Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
 
కర్ణుని పరివేదన
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

   ఆయన తల్లిదండ్రులెవరో పురాణాల్ని బాగా తెలిసినవారు. పుట్టుక గొప్పదయినా పెంపు తక్కువయిన కర్ణుడి పేరు కొడుక్కి పెట్టుకున్నారు. ఆయన దళితుడు. అయినా బాగా చదువుకుని న్యాయమూర్తి అయ్యారు. ప్రస్తుతం ఆయన తమిళనాడులో హైకోర్టు న్యాయమూర్తి.
శ్రీరామ అంటే బూతు మాటా అన్న సామెత ఉంది. అయితే కొన్ని సందర్భాలలో శ్రీరామ అంటే బూతుమాటే. కనీసం కొందరికి. హిరణ్య కశిపుడు తన కొడుకు 'నారాయణ' అంటే క్రోధంతో వొళ్లు మరిచిపోయాడు. ఇప్పటికీ శ్రీలంకలో రావణుడు పరిపాలనా దక్షుడయిన ప్రభువు వారికి. రాజీవ్‌ గాంధీ హంతకులు ఈ దేశంలో కొందరికయినా క్షమాపణకి అర్హులయిన అమాయకులు. దృష్టి వైవిధ్యాన్ని సూచించడానికే ఈ ఉదాహరణలు.
సాధారణంగా అందరూ గుర్తుంచుకోని విషయాలు కొందరిని అమితంగా బాధిస్తాయి. కారణం వారి ఆత్మ న్యూనతా భావం అని సరిపెట్టుకోడానికి వీలులేదు. కర్ణుడి గారి పరిస్థితి ప్రస్తుతం ఇదే. మొన్న ఆయన ఒక పెళ్లికి వెళ్ళారు. ఆయన పక్కన మరో సాటి న్యాయమూర్తి కూర్చున్నారు. ఈయన దళితుడు కాదు. కూర్చున్నవాడు తిన్నగా కూర్చోక కాలు మీద కాలు వేసుకుని - కుడికాలు పక్కనున్న కర్ణుడు గారికి తగిలేటట్టు కూర్చున్నాడు. ఇది సాటి న్యాయమూర్తులు- ఆడా మగా అంతా గమనించి నవ్వుకుంటున్నారు. ఇది అనుకోకుండా జరిగిన పనికాదు. కావాలనే చేశారు. కర్ణుడు గారు సరిపెట్టుకుని దూరంగా జరిగి కూర్చున్నారు.
మొన్నటికి మొన్న రిపబ్లిక డే రోజున మరో సాటి న్యాయమూర్తి- (ఈయనా దళితుడు కాడు)- తనని అవమానించాడు. ఎలాగ న్యాయమూర్తుల పేర్లు నిర్వాహకులు ఆయా కూర్చీలకు అంటించారు. ఫలానా న్యాయమూర్తి కావాలనే కర్ణుడిగారి చీటీని చించి, బాగా నలిపేసి తన పాదం కింద అంటించుకుని కాలు ఊపుతూ కూర్చున్నాడు. మిగతా వారు చూసి ఆనందిస్తున్నారు. అంటించుకున్న న్యాయమూర్తీ సంతోషిస్తున్నాడు.
ఇలాంటి వివక్ష అన్యాయం, అక్రమం న్యాయంగా వీటిని తమ పెద్ద అయిన ప్రధాన న్యాయమూర్తికి వీరు ఫిర్యాదు చేయాలి. కాని కర్ణుడుగారు దళితుల జాతీయ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలు కేవలం అనుకోకుండా జరిగినవి కావని, ఉద్దేశ్యపూర్వకంగా జరిపినవేనని నిరూపించడానికి కర్ణుడిగారి దగ్గర సాక్ష్యాలూ,చూసిన సాక్షులూ ఉన్నారు. రుజువులున్నాయి.
ఈ విషయాలను కర్ణుడుగారు ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి పాత్రికేయులకు వివరించారు. మీరిలా అపోహ పడ్డారేవెూనని ఒక పత్రికా రచయిత అన్నప్పుడు కాదని నిరూపించే రుజువులు తన దగ్గర ఉన్నాయని కర్ణుడుగారు నొక్కి వక్కాణించారు.
ఇది తేలికగా తీసుకునే విషయం కాదు. ఇక్కడ మరో విషయం చెప్పడం అనౌచిత్యం కాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతీ, యువకులకు అభిప్రాయ బేధాలొస్తే వారి దృష్టి తమ పెళ్లి మీదకీ, తాము తీసుకున్న నిర్ణయం మీదకీ పోతుంది. తమ 'పెళ్లి'లోనే లోపం ఉందనుకుంటారు. పెద్దలు చేసిన పెళ్లికి మూలాధారం- సంప్రదాయం. పిల్లలు చేసుకున్న పెళ్లి బలవెూ లేదా బలహీనతో - వారి నిర్ణయం.
ఆ నిర్ణయం తప్పని వారికి ఎప్పుడనిపించినా ఆ పెళ్లికి ముప్పు తప్పదు.
నేను తాడి చెట్టుకీ తాత పిలకకీ ముడి వేస్తున్నాననిపించినా - ఈ రెండు సందర్భాలలోనూ చిన్న పోలిక ఉంది. పక్కన కూర్చున్న వ్యక్తి కాలు తగిలే సందర్భం ఎవరికీ కొత్త కాదు. తెలిసిన వెంటనే పక్క వ్యక్తి 'సారీ' అనడమూ, సర్దుకు కూర్చోవడమూ జరుగుతుంది. అక్కడితో ఆ సందర్భానికి తెర పడుతుంది.
అలాగే - సభలో ఒక కుర్చీకి అతికించిన చీటీ వూడి కిందపడడమూ, కాలికి అంటుకోవడం అసాధారణం కాదు. కాలికింద అంటుకున్న చీటీని ఆ వ్యక్తి గుర్తించకపోవడమూ అసాధారణం కాదు. ఆయన మరో మిత్రుడితో మాట్లాడుతూ నవ్వుకోవడానికీ ఈ చీటీకీ ఎటువంటి సంబంధమూ లేకపోవచ్చు. ఆ పక్కన కూర్చున్నది కర్ణుడుగారు కాకపోతే ఈ ఆలోచనలన్నీ సబబుగా కనిపిస్తాయి.
కాని కర్ణుడుగారికి అలా అనిపించలేదు. ఆయన ఆయా సంఘటనలకీ తన 'కులానికీ' సంబంధం ఉన్నదని భావించారు. అందుకు బోలెడన్ని రుజువులూ, కారణాలూ ఆయనకి ఉన్నాయి. దళితుల పట్ల అత్యాచారాలు- ఇంకా ఈ దేశంలో - ముఖ్యంగా ఉత్తర హిందూ దేశంలో యిప్పటికీ ముమ్మరంగా జరుగుతున్నాయి. అమెరికాలో 'రంగు' వివక్షలాంటిదిది.
అయితే మారుతున్న సామాజిక దృక్పథం, చట్టాలు, ఆయా వర్గాలకు ప్రభుత్వం ఇచ్చే మద్ధతు- యివన్నీ - నచ్చకపోయినా సర్దుకుపోయేవారూ, తప్పనిసరిగా తలవొంచేవారూ- ఇప్పటికీ ఉన్నారు - నల్లవారిని - ఆ మాటకి వస్తే రంగుతక్కువ వారినందరినీ ఈసడించుకునే తత్త్వం ఇప్పటికీ అమెరికాలో, ఇంగ్లండు వంటి దేశాలలో కనిపిస్తుంది.
సామాజిక పరిణామంలో న్యాయమూర్తి స్థాయికి చేరగలిగిన ఒక చదువుకున్న దళితుడిలో ఈ న్యూనతా భావం - ఎంతో కొంత అభద్రతనీ, ఇంకా మనస్సులో తొలగిపోని వ్యత్యాసాన్నీ ప్రతిఫలిస్తుంది. దీనికి కారణం ఆయన దృక్పథం అనడానికి వీలులేదు. అలాంటి ఆలోచనలకు ఇంకా తావు కల్పిస్తున్న సమాజ ధోరణి .
వినడానికి, చూడడానికి అతి చిన్నవిగా కనిపించే సంఘటనలు - ఆలోచనలో సెన్సిటివ్‌గా భావించక తప్పని - ఇంకా మనస్సుని కలుక్కుమనిపించే స్థితిలో బాధిస్తున్న సమాజమూ ఉంది. బాధపడే మనుషులూ ఉన్నారు - అందుకు నిదర్శనం - కర్ణుడు.
 

                                               నవంబర్ 07,2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage