స్వేఛ్చ
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

    'స్వేచ్ఛ' అన్నది చాలా దుర్మార్గమైన విషయం. వివరించడానికి వీలులేనిదీను. ఎంత స్వేచ్ఛ? దేనికన్న స్వేచ్ఛ? ఎంతవరకూ స్వేచ్ఛ? ఎందుకు స్వేచ్ఛ -యిలా బోలెడన్ని మీమాంసలు.
ప్రజాస్వామ్యంలో మరో దుర్మార్గం ఉంది. దాని పేరు స్వేచ్ఛ. ఎవరికి వారు ఎవరి కిష్టమయింది, ఎవరికి సాధ్యమయింది చేసుకోవచ్చును. ఎంతవరకు? మిన్ను విరిగి మీదపడే వరకూనా? మూతిపళ్లు రాలే వరకూనా? మీదపడే దురవస్థల్ని ఎలా అరికట్టాలో తెలీక గింజుకునే వరకూనా?
రాజకీయ నాయకుడు మాట్లాడితే -దాని అర్థం -అతని పదవి మేరకు, పార్టీ మేరకు, పాలన మేరకు, ఆ పార్టీ పరపతి మేరకు మారిపోతుంది. ఇది ప్రజాస్వామ్యంలో మరో దుర్మార్గం. ''మీరంతా మంచిగా ఉండాలి బాబూ!'' అని కాంగ్రెస్‌ నాయకుడు అన్నాడనుకోండి. ''మా మంచిని మీరేం చెప్పనక్కరలేదు. ముందు మీ చిదంబరం మంచినీ, ఎస్‌.ఎం.కృష్ణ మంచినీ, సురేష్‌ కల్మాడీ మంచినీ చూసుకోండి'' అని స్పందన వినిపిస్తుంది. బి.జె.పి. నాయకుడు అన్నాడనుకోండి. ''ముందు మీ నరేంద్ర మోడీ జరిపించిన హత్యలూ, యెడ్యూరప్ప అవినీతి సంగతి చూసుకోండి'' అంటే తీరిపోతుంది.
బి.జె.పి. కోణంలో రాముని ప్రసక్తి మత ఛాందసుల ఆకతాయితనం. కాంగ్రెస్‌ కోణంలో రాముడి ప్రసక్తి వాచాలత్వం. కమ్యూనిస్టులకి ఆ గొడవ లేదు. మరో పార్టీల వాళ్లకి రామునితో ప్రమేయం లేదు.
దేశంలో అవినీతి గురించి మాట్లాడిన అన్నా హజారే మీదా, ఆయన అనుయాయుల మీదా అన్ని వేపులనుంచీ తలో రాయి పడింది. ఓ లాయర్‌ గారిని సుప్రీం కోర్టు ఆవరణలోనే చావగొట్టారు. ఒకావిడమీద అవినీతి కేసు బనాయించారు. మరొకాయన్ని గవర్నమెంటు ఉద్యోగం ముగ్గులోకి లాగారు. ఆయన ఆశించిన మంచిని అందరూ మరిచిపోయి -చెప్పే వ్యక్తిని భ్రష్టు పట్టించేదాకా ఆయా వర్గాలు నిద్రపోలేదు. 'కలిసి ఉండండి బాబూ' అని సత్యసాయి బాబాగారంటే హైదరాబాద్‌లో తిట్టారు. 'మమ్మల్ని విడిపోనియ్యండి బాబూ' అని హైదరాబాద్‌లో అంటే విశాఖలో రాళ్లేశారు. అఫ్జల్‌గురుని ఉరితీయడం న్యాయం అని కోర్టు ఆదేశిస్తే కాశ్మీర్‌లో కాలుదువ్వారు. రాజీవ్‌గాంధీ హంతకుల్ని శిక్షించడం సబబు అంటే తమిళనాడులో కత్తులు దూశారు.
అభిప్రాయాలకీ, దురభిప్రాయాలకీ, నమ్మకాలకీ, అపనమ్మకాలకీ, నీతికీ, ధర్మానికీ, నేరాలకీ, రంకుకీ, బొంకుకీ, అసభ్యానికీ, అవినీతికీ అన్నిటికీ పార్టీల, పదవుల, మంత్రుల, ప్రాంతాల వారి వారి ప్రయోజనాల, లక్ష్యాల, ఆదర్శాల ముసుగులున్నాయి.
ఆ మధ్య టీవీల్లో బొత్తిగా బొడ్డూడని పిల్లలు బొత్తిగా వాళ్లకి అర్థంకాని పాటలకి శృంగార నృత్యాలు చేయడం, పెద్దలు వాటిని చూస్తూ మురిసిపోవడం చూశాను. కొందరు పెద్దలు బాధపడడమూ, ఈసడించుకోవడమూ విన్నాను. ఈ మధ్య అలాంటివి తారసపడలేదు. పిల్లల మీద క్రూరత్వం పనికిరాదు అన్న చట్టం వల్ల ఈ రకం కార్యక్రమాలు నిలిచిపోయాయని ఒకాయన చెప్పారు. ఎంత బాగుంది? అనిపించింది. పది రాగాల్ని గుర్తుపట్టే ఓ బిడ్డ ప్రతిభ, పది పద్యాల్ని చదివే ఓ పాప ధారణ, పది విషయాల గురించి అనర్గళంగా మాట్లాడగల ఓ పసివాడి ప్రతిభ ముచ్చటగా ఉంటాయి.
అయితే మీడియాకు స్వేచ్ఛ ఉంది. సినిమాలకు స్వేచ్ఛ ఉంది. 'డర్టీ సినిమా'లు తీయడం వారి హక్కు. ఈ దేశంలో పదవులకి స్వేచ్ఛ ఉంది. అవినీతికి స్వేచ్ఛ ఉంది. మన ఆర్థికమంత్రి చిదంబరంగారి అవినీతి గురించి ప్రజా ఉద్యమం రాదేం? బయటపడేవరకూ అది వ్యక్తి స్వేచ్ఛ. ఆ తరువాతే అవినీతి. అప్పటికి సుఖ్‌రాంగారి లాగ ఏ పదహారేళ్లో గడిచిపోతాయి. అప్పుడు వృద్ధాప్యం ఆదుకుంటుంది.
నేను కంప్యూటర్‌ వ్యసనపరుడిని. అది లేనిదే బ్రతకలేనంత అలవాటు. అందులో వెర్రితలలు, అనవసరంగా ఊసుపోని, ఆకతాయి, అర్థంలేని కువాదాలు, సెక్స్‌ వ్యవహారాలు -ఒకటేమిటి? విశృంఖలత్వం కనిపిస్తుంది. వ్యాపారాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికన్‌ గూగుల్‌ దీన్ని స్వేచ్ఛ అనవచ్చు. 'స్వేచ్ఛ' సాకుగా చెల్లే మన దేశం ఇందుకు భుజాలు ఎగరవేయవచ్చు. కాని చైనా గూగుల్‌ మీద కత్తికట్టింది. గూగుల్‌ తలవొంచింది.
ఈ మధ్య టీవీలో ప్రతి ప్రోగ్రాం కింద ఒక ప్రకటన కనిపిస్తోంది. 'ఈ కార్యక్రమంలో ఏమైనా అభ్యంతరాలుంటే ఫలానా వారికి తెలియజేయండి' అని. ఒక్కరూ ఆ పని చేసి వుంటారనుకోను. మనది స్వేచ్ఛను అనుభవించే దేశం. అలాంటి ఫలానా నిజాయితీపరులు మనకి అనవసరం.
ఇలాంటి విశృంఖలత్వం మంచిది కాదని ఈ మధ్య ఓ కాంగ్రెస్‌ మంత్రి కపిల్‌ సిబల్‌ అన్నారు. దురదృష్టం. ఆయన కాంగ్రెస్‌వాడు. పైగా మంత్రి. ఆయన మాటకు విలువ పోయింది. ఆ మాటకొస్తే ఈ దేశంలో అన్నా హజారేకే దిక్కులేదు. మన దేశంలో పత్రికా స్వేచ్ఛ మాధ్యమం హక్కు. ఇలా మాట్లాడడంలో ఏదైనా దురుద్ధేశం ఉన్నదేమో! లేకపోతే కాంగ్రెస్‌ వారెందుకు మాట్లాడతారు? ఉన్నా కాదనే ఆ కీర్తి వారికెందుకు దక్కాలి? ఇది ప్రస్థుతం నిజమే అయినా ఇప్పుడు తలవొంచితే రేపు మననెత్తిన ఎక్కుతారేమో! మా ఇంట్లో మేం 'అశుద్ధం' పోగుచేసుకుంటాం. మీకది అభ్యంతరంగా కనిపించవచ్చు. కాని మాకది అమృతభాండం. దీన్నే మేం 'స్వేచ్ఛ అంటాం. అంటూ చాలామంది మేధావులయిన మాధ్యమాల ప్రతినిధులు స్పందించారు.
ఎవరూ ఈ ఇంటర్నెట్‌ వికారాల గురించి స్పందించలేదు. ఈ దేశంలో -ఆ మాటకొస్తే ఏ దేశంలోనయినా -ఒక్క 'మతమే' ఆ పనిని నిర్ధుష్టంగా చెయ్యగలిగింది. ఇస్లాం. గత ఇరవై యేళ్ళుగా కాశ్మీర్‌లో సినిమాలు నడవడం లేదు. ఈ మాధ్యమాల స్వేచ్ఛావాదులేమయారు? ఆఫ్ఘనిస్థాన్‌లో భామియన్‌ బుద్ధుడు లేడు. చెన్నై నగరంలో అన్ని ఇళ్లనూ పడగొట్టి, మేం మా ఆవరణలోనే నిర్మించుకున్న విఘ్నేశ్వరుడి మందిరాన్ని కూల్చి రోడ్డుల్ని విస్తరించిన ప్రభుత్వం -శాంధోమ్‌లో చర్చిముందు రోడ్డుని విస్తరించలేకపోయింది. ఎందుకు? అది మతానికి సంబంధించిన విషయం. మన రాముడు డెమొక్రాట్‌. ఆయన మీద అందరూ రాళ్లేయవచ్చు. దానికో పేరుంది. దాని పేరు స్వేచ్ఛ.

 

                                                డిసెంబర్ 12, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage