Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 

 అరాచకానికి ఆఖరి మలుపు

 
ఇంటికి పెద్దవాడుంటాడు. పెద్దరికం ఒకరిచ్చేది కాదు. ముఖ్యంగా ఇంటి పెద్దరికం. తండ్రినో, తాతనో మనం నిర్ణయించలేదు. మన ఉనికిని వారు నిర్ణయించారు. ఆ పెద్దరికాన్ని ఎదిరిస్తే ఏమవుతుంది? మన ఉనికికి కారణమయిన పాపానికి వారు తలొంచుతారు. నిస్సహాయంగా బాధపడతారు. కృతఘ్నతకి పరిహారం లేదు. "నువ్వెంత?" అని ముసిలి తండ్రిని ఎదిరిస్తే అతని గుండె పగులుతుంది. అందువల్ల ఆ గుండెకే గానీ దేశానికి నష్టం లేదు. కానీ ఓ వ్యవస్థ కూలిపోవడానికి అది ప్రారంభం. ఈ ఎదిరింపుకి ఒక పేరుంది. అవ్యవస్థ. అందువల్ల వచ్చే పరిణామం పేరు అరాచకం.ఇక దేశం విషయం. దేశానికి పెద్దని మనం ఎన్నుకున్నాం. ప్రాంతాల్లో పెద్దల్ని ఆ ప్రాంతాల ప్రజలు ఎన్నుకున్నారు. ఈ వ్యవస్థ సుగమంగా నడవడానికి కేంద్రమూ, రాష్ట్రమూ పరస్పర అవగాహనతో, ఒకరినొకరు గౌరవించుకుంటూ నడవాలి. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం కాదన్నా, పార్టీ ప్రయోజనాలకు కేంద్రం రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినా అవ్యవస్థ ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అప్పుడే సంప్రదాయం బలం. తల ఒంచుకు నష్టపోమని మన సంస్కారం నేర్పింది. కానీ కేంద్రం మాటకి తలొంచి తన పదవిని, తన ప్రభుత్వ ఆధిక్యాన్ని - వెరసి తన స్వలాభాన్ని నష్టపోయే ప్రాంతీయ పాలక్ల సంస్కారం ఇవాళ ఎక్కడేడిసింది? ఫలితం - అరాచకం. ఇంకా ముందుకు పోతే పరాయి దేశాల దోపిడీకి దగ్గర తోవ. ఇది - కొండకచో - చట్టాలూ, శిక్షలూ, ఆంక్షలకు మించి వ్యవస్థ పాటించవలసిన - 'ధర్మం '. అదీమాట. కానీ రాజకీయ నిఘంటువులలో ఇది బూతు మాట.
ఈ ధర్మాన్ని పాటించకపోతే? దేశం కుక్కలు చింపిన విస్తరవుతుంది. వ్యవస్థ బలహీనమవుతుంది. ప్రాంతాలు నీరసపడతాయి. ఒకరికొకరు ఆసరా కారు. ఇలాంటి కప్పల తక్కిడి వాతావరణంలో మనదేశాన్ని చీల్చి వాడుకున్న ఈస్టిండియా కంపెనీ, బుడకీచుల కథలు మనకి తెలుసు. తండ్రిని ఎదిరించిన కొడుకు తన మునిమనుమడికి ఈ అరాచకాన్ని వారసత్వంగా ఇస్తాడు. మూడు తరాలనాటికి ఈ స్వార్ధానికి బలమైన బలమైన వేళ్ళు నిలదొక్కుకుంటాయి. కేంద్రాన్ని కాదన్న రాష్ట్రం మరొక అవకాశవాదికి ఆసరా అవుతుంది. ఒక నాయకుడికి పబ్బం పదవి వస్తుంది. బొజ్జ నిండుతుంది. కాని వ్యవస్థ అడుక్కుతింటుంది. తండ్రిని ఎదిరించిన కొడుకు అరాచకాన్ని ఎవరూ పట్టించుకోరు. అతి వ్యక్తిగతమైన కుసంస్కారం. వ్యవస్థలో ఈ కుసంస్కారానికి బలం చేకూరడానికి దశాబ్ద్దాలు పడుతుంది. అప్పటికి వేళ మించిపోతుంది. ఒక బ్రిటిష్ పాలన పునాదులకు 150 ఏళ్ళు పట్టింది. ఒక మహాత్ముడి అవసరం కలిగింది. ఇది చరిత్ర.
ఇలాంటి అరాచకానికి ఈ మధ్యనే పునాదులు పడుతున్నాయి. మూడే మూడు ఉదహరణలు:
ఒకప్పటి సైన్యాధిపతిని - ఏ కారణం చేతనయినా ఇద్దరు హత్యచేశారు - పంజాబులో. ఆ హంతకుల కుటుంబాలను అమరవీరులుగా ప్రభుత్వ యంత్రాంగమే మొన్న సత్కారాలు చేసి అభినందించింది. నిన్న ఓ ఛానల్లో ఓ పాత్రికేయుడు 'ఇది తప్పుకాదా?' అని అడిగాడు. అ పార్టీ ప్రతినిధి ఆవేశంగా మొన్న కాశ్మీరులో జరిగింది, అటు మొన్న పార్లమెంటులో జరిగింది, ఆ మద్య ముంబైలో జరిగినవాటికి ఈ వ్యవస్థ ఏం పీకింది? అని గొంతు చించుకున్నారు. భేష్. ఇదీ ఈనాటి రాజకీయ వ్యవస్థ బుకాయింపు. మీరు మీ నాన్నని 'వెధవా' అన్నారు. కనుక నేను మా నాన్నని 'లంజా కొడకా' అనవచ్చు. నీతికి పాత తప్పుల్ని ఓరవడిగా చేసుకోవదం 'సాకు అవుతుంది కానీ 'సమర్ధన' అవదు. ఇదీ ఈనాటి అరాచకానికి పునాదులు వేస్తున్న తరానికి ప్రతినిధులు. బురదలోంచి పద్మం రావడం సృష్టి. బురదలోకి పంది రావడం సహజ లక్షణం.
మరో కథ. కావేరీ జలలు తమిళనాడుకి ఇవ్వాలని ఒప్పందం. ఇవ్వవలసిందే అన్నారు మొన్న ప్రధాని కర్ణాటక ప్రతినిధి వర్గంతో. కోర్టూ నిర్దేసించింది. కానీ కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకి నీరు ఇవ్వడాన్ని నిలపవేసింది. కోర్టూ, ప్రధానీ, రెండు రాష్ట్రాల ఒప్పందం - ఇన్నిటిని కాదన్నాక ఇక ఈ వ్యవస్థలో బలమెక్కడ? జలల పంపిణీ ప్రసక్తి కాదిక్కడ. చట్టం పట్ల. ప్రభుత్వం పట్ల మర్యాద మాట.
మూడో కథ. గత నెలలో రాజస్థాన్ లో కేవలం 15 మానభంగాలు మాత్రమే జరిగాయి. 'అన్ని చోట్లా జరుగుతున్నాయి. మా రాష్ట్రంలోనే కాదు' అని తృప్తి చెందారు ఓ రాజస్థాన్ మంత్రిగారు. మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతలా గారు. మరొకడుగు ముందుకు వేసి "అందుకే నేనంటాను - పదిహేనేళ్ళ లోపు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసెయ్యండి. లేకపోతే మానభంగాలు తప్పవు" అంటూ అనూచానంగా వస్తున్న గ్రామీణ ఛందసపు (ఖాప్) పంచాయితీల ధోరణిని సమర్ధించారు. పదిహేనో ఏట పెళ్ళిళ్ళు చట్టరీత్యా నేరం. ఆ విషయం ఒకప్పటి ముఖ్యమంత్రిగారికి తెలియదా? వారు ప్రస్తుతం పదవిలో లేరు. రేపటి ఓట్లకి ఈ ఉవాచ పెట్టుబడి. ఈ దేశంలో అందరు నయకులూ ఈ మాటల్ని వినీవిననట్టు ముఖాలు అటు తిప్పుకున్నారు. ఒక నీచపు ఉదాహరణ. అశుద్దాన్ని మొహం మీద విసిరితే ముఖం తిప్పుకున్నా, ఎక్కడ పడినా దాని దుర్వాసన భరించక తప్పదు.
మన శత్రువులు ఈ ప్రాంతీయ నాయకుల విశృంకలత్వాన్ని గమనిస్తూనే ఉంటారు. మరో పదేళ్ళకి కాకపోయినా మరో ఇరవై ఏళ్ళకయినా ఓ పాకిస్థాన్ (అప్పుడే ఐ.యస్.ఐ ఖాలిస్థాన్ దౌర్జన్యకారులను దువ్వుతోందని వింటున్నాం), మరో చైనా, మరో నేపలు, మరో బర్మా మనకి పాలకులయితే ఆశ్చర్యం వద్దు. నేపాలు, బర్మాల గురించి చెప్పినప్పుడు కొందరికి నవ్వు రావచ్చు - మనం అంత తీసిపోయమా అని. అయ్యా, బలహీనమయిన సర్పానికి చలిచీమ చాలు. అలనాడు ఈస్టిండియా కంపెనీ అలాంటి చలిచీమే!
 


      gmrsivani@gmail.com  

 
                                                                           అక్టోబర్  15, 2012

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage