Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

హిరణ్యకశిపుడి భయం
గొల్లపూడి మారుతీరావు

gmrsivani@gmail.com 

           మొన్న సోమవారంనాడు కోపెన్ హాగన్ లో ప్రారంభమయిన ప్రపంచ రాజ్యాల సమావేశం- గొప్ప చరిత్ర.. 110 దేశాల నాయకులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇది చరిత్ర అనడానికి కారణం- ఈ ఈ దేశాలు సాధించిన ఘనకీర్తి కాదు.  ఈ దేశాలు ఈ భూగోళాన్ని తగలెట్టడానికి ఇన్ని సంవత్సరాలూ చేసిన నిర్వాకం.

          తాము ఏ పని చెయ్యడం వల్ల  అచిరకాలంలో ఈ భూగోళం సర్వనాశనం కాబోతోందో అర్ధం చేసుకుని- ఏదో ఒకటి చెయ్యక పోతే పుట్టె మునుగుతుందన్న భయానికి కార్యరూపం ఈ చరిత్ర.

          పక్కవాడి మంచితనమూ నిన్ను బాగుచేస్తుంది. పక్కవాడి దుర్మార్గమూ నిన్ను హింసిస్తుందని ఏనాడో సుమతీ శతకకారుడు చెప్పిన నిజాన్ని ఈ దేశాలు అర్ధం చేసుకోడానికి ఇంతకాలం పట్టింది. అజ్ణానం అనర్ధమే. కాని సామూహికమైన అజ్ణానం కూడా ఒక్కొక్కప్పుడు కోపెన్ హాగన్ లాగ చూడముచ్చటగా వుంటుంది.

          ఇక్కడో వింత. వివిధ దేశాల పారిశ్రామిక, ఆధునిక, సాంకేతిక ప్రయోజనాలకు ప్రకృతిని లొంగ దీసే కృషిలో బొగ్గుపులుసువాయువు పెచ్చురేగుతుందనీ, తద్వారా వాతావరణం వేడేక్కుతుందనీ, ధృవాలలో మంచు కరుగుతుందనీ, సముద్ర మట్టాలు పెరుగుతాయనీ, త్సునామీలు పెచ్చురేగుతాయనీ, భూకంపాలు,ఉప్పెనలూ ముంచుకు వస్తాయనీ, భౌగోళికమైన ఎల్లలే మారిపోతాయనీ- యిన్ని నిజాలని గ్రహించిన పెద్దలు ఇక్కడ సమావేశమయారు. అయితే ఈ 110 దేశాల ప్రతినిధులు వచ్చిన 1200 లిమో కార్లు, 140 విమానాలు 50 మైళ్ళ చదరపు విస్తీర్ణంలో చెలరేగే బొగ్గుపులుసువాయువుని ఉత్పన్నం  చేస్తుందట.

          వెనకటికి అనాధ శరణాలయానికి సహాయం చెయ్యమని ఒకాయన ఉత్తరం రాస్తే-యిద్దరు అనాధల్ని పంపాడట ఓ పెద్దమనిషి. అక్కడ మాలేలో సముద్ర మట్టం కింద, ఇటు నేపాలులో హిమాలయ శ్రేణుల దగ్గర లాంఛనంగా మంత్రివర్గ సమావేశాలు జరిపి మానవుడు చేసిన తప్పిదాలను ఎలా సవరించుకోవాలా అని చర్చించారుకాని-కోపెన్ హాగన్ కి మన్మోహన్ సింగ్ గారు సైకిలు రిక్షా మీద, ఒబామాగారు సైకిలు తొక్కుకుంటూ వచ్చివుంటే- ఆ లాంఛనం కూడా చూడముచ్చటగా వుండేది. అయితే 110 దేశాలలో సమష్టిగా ఇంత విజ్ణతని ఆశించడం దురాశ!

          సరే. ఈ కోపెన్ హాగెన్ సమావేశానికి మూలస్థంభాలేమిటి? అభివృద్ధి పేరిట, అభ్యుదయం పేరిట, విజ్ణానం పేరిట ఈ భూగోళాన్ని దోచుకుంటున్నామని అందరికీ ఏకాభిప్రాయం కలగడం.డబ్బున్నవాడు ఎక్కువ దోచుకుంటూండగా అంతగా డబ్బు లేనివాడు దోచుకోడాన్ని ఆక్షేపిస్తున్నాడని తెలుసుకోవడం. ఇలా దోపిడీకొనసాగితే అది మాల్టా అయినా, మాల్దీవులయినా అంతా మూక ఉమ్మడిగా నాశనమవుతారనే నమ్మకం కలగడం. అయితే ఈ నాశనాన్ని ఆపడానికి ఎవరు ఎంతెంత ఏమేం చెయ్యాలో తేల్చుకోవడానికి ఈ సమావేశం.

          మేన్ ఫ్రైడే అనే సినీమాలో ఒక దీవిలో ఏకాకిగా మిగిలిపోతాడు ఓ కోటీశ్వరుడు తన ఓడ పగిలిపోగా. సముద్రంలో పడవ మునిగి ఓ నల్లటివాడు ఆ దీవికి కొట్టుకొస్తాడు. వాడిమీద తుపాకీ ఎక్కుపెట్టి నేను నీ యజమానిని అంటాడు దొర. నల్లవాడు తెల్లబోయి ఎందుకని?అంటాడు. తెల్లదొర నవ్వి నా దగ్గర తుపాకీ వుంది. నిన్ను చంపగలను.అందుకని అంటాడు.

          ప్రస్థుతం ఒబామాగారు, గార్డెన్ బ్రౌన్ గారూ (ఇది రంగుల కధకాదు- గమనించాలి)వంటి పెద్దలు అలాంటి కబుర్లే చెప్పబోతున్నారు.స్థూలంగా భారతదేశంలో ఒక్కో మనిషి వాడే సహజ వనరులకి 15 రెట్లు అమెరికాలో, 13 రెట్లు యూరోపులో, 12 రెట్లు జపాన్ లో కొల్లగొడుతున్నారు. అయితే ఒద్దికచెయ్యాల్సింది ముందు భారతదేశం,చైనాలేనని ఈ పెద్దలు అంటున్నారు. కారణం- దొర చేతిలో తుపాకీ.

          ప్రపంచంలో దేన్నయినా జయించవచ్చుకాని మనిషి స్వార్ధాన్ని జయించలేం. ఆ స్వార్ధానికి సమర్ధించుకునే తెలివి, సమర్ధనని చెల్లుబాటు చేసుకునే బలమూ వుంటే- దాన్ని రాక్షసత్వంఅంటాం. ఇది ప్రతీ మానవుడిలో నిక్షిప్తంగా వుండే గుణం. సంస్కారం, సంస్కృతీ,పుట్టుక, మతం, చింతన- మనిషిని క్రమంగా ఈ రాక్షసత్వం నుంచి విముక్తం చేస్తాయి. ఇంత గొప్ప పని దోపిడీని భేషరతుగా జరిపే 110 దేశాల సమావేశం సాదించగలదనుకోవడం దురాశ. ఎవరి దోపిడీని వారు కాపాడుకోడానికి వారు ఎత్తులు వేస్తారు. దీన్నే దౌత్యమంటారు. గతిలేని చిన్న దేశాలు తలలూపుతాయి. చెల్లుబాటయిన పెద్ద దేశాలు రహస్యంగా నవ్వుకుంటాయి.

          ఇంత వివరంగా ఈ కాలమ్ రాస్తున్నప్పుడు ఈ రచయిత బొత్తిగా నిరాశావాదిగా తమకు కనిపించవచ్చు. కాని ఎవరయినా, ఎప్పుడయినా చూడగలిగితే- వేలాది సంవత్సరాలు ఈ భారతీయ వ్యవస్థ ఈ సమస్య ప్రసక్తే లేని ప్రశాంత జీవనం గడిపింది.

          మనిషి తనకి కావల్సింది మాత్రమే ప్రకృతినుంచి తీసుకుని, ప్రకృతి నియతిని బెల్లించకుండా తన జీవనాన్ని గడిపి, సుసంపన్నం చేసిన ఈ ప్రకృతి వైభవాన్ని కృతజ్ణతతో తరతరాలుగా- ముందు తరాలవారికి అందిస్తూ శలవు తీసుకుంటూనే వున్నాడు భారతదేశంలో ఇంతవరకూ.

          ఈ అద్భుతమైన నియతికి కారణం తెలియకపోయినా ఆచరించిన వ్యక్తి మామూలు రైతు కావచ్చు. కారణం తెలిసి, ఆచరణలో ఆదర్శంగా నిలిచిన రుషి కావచ్చు.

          ఈ దేశంలో చాలుఅనుకోవడం సంస్కారం. కావలసిందే తీసుకోవడం-సంపద. అవసరం లేని దాన్ని దూరంగానే వుంచడం వైభవం. ఈ పనిని- ఏ తెలివి తేటలూ లేని జంతువులు- ఇప్పటికీ అడవుల్లో చేస్తున్నాయి. మన intellect కన్నా వాటి instinct గొప్పది. ఒకప్పుడు అది మనకీ ఉండేది. కాని మనం చదువుకున్నాం. జంతువులు చదువుకోలేదు. కనుక వాటికి మిగిలింది. మనకి పోయింది. విచిత్రం. Eco systems ని కాపాడాలని వాటి కెవ్వరూ నేర్పలేదు. కాపాడుకోకపోతే సర్వనాసనమైపోతామని  మనం తెలుసుకోడానికి ఇంతకాలం పట్టింది.

          మానవుడు తెలివి మీరాడు. తెలివి అక్కరలేని అవసరాన్ని పెంచింది. అవకాశాల ద్వారాలను తెరిచింది. స్వార్ధం ఎల్లలను చెరిపేసింది. బుకాయింపుకీ, హక్కుకీ, బడుగుతనానికీ, దోపిడీకీ- అన్నిటికీ ఒకే సూత్రాన్ని బిగించుకున్నాడు మానవుడు. తత్కారణంగా ఎంతవరకూ ప్రయాణం చేశాడు?- కోపెన్ హాగన్ దాకా.

                                          (ఆంధ్రప్రభ సౌజన్యంతో)                 

                                                             డిసెంబర్ 14, 2009

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage