Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here చిన్న చికిత్స
గొల్లపూడి మారుతీరావు
తొమ్మిది గంటలకి షూటింగ్ కాల్ షీట్ వుంటే అక్కినేని 8 గంటలకే మేకప్ రూంకి వచ్చి మేకప్ చేసుకుని 9 గంటలకి సిద్ధంగా వుండడం నాకు తెలుసు. ఆయన సినీ పరిశ్రమలోనే సీనియర్. వయస్సులో అందరికంటే పెద్ద. ఒక్క అడుగు వెనక వచ్చినా ఎవరూ ఆక్షేపించరు. పైగా అందరూ అర్ధం చేసుకుంటారు. ఓసారి ఆయన్ని అడిగాను: కాస్త మెల్లగా రావచ్చుకదా అని. ఆయన సమాదానం నన్ను ఆశ్చర్యపరిచింది. “నేను వేళకి వచ్చి మేకప్ రూంలో సిద్ధంగా వున్నానని తెలిస్తే అక్కడ డైరెక్టరూ, మిగతా టెక్నీషియన్లూ అప్రమత్తంగా వుంటారు” అన్నారు. ఇది నేనెన్నటికీ మరిచిపోను. ఒకవేళ డైరెక్టర్ కారు ఆలశ్యమయినా దిగగానే అడిగే మొదటి ప్రశ్న: హీరోగారు వచ్చేశారా? అని. వచ్చారంటే ఆరోజు తను పొరపాటు చేసినట్టే లెక్క. ఊటీలో “పెయ్’’ లొకేషన్ వుంది. “పెయ్” అంటే తమిళంలో దెయ్యమని. ఆ లొకేషన్ కి ఆపేరెందుకొచ్చిందో తెలీదు. నేనూ ఎన్నో సినీమాలు ఆ లొకేషన్ లో చేసిన గుర్తు. చాలా ప్రసిద్ధమయిన స్థలం. ఎత్తుపల్లాలతో చూడ ముచ్చటగా వుంటుంది. షూటింగ్ కి ఊటీ వెళ్ళినవారంతా ఏదో ఒక సందర్భంలో దాన్ని ఉపయోగించుకోవడం కద్దు.సముద్రమట్టానికి కొన్ని వేల అడుగుల ఎత్తున ఉన్న ఊటీలో- ముఖ్యంగా ఆస్థలంలో మేఘాలు నేలబారుగా కదులుతాయి. ఊటీలో మంచు విడి తెల్లవారడమే 8 అవుతుంది. చలిని జయించి, స్నానాదులు ముగించుకుని ఊటీకి దాదాపు 18 మైళ్ళ దూరంలో వున్న ఈ లొకేషన్ కి రావడం- అదిన్నీ మేకప్ చేసుకుని రావడం పెద్ద గగనం. మేఘాలు దూరమయి సూర్యరశ్మి నేలని తాకేసరికి ఇంకా వేళవుతుంది. అయితేడైరెక్టరూ, సిబ్బందీ ఇక్కడికి వచ్చేసరికి- ఒకాయన మేకప్ చేసుకుని పల్చని దుస్తుల్లో వచ్చి కూర్చునేవారు. మేఘాలు కదిలేసరికి ఆయన కనిపించేవారు. ఆయన పేరు ఎన్టీ రామారావు. “రండి బ్రదర్” అని ఆయన పలకరింత వినగానే అందరికీ గుండె ఝల్లుమనేది. ఇద్దరు ప్రసిద్ధులయిన పెద్దల ఉదాహరణలివి. ఇద్దరూ తెలుగునాట చరిత్రని సృష్టించినవారు. ఒకాయన బొత్తిగా చదువురాని రైతు. విధి వక్రించకపోతే ఎన్టీఆర్ సర్వనాయక సమ్మతంగా ఈ దేశానికి ప్రదాని అయేవారు. ఎక్కడ నిమ్మకూరు? ఎక్కడ బిఏ చదువు? ఎక్కడ నాటకరంగం?- ఎంత దూరం ప్రయాణం? నాయకత్వం వ్యవస్థకి ముందు చూపునివ్వాలి. స్పూర్తినివ్వాలి. మార్గదర్శకం కావాలి. హెచ్చరిక కావాలి. మేలుకొలుపు కావాలి. అది బెత్తం పుచ్చుకున్న బడిపంతులు కాకూడదు. ముందు నడిచే పెద్ద దిక్కు కావాలి. యద్యదాచరతి శ్రేష్టః అన్నది గీతాచార్యుడి వాక్కు. ఈ ఇద్దరి కధల్లో రెండో పార్శ్యముంది. ఈ ఇద్దరూ సమయాన్ని పాటించమని ఎవరికీ పాఠాలు చెప్పలేదు. సిబ్బందిని నిలదీయ లేదు. ఎందుకు ఆలశ్యమయిందని కనుబొమ్మలు ఎగరేయలేదు. ఆలశ్యానికి సంజాయిషీ అడగలేదు. ఆంక్షలు విధించ లేదు. కోపం తెచ్చుకోలేదు. అసలా విషయమే ప్రస్తావించలేదు. చిరునవ్వుతో పలకరించారు. తమ “తప్పు’ని ఎదుటి వ్యక్తి చేసిన “ఒప్పు” ఎత్తిచూపింది. సంస్కారికి ఆ పాఠం చాలు. పొరపాటు. ఇలాంటి పాఠం చదువురాని వాడిని కూడా సంస్కారిని చేస్తుంది. నా చిన్నతనంలో ఓ గొప్ప సంఘటన నాకు చూచాయగా గుర్తుంది. మాయింటినిండా చిన్నాన్నలూ, చదువుకునే వారి పిల్లలూ, మేనత్తలూ- యిలా రకరకాలవారుండేవారు. అందరికీ మా అమ్మే వండి వార్చాలి. ఓ రాత్రి మా నాన్న ఆలశ్యంగా వచ్చారు. పనంతా పూర్తి చేసుకుని రొట్టె,కూర గిన్నెలో మూతపెట్టి వుంచింది అమ్మ. అందులో ఓ రొట్టె బొత్తిగా మాడిపోయింది. నాకర్ధమయింది. ఈ రొట్టెని నాన్న ఎలాతింటారు?చూస్తూ కూర్చున్నాను- నాన్న ఏమంటారో చూద్దామని. నాన్న కాళ్ళు కడుక్కుని వచ్చి “అందరి భోజనాలూ అయాయా?’’ అని అమ్మని పలకరించి, నన్ను నవ్వుతూ ముద్దు పెట్టుకుని మాడిపోయిన రొట్టెని లొట్టలు వేసుకుంటూ తినేశారు. నేను ఆశ్చర్యపోయాను. రాత్రి నాన్నగారి కడుపుమీద చెయ్యివేసుకు నిద్రపోవడం అలవాటు. రాత్రి అడిగాను. “నిజంగా కాలిన రొట్టె బాగుందా నాన్నా?” అని. నాన్న నవ్వారు. నన్ను దగ్గరికి తీసుకుని “అమ్మ రోజంతా పనిచేసి అలసి పోయిందికదా? రొట్టె కాలిపోయిందని తనకీ తెలుసు . ఒకరోజు కాలిపోయిన రొట్టె తినడం వల్ల కొంప మునగదు” అన్నారు. అమ్మ ఆ మాటలు వినే వుంటుంది . ఆ తర్వాత నా ఎరికలో ఎప్పుడూ రొట్టె మాడడం ఎన్నడూ చూడలేదు. మన ప్రవర్తన గొప్పదే కావచ్చు. కాని ఎదుటి వ్యక్తి లోపాన్ని నీ ప్రవర్తనతో సంస్కరించడం చాలా గొప్ప ఆయుధం. చాలా బలమైనది. తుపాకులు, శతఘ్నులు చెయ్యలేని పనిని ఈ సహనం చేస్తుంది. దీనికి అంతర్జాతీయ స్థాయినిచ్చి, గొప్ప ఆయుధాన్ని చేసి రవి అస్తమించని భ్రిటిష్ సామ్రాజ్యాన్ని తలవొంచేటట్టు చేసిన మహానుభావుడు ఒకాయన ఉన్నాడు- ఆయన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఆయన్ని ఒక జాతి మహాత్ముడని గౌరవించుకుంది. జాతిపితని చేసి ఆరాధించింది. (ఆంధ్రప్రభ సౌజన్యంతో) డిసెంబర్ 21, 2009
************ ************
************* ************* |