Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version.
Click Here

 

కొత్త నీరు          .

        ఈ మధ్య హైదరాబాదులో టీవీ చూస్తూ ఓ కొత్త సినీమా శీర్షిక కనిపించగానే ఆనందంతో హాహాకారాలు చేశాను. ఆ చిత్రం పేరు: "సారీ, మా ఆయన ఇంట్లో వున్నాడు

          దాదాపు 27 సంవత్సరాల క్రితం "ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్యపెద్ద హిట్ అయినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మెచ్చుకున్నారుగాని ఒకే ఒక్క సమీక్ష నాకు బాగా గుర్తుండిపోయింది. అది చేసింది నిర్మాత  నవతా కృష్ణంరాజుగారు. "ఆ సినీమాలో చిన్న బూతు వుందండీ. అది ఆడియన్స్ కి బాగా పట్టింది అన్నారు.

          సమాజంలో రంకు నడుపుతూ పెద్దమనిషిలాగ చెలామణీ అయే ఓ దొంగముండా కొడుకు, పెద్దమనిషి అయివుండీ  పెద్దమనిషినని పెళ్ళాం దగ్గరే నిరూపించుకోలేని నిస్సహాయుడైన పెద్దమనిషి కధ అది. అందులో నేను దొంగముండా కొడుకుని. "మాపల్లెలో గోపాలుడు లో పెద్ద పులుసు, చిన్న పులుసు శృంగారం వాటా కూడా నాదే. ఈ 27 సంవత్సరాలలో బూతు పెరిగి పెరిగి యిన్నాళ్ళకి విశ్వరూపం దాల్చింది.

          ఎన్నో దశాబ్దాల క్రితం "బాలరాజు చిత్రంలో కస్తూరి శివరావు "నా అప్పడాల కర్రా, నా ఆవకాయ బద్దాఅని పాట పాడితే పెద్దమనుషులు ఆ రోజుల్లో బుగ్గలు నొక్కుకున్నారు.

          ఈ రోజుల్లో తెరమీద సంభోగం మినహా అన్ని భంగిమలూ ఏమీ సందిగ్డం లేకుండా చూపితే ప్రేక్షకులు కేరింతాలు కొడుతూ ఆనందిస్తున్నారు. మన సంస్కృతిలో చాలా మార్పులు వచ్చినట్టే- అభిరుచుల్లో, అభిప్రాయాల్లో, దృక్పధాలలో, అలవాట్లలో, విశృంఖలత్వంలో ఎన్నొ రకాల మార్పులు వచ్చాయి.

          వ్యక్తుల మధ్య సంబంధాలలోనూ మార్పులు వచ్చేశాయి. ఇదివరకు పనిమనుషులు "అయ్యగారు, అమ్మగారు అనేవారు. మొన్న ఓ పనిమనిషి వచ్చింది. జీతం గట్రా మాట్లాడుకుంటూ "అంకుల్ ఏం చేస్తారు?అనడిగిందట మా ఆవిడని. ఆ పనిమనిషి అంకుల్ వాళ్ళాయనేనని మా ఆవిడకి అర్ధం కావడానికి చాలా సమయం పట్టిందట. ఆ మధ్య వైష్ణోదేవి యాత్రకి వెళ్ళాను. డోలీని మోసే బోయీలు చక్కగా "అంకుల్, కాస్త పక్కకి జరగండిఅని నాతో వరస కలుపుకున్నారు. "మేనళ్ళుల్లూ, జాగ్రత్తగా తీసుకువెళ్ళండిఅందామని ఆవేశం వచ్చిందికాని "నెవ్యూలూ అంటే వాళ్ళకి అర్ధం కాదేమోనని ఊరుకున్నాను.

          ఇప్పుడిప్పుడు గర్ల్ ఫ్రెండూ, బోయ్ ఫ్రెండూ ఉండడం వ్యభిచారం అనిపించుకోదు. అభిరుచి, ఫాషన్ అనిపించుకొంటుంది. ప్రపంచ చలన చిత్రోత్సవాలలో విదేశీ చిత్రాలను చూస్తూంటాను. చాలా దేశాలలో- ఇరాన్,ఇండియా వంటి వెనుకబడిన దేశాలలో తప్ప- సెక్స్ ఆటవిడుపు, వినోదం, జీవితంలో విసుగుదల నుంచి విముక్తి, ఓ గేలం, ఓ ఎర, ఓ శక్తి, ఓ ఆయుధం. అప్పుడెప్పుడో మన దేశంలో స్త్రీ పురుషుల మధ్య సెక్స్ ని సమాజం ఉత్సవంలాగ జరిపే ఘట్టం ఇప్పటికీ కొందరు జరుపుతున్నారు. శోభనం వివాహంలో ఓ భాగం.  సెక్స్ కీ వారసత్వానికీ, వంశాభివృద్ధికీ, సంప్రదాయానికీ, ముందు తరాల జీన్స్ కీ లంకె వుందని భావించే "వెనుకబడినజాతి ఇంకా మనమధ్య ఉంది. ఏడు తరాల జీన్స్ ఏదో తరంలో తప్పక నిలదొక్కుకుంటాయన్నది శాస్త్రీయంగా నిరూపణ అయిన సత్యం.

          వివాహంలో నూతన వధూవరులు తలంబ్రాలు పోసుకున్నప్పుడు వరుడు ఓ మంత్రం
చెప్తూ వధువు తల మీద తలంబ్రాలు పోస్తాడు. "ప్రజామే కామస్సమృధ్యతామ్
అంటాడు. నేను కోరిన సంతానాలు సమృద్ధిగానుండుగాక- అని దానర్ధం.

          నక్షత్రాల హొటళ్ళలోనో, పార్కుల చెట్ల నీడల్లోనో అబ్బాయిలూ అమ్మాయిలూ ఇలాంటి దుర్భాషలాడతారనుకోను. ఆ మధ్య ఓ పత్రిక నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఓ ప్రశ్న అడిగిందావిడ. "2050 కన్యాశుల్కమా? వరకట్నమా? సీనేంటంటారు? అని. "అసలు వివాహ వ్యవస్థ వుంటుందో లేదో అన్నాను. ఇది చదివిన - బొత్తిగా చదువుకున్న పెద్దమనిషి- కందాళం పార్ధసారధి అనే ఆయన తన కూతురు పెళ్ళి శుభలేఖ లోనే భాగంగా మన వివాహ వ్యవస్థ వైభవాన్ని ఉటంకిస్తూ "పెళ్ళి పుస్తకంగా ముద్రించి అందరికీ పంచాడు. ఇలాంటి అమాయకుల్ని మనం సుళువుగా క్షమించవచ్చు.

          ఏతావాతా, నాకు నచ్చిన సినీమా శీర్షిక స్పూర్తితో మరికొన్ని కొత్త చిత్రాల పేర్లని సూచిస్తున్నాను. "గదివెనుక గొళ్ళాం తీసే వుంటుంది’’, "అయ్యో, గదిలో జాకెట్టు మరిచిపోయాను, "మళ్ళీ...అప్పుడేనా!”, "కిటికీ మీద సెల్ ఉండిపోయింది చూడు’, "ఆ తలుపు గొళ్ళాం పెట్టు”, "మా ఆయన మళ్ళీ గొడవ చేస్తున్నాడు", "ఈసారి ఎక్కడ కలుద్దాం?

          నేను సినీమాలు రాసే రోజుల్లో మంచి టైటిల్ పెడితే నిర్మాత నాకు మంచి వాచీ కొనిచ్చే సంప్రదాయం ప్రారంభించాను- మనుషుల్లో దేవుడు, మరపురాని తల్లి, దేవుడు చేసిన పెళ్ళి-ఇలాంటివి. ఇప్పుడలాంటి దిక్కుమాలిన టైటిల్స్ పెడితే వాచీలు మాటేమోకాని వీపు వాచిపోతుంది. అయినా అలాంటి ఇబ్బందులు లేవు. "ఛీ, మళ్ళీ ఆమాటంటే మూతి మీద తంతాను అన్నామనుకోండి. ఇందులో నాలుగయిదు సినీమా టైటిల్స్ వున్నాయ్. "ఛీ’’,"మళ్ళీ ఆమాటంటే”, "మూతి మీద”, "తంతాను. ఇంకా మాట్లాడితే  "మళ్ళీ” "ఆ మాటంటే రెండు టైటిల్స్ గా పనికొస్తాయి.

          చివరగా ఒక్క మాట. "సారీ, మా ఆయన ఇంట్లో వున్నాడు సినీమాను నేను తప్పకుండా చూస్తాను. ఆవిడెవరో, వాళ్ళాయన ఆ రోజు ఇంట్లో ఎందుకున్నాడో, సారీ చెప్పాల్సిన పెద్దమనిషి సౌందర్యం ఎలాంటిదో- యివన్నీ నాకు ఉత్సాహాన్నిచ్చే విషయాలు. కేవలం టైటిల్ తో నిర్మాత  నా వాటా వంద రూపాయల్ని కొట్టేశారు!

          అయ్యా, చేసుకున్నవాడికి చేసుకున్నంత!  

         అక్టోబర్ 19, 2009

       ************               ************           *************          *************
    
You can mail your opinions directly to Maruthi Rao Garu at gmrsivani@gmail.com
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com

Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

KOUMUDI HomePage