వ్యక్తి - వ్యవస్థ
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

    చాలా కాలంగా చాలామంది రాజకీయ నాయకుల మనస్సుల్లో ఉన్న భావమే నాకూ ఉండేది. సమాజంలో ఎంత అవినీతి పేరుకున్నా, దాని నిర్మూలన ఎంత అవసరమయినా-దేశంలో ఓ వ్యక్తి చేసే ఉద్యమమో, చెప్పే నినాదమో దాన్ని నిర్ణయించాలా? 543మంది సభ్యులున్న ప్రజా ప్రతినిధుల సభకు ఆ దక్షత లేదా? ఓ వ్యక్తి చేసే ఉద్యమం పాలక వ్యవస్థని బ్లాక్‌ మెయిల్‌ చెయ్యడం సబబా? యిలాంటి ఆలోచనలకు నా మనస్సు కూడా ఓటు వేసింది.
అయితే రాజకీయ నాయకులే యిలాంటి మాటలంటున్నారని మనం గమనించాలి - మీరూ నేనూ కాదు. మీరూ నేనూ ఏకీభవించే రీతిగా, మనకూ సబబనిపించే రీతిగా 'రాజకీయ నాయకులు' యీ మాటలంటున్నారు. ఇందులో రాజకీయమైన మెలిక ఉంది. అన్నా హజారే అవినీతి పరుడన్నా, కిరణ్‌ బేడీ డబ్బు స్వాహా చేసిందన్నా, కేజ్రీవాల్‌ గవర్నమెంటు ఉద్యోగాన్ని దుర్వినియోగం చేశాడన్నా- ఆ విధంగా ఓ వ్యక్తి ధ్వజం ఎత్తిన 'అవినీతి' మీద కాక, ఆ వ్యక్తి మీద బురద జల్లే పనికి మన మద్దతు చేకూరుతుంది.
ఈ దేశంలో జరపాల్సిన అన్ని సహేతుకమైన మార్పులకీ రాజకీయమైన ప్రయోజనాలకు భంగం కలిగితే ఏ మాత్రం జరగవన్న నిజాన్ని గత 64 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. స్త్రీలను నెత్తిన పెట్టుకుని పూజించాలని లల్లూగారు బుంగమూతి పెట్టుకుని భావిస్తారు. వంటింట్లో ఉన్న వారి భార్యని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోపెట్టి వెనుక నుంచి వారే సారధ్యం చేస్తారు. మరి పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం బిల్లుకి మద్దతు పలకరేం? ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని తమ సారధ్యం సాగే నేపథ్యంలో 'మహిళ'లకు సమాన ప్రతిపత్తి అనే నినాదం వరకూ గొడవ లేదు. కాని పూర్తిగా వారి చేతికే కళ్లెం యివ్వాలంటే కుదరదు. ఇది 64 సంవత్సరాలలో నిరూపణ అయిన సత్యం. సరే. ఈ అవినీతి నిర్మూలనకు లోక్‌పాల్‌ బిల్లును యూపిఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మంచిదే. అందులో లోటుపాట్లున్నాయని అన్నా హజారే వర్గం అంటోంది.
చర్చించాల్సిందే. కాని నిన్న ఏం జరిగింది? 'అవినీతి' మాట పక్కన పారేసి- లోక్‌పాల్‌ కమిటీలో వెనుకబడిన వారికీ, మైనారిటీలకూ ప్రాతినిధ్యం కావాలని అంతా విరుచుకుపడ్డారు. ఇప్పటికే అన్ని రంగాలలో 27 శాతం రిజర్వేషన్‌ ఉన్నది. అందులో మళ్లిd రిజర్వేషన్‌ చెల్లదని తీర్పు. తీరా 8మంది సభ్యులున్న కమిటీలో ఇందరికి రిజర్వేషన్‌ ఎలా సాధ్యం? మన దేశంలో నలుగురైదుగురు రాష్ట్రపతులూ, ఉప రాష్ట్రపతులూ, ముఖ్యమంత్రులూ, గవర్నర్లూ, కేంద్ర మంత్రులూ, ప్రధాన ఎన్నికల అధికారులూ - యీ రిజర్వేషన్ల ప్రసక్తి లేకుండానే పదవుల్లో ఉన్నారు. మతాతీత, వర్గాతీత వ్యవస్థకి ఇంతకన్న నిదర్శనం ఏం కావాలి? ఎవరో నిన్న టీవీ ప్రోగ్రాంలో అంటున్నారు. వీరంతా కోరినట్టు-రిజర్వేషన్లు కల్పిస్తే 8 మంది సభ్యుల కమిటీలో .38శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలట! ఎలా? సమాజంలో అవినీతిని నిర్మూలించే గొప్ప ఆయుధం కదా లోక్‌పాల్‌ చట్టం? ఎక్కువ అన్యాయం వెనుకబడిన వారికీ, మైనారిటీలకూ జరుగుతోంది కదా? కనుక అవినీతిని నిర్మూలించే కమిటీని బలపర్చడానికి బదులు- యింకా ఏర్పడకుండానే ఆ కమిటీ నిర్వహణ మీద అపనమ్మకం వ్యక్తం చెయ్యడం కదా ఈ పని? అసలు 'అవినీతి' గొడవ మరిచిపోయి, రిజర్వేషన్ల గొడవతో నిన్నటి పార్లమెంటులో నాయకుల వీరంగం దొడ్డితోవన ఈ లోక్‌పాల్‌ బిల్లును అటకెక్కించే కుట్రగా అర్థమౌతోంది.
ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది. ఏదైనా సామాజికమైన మంచిపని జరగాలంటే - అది రాజకీయ నాయకుల వల్ల జరగదు. ఒక 'నీతిపరుడి' ఉద్యమం వల్ల మాత్రమే జరుగుతుందని, ఇందుకు నిన్నటి లిబియా, ఈజిప్లు, మొన్నటి అన్నా హజారే ఉద్యమం యిందుకు నిదర్శనం.
రాజకీయ నాయకులే, పార్లమెంటే న్యాయంగా ఈ పని చెయ్యాలి. అర్హత, దక్షత ఆ సభదే. కానీ నాయకుల నిర్వాకం నిన్న చూశాం కదా?
అలనాడు ఒక్క మహాత్మాగాంధీ అహింసాయుతమైన ఉద్యమమే ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చి పెట్టింది. కానీ రాజకీయ నాయకత్వం ఏం చేసింది? ఈ దేశాన్ని మూడుముక్కలు చేసింది. లక్షలాదిమంది చావుకి కారణమయింది. ఇప్పటికీ ఆ పీడకల నుంచి ఈ దేశం తేరుకోలేదు. ప్రపంచ చరిత్రలో మంచికీ, చెడుకీ వెనుక ఒకే ఒక వ్యక్తి ప్రమేయమే కనిపిస్తుంది. హిట్లర్‌, స్టాలిన్‌, నెహ్రూ, నాజర్‌, మండేలా. నిజాయితీకీ, నిరంకుశత్వానికీ వ్యక్తి ఆదర్శమే పెట్టుబడి. స్వలాభం చూసుకునే ప్రతినిదుల వ్యవస్థ కప్పల తక్కిడె. ఏకాభిప్రాయానికి ఆస్కారమే ఉండదు. ఈ దేశంలో హిందూ దేశంలో 'దేవుడి' విషయంలోనే ఏకాభిప్రాయం లేదు! ఒకరికి రాముడు, మరొకరికి శివుడు, మరొకరికి శక్తి, ఇంకొకరికి బాబా, ఇంకా మరిడమ్మ, నూకాలమ్మ, కరుమారియమ్మ, కంకాణమ్మ-మీ యిష్టం. సామూహిక విశ్వాసం వెర్రితలలు వేస్తుంది. సామూహిక చైతన్యం ఏకీకృతమైన కృషి ద్వారానే రూపుదిద్దుకుంటుంది. అన్నార్తుడికి అన్నం పెట్టడానికి 'మెజారిటీ' మద్దతు అక్కర్లేదు. పేద వారి ఆకలి తీర్చడానికి బిల్లు పెట్టమనండి. వెయ్యి రకాలైన అభిప్రాయాలు, అభ్యంతరాలు తలెత్తుతాయి. అందరికీ ఉపయోగపడే మంచి ఒక ఉద్యమం. అది వ్యక్తి ద్వారానే సాధ్యం. ఉదాహరణ: వివేకానంద, జీసస్‌, మహాత్ముడు, నెల్సన్‌ మండేలా, మార్టిన్‌ లూధర్‌కింగ్‌. బ్రిటిష్‌ పార్లమెంటు కాదు, అమెరికా సెనేటు కాదు, ఇండియా పార్లమెంటు కాదు. జెరూసలేం ప్రజాసంఘం కాదు. వ్యవస్థ 'మెజారిటీ' వలలో చిక్కుకున్న స్వప్రయోజనాల కూటమి. వ్యక్తి స్వప్రయోజనాలకు విడాకులిచ్చిన ఉద్యమం. అతను సబర్మతిలో ఉంటాడు. మాలేగాంలో ఉంటాడు. బేలూర్‌లో ఉంటాడు. జెరూసలేంలో ఉంటాడు. పార్లమెంటుల్లో కాదు. నాకింకా ఒక వ్యక్తి పాలక వ్యవస్థని నిలదీయడం మీద అపనమ్మకం ఉంది. కానీ ఈ దేశానికి మరో గతిలేదు. అది ఈ దేశపు నాయకుల నిర్వాకం.
 

                                                డిసెంబర్ 26, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage