Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here
 
 

రామ్ తెరీ గంగా మైలీ

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com
 


సుప్రీం కోర్టు న్యాయమూర్తులు మొన్న మన పాలక వ్యవస్థకి మంచి కితాబునిచ్చారు. గత ముప్పై సంవత్సరాలలో గంగానదిలో పేరుకున్న కాలుష్యం కన్న దరిద్రమయిన స్థాయిలో దేశంలో అవినీతి ఉన్నదని.
మనదేశం ప్రజాస్వామిక దేశం అంటూ మన నాయకులు చంకలు గుద్దుకుంటూ ఉంటారు. అంటే ప్రజలు ఎంపిక చేసిన నాయకులు పాలించాలని. కాని ఈ మధ్య ఏ నాయకులూ ఏ అవినీతిమీదా నిర్ణయాలు తీసుకోవడం లేదు. శిక్షలు విధించడం లేదు. ఎవరా నిర్ణయాలు తీసుకుంటూన్నారు? సుప్రీంకోర్టు. నిజానికి ముఖ్యమైన నిర్ణయలన్నీ సుప్రీం కోర్టు తీసుకుంటోంది ఇటీవల.
ఎదురు తిరిగిన పదమూడు మంది సభ్యులమీదా (కర్ణాటకలో) సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోకపోతే ఇవాళ కర్ణాటకలో ప్రభుత్వం ఉండేదా? ఏ.రాజా గారు అవినీతి కుంభకోణం జరిపారు. ప్రభుత్వం చర్య తీసుకోవాలి కదా? సురేష్ కల్మాడీ గారు కోట్లు దోచుకున్నారు. ప్రభుత్వం నోరిప్పాలి కదా? ఆయనతో పనిచేసిన వాళ్ళందరూ జైల్లో ఉంటే ఆయనమాత్రం చైనా మొనాకోలలో తిరుగుతున్నాడేం? ఆయన్ని కనీసం బర్త్ రఫ్ చెయ్యాలి కదా? యెడ్యూరప్ప కుంభకోణం వుంది? ఆ పార్టీ మాట్లాడదేం? ప్రతీ పార్టీ నాయకుడికీ నన్ను ముట్టుకోకు అనే ముసుగు కావాలి. అందరూ - ఆఖరికి సుప్రీం కోర్టుకి ఆ పగ్గాలు వదిలేశారు. అది డిఫాక్టో పాలనా సంస్థ అయి - ప్రతీ కుంభకోణం, ప్రతీ నియామకం (పి.జె.థామస్) నూ నెత్తిన వేసుకోవాల్సి న స్థితి వచ్చింది. రాను రాను సిబిఐ మీదా, ఈ చాకిరీ చెయ్యాల్సిన విజిలెన్స్ కమిషన్ మీదా ప్రజలకీ , మిగతా పార్టీలకీ నమ్మకాలు పోయాయి.
టూ- జీ స్పెక్ట్రమ్ టెండర్ల గడువుని హఠాత్తుగా మార్చి కేవలం నలభై అయిదు నిముషాలు మాత్రమే ఇచ్చారట. విశేషమేమంటే ఆ గడువులోనే చాలా సంస్థలు దరఖాస్తులు పెట్టగలిగాయి. ఇది గొప్ప విడ్డూరమని న్యాయమూర్తులు ముక్కుమీద వేలేసుకున్నారు. ఆ వేలు మన ఘనత వహించిన ప్రధాన మంత్రి, నిజాయితీ పరుడు , సత్య సంధుడు ఏ నాడో వేసుకుని ఉండాలి కదా? ఇంత స్పష్టమైన అరాచకం తెలియకుండా , పోనీ, కప్పిపుచ్చడంలో ప్రభుత్వమ్ ఆంతర్యమేమిటి?
జరిగిన అవినీతిని పరిశీలించడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేసి తీరాల్సిందేనని గత పదహారు రోజులుగా ప్రతిపక్షాలు పార్లమెంటుని స్తంభింపచేశాయి. తమ పరిధిలో ఏ రకమైన అవినీతీ లేదని బల్లగుద్దే ప్రభుత్వం సుప్రీం కోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపిస్తానంటుందేకాని జేపీసీకి ఎందుకు ఒప్పుకోదు? ఏ లొసుగూ లేకపోతే ఇంతపట్టింపు ఎందుకు? అంటే దొంగలు కొల్లగొట్టిన మూటని అందరూ పంచుకున్నారనేగా అర్థం? పార్లమెంటుకి గంటకి ఇరవై వేలరూపాయల ఖర్చు. ఇప్పటికి విలువైన కాలం ఎలాగూ పోగా ఇప్పటికే ప్రజలసొమ్ము, నాలుగున్నర కోట్ల సొమ్ము గంగపాలయింది. చర్చించాల్సిన బిల్లులన్నీ అలాగే పడిఉన్నాయి. ఘనత వహించిన నిజాయితీ పరులందరికీ ఈ విషయం తెలీదా?
నాకు అర్థం కాని విషయం ఒకటుంది. నీ మొహం ఎందుకిలా ఏడిసింది? అని నిలదీస్తే చాలా గర్వంగా, ఆవేశంగా , మాయాబజార్ లో సి.ఎస్.ఆర్ కంటే గొప్పగా సిగ్గులేకుండా మొన్న తమ మొహం ఇంతకంటే ఎల చచ్చింది? అనడం తరచు వినిపించే వాదన. టూ-జీ కుంభకోణం గురించి తేల్చమని భారతీయ జనతా పార్టీ అంటే ముందు యెడ్యూరప్ప సంగతి తేల్చికోమని కాంగ్రెస్ అంటుంది. పి.జె.థామస్ సంగతేమిటని అంటే అల్లప్పుడు డబ్బు పుచ్చుకుంటూ దొరికిన మీ బంగారు లక్ష్మణ్ విషయంలో మీరేం పీకారు? అంటూంది కాంగ్రెస్.
ప్రస్థుతం ఎవరి అవినీతి వల్ల తక్కువహాని కలిగిందో వారితో సరిపెట్టుకోవలసిన నిస్సహాయ స్థితిలో ఎన్నిక చేసిన పౌరుడు ఉన్నాడు. బాచా బూచులలో ఏ బూచి వల్ల ఎంత తక్కువ నష్టమో ప్రతీ ఎన్నికలో తేల్చుకోవాల్సిన స్థితిలో ప్రజలున్నారు.
అన్నట్టు థామస్ గారి కథ మరింత విపులంగా చెప్పుకోవాల్సి ఉంది. దేశంలో ఇలాంటి కుంభకోణాలను దర్యాప్తు చేయించాల్సిన అత్యుత్తమ పరిశీలక వ్యవస్థ -ఛీఫ్ విజిలెన్స్ కమిషన్ - మరో కారణానికి గబ్బు పట్టింది. లోగడ టూ-జీ కుంభకోణంతోనే ప్రమేయం ఉండి, తనమీద రకరకాల (ఇంకా నిరూపణ కాని) కేసులున్న ఓ అధికారిని - పి.జె.థామస్ ని - తన్ని నియమించాల్సిన కమిటీలో ఉన్న ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ అభ్యంతర పరుస్తున్నా నియమించింది కేంద్రం. దేశంలో అవినీతిని ప్రక్షాళనం చెయ్యడానికే నిర్దేశించిన ఈ కమిషన్ అధిపతి - ఛీఫ్ ఎలక్షన్ కమీషనర్ లాగే రాజ్యాంగ పరమైన స్థాయిలో నియమితమయే ఏకైక ఆఫీసరు. తమ లొసుగుల్ని కప్పిపుచ్చుకోడానికి ఆ పాపంలో పాలున్న ఒక ఆఫీసరు గారిని తీసుకొచ్చి - ఎవరు కాదంటున్నా కుర్చీలో కూర్చోబెట్టిన ఘనత కేంద్రానిది. అంటే దొంగకి తాళం చెవులు ఇచ్చినట్టు. ఈయన ఇప్పుడు ఫలానా టూ-జీ స్పెక్ట్రం మీద విచారణ జరపాల్సిన సీబీఐ డైరెక్టర్ ని నియమించారు. ప్రతిపక్షాలన్నీ వత్తిడి తీసుకురాగా - పోనీ టూ-జీ స్పెక్ట్రం వ్యవహారంలో మాత్రం ఆయన కల్పించుకోరని కేంద్రం చిన్న మినహాయింపు ఇచ్చింది. మరి తమలో ఏమీ అవినీతి లేదని చెప్పే ప్రభుత్వం ఈ వెసులుబాటునయినా ఎందుకు కల్పించాలి? జెపిసి లాగే ఎందుకు బిగుసుకోలేదు? ఈ మినహాయింపులోనే ఆయన వాటా పాపం అర్థమౌతోంది కదా?
ఇక రాష్ట్రాలలో కాంగ్రెస్ భాగోతం. ప్రతీ ఎన్నిక తర్వాత ఢిల్లీ పెద్దలు, ఆయా అసెంబ్లీల సభ్యులు కలిసి తుది నిర్ణయం సోనియా గాంధీకి అప్పగిస్తారు. వారు తమకు నచ్చిన నాయకుడి పేరుని వెల్లడిస్తారు. మహారాష్ట్రలో నయినా, ఆంధ్రాలో అయినా, మరెక్కడయినా ఇదే తంతు. ఒక నాయకురాలు తన నిర్ణయాన్ని ఎన్నికయిన సభ్యులమీద రుద్దడం ఏ రకమయిన ప్రజాస్వామ్యం? న్యాయంగా సభ్యులంతా కలిసి నాయకుడిని ఎన్నుకోవాలి కదా? విధేయత వ్యక్తిస్వేఛ్చని ఉరితీసి నిరంకుశత్వానికి ప్రజాస్వామ్యమనే దొంగపేరు పెట్టిన దయనీయమయిన అరాచకం ఇది.
అయ్యా. తవ్విన కొద్దీ రకరకాల పందికొక్కులు బయటపడి - నిర్వీర్యత, నిస్పృహ ప్రజల్లో పెరుగుతోంది. ఈ వాతావరణం గత ముప్పై సంవత్సరాలలో మరింత బలపడింది. ఈ పాపాలన్నిటినీ తమవి కాకపోయినా ప్రతీక్షణం నెత్తిన వేసుకు మోస్తున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు గంగానదిలో పేరుకుపోయిన కుళ్ళును మరిపించే దుర్గంధం ముక్కుపుటాలను బద్దలుకొడితే ఆశ్చర్యం లేదు. మన ముక్కులు ఈ దుర్గంధానికి అలవాటుపడిపోయి దానికి దూరంగా ఉండే రకరకాల ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటున్నాం. కాని నమ్మడానికి కూడా వీలులేని, బోరవిరుచుకు చేసే అవినీతి భాగోతాల దుర్గంధానికి ఇంకా అలవాటు పడని ముక్కులు కొన్ని ఉన్నాయి. వాటి అనుభవసారమే ప్రస్తుతం మనం విన్నది.

***
డిసెంబర్ 06, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage