ఒక 'ఏడుపు ' కథ
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

   ప్రజాస్వామిక వ్యవస్థ బలం నాయకత్వం. ఒకనాటి నాయకత్వం ఆ నిజాన్ని నిరూపించింది. జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభాయ్‌ పటేల్‌, మౌలానా అజాద్‌, గోవింద వల్లభ్‌పంత్‌, టంగుటూరి ప్రకాశం, భోగరాజు పట్టాభి సీతారామయ్య -యిలాగ. వీళ్లకి మద్దతుగా బ్రిటిష్‌ పాలన ఇచ్చిపోయిన మరొక గొప్ప వ్యవస్థ దన్నుగా నిలిచింది. అది సివిల్‌ సర్వీస్‌. ఒకనాటి జె.పి.ఎల్‌.గ్విన్‌, హెచ్‌.వి.ఆర్‌.అయ్యంగార్‌, కె.నట్వర్‌సింగ్‌, యశ్వంత్‌సిన్హా ఈ వ్యవస్థకి స్థాళీపులాక న్యాయంగా ఉదాహరణలు.
'మెజారిటీ' పెట్టుబడిగా ప్రజాస్వామిక వ్యవస్థ ఏనాడైతే దిగజారిందో పాలన రూపు రేఖలు మారిపోయాయి. ఆనాడు సామర్థ్యానికి మెజారిటీ దన్నుగా నిలిచింది. ఈనాడు మెజారిటీయే పదవికి దగ్గర తోవ అయింది. ఆ రోజుల్లో 'పదవి' కేవలం బాధ్యత. అలవోకగా తమ పదవులకి రాజీనామాలిచ్చిన లాల్‌ బహదూర్‌ వంటి నాయకులు ఈ నిజాన్ని నిరూపిస్తారు. ఇప్పుడు పదవులే లక్ష్యం. పదవులు అధికారానికి దగ్గర తోవ. డి.పి.యాదవ్‌, గాలిసోదరులు, యెడ్యూరప్పలూ -మరెందరో ఇందుకు సాక్షులు. 'మెజారిటీ'కి మతం, కులం, డబ్బు, గూండాయిజం, ప్రాంతీయవాదం, ఇంకా కుటుంబ తత్వం -యివన్నీ సాధనాలయాయి. పైగా ఇవన్నీ తమ హక్కులుగా రెచ్చిపోవడం ఈనాటి గొప్పతనం, గొప్ప ఆయుధం.
రాజీవ్‌గాంధీని చంపిన శివరాసన్‌ ఒక అమర వీరుడుగా ఊరేగింపులు, అఫ్జల్‌గురు నిరపరాధి అంటూ అసెంబ్లీలలో రెచ్చిపోయిన మతవాదులు, తమిళనాడులో కొడుకులు, కూతుళ్లూ, మేనల్లుళ్లూ -పదవుల్ని పంచుకున్న ఓ ముసలి నాయకత్వం -ఇవన్నీ ఈనాటి ధోరణులకు మచ్చుతునకలు.
ఈ ధోరణులకు గొంతు విప్పే తొలి రోజుల్లో కూడా -ఇంకా ఇంకా ఈ వ్యవస్థకి, ఈ దేశ పాలనకి గొడుగుపట్టే పటిష్టమైన శ్రేణి ఉండేది. అది మళ్లీ ఐఏఎస్‌ల శ్రేణ. ఆనాటి నాయకుల వెర్రితలల్ని తట్టుకుంటూనే పాలనని సజావుగా నడిపిన దక్షులయిన ఐఎఎస్‌లతో నాకు ప్రత్యక్ష పరిచయాలున్నాయి. బి.కె.రావు, వి.పి.రామారావు, నరేంద్ర లూధర్‌, బి.పి.ఆర్‌.విఠల్‌, సి.ఎస్‌.రావు ఇవి నమూనా ఉదాహరణలు. తన పదవి బలం, పదవి లక్ష్యం ఎరిగి, రాజకీయ వ్యవస్థని ఆసేతు హిమాచలం గడగడలాడించిన ఒక క్రమశిక్షణతో ఎన్నికలను నిర్వహించిన ఐఎఎస్‌ అధికారి టి.ఎన్‌.శేషన్‌ని ఈ తరం ఇప్పటికీ మరిచిపోదు. అంతకుముందూ, ఆ తర్వాతా ఆ పదవి గురించి కానీ, ఆ బాధ్యత గురించి కానీ మనం వినలేదు.
ఇప్పుడిప్పుడు నాయకత్వమే డబ్బు యావ, పదవి యావలో పడిపోతున్న తరుణంలో వాళ్లకు తాళం వేసే శ్రేణులుగా ఐఎఎస్‌ మిగులుతోంది. ఇది అందర్నీ ఒకతాటిని కట్టే విమర్శ కాదు. ఇప్పుడు మనం వింటున్న అవినీతులూ -వాటిలో ఈనాటి ఐఎఎస్‌ల వాటాలూ -తల్లి రంకు తెలిసినప్పుడు కొడుకు మనస్సు ఛిద్రమయినట్టు మాతరానికి అనిపిస్తుంది. ఇంతకంటే క్రూరమైన ఉదాహరణ చెప్పలేను.
కులం వెనుక కుత్సితాలకు పాల్పడిన ఐఎఎస్‌లు నాకు తెలుసు. డబ్బుకోసం పదవిని తాకట్టుపెట్టిన ఆఫీసర్ల బాగోతాలను మనం ప్రతిరోజూ పేపర్లలో చూస్తున్నాం. గనుల కుంభకోణంలో 68.5 హెక్టార్ల భూమిని ఓబుళాపురంలో కట్టబెట్టిన ఓ మహిళా ఐఎఎస్‌ అధికారి ఏడుస్తూ జైలుకెళ్లిన బాగోతం మనం చూశాం. ఈ సంఘటన ఈ రాష్ట్రంలో చరిత్ర -మొదటి ఐఎఎస్‌ మహిళ జైలుకి వెళ్లడం. అంతకుముందే గనుల డైరెక్టర్‌ బి.వి.రాజగోపాల్‌ జైలుకి తరలారు. ఈ మధ్య ప్రభుత్వం నిర్వహించిన సభలో పాల్గొన్నాను. అన్ని విషయాలనూ ఆకళించుకునే కీలక స్థానంలో ఉన్న ఓ చిన్న ఉద్యోగి శ్రీలక్ష్మి అహంకారాన్ని, తన అనుయాయుల పట్ల నిరంకుశ ప్రవర్తననీ గురించీ చెప్పాడు. నేను చెప్పమనలేదు.
కంచే చేనుమేసిన సందర్భమిది. తన సామర్థ్యం, ఔదార్యం, ప్రజాహితానికి తన చిత్తశుద్ధి కారణంగా ప్రజలలో తలమానికంగా నిలిచిన ప్రతిభని 'మెజారిటీ'గా ఆనాటి రాజకీయ మేధావులు రాజ్యాంగంలో గుర్తులు పెట్టారు. కాని ఇవేవీ అక్కరలేని 'మొండి', దుర్మార్గపు మెజారిటీ ఇప్పుడు కొలబద్దగా నిలిచింది. ఇప్పుడు పదవుల్లోకి వచ్చిన నాయకులు 'అవినీతి'కి తలవొంచుకోవడం ఎప్పుడో మానేశారు. తాము నిర్దోషులమన్న బుకాయింపుని ఆయుధం చేసుకున్నారు.
శ్రీలక్ష్మి మంత్రి సబితకి తన పాపంలో వాటాను పంచారు. సబిత చేసిన పని సబవుకాకపోతే, తప్పయితే -ఎత్తి చూపాల్సిన ఓ గొప్ప సివిల్‌ సర్వీస్‌ అధికారి -అరెస్టయాక ఈ విషయాన్ని సాకుగా చెప్పడం -ఆఫీసర్లలో ఎంత రాజీతత్వం,ఎంత తలవొంచే తత్వం చోటుచేసుకున్నదో అర్థమయి -నీరసమూ, నిర్వేదమూ కలుగుతుంది. శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ ఈ దేశానికి వెన్నెముకగా నిలిచే చరిత్రగల ఈ శ్రేణి ఎంత భ్రష్టుపట్టిందో చెప్తున్నారు. ఐఎఎస్‌ల ఏడుపు నేనెన్నడూ చూడలేదు. కన్నీరు స్త్రీ అబలత్వానికి చిహ్నంగా శలవు తీసుకుని చాలాకాలమైంది. ఉదాహరణ: ఇందిరాగాంధీ, జయలలిత, మాయావతి, మమతా బెనర్జీ, మార్గరెట్‌ థాచర్‌, గోల్డా మేయర్‌. కాగా కన్నీరు అవినీతికి చిహ్నం. బలహీనతకు పెట్టుబడి. నిజాయితీ ఎన్నడూ కన్నీరు పెట్టదు. ఉదాహరణ: కిరణ్‌ బేడీ, మదర్‌ థెరిస్సా ఎందరో దు:ఖార్తులను అక్కున చేర్చుకుంది. కాని ఆమె కన్నుల్లో ఎప్పుడూ కన్నీరు చూడలేదు. కరుణ వర్షిస్తుంది.
 

                                                డిసెంబర్ 5, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage