Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

"చెత్త" నోబెల్

          కేంద్ర మంత్రి జయరాం రమేశ్ ఈ మధ్య ఓ గొప్ప నిజాన్ని వక్కాణించారు. "దుమ్ము దూసర చెత్తకు ఏదైనా నోబెల్ బహుమతి వుంటే మన దేశానికి పోటీ లేకుండా ఆ బహుమతి దక్కుతుంది అని.

          వెంటనే దుమారం లేచింది. ఈ దేశంలో ఓ గొప్ప సంప్రదాయం వుంది. అధికారంలో వున్న పార్టీలు ఎప్పుడూ అబద్దాలే చెప్పాలి. ఎదుటి పార్టీలు నిజాలు చెప్పాలి. అధికార పార్టీ చెప్పిందికనుక ఎప్పుడూ అబద్దం నిజంగానే చెలామణీ అవుతుంది. ప్రత్యర్ధులు చెప్పారు కనుక నిజం ఎప్పుడూ అబద్దంగానే కనిపిస్తుంది. ఇది అబద్దమని సీబీఐ, పోలీసులు, కొండొకచో న్యాయస్థానాలూ సమర్దిస్థాయి. ఈ వ్యవస్థనే తెలుగులో "ప్రజాస్వామ్యం అంటారు.

          వెరసి- అధికారంలో వున్న నాయకులు, పార్టీవారు "మూడు కోతుల పాత్రని నిర్వహిస్తూంటారు. చెడు చూడరు. చెడు వినరు. చెడు మాట్లాడరు. పొరపాటున ఏ కోతయినా తొందరపడి నోరిప్పితే ఆకాశం విరిగి మీదన పడుతుంది. ఉదాహరణకి మంత్రిగారు "కేంద్ర నాయకత్వంలో అవినీతి పరులున్నారు అనుకోండి. ఇదేమంత విడ్డూరమయిన విషయం?-ఆకాశంలో నక్షత్రాలున్నాయి అన్నట్టు! కాని ఆమాట అధికారంలో వున్న మనిషి అనకూడదు. అంటే-"అదిగో, మీ మంత్రిగారు చెప్పారు- అవినీతిపరులున్నారని. వారెవరో, వారు చేసిన అవినీతి ఏమిటో పార్లమెంటుకి చెప్పాలి అని ప్రతిపక్షాలు నిలదీస్తాయి. అందుకే  మధు కోడా అనే జార్ఖండ్ ఒకప్పటి ముఖ్యమంత్రి 4000 కోట్లు ఫలహారం చేశాడని ఇన్కంటాక్స్ రుజువులు చూపినా- న్యాయస్థానం ఒప్పుకునే వరకూ "ఇది నా శత్రువుల కుట్ర"  అనడం రివాజు. బొత్తిగా సత్యం రామలింగరాజులాగ "అవునుసార్! బుద్ది గడ్డి తిని 7000 కోట్లు తినేశాను అని ఏ నాయకుడు ఒప్పుకుంటాడు? పాపం, రామలింగరాజుగారు కర్ణాటకలో వుంటే యెడ్యూరప్పగారు ఆయన్ని మంత్రిని చేసేవారు.

          సరే. ఇప్పుడేమయింది? జయరాంగారి మాటవినగానే- నలుగురు "చెత్తమేయర్లు- నాలుగు అబద్దాలతో- "కోతుల పాత్రలు ధరిస్తూ కెమెరాల ముందుకొచ్చారు. చెన్నై మేయర్ "దేశంలోకెల్లా మా నగరం పరిశుభ్రమయినది అని నోరారా అబద్దం చెప్పారు- మరొక పక్క భయంకరమైన చెత్త దృశ్యాలను ఛానల్ కన్నులపండగగా చూపించింది. అలాగే ముంబై మేయర్ గారు గర్వపడ్డారు. వెంటనే మరో చెత్త దృశ్యం. జయరాం రమేశ్ గారు నోరు పారేసుకున్నారుగాని మన దేశంలో "చెత్తస్టేటస్ సింబల్.

          అప్పుడెప్పుడో అబ్దుల్ కలాంగారు ఓ వ్యాసంలో వాపోయారు- బొత్తిగా పెద్దమనిషి కనుక.సింగపూర్ లో మనవాడు దిగుతాడు. అక్కడ సిగరెట్టు పీకలు రోడ్డు మీద పారెయ్యడేం? టొక్యోలో రోడ్ల మీద కిళ్ళీ ఉమ్ము వెయ్యడేం? బోస్టన్లో నిషేధించిన స్థలాలలో కార్లను నిలపడేం? భారత దేశంలో దిగగానే మనకి ఎక్కడ లేని స్వేఛ్ఛ వస్తుంది. పేపర్లు రోడ్ల మీద విసిరేస్తారు. సిగరెట్టు పీకలు పారేస్తారు.

          ఒక ఇంటర్వ్యూలో బోంబే మునిసిపల్ కమీషనర్  తినయ్కర్ ఓ మాట చెప్పాడు. ధనవంతుల కుక్కలు యజమానులతో షికార్లకు వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మలవిసర్జన చేస్తాయి. మళ్ళీ ఈ ధనవంతులే అధికారులు పేవ్ మెంట్లను శుభ్రంగా ఉంచడంలేదని, దుర్గంధభూయిష్టంగా వుంటున్నాయంటారు. కార్పొరేషన్ ఆఫీసర్లు ఏం చెయ్యాలని వారి ఉద్దేశం? ప్రతీ ఆఫీసరూ వాళ్ళ కుక్కల వెనుక ఓ చీపురూ చేటా పట్టుకు తిరిగి వాటి కుప్పలు ఎత్తాలనా?

          అమెరికాలో ఏ కుక్క ఇలాంటి పని చేసినా దాన్ని వెంటనే తీసే బాధ్యత ఆ కుక్క యజమానిది. జపాన్ లోనూ అంతే. అమెరికాలో వున్న తెలుగు కుక్కకీ ఈ గౌరవం దక్కుతుంది. కాని అమలాపురం రాగానే అధికారులది కుక్క బతుకయిపోతుంది.

          చెన్నైలో ఏ ఆఫీసు మూలని చూసినా భయంకరమైన తాంబూలాల ఉమ్ములుంటాయి. ప్రతీ బస్సు స్టాండు రాటలకీ సున్నం ముద్దలుంటాయి.

          అమెరికాలో ఎవరి ఇంటి చెత్తని వారు తీసుకొచ్చి చెత్తలారీకి అందే పద్ధతిలో డబ్బాని పెట్టాలి. లారీ ఫోర్క్ కి ఆ డబ్బా అందకపోతే? లారీ తీసుకెళ్ళదు. చెత్త అక్కడే వుండిపోతుంది. ఈ విషయాన్ని మా మిత్రులు డబ్లిన్ లో చెప్పారు.

          మరి మనకి ఇండియాలో ఎంత స్వేచ్చ? నాలుగో అంతస్థునుంచి చెత్త గాలిలో విహరిస్తుంది. మనకి రోడ్లన్నీ విశాలమయిన కుప్ప తొట్టిలే!

          ఇదో రకమయిన చెత్త. మనకి చాలా రకాలయిన "చెత్త నాయకులున్నారు. మహారాష్ట్రలో మహారాష్ట్రులకే ఉద్యోగాలివ్వాలంటూ రాష్ట్రేతరుల్ని చావగొట్టే రాష్ట్రభక్తులు కొందరు. వాళ్ళు అత్యాచారాలు చేస్తున్నారంటూనే వారిని సమర్ధించే అశోక్ చావన్ వంటి ముఖ్యమంత్రులు మరికొందరు(నిన్న ఓ రైల్వే సభలో రాజ ధాకరే పాటనే వీరూ పాడారు). శ్రీలంకనుంచి వచ్చిన కాంధిశీకులకు పౌరహక్కులు కల్పించాలనే 87 సంవత్సరాల ముసిలి ముఖ్యమంత్రిగారు. ఇవన్నీ ఒకెత్తు. తమకో సుందర దృశ్యం. తమిళనాడులో అన్నా డిఎంకె కి సంబంధించిన ఓ "చెత్త నాయకుడు- బహుశా అమ్మ పాలనలో ఆనాటి మంత్రి అయివుండొచ్చు. అమ్మ పాదాల మీద తల ఆనించి మొక్కే సుందర దృశ్యాన్ని తమిళనాడు ప్రజలు చూసి తరించారు.

          ఏతావాతా, మన దేశంలో చెత్త రకరకాలు. అవి కేవలం దుమ్ము దూసర స్థాయిలోనే వుండవు. కొందరు నాయకుల బుద్ధుల్లో, కొందరు పౌరుల చేతల్లో, కొందరి ఆలోచనల్లో, కొందరి ఆచరణల్లో- ప్రతిఫలిస్తూంటాయ్.

          భారత "చెత్త" సర్వాంతర్యామి.సర్వవ్యాపి. జయరాం రమేశ్ గారు - పాపం పదవిలో వున్న పాపానికి నిజం చెప్పి వీధిన పడ్డారు కాని- "చెత్త నోబెల్ బహుమతి అంటూ వుంటే ఈ ప్రపంచంలో ఎవరికీ మనతో పోటీ చేసే దమ్ముండదు.

          మనది ప్రజాస్వామిక దేశం. రోడ్లు మావి. ఉమ్ముతాం. పదవులు మావి. పీక్కొంటాం. కుక్కలు మావి. కుప్పలు వేయిస్తాం.

          చెత్తమీది. కాని నోబెల్ బహుమతి మాది.

          

                                                             నవంబర్ 23, 2009

       ************               ************           *************          *************
    
You can mail your opinions directly to Maruthi Rao Garu at gmrsivani@gmail.com
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage