి ప్రాధమికమయిన ఆహారం -
ఉల్లిపాయ - అప్పుడే రాజకీయ నాయకుల, వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది.
విచిత్రమేమిటంటే - ఉల్లిపాయని ఈ దేశంలో సమృద్ధిగా పండించే రాస్ట్రం
మహారాష్ట్ర . మన కేంద్ర ఆహార మంత్రి మహారాస్ట్రలో మహా నాయకులు. అకాల వర్షాల
వల్ల పంటలు పాడయితే ఎవరేం చెయ్యగలరని ఆయన చేతులెత్తేశారు. ఘనత వహించిన
మంత్రివర్యా! ఆ మాట పొలం దున్నే రైతు అనాలికాని - ముందు జాగ్రత్తలు తీసుకుని,
అకాల వర్షాల పర్యవసానాన్ని అదుపులోకి తీసుకురావలసిన మంత్రివర్యులు అనవలసిన
మాటకాదు.
ప్రధాన మంత్రిగారికి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వ్యసనం. మూడేళ్ళుగా తన కంటి
ముందే టెలికాం శాఖలో జరిగే అవినీతిని, కామన్వెల్తు క్రీడల్లో జరిగే అవినీతినీ,
ప్రసార భారతి సిఈఓ లల్లీ గారి అవినీతిని, చీఫ్ విజిలెన్స్ కమీషనర్ గా ధామస్ గారి
నియామకంలో అవినీతినీ, ప్రస్థుతం ఉల్లిధరల పెరుగుదలకు నాయకుల అలసత్వమనే అవినీతినీ
గుర్తించరు. అవి జరిగాక - ఎందుకిలా అవుతోందని శరద్ పవార్ గారిని అడిగి ఉండాలి.
తమరు అడగలేదని ఇప్పుడు 'ప్రజలు ' ఆ ప్రశ్నన్ని 'తమరిని'అడగాలి. వార్షిక సభల్లో
మైకుల ముందు ప్రతిజ్నల ద్వారా నిజాయితీ నిరూపణ కాదు. వీధిన పడిన అసమర్ధత,
అలసత్వం, అశ్రద్ధ కూడా అవినీతే. ద్రోణుడిని చంపడంలో ధర్మరాజుకి అవినీతి వాటా
ఉంది. ఉల్లి కుంభకోణంలో మన్మోహన్ సింగ్ గారికీ వాటా ఉంది. తిలా పాపం తలా
పిడికెడు.
వెనుకటికి ఓ సామెత ఉంది. మొగుడు కొట్టాడని కాక తోటికోడలు దెప్పిందని ఒకావిడ
గింజుకుందట. నాలుగు వారాల కిందట 'వాగా ' సరిహద్దు ద్వారా కిలో పదిరూపాయలకి
ఉల్లిపాయలు అమ్మిన భారతదేశం - ఇప్పుడు ఏడు రెట్లు ధరని చెల్లించి పాకిస్థాన్
నుంచి ఉల్లిపాయని దిగుమతి చేసుకుంటోంది. మనం తినే ప్రతి ఉల్లిపాయ - పాకిస్థాన్
అడ్రసుతో వెనక్కిరావడం మనల్ని వెక్కిరిస్తున్నట్టుంది. కనీసం పొరుగు దేశానికి
నవ్వుతాలుగా నయినా ఉండి ఉంటుంది - మన నాయకుల నిర్వాకానికి. అంతరిక్షాన్ని
జయిస్తున్నామని బోర విరుచుకునే భారతీయులు కనీసం ఉల్లిపాయని చెప్పుచేతల్లో
ఉంచుకోలేకపోయారని పాకిస్థాన్ లో కొందరయినా కిసుక్కున నవ్వుకుంటూంటారు.
ఉల్లిపాయ గురించి రకరకాలయిన జోక్స్ అప్పుడే ప్రచారంలోకి వచ్చాయి. వియ్యాలవారిని
బరాత్ లో ఆహ్వానించి 'పాన్ పరాగ్ ' ఇస్తారా అని పలకరించే వ్యాపార ప్రకటన ఒకటుంది.
ఇప్పుడు 'ప్యాజ్ 'తో (ఉల్లిపాయ) స్వాగతం చెపుతారా అని ప్రకటన రావాలని ఒకాయన
చమత్కరించాడు.
గురుదత్ ఇవాళ బతికుంటే 'ప్యాసా ' అనే చిత్రం సంగతి మరిచిపోయి 'ప్యాజా '
తీస్తాడన్నారు ఒకాయన. ప్రముఖ దర్శకులు శంకర్ గారు 'అన్నియన్ ' అనే సినిమా తీశారు.
వారిక 'ఆనియన్ ' తీయడం అవసరమన్నారు ఒకాయన.
ఉల్లి కళ్ళ నీళ్ళు తెప్పిస్తుంది. సరే. ఉల్లిపాయ చేతికి రావడానికే కళ్ళ నీళ్ళు
తిరుగుతున్నాయిప్పుడు.
ఆఖరుగా ఉల్లి ప్రియుడయిన ఒక కవి గోడు:
ఉల్లీ! దుంపను తెంచకు
తల్లీ! నా కొంప గూల్చ తగునా నీకున్?
మళ్ళీ భువిలో నూకలు
చెల్లీ చెడకుండ చూడు చేతులు మోడ్తున్.