Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here
 
 

తెలుగోడు

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com
 

నా ఆరోగ్యానికి ముఖ్య రహస్యమొకటుంది. నేనేనాడూ తెలుగు ఛానళ్ళు చూడను. మధ్య కొన్నాళ్ళుగా విశాఖపట్నంలో ఉండడం జరిగింది. వద్దనుకున్నా - ఛానళ్ళు కళ్ళల్లో పడుతున్నాయి. అప్పుడప్పుడు - అక్కడక్కడా ఆగినప్పుడు బోధపడిన (కాదు - బోధపడని) విషయాలు కొన్ని ఉన్నాయి.
 - వేంకటేశ్వర సుప్రభాతంలో 'బూతు ' ఉన్నదని ఒక సాహితీ వేత్త బల్లగుద్దుతున్నాడు.
- వాల్మీకి బూతులు రాశాడని ఒకరు పేపర్లో గొంతు చించుకుంటున్నారు.
- శ్రీ శ్రీ అస్పృస్యత గురించి రాయలేదు కనుక ఆయన విగ్రహం టాంక్ బండ్ మీద ఉండనక్కరలేదని ఒకాయన అంటున్నారు. దీనికోసం  ఒక చర్చ. అయిదారుమంది గొంతులు చించుకుంటున్నారు.తన విగ్రహం పెట్టమని శ్రీ శ్రీ ఏనాడూ ఏడవలేదు. ఆయన్ని గౌరవించిన తరం పెట్టింది. అక్కరలేదనుకున్న తరం తీసేస్తుంది. దశాబ్దాల తర్వాత ఆయన దేశంలోనే లెనిన్  విగ్రహాలూ, ఆయన తరంలోనే సద్దాం హుస్సేన్ విగ్రహాలూ కూలాయి. ఏతా వాతా శ్రీ శ్రీ స్థానాన్ని నిర్ణయించేది విగ్రహాలు కాదు, టీవీ ఛానలు, పెద్దమనుషులూ కాదు - కాలం. ఆసక్తి ఉన్నవారు చదువుకుంటారు. లేకపోతే మానేస్తారు.
- ఒక ఛానల్ అసలు రాముడనేవాడున్నాడా? 'రామాయణం ' రచనేనా? వంటి ప్రశ్నల్ని టీవీ ఫ్రేమంతా కనిపించేలాగ ప్రకటించింది.
- ఒకాయన లలితకళా తోరణానికి పదికోట్లు ఇచ్చాడు. రాజీవ్ గాంధీ పేరుని కలిపారు. బి.ఎన్.రెడ్డిద మరేదో రెడ్డి పేర్లు పెట్టొచ్చు కదా అని ఒకాయన అంటున్నారు. మరేదో పేరు రాజీవ్ గాంధీది ఎందుకు కాకూడదు?
- సూటూ బూటూ వేసుకుని బిబిసీ లోనో, సి.ఎన్.ఎన లోనో అనౌన్సర్ని తలపించే   ఏంకర్ 'తెలుగు ఆత్మ గౌరవం' గురించి ఊదరగొట్టేస్తున్నాడు.
- మధ్యనే మా ప్రొఫెసర్ గారిని తలుచుకుని పూర్వ విద్యార్ధులు ఆయనకి నివాళులర్పించారు. అదే ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఒక ప్రొఫెసర్ గారు నిన్న తప్పతాగి యూనివర్సిటీకి వచ్చారట.
- మరో వార్తలు చదివే అమ్మాయి - నిస్సందేహంగా తెలుగు రాని అమ్మాయి - క్రికెట్ గురించి మాట్లాడుతూ - చుక్కలు చూపించాడు, దుమ్ములేపాడు, వీరబాదాడు - అంటోంది. క్రికెట్ వైభవాన్ని చెప్పడానికి ఇవి తెలుగు జాతీయాలు కాబోలు.
- టైముని అమ్ముకోడానికి 'వ్యభిచారం ' స్థాయిలో అడ్డమయిన విషయాల మీదా చర్చలు జరిపే - బొత్తిగా సంస్కృతి, సంప్రదాయం, విలువల గురించి అవగాహన లేని  ఛానళ్ళ యావ స్థాళీపులాక  న్యాయంగా  అర్ధమవుతోంది.
- ఇక శవాలు, కళేబరాలు, తలలు తెగిన మొండాలు, గోనె సంచుల్లో చుట్టిన పసిపిల్లలు, ముక్కుల్లో గుడ్డలు పెట్టిన మహిళల పీనుగులూ - హత్యకూ, జుగుప్సకూ, వెగటుతనానికీ 'సెన్సేషనలిజం' కూ బొత్తిగా తేడా తెలీని దృశ్యాలు పుంఖాను పుంఖాలు.
- తెలుగు ఛానళ్ళలో మొదటి పతనం - తెలుగుకి 'అధికార భాష'గాన మరేదో స్థాయిలోనో పెద్ద పీట వేయించాలనే తాపత్రయం పడే నేపధ్యంలో - తెలుగు భాష దయనీయ స్థితి.
- గ్రామాల నుంచి ఒక పాత్రికేయుడు మాట్లాడుతున్నాడు: 'ఇక్కడ గుడిలో పూజలు జరుగుతున్నాయి. 'అదేవిధంగా ' ఇంకా జరుగుతాయి. ఇక శివుడు 'గురించి చెప్పాలంటే ' - బాగా జరుగుతాయి. ఇక అమ్మవారి 'విషయానికొస్తే ' - 'అదే విధంగా' - 'అలాగే' పక్కనున్న మరో గుడి - 'అదే విధంగా ' -
- ఇక చర్చలు. 'ఫలానా ఆయన అలా అన్నారు. మీరిలా అంటారా? మీరిలా అనవచ్చుకదా? ' అంటూ యాంకరే రెచ్చగొట్టడం. చర్చలో ముగ్గులోకి లాగే తెలివయిన ప్రశ్నలు వేయడం రివాజు. కాని చర్చే అవసరం లేని   పిచ్చి సమస్యని ఎత్తుకుని - ముగ్గురిని పోగుచెయ్యడం. టీవి ఛానల్లో ఇద్దరు నాయకులు కెమెరాల ముందే చొక్కాలు చింపుకుని కొట్టుకున్నారు.
'లంజకొడకా ' అనే పరిమళ భరితమైన తిట్టు 28 సెకెన్ల క్లిప్పింగ్ లో 'టైంసు నౌ ' ప్రసారంలో - దేశమంతా గుబాళించింది. (చూడాలనుకున్నవారు దేసి షాక్ వీడియోస్ కి వెళితే ఇప్పుడు ముచ్చటని చూడవచ్చు)
- మరొక విచిత్రమైన ప్రేక్షకుల మద్దతు. 'రామాయణం దరిద్రమైన రచనా కాదా?' అన్న విషయం మీద చర్చ జరుగుతుందనుకోండి. యాంకర్ ప్రేక్షకులకి ఒక నంబరు ఇస్తాడు. అవునంటే ఫలానా పద్దతి, కాదంటే ఫలానా పద్దతి. ఎవరు చెప్పేది? రోడ్డు మీద టీవీ చూస్తున్న, చేతిలో సెల్ ఫోన్ ఉన్న వ్యక్తి. అతని కేమిటి అర్హత? సెల్ ఫోన్ ఉండడమే. అతనికీ రామాయణానికీ ఎటువంటి సంబంధమూ లేదు. చివరలో యాంకర్ ప్రకటిస్తాడు. రామాయణం దరిద్రంగా ఉన్నదని 85 శాతం అంటున్నారు. 15 శాతం పరవాలేదంటున్నారు.
మాధ్యమం
ప్రజల మనోభావాలను తీర్చిదిద్దే స్థాయి పోయింది. వారి అభిప్రాయాలకు అద్దం పట్టే డెమోక్రసీ వచ్చేసింది. ఇంతమంది తమ టీవీ చూస్తున్నారని పేరు టీవీకి. రామాయణం గొడవ ఎవరికీ అక్కరలేదు. సెల్ ఫోన్ లో నెంబరు నొక్కినవాడికి అసలక్కర్లేదు.
మరొక
గొప్ప ఉదాహరణ. రోశయ్యగారు మంత్రి వర్గ విస్తరణ చేస్తారా? చెయ్యాలా? అన్న ప్రశ్న మీద ప్రజాభిప్రాయం. ప్రశ్నలకి సమాధానం రోశయ్య గారికే తెలీదు. అధిష్టానం నిర్ణయించాలి. ఇక రోడ్డు మీద టీవీ చూసేవాడు చెప్పడం అసందర్భం, అనాలోచితం.

- మిడి మిడి జ్నానంతోఉన్న మేధావులు - స్పృశించనక్కరలేని చాలా విషయాలను నెత్తికెత్తుకోవడం, ఛానళ్ళు వాటిని అమ్ముకోవడం అతి నీచమయిన స్థితి. ఎవరి ప్రజ్నని వారు చూపడానికి సమాజంలో కావలసినంత 'చోటు ' ఉంది. వాటి స్తానాన్ని నిర్ణయించడానికి కాలం ఉంది. పక్కవాడి మొహానికి మసి పూయడం తమ గొప్పతనం ఏనాటికీ కాదు. అయితే - తామర తుంపరగా పెరుగుతున్న ఇన్ని ఛానళ్ళకు - పురాణాలు చదివేవారు కావాలి. పాటలు పాడేవారు కావాలి. స్థోత్రాలు కావాలి. వార్తలు కావాలి. దిక్కుమాలిన చర్చలు కావాలి. అర్ధం పర్ధం లేని వాదాలు కావాలి. అన్నిటికీ మించి అడ్డమయిన దానికీ 'తెలుగు వైభవం, తెలుగు ఆత్మగౌరవం' కావాలి.
వెనకటికి
చెలం గారు పక్క థియేటర్లో  ఎవరో హీరోయిన్ అరుస్తూ పరిగెడుతున్న ఆక్రోశం విన్నారట - 'తీసెయ్యకురోయ్ ' అంటూ. ఏమిటా తీసెయ్యకూడనిది అని జాగ్రత్తగా విన్నారట. తీరా 'శీల 'మని తేలిందట. ఆత్మ గౌరవం ' ఛానల్ కయినా చేతికి దొరికితే ఎత్తుకు పారిపోయి, పేటెంట్ చేసి, చావగొట్టి చెవులు మూసేవారని నాకనిపిస్తుంది.
ఇక్కడ
వ్రాత పూర్వకంగా ప్రకటిస్తున్నాను. నేను ఛానల్ నీ పూర్తిగా చూడలేదు. కారణం చూడలేకపోవడమే. తప్పునాదికాదు. రాజకీయ, సాంఘిక, ఆధ్యాత్మిక, సాహిత్య, ప్రసార, ప్రచార, వ్యక్తిగతమైన నీతి, వ్యవస్థాగతమయిన కమిట్ మెంట్ - సంబంధించిన అన్ని రంగాలలోనూ సమగ్రమయిన అవ్యవస్థనీ, అధోగతినీ సాధించిన నేపధ్యం నాలో తృప్తినీ, ఉత్సాహాన్నీ మిగిల్చింది. నేను తెలుగు దేశంలో లేనందుకు, తెలుగు ఛానళ్ళ బారిన పడనందుకు.

***
నవంబర్ 1, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage