|
Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here రెడీమేడ్ జీవితాలు
ఇప్పుడిప్పుడు జీవితం మరింత సుఖవంతమయిపోయింది. మన సుఖాల్ని ఎరిగిన పెద్దలూ, మన అవసరల్ని తెలుసుకున్న నాయకులూ, మన కష్టాల్ని గుర్తించిన మంత్రులూ - జీవితం ఎన్నడూ లేనంత హాయిగా మూడు పువ్వులూ ఆరుకాయలుగా తీర్చిదిద్దుతున్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రులు మనకి తాయిలాలు ఇస్తారు. మనం చేసే ప్రతి పనికీ చిన్న 'ఎర 'ని చూపిస్తారు. ఆ పనికి మనం ఉద్యక్తులు కావడానికి అది రుచి. పోను పోనూ తాయిలాలు తగ్గిపోతాయి. నలభయ్యో ఏట మనకి ఎవరూ తాయిలాలు ఇవ్వరు నిజానికి మనం పిల్లలకి ఇచ్చే వయసది. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది? తాయిలాలు ఇస్తూనే మన శక్తి సామర్ద్యాల్ని పెంచేదారుల్ని మనకి పెద్దలు నేర్పుతారు.సామర్థ్యాన్ని, దక్షతనీ పెంచుకునే శక్తిని తల్లిదండ్రులు కల్పిస్తారు. తాయిలం ప్రోత్సాహకమే కాని లబ్దికాదు. ఊతమేకాని సిద్దికాదు. తర్వాత మనం తాయిలాల గురించి ఎదురుచూడం. వాటిని అడిగే పిల్లలకి మనం రుచిచూపుతాం. ఒకవేళ ఆ సామర్ధ్యాన్ని మనం అలవరుచుకోవాలని ఎవరూ నేర్పకపోతే? అదీ దుర్మార్గం. అదీ లోపం. ఆ పని ప్రస్తుతం మనదేశంలో జరుగుతోంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు - రెడిమేడ్ సుఖాలకు తోవలు వేస్తున్నయి. అవన్నీ గొప్ప పనులు. మీకు కలర్ టీవీలు కొని ఇస్తారు. సైకిళ్ళు ఇస్తారు. పిల్లల చదువులకి పుస్తకాలు కొని ఇస్తారు. పెళ్ళి చేసుకోవాలంటే మంగళ సూత్రాలు ఇస్తారు. పెళ్ళికాని పిల్లలకి డబ్బులిస్తారు. మీకు తక్కువ మార్కులు వచ్చినా పాసు చేస్తారు. పరీక్షలు కాన్సిలు చేస్తారు. ఉద్యోగం లెదా? లేనందుకు డబ్బులిస్తారు. మీ భర్త పోయాడా? వెయ్యి రూపాయలిస్తారు. మీకు కాలు చెయ్యి లేదా? పదిహేను వందలు. ఊరికే ఇళ్ళు కట్టించి ఇస్తారు. ఆడవాళ్ళకయితే చీరలు ఇస్తారు. లక్షల ఉద్యోగాలిస్తారు. ఇలాంటి భూతల స్వర్గాన్ని - మన పాతనాయకులు చూపలేదు. ఇలాంటి ఉపకారాలు చెయ్యాలని అప్పటి నాయకులకి తోచలేదేం? ఇప్పుడు కేంద్రం మరో పెద్ద ఉపకారం చెయ్యబోతోంది. మీకు వారు జరిపే ఉపకారం దళారుల పాలు కాకుండా సరాసరి మీకు చేరడానికి 'సరాసరి డబ్బు బదిలీ ' (డైరెక్ట్ కాష్ ట్రాన్స్ ఫర్ ) ఏర్పాటు చేస్తారు. ఆధార్ కార్డులు ఉన్నవారందరికీ ఈ ఉపకారం అందుతుంది. ఈ దేశంలో 1.2 బిలియన్ల జనాభా ఉంది. చదువురానివారు, పద్దతులు తెలియనివారు, అసలు మాట్లాడడమే తెలియని వారు, బాంకు అంటే అర్ధమే తెలియని వారు ఈ దేశంలో లక్షల మంది ఉన్నారు. వీరందరికీ కొన్ని కోట్ల బాంకు ఎక్కౌంట్లు ఏర్పరచడానికి ఎన్ని వందల బాంకులు కావాలి? ఎన్ని లక్షల సిబ్బంది కావాలి? గ్రామంలో చదువులేని సాదాసీదా మనిషికి ఈ లబ్దిని చేర్చడానికి ఈ బాంకుల్లో దళారులు ఏర్పడుతారు. దోచుకునే మనసు ఉండాలేకాని మార్గాలు బోలెడు. ఇది తెలివైన పథకం. ఢిల్లీ బాబుల ఆలోచనలో పుట్టినది కాని ఆచరణలో అనూహ్యమైంది. నా కయితే ఊహకందని విషయం. ఇక - పదవుల్లో లేని నాయకులకి అరచేతిలో స్వర్గాన్ని చూపడం సుళువు. ఇచ్చే వాడికి బాధకాని హామీలు ఇచ్చేవాడికి బాధేముంది? ఇప్పుడు పబ్బం గడుస్తుంది. రేపు పదవిలోకి వచ్చినప్పటి మాటకదా! ఎన్నిసార్లు ఏరు దాటలేదు? ఎన్ని తెప్పల్ని తగలెయ్యలేదు? కష్టపడి పనిచెయ్యడం గురించీ, చదువుకుని బాగుపడడం గురించీ, ప్రయత్నించి రాణించడాన్ని గురించీ ఎవరూ మాట్లాడినట్టు కనిపించదు. తాయిలాలు ప్రకటించడంలో నాయకులు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ప్రజలకీ ఒక విషయం అర్ధమయిపోయింది. ఓట్ల కోసం వీళ్ళది దేబిరింపు అని. వాళ్ళూ - మా సంగతేమిటని బొడ్డులో చెయ్యేసి నిలదీయడం మరిగారు. దీపముండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి? పదవికి దగ్గర తోవని వెదికే నాయకులకు - లబ్ధి పొందే ఓటర్లకీ మధ్య అనుబంధాలు, ఆత్మీయతలకీ ఆస్కారం లేదు. నిజానికి అవసరమూ లేదు. ఆనాడు గాంధీని దేశం ప్రేమించింది. మా అమ్మ విజయనగరం రాజుగారికి ఓటు వెయ్యాలనేది. ఒకటి ఔన్నత్యం, రెండోది సంప్రదాయం. ఇప్పుడు రెంటికీ స్థానం లేదు. ఓ నమునా ఉపన్యాసం: "మీ ఊరిలో నలుగువేల ఇళ్ళు కట్టిస్తాం. అందులో ప్రతీ దూలానికి బల్బు ఉంటుంది. 24 గంటలూ అందులో కరెంటు ఉంటుంది. మీ పిల్లలందరికీ బట్టలిస్తాం. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాం. అత్తారింటికి మేమె పంపిస్తాం. మొదటి పురుడు మేమే పోస్తాం. బారసాలకి అయిదువేలు. కుర్రాడికి ఉగ్గు గిన్నెలు, బొంతలూ ఉచితం. జబ్బు చేస్తే ఆసుపత్రి ఖర్చులు మావి. మీకు చేసినా మావే." నిన్నటి తరాల నాయకులకు ఇంతటి ఔదార్యం ఎందుకు లేకపోయింది? నెహ్రూగారు ఇంత ఉదారులుకారా? నీలం సంజీవరెడ్డిగారికి ఈ మాత్రం సహృదయత లేకపోయిందా? ముఖ్యకారణం - చేస్తేకాని పదవుల్లోకి రాలేని దుస్థితిలో వారు లేరు. వారి దక్షతని నిజమైన సేవతో నిరూపించుకున్నారు. తాయిలాలు ఇవ్వడం ద్వారానే ఓట్లు వస్తాయని దేబిరించాల్సిన వ్యక్తిత్వాలు కావు వారివి. దీర్ఘకాలికంగా ఈ జాతికి ఏది అవసరమో వారు ఆలోచించారు. వారు ఆలోచించగలరని ప్రజలూ గుర్తించారు . అన్నిటికన్నా ముఖ్యం - తాయిలాలు ఇస్తేకాని వోట్లు రావన్న స్థితిలో వారు లేరు. వారి హయంలోనే నాగార్జున సాగర్, భక్రానంగళ్, హీరాకుడ్ వంటి ప్రాజెక్టులు - ఈ దేశపు ఆర్ధిక స్థితినే మార్చగలిగినవి వెలిశాయి. ఈ రోజుల్లో ప్రాజెక్టులు లేవా? ఉంటే అవి పోలవరాలవుతాయి. వాన్ పిక్లవుతాయి. కొత్త దళారుల ద్వారా కాంట్రాక్టుల ఫలహారానికి ఆధారాలవుతాయి. ఎందుకంటే ఇప్పటి నాయకుల ఆయుష్హు కేవలం అయిదేళ్ళు. అప్పటి నాయకుల వయస్సు జీవితకాలం. నెహ్రూగారు మంత్రి పదవి అయాక అలహబాదులో బట్టల కొట్టుపెట్టుకోవడాన్ని మనం ఊహించలేం. జైళ్ళలో మ్రగ్గడాన్ని అస్సలు ఊహించలేము. ఈ ప్రజాస్వామ్యంలో అదనూ, అవకాశం వచ్చినప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి . వస్తువులు కొనుక్కునే స్తోమతు, ఆత్మస్థైర్యం, శక్తి ఇవ్వడానికి వ్యవధి లేదు. మేమే కలర్ టీవీలు కొనిస్తాం. జీతాలు కడతాం. తర్వాత మా గతి? అడగాలని ప్రజలకి తెలీదు. నాయకులు ఒక విధంగా పబ్బం గడుపుకుంటున్నారు. తెలివి మీరిన ఆయా వర్గాల నాయకులు మరో విధంగా వారిని బెల్లిస్తున్నారు. భవిష్యత్తు? ఎవడిక్కావాలి? భవిష్యత్తులో నిర్వీర్యమైన జాతి మిగులుతుంది. గవర్నమెంటు ఇచ్చే రాయితీల మీద బతికేవాడు - సామర్ధ్యాన్ని పెంచుకోనవసరం లేని బానిస అవుతాడు. ఇది మరో రకమైన బానిసత్వం. బ్రిటిష్ వారు మనకి అలవాటు చేసింది ఇదే! 'నువ్వు ఎందుకు పనికొస్తావో మేం నిర్ణయిస్తాం. ఏం చదవాలో మేం చెపుతాం. ఉద్యోగాలు మేం ఇస్తాం. మాకు నౌఖరీ చెయ్యి. అదేమిటో నీకు తెలియాల్సిన అవస్దరం లేదు. నువ్వు చచ్చేదాకా నీకు డబ్బిస్తా. నువ్వు చచ్చాక నీ పెళ్ళానికీ డబ్బిస్తాం '. ఇది మా అమ్మ వంటివారికి చాలా మన్నికమయిన ఏర్పాటు. మా అమ్మకి చదువులేదు. ఆమె పెట్టుబడి విశ్వాసం. 65 సంవత్సరాల పైగా మనం ఈ బానిసత్వానికి అలవాటు పడిపోయాం. ఇప్పుడెందుకూ మార్చడం? ఏతావాతా అక్షరాలు పలక మీద రాయడానికి కుర్రాడికి అప్పుడప్పుడు తాయిలాలు ఇవ్వాలి. గొర్రెల్లాగ ఓట్లు గుద్దడానికి చదువులేని పామర జనానికి తాయిలాలే లాయికీ. తాయిలాలను మరిగే జాతి తన ఆత్మగౌరవం గురించీ, సామర్ధ్యాన్ని గురించీ ఆలోచించదు. తాయిలాలు మరిగిన కుర్రాడు అక్షరాల మీద దృష్టి పెట్టడు. తండ్రి గల్లా పెట్టెమీదే దృష్టి పెడతాడు. ప్రజలు ప్రస్తుతం ఆ పనే చేస్తున్నారు.
************ ************ ************* ************* |