Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here
 
 

చిన్న చేప

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com
 

 
ఓ సాయంకాలం నా కారు టోల్ గేటు దగ్గర ఆగింది. అక్కడ టోల్ ఆరు రూపాయలు. నా డ్రైవరుకి పదిరూపాయల నోటిచ్చాను. టోల్ కిటికీ దగ్గర , బయట ఒకాయన నిలబడి ఉన్నాడు. అయిదు రూపాయల నాణెం డ్రైవరుకి అందిస్తూ చిరునవ్వు నవ్వాడు. టిక్కెట్టు తీసుకోమన్నాను. రూపాయి చిల్లరలేదన్నాడు టోల్ మనషి. ఈ టిక్కెట్టుకీ రూపాయకీ ముడి ఉంది. రూపాయి ఇస్తే అధికారంగా టిక్కెట్టు వస్తుంది. డబ్బు గవర్నమెంటుకి చేరుతుంది. చిరునవ్వుని అర్ధం చేసుకుని రూపాయితో సరిపెట్టుకుని (నీకు టోల్ అయిదు రూపాయిలకే కిట్టుబాటయింది కదా!) అవినీతిని పంచుకుంటావా? అయిదు రూపాయలు అతని జేబులోకి వెళుతుంది. దూరంగా ఒకరిద్దరు కూర్చుని ఉన్నారు. బహుశా అందరికీ వాటా ఉండవచ్చు. తిలా పాపం తలాపిడికెడు. ఎంత మంది రూపాయి వాటాకి కక్కుర్తి పడితే - అన్ని అయిదేసి రూపాయలు ఎవరు తింటే మనకేం, మనకో రూపాయి కిట్టిందికదా? ఈ దేశాన్ని ఎంతమంది కొల్లగొట్టుకు తినడం లేదు అన్న నైరాశ్యం దాదాపు అందరికీ వస్తుంది. ఆ నిర్వీర్యమే టోల్ అవినీతికి పెట్టుబడి.
టిక్కెట్టు పుచ్చుకు తీరాల్సిందే - అన్నాను.
"రూపాయి చిల్లర లేదు" అని డ్రైవర్ తో రెట్టించాడు టోల్ గుమస్తా విసుగ్గా - ఈ మాత్రం అవినీతిని అర్ధం చేసుకోలేని మూర్ఖుడివా అన్నట్టు చూస్తూ.
నేను ఇటు తలుపు తీసుకు దిగాను ఆవేశంగా. "కారు అక్కడ వదిలేసి దిగు మదీనా. చిల్లర రూపాయి వాళ్ళ చేతికి వచ్చేదాకా కారు అక్కడే ఉండనీ. ఇక్కడ వెయిట్ చేద్దాం" అన్నాను.
టోల్ దగ్గర కూర్చున్నవారు విధిగా చిల్లర ఉంచుకోవాలి. లేకపోతే వరసగా వచ్చే కార్ల వెనక మరో ఇరవై కార్లు నిలిచిపోతాయి - రూపాయి కారణంగా. ఇది సినిమా హాలుకి వెళ్ళే బేరం కాదు. రోడ్డు మధ్య టోల్. పైగా టిక్కెటు చాలా అవసరం. "రానూ పోనూ" చెల్లించేవారికి అకౌంటుల్లోకి వెళ్ళాల్సిన ఖర్చు. వ్యాపారస్తులకి ఆదాయపు పన్నువారు అంగీకరించే వినిమయం.
నా మొహం చూడగానే గుమస్తా ముఖం వెలిగింది. దూరంగా కూర్చున్న ఇద్దరూ లేచి వచ్చారు. అందరి ముఖాలూ వికసించాయి. టోల్ గుమాస్తా ముఖం చాటంత చేసుకుని డ్రైవరు దగ్గర అయిదు రూపాయల నాణెం తీసుకుని పదిరూపాయల నోటు తిరిగి ఇచ్చేశాడు - 'వెళ్ళిరండి సార్' అంటూ.
అంటే - నేను ఫలానా నటుడిని కావడం వల్ల నాకు టోల్ లేదు. ఇప్పటికీ టిక్కెట్టు లేదు. అంటే నేనిప్పుడు వారి అవినీతిలో పూర్తి వాటాదారుడిని - టోల్ ఇవ్వలేదు కనుక.
'డబ్బు తీసుకుని టిక్కెట్టు ఇవ్వండి. రూపాయి చిల్లర వచ్చేదాకా..'
మాట పూర్తికాకుండానే నాలుగు రూపాయలు డ్రైవరు చేతికిచ్చాడు. టిక్కెట్టు అందింది. మా మిత్రుడు ఓ తాసిల్దారు (ఎం.ఆర్.ఓ) ఉన్నాడు. ఆయన తన కంటే పెద్ద ఆఫీసర్ల్లు వచ్చినప్పుడు మర్యాద చేస్తాడు. లోకల్ ఎస్సై గారికి పేరుడు నెయ్యి, అరకు నుంచి పుట్ట తేనె పంపుతాడు. అతనికి డబ్బు ఎలా వస్తుంది? సమాధానికి వెదుక్కోనక్కరలేదు. ఆయన స్థాయిలో కొన్ని 'టోల్'లు ఉన్నాయి.
ఈ దేశంలో ఓ రాష్ట్రం ముఖ్యమంత్రిగారి అనధికారపు అల్లుడు - ఎ.రాజా -
దేశం సొమ్మును లక్షల కోట్లు స్వాహా చేసే నిర్వాకం చేశాడు. అందులో వాటా నిస్సందేహంగా అనధికారపు మామగారికె, పార్టీకి కిందటి ఎన్నికల్లో దాఖలు పరిచే ఉంటాడు. మరొక ప్రబుద్ద నాయకుడు సురేష్ కల్మాడీ కామన్వెల్త్ క్రీడల్లో వేల కోట్ల కుంభకోణంలో దేశం డబ్బు కొల్లగొట్టి క్రీడల వసతుల్ని కుక్కలకీ, బురదకీ వదిలిపెట్టాడు.. సౌమిత్రా సేన్ అనే న్యాయమూర్తి లక్షల సొమ్ముని మింగి భారతదేశ చరిత్రలో బోనులో నిలబడిన మొదటి న్యాయమూర్తిగా ఘనత కెక్కాడు. మరొక వ్యాపారవేత్త కేవలం 7 వేల కోట్లు మింగి హరాయించుకోవడం ఎలాగో తెలీక వీధిన పడి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. సైన్యాధికారుల దగ్గర్నుంచి,ముఖ్యమంత్రుల బావమరుదుల దాకా ముంబై ఆదర్శ సొసైటీ ఆస్తుల్ని స్మశానంలో శవాన్ని పీక్కుతిన్నట్టు అందరూ పంచుకున్నారు. ఇవన్నీ పెద్ద చేపలు.
వీళ్ళనుంచి స్ఫూర్తినీ - ఆయా దశలలో వీళ్ల అవినీతికి కొమ్ముకాయడానికి - తప్పని సరిగానో, అలవాటుగానో, అవసరం తోనో విచ్చలవిడితనానికో తలవొంచిన ఆఖరినమూనా - టోల్ గేట్ దగ్గరి చిన్నచేప.
నేను శంబల్పూరు వెళ్ళినప్పుడు - మా సామాన్లు మోస్తున్న కూలీ గ్యాస్ స్టౌని కింద పడేశాడు. మా పిల్లలు (పదేళ్ళవాళ్ళు) ఘొల్లుమన్నారు. నేనూ కోపం తెచ్చుకున్నాను. ఆ రైల్వే కూలీ చేతులు జోడించి 'మేరా పీట్ పర్ మారో సాహెబ్, మగర్ పేట్ పర్ నహి ' అన్నాడు. తెలుగులో - 'నా వీపు మీద కొట్టండి సార్. నా కడుపు మీద కొట్టకండ' అని. ఆ మాట నేనెన్నటికీ మరిచిపోను.
ఈ చేపల మహా సముద్రంలో - ఏ చేపని చూసి ఏ చేపని పట్టాలో - ఎక్కడ కొడితే టోల్ గేటు దగ్గర నిజాయితీ నిలుస్తుందో ఆలోచించిన కొద్దీ అవ్యవస్థ మనస్సులో నిలుస్తుంది.
ఒక చిన్న విషయం. అమెరికాలో అవినీతి ఉంది దేశాల్ని నాశనం చేసే పొగరుబోతు అహంకారం స్థాయిలో ఉంది. కాని టోల్ గేటుల్ని సొమ్ము చేసుకునే కక్కుర్తి అవినీతి లేదు. ఎందుకని?
మన దేశంలో ప్రతీ చేపా తనకంటే చిన్న చేపని ఫలహారం చేస్తూంటుంది. అక్కడ తిమింగలాలే పెద్ద చేపల్ని తింటాయి. మిగతా చేపలు నాచునీ, పాచినీ తిని బతుకుతాయి.

***
నవంబర్ 15, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage