'ముళ్ల' పెరియార్ భాగోతం
గొల్లపూడి మారుతీరావు gmrsivani@gmail.com
చెన్నైలో మాయింటికి ఎదురుగా ఓ ముసలాయన ఉండేవాడు. మా యింటి
ఆవరణలో గన్నేరు, మందార పువ్వులు పూసేవి. ఉదయమే వచ్చి ఆ పువ్వులు
కోసుకునేవాడు. ఎప్పుడైనా -మేం నిద్రలేవడం ఆలశ్యమయి, వీధి గేటు తీయడంలో
జాప్యం జరిగితే కోపం తెచ్చుకునేవాడు -గేటు మూసేస్తారేమని. ఇల్లు మాది.
పువ్వులు మావి. ఆయన మా ఇంటికి వచ్చి మా పువ్వులు కోసుకుంటున్నాడు. పెద్దాయన
కదా అని మేం సరిపెట్టుకునేవాళ్లం. అయినా అదేదో తన హక్కులాగ కసురుకునేవాడు.
పైగా ''మీ ఆంధ్రా వాళ్లు ఎప్పుడూ ఇంతే. మాదేశం వచ్చి మమ్మల్ని
దోచుకుంటున్నారు'' అనేవాడు మా ముఖం మీదే. ఇదో విచిత్రమైన బుకాయింపు. మా
ఇంటికి వచ్చి మా వస్తువుని తీసుకెళ్తూ మమ్మల్ని తిట్టడంలో అనౌచిత్యం ఏ
కోశానా అతని మునస్సులో కదిలేదికాదు. మేమే తెల్లబోయి -ఈ విసుగుదలలో దురన్యాయం
ఆయనకి తట్టలేదా అని ఆశ్చర్యపోయేవాళ్లం. కాని ఆయనకి ఏనాడూ అలా అనిపించలేదు.
కారణం -ఇల్లు మాదయినా, పువ్వులు మా యింట్లో పూసినా -దేశం తమిళ దేశం. ఆయన
తమిళుడు. అక్కడ పూసిన ఏదైనా వారిని అనుభవించనియ్యక పోవడం దోపిడీ అవుతుంది.
ఇదీ ఆయన లాజిక్.
స్థూలంగా ముల్లై పెరియార్ డామ్ కథ ఇది. ఎప్పుడో 150 సంవత్సరాల కిందట
బ్రిటిష్‌వారి హయాంలో అరేబియా సముద్రంలో కలిసిపోతున్న పెరియార్ నదిని దారి
మళ్లించి తూర్పు వేపు తిప్పడం ద్వారా ఇప్పటి తమిళ దేశంలో ఉన్న వేలాది
ఎకరాలకు నీరు దక్కుతుందని గ్రహించారు. చాలా కారణాలకి అది వెంటనే జరగలేదు.
116 సంవత్సరాల కిందట కేరళలో ఇద్దుకీ జిల్లాలో టెక్కడి కొండల మధ్య డామ్‌ని
నిర్మించారు. ఇందువల్ల పెద్ద ఉపకారం -తమిళనాడులో తేని, మధురై,
శివగంగ,రామనాధపురం జిల్లాల రైతులకి. డామ్ కేరళలో ఉంది. వినియోగం తమిళనాడుకి.
ఉపయోగం వీరిది కనుక ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం డామ్ రక్షణ, నిర్వహణ
బాధ్యతల్ని ఆనాటి తిరువాన్కూర్ మహారాజుకి ఒక అగ్రిమెంటు ద్వారా
అప్పగించింది. ఇది 999 సంవత్సరాల ఒప్పందం. ఆ రోజుల్లో కేరళ తమిళనాడు అంటూ
ప్రత్యేకంగా రాష్ట్రాలు లేవు. అంతా సంయుక్త మద్రాసు రాష్ట్రం. తర్వాత
రాష్ట్రాలు ఏర్పడ్డాయి. డామ్ కేరళలోకి పోయింది. వినియోగం తమిళనాడుదయింది.
ఇది మీ ఇంట్లో మా కుక్కపిల్లని సాకడం లాంటిది. కుక్కపిల్లంటే మాకు మోజు.
బాధలు మీవి. ముద్దు మాది. దాని నిర్వహణ ఖర్చుల విషయంలో, చెల్లించే పన్నుల
విషయంలో లావాదేవీలు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో ఇంజనీర్లు అప్పటికి తెలిసిన
పద్ధతుల్లో చెక్కసున్నం, రాయితో నిర్మించారు. పాతబడిన కారణంగా డామ్ పగుళ్లు
చూపింది. సమస్యలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు రిపేర్లు జరుగుతున్నాయి. పైగా
ఆ ప్రాంతం భూకంపాలకు ఆలవాలమయిన చోటు. 1988లో జూన్ 7న భూకంపం వచ్చింది.
ఇందుకు కారణం ఈ డామ్, కొండల మధ్య నీటి వత్తిడి కారణం కావచ్చునన్న
ఆలోచనలున్నాయి. 1979లో మోర్వీ డామ్ బద్దలయి 25 వేల మంది చచ్చిపోయిన పీడకలని
ఎవరూ మరిచిపోలేదు. ఇదంతా ప్రజల భయానికి నేపథ్యం. డామ్ దెబ్బతింటుది కనుక ఆ
రోజుల్లో నీటి మట్టం 142.2 అడుగుల నుంచి 136 అడుగులకి తగ్గించక తప్పలేదు.
అయితే అందువల్ల 1960 -2005 మధ్య 40 వేల కోట్ల పంట నష్టం వచ్చిందని తమిళనాడు
అంటోంది. బాబూ, ఈ డామ్ కూలితే కోట్లాదిమంది చచ్చిపోతారు. కొచ్చిన్ నగరమే
మునిగిపోతుంది. వేరేగా కొత్త డామ్ కడతాం -అంటుంది కేరళ ప్రభుత్వం. మా
వనరులు చెడిపోతాయి -అంటుంది తమిళనాడు ప్రభుత్వం. ఈ గొడవ సుప్రీం కోర్టులో
మురుగుతోంది.
ఇప్పుడు మరో ఉపద్రవం వచ్చిపడింది. ఈ మధ్య 3-డి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
-ఇండియా సంయుక్త నిర్మాణంగా సోహన్ రాయ్ అనే ఆయన 'డామ్ 999' అనే
చిత్రాన్ని నిర్మించాడు. 1975 చైనాలో బాంక్వియో డామ్ కూలి రెండున్నర
లక్షలమంది చావుకి కారణమైన దుర్ఘటన దీనికి మాతృక. ఇది టవరింగ్
ఇన్ఫెర్నో,పొసైడెన్ అడ్వంచెర్, డాంటేస్ పీక్ లాగ ఒక కల్పిత గాథ. ఎంతో
ఉత్కర్ష కలిగేటట్టు విధ్వంసాన్ని భయానకంగా, కళ్లకు కట్టేటట్టు చిత్రించాడు.
సెన్సార్ బోర్డ్ దీనికి అనుమతినిచ్చింది. ఈ సినిమాని ఇంకా ఎవరూ చూడలేదు.
నలుగురికీ తెలిసిందల్లా 999 అన్న సూచన మాత్రమే. అంటే ముల్ల పెరియార్ డామ్
ఒప్పందం. అది చాలు ఇదిగో పులి అంటే అదిగో తోక అనడానికి. తమిళులలో గొప్ప
ఐకమత్యం ఉంది. తమకి సంబంధించిన ఏ సమస్య వచ్చినా అన్ని పార్టీలూ ఏకమయిపోతాయి.
ఇది ప్రాంతీయ దురభిమానం కల్పించిన గొప్ప సుగుణం. మొన్న రాజీవ్ గాంధీ
హంతకుల్ని విడిచిపెట్టాలని కరుణానిధిగారూ, వారి పార్టీ అంది. తద్వారా వారికి
పరపతి పెరిగితే? జయలలితగారు వెనక్కి తగ్గలేదు. ఏకంగా శాసనసభే హంతకులను
ఉరితీయకూడదని తీర్మానం చేసింది!
ప్రతిపక్షం స్థాయిని కూడా పోగొట్టుకున్న డి.ఎం.కె. కేరళ మీద కత్తులు దూసింది.
ప్రజల సానుభూతికి ఇది దగ్గర తోవ. డామ్ మాట దేవుడెరుగు. ఇప్పుడీ ఉద్యమం
వల్ల ప్రతిపక్షం మార్కులు కొట్టేస్తే! మేడమ్‌గారూ కత్తులు దూశారు.
రాష్ట్రంలో డిఎంకె, డిఎండికె, రెండు కమ్యూనిస్టు పార్టీలూ, ఎంఎంకె, ఆర్‌పిఐ
-అన్ని పార్టీలూ ఏకమయాయి. ఇది అద్భుతమైన ఐకమత్యం. ప్రాంతీయ దురభిమానం
ప్రజలలో పరపతికి దగ్గర తోవ అని నమ్మిన రాజకీయాలూ, వారి నమ్మకాన్ని నిజం చేసే
ప్రజలూ ఈ అరాచకానికి పెట్టుబడి. అలనాడు -ఇలాంటి హిందీ వ్యతిరేక ఉద్యమమే
ప్రజల ఆశీర్వాదాన్ని ద్రవిడ పార్టీలకిచ్చింది. ఇప్పటికీ ద్రవిడ పార్టీలే
రాజ్యమేలుతున్నాయి. ఇది చరిత్ర. త్వరలో ఎన్నికలు కేరళలోనూ రాబోతున్నాయి.
డామ్ కూలుతుందో లేదో దేవుడి కెరుక. ఇప్పుడు తమిళనాడుని ఎదిరించకపోతే తమ
ఆబోరు దక్కదు. పైగా పాపులారిటీకి ఇది దగ్గర తోవ. నా బాధ ఇది కాదు. మొన్నటికి
మొన్న మన అన్నగారు -ఎన్టీరామారావుగారు -తనని పెంచి పెద్ద చేసిన రాష్ట్రానికి
కృతజ్ఞతగా ఉదారంగా తెలుగుగంగని తమిళ రాష్ట్రానికి సమర్పించారు. 116
సంవత్సరాల క్రితం బ్రిటిష్ ప్రభుత్వమూ అలాంటి పనేచేసింది. రేపు -అంటే మరో
పాతిక సంవత్సరాలకి మన పరిస్థితీ కేరళ తంతులోనే ఉంటుందని! డామ్ కూలితే
కోట్లాదిమందికి ప్రాణ నష్టమని కేరళ భయం. తమకి వనరులు దెబ్బతింటాయని తమిళనాడు
బాధ. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం. తమిళనాడులో కాంగ్రెసేతర ప్రభుత్వం.
మనదేశంలో ఎప్పుడూ మైనారిటీదలే పై చెయ్యి. మాయావతి, మమతా బెనర్జీ, జయలలిత -కేంద్రాన్ని
ముక్కుపిండి తమ ఆటని చెల్లించుకోవడమే ఇందుకు నిదర్శనం. కేంద్రం, సుప్రీం
కోర్టూ, నిపుణుల సంఘాలూ జుత్తులు పీక్కొంటున్నాయి. ఎవరు ఏం చేసినా మా
ఎదురింటాయనదే అంతిమ విజయం -నాకు తెలుసు.
డిసెంబర్ 19, 2011 ************ ************ ************* ************* Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com Read all the columns from Gollapudi గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి |