Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

సాంబారు వడ కధ

          ఇప్పుడిప్పుడు రాష్ట్రమంతా వచ్చే దిన పత్రికలకు జిల్లా అనుబంధాలు వచ్చాయి. జాతీయ స్థాయిలో పది మందీ తెలుసుకోవలసిన వార్తల్ని- బొత్తిగా అనుభవం చాలని స్థానిక సంపాదకులు- జిల్లా అనుబంధానికి అంటగట్టి మరిచిపోవడం కద్దు.

          ఒకటి రెండు ఉదాహరణలు. విజయనగరంలో దాదాపు 28 సంస్థలు ఒకటయి- ఏటేటా గురజాడ అప్పారావు స్మారక పురస్కారం యిస్తారు. ఇది విజయనగరానికీ, పుచ్చుకునేవారికీ గర్వకారణం.- అప్పారావుగారి స్మృతి చిహ్నం కనుక. చాలా సంవత్సరాలు- యిప్పటికీ కూడానేమో- ఇలాంటి వార్తలు జిల్లా తోకపత్రికల్లో మాయమవుతూంటాయ్.

          మా గొల్లపూడి  శ్రీనివాస్  జాతీయ బహుమతికూడా అప్పుడప్పుడు స్థానిక తోకల్లోనే ప్రస్పుటంగా కనిపించి మాయమవుతూంటుంది. వార్త విలువ, scope పట్టించుకునే నాధులు లేరు.

          ఇది రాయడానికి కారణం- మద్రాసువంటి మహానగరాలలో జిల్లా అనుబంధాలులాగే- ఆయా పేటలకు పరిమితమయే చిన్న చిన్న పత్రికలొస్తాయి. టినగర్ టైమ్స్, మైలాపూర్ టైమ్స్, సైదాపేట టైమ్స్-యిలాగ. మంచిదే. కాని ఈ టైమ్స్ లో వార్తలు- పదిమందీ పంచు కోవలసినస్థాయిలో వుంటే వాటి గతి ఏమిటని? ఈ ప్రశ్నకు బలాన్ని చేకూర్చడానికే ఈ కాలమ్.

          నిన్న ఉదయం పత్రికలు తిప్పుతూంటే టి.నగర్ పత్రికని నా మీద పడేసి పోయాడు సైకిలు కుర్రాడు. దాని మీద సహజంగా నాకు చిన్న చూపు. మూడు నాలుగు మైళ్ళ విస్తీర్ణం వున్న ఓ పేట వార్తలు ఏం వుండి చచ్చాయని. కాని ఓ మంచి వార్త, ఆలోచింపజేసేవార్త, పదిమందీ  ఆలోచించవలసిన వార్త కనిపించింది. దీన్ని అన్ని జాతీయ పత్రికలలో ప్రకటించి ఛానల్స్ లో చర్చ జరపాలని.

          2005 ఏప్రిల్ 10 న ఓ ముసలాయన (పేరు ఆర్.సుందర్) పాండే బజారులో కాఫీ హొటల్ కి వెళ్ళాడు (శ్రీ బాలాజీ ఫుడ్స్). సాంబారు వడ ఆర్డరు చేశాడు. సర్వర్ 35 రూపాయల బిల్లు యిచ్చాడు. అందులో 32 రూపాయలు టిఫిన్ కీ- మిగతా మూడు రూపాయలూ-అమ్మకం పన్ను, అదనపు చార్జ్, సర్వీస్ చార్జ్. న్యాయంగా యివన్నీ కలిపితే 34-28 పైసలయింది.హొటల్ వారు చక్కగా దాన్ని 35 రూపాయలకి సవరించారు.

          "ఇదేమిటయ్యా?అని ఈ ముసలాయన సూపర్ వైజర్ నీ, మేనేజర్ నీ ఆడిగారట. అక్కడ వార్తలో ఒక్క వాక్యమే రాశారు. ఆయన్ని వెక్కిరించి, అవమానించారని.

          రచయితని కనుక, తమిళ వెక్కిరింతల్ని 38 సంవత్సరాలు చూసినవాడిని కనుక ఈ విధంగా సంభాషణ సాగి వుంటుంది.

          "య్యోవ్! ఏందయ్యా పొద్దున్నే తగాదా? పెద్ద తినే మొనగాడొచ్చాడు-తిన్నది   వడ- నిలదీసేది గంట

          "ఏం ముసలాయనా?అంత యిచ్చుకోలేనోడివి ఎందుకు తిన్నావ్?

          "ఏం? నీకు కారణాలు చెప్పడానికి మాకు టైం లేదు. పక్క టేబిలు మీద తింటున్న వారితో "వచ్చాడయ్యా మొనగాడు. 70  పైసలకి భారతం చదువుతున్నాడు. వెళ్ళవయ్యా- వెళ్ళు- యిచ్చావులే బోడి 35 రూపాయలు.."

          తమిళనాడులో వెంటనే ఎక్కడలేని ఐకమత్యాన్నీ పక్కవాళ్ళు చూపుతారు. అంతా పెద్దలయిపోతారు.

          "య్యోవ్! ఎందుకయ్యా షండ(తమిళంలో తగదా)? డబ్బిచ్చిపో"

          "నీలాగ మేమంతా మాట్లడలేకా? అయినా నువ్వు సంపాదించింది కాదుకదా? నీ కొడుకో అల్లుడో యిచ్చాడు. తిని గమ్మున ఉండు"" (అందరూ నవ్వులు)

          ఇలా సాగివుంటుంది సీను. సుందర్ గారికి కాలింది. కాగా యింతమంది అవమానం తలకెక్కింది. అంతటితో ఊరుకోలేదు. ఆ సర్వర్ యిచ్చిన బిల్లు జత చేసి హొటల్ కి నోటీసు పంపించాడు- తనకి 72 పైసలు, 5000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని.

          ఆయనో పిచ్చిముండా కొడుకని నవ్వుకొని హొటల్ యాజమాన్యం ఆ నోటీసుని పొయ్యిలో పారేసివుంటుంది.

          సుందర్ గారు అక్కడితో ఆగలేదు. జిల్లా వినిమయ దారుల న్యాయస్థానంలో కేసు పెట్టాడు. యాజమాన్యం కాస్త ఖంగు తిని వుంటుంది. వారు న్యాయస్థానంలో యిచ్చిన వివరణ- కంప్యూటర్ సమస్య కారణంగా బిల్లుని 35 రూపాయలకు సవరించామని, 72 పైసలూ వాపసు యిస్తామనీ అన్నారు. ఆమాట ఆనాడే అనివుండొచ్చుకదా? ఈ దేశంలో అహంకారంతో కూడిన పొగరుబోతుతనానికి అవకాశం ఏదీ?

          14 నెలల తర్వాత ఘనత వహించిన న్యాయస్థానం- హొటల్ యాజమాన్యం 72 పైసలు యివ్వడానికి అంగీకరించారు కనుక (అంగీకరించడానికి 14 నెలలూ, కోర్ట్ లో కేసు మాటో!!) వారి సర్వీసులో (సేవలో) లోపం లేదుకనుక కేసు కొట్టేసింది.

          కాని సుందర్ గారు పట్టువదలని విక్రమార్కుడు. రాష్ట్రస్థాయి వినిమయ దారుల న్యాయస్థానానికి అప్పీలు చేశాడు. మరో 2 సంవత్సరాల ఏడు నెలల తర్వాత రాష్ట్ర వినిమయదారుల న్యాయస్థానం అద్యక్షులు జస్టిస్ తనికాచలం, సభ్యులు గుణశేఖరన్ గారలు- వినిమయదారుడు కోర్టు కెక్కాక  72 పైసలు వాపసు యిస్తాననడం సేవ అనిపించుకోదని, సేవ అన్నది వినిమయదారుడికి ఉపయోగం కావాలిగాని ,శిక్ష కారాదని అంటూ, 50 పైసల కంటే ఎక్కువ తేడా బిల్లులో ఉన్నప్పుడు 34-28 పైసల్ని 34 చెయ్యడం సబబు కాని 35 చేయడం అన్యాయమని తేల్చింది.

          "ఇది అన్యాయమయిన వ్యాపార సరళి. దీనిని ప్రోత్సహించకూడదు. ఓ ముసలాయన్ని అంతమంది ముందు ఆనాడు అవమానించకపోతే ఆయన న్యాయస్థానం వరకు వచ్చేవారే కాదు అంటూ 72 పైసలు వాపస్ యివాలని, సేవలో లోపానికి నెలరోజుల్లోగా వెయ్యి రూపాయలు చెల్లించాలని తీర్పు యిచ్చింది.

          ఈ కేసు ఎన్నో ప్రశ్నల్ని రేపుతుంది.మన దైనందిన జీవితంలో ఎన్నో రంగాలలో- అనౌచిత్యాన్నీ, అలక్ష్యాన్నీ, పొగరునీ, పెడసరాన్నీ, భాధ్యతారాహిత్యాన్నీ, ఎవడికి చెప్పుకుంటావో పోయి చెప్పుకో అనే చులకనభావాన్నీ- వెరసి తమ హక్కుగా భావించే అవినీతిని ప్రతి దినం చూస్తాం.

          సిగరెట్టు కాల్చి- 20 నిముషాలు ఆలశ్యంగా కుర్చీలో కూర్చున్న గవర్నమెంటు గుమాస్తామీద రేషన్ షాపులో రిక్షా వెంకయ్య విసుగుని చూపితే "ఏంటయ్యా అరుస్తావు? ఇది నీ అత్తారిల్లా?అంటూ అతని అసమర్దతని నిలదీసినందుకుగాను "రేషన్ కార్డు ఈ మూల చిరిగిపోయింది. కొత్త కార్డ్ రాయించుకురా .అప్పుడు కిరసనాయిలు యిస్తానుఅని కార్డ్ మొహంమీద విసిరేస్తాడు. పాపం, వెంకయ్య టి.నగర్ సుందర్ కాలేడు. 72 పైసలకోసం 4 1/2 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగలేడు. తిరిగే ఉద్విగ్నత, పౌరుషం, చెల్లుబాటయే స్తోమతూ వెంకయ్యకి ఉండదు. ఉండదని సిగరెట్టు కాల్చే అవినీతిని తన హక్కుగా ఛలామణీ చేసుకునే గుమాస్తాకి తెలుసు. ఈ గుమాస్తాలూ, హొటల్ వినిమయదారులూ, వారిని ఉదారంగా సమర్ధించే చెంచాలూ ఇదంతా ఒక విషవలయం.

          ఈ కధలో ముసిలి సుందర్ వీరుడు. కాని దురదృష్టవశాత్తూ ఆయన వీరత్వం కోట్లాది సామాన్య ప్రజకి మార్గదర్శకం కాలేదు. ఆ వ్యవధి,స్తోమతు చాలామందికి ప్రాక్టికల్ కారణాలకి పొసగదు కనుక.

          చాలామంది 4 1/2 సంవత్సరాల పోరాటం కంటే 72 పైల నష్టానికి, ఆ క్షణంలో హొటల్ లో అవమానానికీ తలొంచుతారు. కాగా, దినం గడిస్తే చాలునని పరుగులు తీసేవాడు అవినీతితో పోరెక్కడ జరపగలడు?

          ఇది గొప్ప నీతి కధ. అయితే సుందర్ వంటి నీతిమంతుడూ, రోజుగడుపుకోగలిగిన వాడూ సాధించగలిగిన విజయం. ఈ కధకి ఫలశ్రుతి. సుందర్ కో దండం. కాని తెల్లారిలేస్తే ఎంతమంది వెధవాయలతో మనం బతకాలి? ఎన్ని కోర్టు కేసులు?

          సమాజంలో వ్యక్తిగత శీలం లోపించడం ఇందుకు కారణం. మరొక ముఖ్యమయిన కారణం- ఎవరేం చేసినా చెల్లిపోయే పరపతి, పదవి, అవినీతి, గూండాయిజం, డబ్బు, అలసత్వం-యిన్ని వున్నాయి వెనుకదన్నుగా. పైగా మనది ప్రజాస్వామ్యం. అదొక్కటి చాలు మనరోగం కుదర్చడానికి. ఎవడూ ఎవడికీ జవాబుదారీకాదు- 72 పైసలకి 4 1/2 సంవత్సరాలు పోరాటం సాగించే మొనగాళ్ళుంటే తప్ప.

          

                                                             నవంబర్ 16, 2009

       ************               ************           *************          *************
    
You can mail your opinions directly to Maruthi Rao Garu at gmrsivani@gmail.com
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage