నిజం వద్దు - అబద్ధం ముద్దు
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

  ప్రపంచ ప్రఖ్యాత డచ్‌ చిత్రకారుడు రెంబ్రాంట్‌ ఒకమాట అన్నాడు: చిత్రాల్ని దగ్గరగా చూడకు. కంపుకొడతాయి -అని. చిత్రాల మాటేమోగాని ఈ మాట మనదేశంలో ప్రజా నాయకులకీ, డబ్బుని కూడవేసే చాలామంది పెద్దలకీ వర్తిస్తుంది.
ఉదాహరణకు ఒకప్పుడు పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో టెలికాం మంత్రిగా ఉన్న సుఖ్‌రాంనే తీసుకోండి. ఆయన్ని మొన్నకాక మొన్న సుప్రీం కోర్టు నేరస్తుడని జైలుకి పంపింది కాని -ఈ 16 సంవత్సరాలూ ఆయన నాయకత్వంలో మనం ఆనందంగా గడిపామా లేదా? ఆయన్ని అయిదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎం.పిగా ప్రజలు ఎన్నుకున్నారు. కాంగ్రెస్‌ 1996లో ఆయన్ని బహిష్కరించినా ఆయన హిమాచల్‌ వికాస్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పరుచుకుని కొత్త కుంపటి పెట్టారు. బి.జె.పి.లో చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయారు.
ఆ రోజుల్లో ఆయన పడక గదిలో మూడున్నర లక్షల రొక్కం సూట్‌ కేసుల్లో దొరికింది. అయ్యో, ఈ మాత్రానికే అయిదేళ్లు జైలుకి పంపాలా? మా వూళ్లో పంచాయతీ బోర్డు గుమాస్తా ఈ మాత్రం సొమ్ము సంపాదించగలడు అని తమకు అనిపించవచ్చు. కాని ఆనాటి మూడున్నర లక్షలు ఈనాటి డజన్ల కోట్లతో సమానమని తమరు గ్రహించాలి. కాగా ఈ 16 సంవత్సరాలలోనూ టెలికాం మంత్రులు సుఖ్‌రాం నుంచి రాజా వరకూ ఎంత అభివృద్ధిని సాధించారో మనకు అర్థమవుతుంది. ఇప్పటికీ తన 86వ యేట రాజాగారి సరసన తీహార్‌ జైల్లో ఉన్న సుఖ్‌రాం గారు బెయిల్‌ కోసం కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారు.
మీరు గమనించాలి. నేను నేరాల గురించీ, నేర చరిత్రగల నాయకుల గురించీ మాట్లాడడం లేదు. ఇలాంటి నేరాలు రచ్చకెక్కడం వల్ల, కోర్టులు వీధిన పెట్టడం వల్ల 16 సంవత్సరాల పాటు పార్టీ నాయకులుగా, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన గౌరవాన్ని అందుకున్న వారి పరిస్థితిని ఆలోచించమంటున్నాను. ఇలాంటి నాయకునికా మనం ఈ రాష్ట్ర పాలనను అప్పగించాం. మంత్రిగా ఉంటూనే స్వాహా చేసిన ఈయన, ముఖ్యమంత్రిగా ఉంటూ ఎంత తిన్నాడో ఎవరికి ఎరుక? అని తమరు వాపోవచ్చు. నేను దాని గురించీ విచారించడం లేదు. ఈ నేరాల వల్ల మన కళ్లముందున్న మహోన్నత శిఖరం కూలిపోతోందని గమనించండి. చిత్రాల్ని దగ్గరగా చూడకూడదు. చూస్తే 'కంపే' మిగులుతుంది.
ఇప్పుడు అసలు కథ. స్విస్‌ బంకుల్లో 700 మంది పెద్దల నల్లధనం అకౌంట్లు వున్నాయంటున్నారు. ఆ పేర్లు తెలిసినా ప్రభుత్వం మనకు చెప్పడం లేదని గింజుకుంటున్నారు. ఇదెంత ఉపకారమో వారికి అర్థం కావడం లేదని నా ఉద్దేశం.
ఈ 700 మందిలో మనం అనునిత్యం ఆరాధించే సినీ నటులు ఉండవచ్చు. మనం పేరు వింటేనే పీకలు కోసుకునే క్రికెట్‌ హీరోలు ఉండవచ్చు. సోనియా గాంధీ, రాజీవ్‌గాంధీ, శరద్‌పవార్‌ వంటి అభిమాన నాయకుల పేర్లు ఉండవచ్చు. మన ప్రియతమ మంత్రి రాజాగారి పేరూ ఉండవచ్చు. ఇంకా పారిశ్రామిక వేత్తలూ, నిజాయితీ గురించీ, నీతి గురించి మనకి అనునిత్యం బోధలు చేసే నీతిపరులుండవచ్చు. నిన్నటికి నిన్న ఎవరో దుర్మార్గుడు శరద్‌పవార్‌ చెంప పగలకొడితే చాలామంది అభిమానులు ధర్నా చేశారు. సుఖ్‌రాం జైలుకి వెళ్లినందుకు వారి నియోజకవర్గం 'మండీ'లో ఎందరో నిరసనలు చేశారు. ఈ స్విస్‌ ఖాతాలు వారి మనస్సుల్ని ఎంత గాయపరుస్తాయో ఊహించలేం.
ఇంకా మరోకొన్ని పేర్లు మనల్ని షాక్‌లో పడేసేవి ఉండవచ్చు. కొందరు డబ్బుని ప్రదర్శించరు. తలవొంచుకుని అనుభవిస్తారు. చాలా సంవత్సరాల కిందట విశాఖపట్నంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. బిచ్చమెత్తుకుంటున్న వాడిని నా చిన్నతనమంతా చూశాను. తీరా వాడు చచ్చిపోయాక కొన్నివేల రూపాయలు వాడిగోతాంలో దొరికాయి. తప్పు లేదు. సినీనటన, క్రికెట్‌ లాగే ముష్టివాడి వృత్తి. అందులో రాణించాడు. నలుగురూ ఇచ్చింది దాచుకున్నాడు. వాడికి పేదరికం దయనీయమైన స్థితికాదు. ఒక ముసుగు. ఉదారులయిన వితరణశీలురికి ఆ 'ముసుగు'ని గౌరవించడం పరలోకప్రాప్తికి తోవ.
ఏతావాతా -ఉదాహరణకి -కేవలం ఉదాహరణకి -స్విస్‌ బ్యాంకు అకౌంట్‌ దారుల్లో మనం దేవుడిలాగ కొలిచే సచిన్‌ టెండూల్కర్‌ పేరుందనుకోండి. మన మనసు ఎంత క్షోభిస్తుంది? 16 సంవత్సరాలు 'దేవుడు'లాగ దేశంలో చెల్లుబాటయిన సుఖ్‌రాం తీహార్‌లో రాజాగారి సరసన ఉన్నారంటే మనకెంత బాధ కలిగింది? అలాగే అమితాబ్‌ బచ్చన్‌ పేరుందనుకోండి. ఈ దేశంలో ఎంతమంది గుండెలు పగిలిపోతాయి?
అందుకని కొన్ని నిజాలు మనకి తెలియకపోవడంలోనే సొగసు ఉంది. శ్రేయస్సు ఉంది. ఈ విషయం మన సోనియాకి తెలుసు. ప్రణబ్‌ ముఖర్జీకి తెలుసు. ఇంగ్లీషులో చెప్పనే చెప్పారు - Unheard melodies are sweeter  అని. మొనాలిసా నవ్వులాగ, చిదంబర రహస్యం లాగ -స్విస్‌ బాంకుల్లో నల్లధనం ఖాతాదార్ల పేర్లు ఎప్పటికీ తెలియకుండానే ఉండిపోవాలి.
నిజం నిష్టూరంగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు గుండెల్ని పిండిచేస్తుంది. మనం మనస్సులో ప్రతిష్టించుకున్న దేవుళ్లని నేలమట్టం చేస్తుంది. నిజం కర్కశంగా ఉంటుంది. మన కలల్ని కాటువేస్తుంది. కంపుకొడుతుంది. మన కళ్లముందున్న పంచరంగుల స్వరూపాల్ని ధ్వంసం చేస్తుంది. మన అభిమానాన్ని వంచిస్తుంది. కనుక గవర్నమెంటు చెప్పే 'అబద్ధం'లో -అది నిజంగా అబద్ధమైనా మన శ్రేయస్సు ఉన్నదని గమనించాలి. మనకి మరో సుఖ్‌రాంలు వద్దు. స్విస్‌ బ్యాంకుల్లో వివరాలు తెలియని బాంకు అకౌంట్లే ముద్దు.
 

                                               నవంబర్ 28, 2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage