Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here
 
 

పతివ్రతల దేశం

గొల్లపూడి మారుతీరావు
      gmrsivani@gmail.com
 



’మాంగల్యానికి మరోముడి’ సినీమాకి దర్శకుడు కె.విశ్వనాథ్. నేను రాసిన చిత్రం అది. అందులో నాకిష్టమైన పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్రని గిరిజ చేసింది. నాలుగయిదు వాటాలున్న లోగిలి అది. అల్లు రామలింగయ్య, మిగతా ఎందరో అద్దెలకుంటున్నారు. ఒక ఇంట్లో భార్యా భర్తలున్నారు. భార్య సావిత్రి. మహా పతివ్రత. ఆమె భర్తని సినీమాలో ఎప్పుడూ చూపలేదు. ఒక గొంతు మాత్రం వినిపిస్తూ ఉంటుంది. - ’సావిత్రీ!’ అని గర్జిస్తూ. ఆ గొంతు విశ్వనాథ్ ది. ఈమె కంగారు పడుతూ ’వస్తున్నానండీ..’ అంటూ పరిగెత్తుతుంది. సీనుల్లో మధ్య మధ్య ఉన్నట్టుండి వస్తుంది - "బాబాయి గారూ! మా ఆయన మళ్ళీ కొట్టారు "అంటూ.
అల్లు అంటాడు.."నువ్వు సీత , సావిత్రి వంటి మహా పతివ్రతవి కనుక అలాంటి భర్తతో వేగుతున్నావమ్మా" అని. అంతే! తళ తళా మెరిసే అరచేతి సైజు మంగళసూత్రాలను కళ్ళకు అద్దుకుంటూ తృప్తిగా లోపలికి వెళ్ళిపోతుంది. ఆమె పేరు సావిత్రి.
మధ్య మధ్యలో మళ్ళీ వస్తూంటుంది. "ఏమండీ..మా ఆయన కొట్టారు.."అంటూ.
మిగతా వాళ్ళకి రొటీనయిపోయింది. "అనెయ్యవయ్యా - ఓ పనైపోతుంది.." అంటూ..
"నువ్వు సీతా సావిత్రి వంటి.." అంతే..ఆవిడ నిష్క్రమిస్తుంది.
ఈ పతివ్రతకి భర్త పెట్టే హింసకంటే సమాజం ఇచ్చే ఊరడింపు, కితాబు పెద్ద మార్ఫియాలాగ పనిచేస్తుంది. ఇందులో ఒక కరుకు నిజం ఉంది. తరతరాలుగా సంప్రదాయంలో మునిగి, తేలి, ఊరి , నానిన విలువలను ప్రశ్నించాలని, ప్రశ్నించవచ్చని, ప్రశ్నించే అవసరం ఉందని ఆలోచనలోకైనా తెచ్చుకోని వ్యక్తులెందరో ఉన్నారు. ఎన్నో సమాజాలున్నాయి. ఎన్నో దేశాలున్నాయి. ఎన్నో మతాలున్నాయి.
బురఖాని నిషేధించాలని కొన్ని దశాబ్దాలుగా యూరోపు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కాని ఆయా సమాజాలలో ఆటుపోటులొస్తున్నాయి. ఎట్టికేలకు బెల్జియం బహిష్కరించింది. ఫ్రాన్స్ బహిష్కరించనుంది. "ప్రపంచం అభ్యుదయ పధంలో ప్రయాణం చేస్తుండగా మహిళని బురఖా వెనుక మ్రగ్గమనడం పరమ ఛాందసం " అన్నారు ఫ్రెంచి అధ్యక్షుడు శార్కోజీ. కాని ఆ దేశంలోనూ పతివ్రతలున్నారు. ఒక మహిళ బురఖాలోంచే సమాధానం చెప్పింది. "ఇది మా మతం. మా సంప్రదాయం..మా హక్కు. మేం అలా బానిసల్లాగ భావించడం లేదు. మా మతం కట్టుబాట్లను గౌరవించి బతుకుతున్నందుకు గర్వపడుతున్నాం. " అని.
అయ్యా కొన్ని దేశాల్లో కొన్ని సౌకర్యాలున్నాయి. సౌదీలో మందుకొట్టే ఆస్కారం లేదు. యూరోపు దేశాల్లో మీ ఇష్టం. ఆరబ్ దేశాల్లో ఎంతమంది భార్యలనయినా పెళ్ళీ చేసుకోవచ్చు. మన దేశంలో బహుభార్యాత్వం నేరం. వద్దనుకుంటే ’తలాఖ్’ అని మూడు సార్లు చెప్పి ఆ భార్యల్ని వదిలించుకోవచ్చు. మన దేశంలో విడాకుల జిడ్డు సంవత్సరాలు వదలదు. ఫ్రాన్స్ కి వెళ్ళావా..మంచి షాంపేన్ రుచి చూడవచ్చు. పనామాలో మంచి చుట్టలు కాల్చుకోవచ్చు.
మొన్న మొన్ననే అబూదాభీ లో యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ సుప్రీం కోర్ట్ - పతివ్రతలకు కొన్ని సౌకర్యాలు కల్పించింది. భర్తల్నీ, పిల్లల్నీ చావగొట్టి బొత్తిగా జాగర్తలు తీసుకోకుండా ముఖాలమీదా, చేతులమీదా తట్లు తేలేట్లు కొడుతున్నారని సుప్రీం కోర్టు బాధపడింది. ముఖ్యంగా పెళ్ళాల్ని కొట్టే భర్తలకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. "బాబూ! మీరు మీ పెళ్ళాల్ని, పిల్లల్ని చావగొట్టుకోండి. అది మీ ఇష్టం, మీ హక్కు..మీ పెళ్ళాలు పతివ్రతలని మాకు తెలుసు. కాని వొంటి మీద ఏ మచ్చలూ కన్పించకూడదు. గీతలు పడకూడదు.." అని సెలవిచ్చింది.
ఏతా వాతా పోలీసోడి దెబ్బల్లాగ ఉండాలని కోర్టు ఉద్దేశం. నొప్పి పుట్టాలి..కాని దెబ్బ కన్పించకూడదు. కొట్టాలి..కాని రుజువులు మిగలకూడదు. నా ఉద్దేశం ఎమిరేట్స్ భర్తలు కొన్నాళ్ళు ఆంధ్రా పోలీసుల దగ్గర రిఫ్రెష్ కోర్స్ తీసుకోవాలని.
"ఇస్లాం చట్టం క్రమశిక్షణ కోసం  పెళ్ళాన్ని కొట్టడానికి అంగీకరిస్తుంది. అయితే ఈ హక్కుకి కొన్ని నిభందనలున్నాయి" అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫలా అల్ హజేదీ తీర్పునిచ్చారు. "అలాగే మీ పిల్లల్ని మీరు కొట్టుకోండి. కాని 23 యేళ్ళు దాటిన ఆడపిల్లల్ని కొట్టకూడదని షారియా చట్టం చెబుతోంది" అన్నారు. మరి పెళ్ళయ్యాక? వయస్సుతో నిమిత్తం లేకుండా అప్పుడు భర్త క్రమశిక్షణ కోసం భార్యని కొట్టుకోవచ్చు. అది వేరే విషయం. అయితే చర్మం మీదా , వొంటి మీదా వాతలూ, గీతలూ ఉండరాదు. భర్త కొడుతున్నప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి దెబ్బనీ ఆచితూచి కొట్తవలెను. మచ్చలు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకొనవలెను.
ఈ మధ్య ఒకాయన పెళ్ళాన్ని కింది పెదవిమీదా, పంటి మీదా దెబ్బలు కనిపించేట్టు బాధ్యతా రహితంగా చావబాదాడు. అలాగే కూతుర్ని కుడి చేతిమీదా, కుడి మోకాలి మీదా దెబ్బలు కనిపించేట్టు కొట్టాడు ఇలాంటి పని చేస్తే - బొత్తిగా అరాచకం ప్రబలిన మన దేశంలో అతన్ని అరెస్టు చేస్తారు. ఛానెళ్ళ వాళ్ళు అతన్ని నెత్తిని వేసుకుని ఊరేగుతారు. మహిళా స్వేఛ్చని ఘోషించే సంఘాలు గొంతులు చించుకుంటాయి. కాని ఎమిరేట్స్ సుప్రీం కోర్టు కేవలం అయిదువందలు దిర్హాన్లు జరిమానా వేసి " నీ పెళ్ళాన్ని, పిల్లనీ కొట్టుకునే హక్కు నీకుంది బాబూ..కానీ ముందు జాగ్రత్తలు తీసుకుని కొట్టుకో" అని బుధ్ది చెప్పింది. ఈ ఒక్క కారణానికే నాకు ఎమిరేట్స్ మీద మక్కువ పెరుగుతోంది.
అయ్యా ఈ దేశాల్లో పతివ్రతలదే ప్రధమ స్థానం. ఇక్కడ మేధా పాట్కర్ లూ, అరుంధతీ రాయ్ లూ, ఉమెన్స్ లిబ్బులూ దొబ్బవు.



***
అక్టోబర్
25, 2010

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage