Due to unavoidable reasons we could not upload Audio for this week.
  

   గాంధీ పుట్టిన దేశం

గాంధీ పుట్టిన దేశమిది. చిన్న అంగవస్త్రం చుట్టుకుని, చేతికర్ర పట్టుకుని, గొర్రెపాలు తాగి, మూడో తరగతి కంపార్టుమెంటులో ప్రయాణం చేస్తూ రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్య పాలకుల్ని గద్దెదించిన ఓ'బికారి' పుట్టిన దేశం. ఈ దేశంలో మంత్రిగారు 71 లక్షలో దుర్వినియోగం చేస్తే తప్పులేదని సమర్థించే ఓ కేంద్ర మంత్రి, పని సజావుగా చేశాక, కాస్త దోచుకున్నా తప్పులేదని ఐయ్యేయస్‌ అధికారులకు హితవు చెప్పే ఓ రాష్ట్ర మంత్రీ ఉన్నారు. భారతదేశం అవకాశవాదులు, రోగ్స్‌, అవినీతి పరుల పాలిట పడుతుంది -అని ఆనాడే వక్కాణించిన మాజీ బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ జోస్యాన్ని అక్షరాలా నిజం చేసే రోజులొచ్చాయి. కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్‌ వర్మ టీవీ కెమెరాల ముందు ముసి ముసి నవ్వులు నవ్వుతూ 'కేంద్రమంత్రికి 71 లక్షలు ఓ లెక్కా? 71 కోట్లు అయితే ఆలోచించవచ్చు' అనే హాస్యోక్తి దేశం చూసి పులకించింది. ఈ దేశంలో ఇలాంటి మాటలు అన్నాక కూడా చెల్లుబాటయిపోయే గాజులు తొడిగించుకున్న పాలక యంత్రాంగం వుంది, దీనిపేరు ప్రజాస్వామ్యం.
గాంధీ జీవితంలో రెండే రెండు సంఘటనలను ఇక్కడ గుర్తు చేసుకోవడం సముచితంగా వుంటుంది. దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కులకోసం బాపూజీ పోరాటం సాగిస్తున్న రోజులివి. ఆనాటి ప్రభుత్వం -ప్రతీ భారతీయుడూ తమ గుర్తింపు కార్డుల కోసం వేలి ముద్రలివ్వాలని చట్టాన్ని చేసింది. ఎట్టి పరిస్థితులలోనూ యివ్వరాదని గాంధీజీ భారతీయులకు ఉద్భోధించారు. తత్ఫలితంగా -వందలాది మందిని అరెస్టు చేశారు. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి 'సహాయ నిరాకరణ', 'సామూహిక చట్ట ఉల్లంఘన' వంటి ఉద్యమాల రుచి తెలియదు. ప్రభుత్వ యంత్రాంగం నిలిచిపోయింది. ఏం చెయ్యాలో ప్రభుత్వానికి కొరుకుడు పడలేదు. జైలులో ఉన్న గాంధీజీని -గవర్నరు జనరల్‌, అప్పటి ఫీల్డ్‌మార్షల్‌ క్రిస్టియన్‌ స్మట్స్‌ తన కార్యాలయానికి పిలిపించారు. జైలు దుస్తుల్లో, చేతులకి బేడీలతో గాంధీజీని తీసుకువచ్చారు. బేడీలు తీసి, ఆయన్ని స్మట్స్‌గారి సమక్షంలో నిలిపారు. గాంధీజీ మాటలకి లొంగే ఘటం కాదని తేల్చుకుని -ఈ చట్టాన్ని ఉపసంహరిస్తూ -అక్కడికక్కడే గాంధీజీని జైలు నుంచి విడుదల చేశారు. ఒకడుగు వేసి, తన జైలు దుస్తుల్ని చూసుకొని గాంధీజీ ఆగారు. ''ఈ బట్టల్లో నడిచి వెళ్లడం కన్నా -టాక్సీలో వెళ్తాను, నాకు డబ్బు అప్పుకావాలి'' అన్నారు గాంధీజీ గవర్నర్‌ జనరల్‌తో. స్మట్స్‌ నిర్ఘాంతపోయారు. ''ఎంతకావాలి?'' అన్నారు. 'ఒక షిల్లింగ్‌'. స్మట్స్‌కి ఏం చెయ్యాలో తెలీక తన సహచరుడు డేనియల్‌ని అడిగారు. ఈ నిజాయితీ వారికి అర్థం కానిది, ఊహించనిది. జేబులోంచి ఒక షిల్లింగ్‌ తీసి యిచ్చారు.
కోట్లు స్వాహా చేసి, అరెస్టయి నెలల తరబడి జైళ్లలో ఉండి నిరపరాధిగా కాక, కేవలం బెయిల్‌మీద విడుదలయిన -మన కాలం నాటి కేంద్ర మంత్రులు (ఉదాహరణకు ఏ రాజా) ఒక సామ్రాజ్యాన్ని జయించినట్టుగా జైలు తలుపులు తీసుకురావడం, వారి చెంచాలు ''సత్యమేవ జయతే'' అనే నినాదాలు చేయడం చూస్తున్నాం. అలనాడు గాంధీ తనని అరెస్టు చేసిన గవర్నరు జనరల్‌ దగ్గర ఒక షిల్లింగ్‌ అప్పుచేసి టాక్సీలో ఇంటికి వెళ్లాడు. మహా గౌరవనీయులయిన బేణీ ప్రసాద్‌ వర్మ గారి కిది పాఠంగా చెప్పాల్సిన సంఘటన. బాబూ! మనది ప్రజాస్వామ్యం.
మరొక సంఘటన. భారత స్వాతంత్య్ర పోరాటపు రోజుల్లో బీహార్‌లో చంపారన్‌ ప్రాంతంలో ఇండిగో కార్మికుల ఇక్కట్లను పరిష్కరించడానికి గాంధీజీని ఆహ్వానించారు. ఆయన రైలు దిగినప్పుడు వేలాదిమంది స్వాగతం పలికారు. బ్రిటిష్‌ పోలీసులకి పచ్చి వెలక్కాయ నోట్లో పడిన పరిస్థితి. ఏం చెయ్యాలో తెలీక గాంధీజీని అరెస్టు చేశారు. ఆయన్ని మెజిస్ట్రేట్‌ ముందు నిలబెట్టారు. చంపారన్‌ శాంతి భద్రతల దృష్ట్యా వెంటనే రాష్ట్రాన్ని వదిలివెళ్లవలసిందిగా మెజిస్ట్రేటు శాసించారు. నేను వెళ్లనన్నారు గాంధీజీ, ఏం చెయ్యాలో మెజిస్ట్రేట్‌కి అంతుబట్టలేదు. ''అయితే నిన్ను విడుదల చెయ్యడానికి వంద రూపాయలు జరిమానా విధిస్తున్నాను'' అన్నారు. నేను వంద రూపాయలు చెల్లించనన్నారు. మెజిస్ట్రేటు జీవితంలో -బహుశా భారత దేశ చరిత్రలోనే ఇటువంటి ఖైదీని ఎవరూ చూసివుండరు. ఏం చెయ్యాలో తెలీక -విలవిలలాడి ''అయితే వంద రూపాయలు చెల్లించనక్కరలేకుండానే నిన్ను విడుదల చేస్తున్నాను'' అన్నారు మెజిస్ట్రేట్‌. ఒక షిల్లింగ్‌, వంద రూపాయలూ -విలువ కేవలం డబ్బు కాదు. (ఏ.రాజాలూ, బేణీప్రసాద్‌ వర్మలూ తమరు గ్రహించండి) ఒక వ్యక్తి నైతికమయిన, ఒక జాతి సగర్వంగా తలెత్తుకోవలసిన అపురూపమయిన క్షణాలు. ఆ వ్యక్తి మహాత్ముడయ్యాడు. మన దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి పెట్టారు. మరో 60 ఏళ్ల తర్వాత 71 లక్షలు దోచుకోవడం అంత పట్టించుకోవలసిన విషయం కాదని కెమెరా ముందే చెప్పి, పదవిని నిలుపుకొన్న దోపిడీ దారుల పాలనలో వున్నాం. పనిచేసి దోచుకోవచ్చునని బోధించే రాష్ట్ర మంత్రుల హయాంలో బ్రతుకుతున్నాం. వారికి గాంధీజీ అప్పుచేసిన ఒక షిల్లింగ్‌, చెల్లించడానికి నిరాకరించిన వందరూపాయలూ గడ్డిపరకల్లాగ, గాంధీజీ వెర్రిబాగుల వారిలాగ కనిపించవచ్చు.
బాబూ!మనది ప్రజాస్వామ్యం. అదే మన దరిద్రం.
 
 


      gmrsivani@gmail.com  

 
                                                                           అక్టోబర్  29, 2012

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage