మనుధర్మ శాస్తం మగాళ్ళ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని మగాళ్ళకి
లాభించే ' మగ ' శాస్త్రమని ఈ మధ్య ఎవరో మహిళా రచయిత్రి అనగా విన్నాను. నాకు ఈ
విషయంలో ఏమీ సందేహం లేదు. ఆ మహిళతో నేను ఏకీభవిస్తూనే సిగ్గుపడుతున్నాను - ఇలా
ఏకపక్షంగా చట్టాల్ని చేసినందుకు. ప్రస్తుతం మనువుగారు దర్శనమిస్తే "వెధవాయా! నీ
శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని చేశాం. నోర్ముయ్" అంటాడేమో.
ఈ మధ్య ఇలాంటి మనువులు మరో మతంలోనూ ఉన్నారని తెలిసి నాకు ఆశ్చర్యమూ, కొండకచో
ఆనందమూ కలిగింది. ఆనందం ఎందుకు? చెపుతాను. ఆనందం రెండు రకాలు. మనకి గోరు చుట్టు
లేకపోతే ఆనందం. అది సబవే. కాని మనకొచ్చిన గోరు చుట్టు ప క్కవాడికీ వస్తే
అదోరకమైన ఆనందం. వాడు నీకంటే ఎక్కువ సుఖపడడం లేదులే అన్నది ఓదార్పు. అందుకే
ఇద్దరు మందు తాగేవాళ్ళూ, సిగరెట్లు కాల్చేవాళ్ళూ, జర్దాకిళ్ళీ నమిలేవాళ్ళూ
త్వరగా అతుక్కుపోతారు - టంకం వేసినట్టు. ఒకరి యాతన మరొకరికి అర్ధమౌతుంది కనుక.
అసలు విషయానికి వస్తాను. దార్ - ఉల్ -ఉలూం (దేవ్ బండ్) ఇస్లాం బోధనా శాఖ - తమ
ఫత్వా (ఆంక్షల) డిపార్టుమెంటు ద్వారా కొన్ని విలువైన, ఆసక్తికరమైన, మగవాళ్ళకి
కలసి వచ్చే వివరాలను తెలియజేసింది. ఇక్కడా కొందరు సున్నీ మనువులున్నారు.
ఒక మగధీరుడు వీరిని అడిగాడు. "అయ్యా! నేను మా ఆవిడతో కోపంగా మూడుసార్లు సెల్ఫోన్
లో 'తలాక్ ' చెప్పాను. నాకొక్కసారీ వినిపించలేదని సాక్ష్యం చెప్పడానికి అటువేపూ
ఆమె దగ్గర ఎవరూ లేరు. ఇప్పుడు చెప్పండి - నా పెళ్ళానికి నేను విడాకులు
ఇచ్చినట్టా కాదా?" అని.
సున్నీ మనువులు ఏమీ సందేహించలేదు. కుండ బద్దలు కొట్టేశారు. ఏ కారణం చేతయినా నీ
సెల్ ఫోన్ పనిచెయ్యకపోయినా, రిపేరుకి వచ్చినా - అటుపక్క వినే సెల్ ఫోన్లో
వినిపించని లోపాలున్నా - వినాల్సిన ఆ ఇల్లాలి చెవికి లోపమున్నా - తలాక్ తలాకే.
విడాకులు విడాకులే. మరి వినిపించని పెళ్ళానికి "మీ ఆయన తలాక్ అన్నాడమ్మా" అని
ఎవరు చెపుతారు? అది ఆవిడ ఖర్మ. నువ్వు చెప్పావు. అది ముఖ్యం. ఆ తర్వాత సెల్
ఫోనుల ప్రమేయం లేదు. చెవి, కంటి, గొంతు నిపుణుడు సాక్ష్యం ఇచ్చినా చెల్లదు.నీ
పెళ్ళాం పరాయి మనిషే. 'ఇద్దత్ ' గడువు మూడునెలలూ అయాక - ఆమెకిష్టమయిన మనిషిని
పెళ్ళి చేసుకోవచ్చు.
ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఈ సున్ని బోర్డు తేల్చినదేమిటంటే - షారియా (ఇస్లాం)
శాస్త్రం ప్రకారం - సరదాగా మొగుడు 'తలాక్ ' అని మూడుసార్లన్నా - పెళ్ళి
పెటాకులయినట్టే.
పాపం. ఒక మొగుడుశ్రీ ఇంటర్నెట్ లో పెళ్ళాంతో చాట్ చేస్తూ సరదాకి - కేవలం సరదాకి
'తలాక్ ' అన్న మాటని మూడు సార్లు నొక్కాడట. "బాబూ, నాకు ఇస్లాం శాస్త్రం తెలియదు.
విడాకుల చట్టాలు అసలు తెలియవు. నా పెళ్ళాంతో ఏదో నవ్వులాటకి అన్నాను. నేనూ మా
ఆవిడా హాయిగా బతుకుతున్నాం. ఆవిడతోనే జీవితాంతం జీవించాలని నా కోరిక" అని
మొరపెట్టూకున్నాడట.
దారుల్ - ఉల్ - ఉలూం సమాధానం చెప్పింది. "బాబూ! నవ్వుతూ అన్నా,
ఉద్దేశించనకపోయినా తలాక్ తలాకే. తప్పేది లేదు. శాస్త్రం తెలియకపోవడం సాకు కారాదు"
మన పెద్దలు చెపుతారు కదా? తెలియదని నిప్పు ముట్టుకుంటే కాలకుండా ఉంటుందా?
పెళ్ళిచేసుకోవాలి. అతను విడాకులిచ్చాక - మళ్ళీ మూడు నెలలు ఇద్దత్ గడువు
పూర్తయాక మొదటి భర్తని పెళ్ళి చేసుకోవచ్చు.
కనుక - నీ విడాఖుల అజ్నానమూ, సెల్ ఫోన్ల రిపేర్లూ, ఇంటర్నెట్ లో సాంకేతిక లోపాలూ
'ధర్మ 'రక్షణకి అడ్డురావు. అది శాస్త్రం. 'మాయాబజార్ ' సినిమా చూసిన వారికి
వంగర మాటలు గుర్తుండే ఉంటాయి. శాస్త్రం ఎప్పుడూ ఖరాఖండీగానూ, నిష్కర్షగానూ
చెపుతుంది.
నాది ఒక్కటే భయం.మన దేశంలో సెల్ ఫోన్ కార్పొరేట్ల పోటీలు పెచ్చురేగిపోతున్నాయి.
ఏ రాజా వంటి నీతిపరులయిన మంత్రులు మనల్ని పాలిస్తున్నారు. ఈ శాస్త్రాలను అడ్డం
పెట్టుకుని - 'తలాక్ ' రికార్డ్ చేసే సౌక్ర్యం నారీమణులకు కల్పించవచ్చు.
ఇందువల్ల విడాకుల పర్వాలు పెచ్చురేగిపోయే ప్రమాదం ఉంది. అయితే శాస్త్రకారులే
దీనికి విరుగుడని ఆలోచిస్తారు. మనువుల శక్తి అలాంటిది.
దీనికి 'విడాకులు ' అన్నవాడెవడో బొత్తిగా అమాయకుడై ఉండాలి. ఆకులూ, అలమలూ, తీగలూ,
ఏకులూ అన్న పేర్లు ఈ వ్యవహారానికి పొసగదు. ఇక్కడ శషభిషలు పనికిరావు. నవ్వుతూ
అన్నా మాడు పగులుతుంది. కావాలంటే మన మనువుని అడగండి. దేవ్ బండ్ దార్ - ఉల్ -ఉలాం
ని అడగండి.
ఒక్కసారి ఈ నవ్వులాటని పక్కన బెడితే - మారే ప్రపంచంలో వివాహ వ్యవస్థని
కాపాడడానికే మతాలన్నీ తాపత్రయ పడ్డాయి. కలిసి ఉండడం సమాజ హితం. విడిపోవడం
దురదృష్టకరం. దానిని వీలయినంత ఇరకాటంగా, ఇబ్బందికరంగా చేయడం వల్ల వ్యవస్థకి మేలు
జరుగుతుందని భావించిన పెద్దలు చేసిన ఏర్పాటిఎది. భార్యతో వంద సంవత్సరాలు జీవించే
ఏర్పాటుని నవ్వుల పాలు చేయకండి. తేలికగా మాటల్లోనూ, చాటుల్లోనూ దుర్వినియోగం
చేయకండి - అని వారి సందేశం.