Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here విపత్తు- విపరీతం చరిత్రలో ఎన్నడూ వూహించని విపత్తు ఆంధ్రరాష్ట్రంలో జరిగింది. కృష్ణా, గుంటూరు, మెహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాలలో కృష్ణా, తుంగభద్ర నదీజలాలు సృష్టించిన భీభత్సం భయానకం, నష్టం హృదయ విదారకం. దశాబ్దాల కిందటి మాట. అప్పటి అమెచ్యూర్ నాటక రంగ ప్రముఖుడు, మహానటుడు కె.వెంకటేశ్వరరావు కొడుకు పోయాడు. ఈ విషయం తెలీని రేడియో అధికారులు ఆయన్ని రేడియో నాటికలో నటించడానికి పిలిచారు. అప్పట్లో రేడియో ప్రసారాలు సరాసరి సాగేవి. రికార్డింగుల్లేవు. కొడుకుని పోగొట్టుకున్న తండ్రి పాత్రని వెంకటేశ్వరరావు పోషించాలి. ప్రసారంలోనే బావురుమన్నాడు వెంకటేశ్వరరావు. అప్పుడు ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్.ఎన్.మూర్తిగారికి తెలిసింది అతనినష్టం. కాని ఎదురుగా ప్రసారం జరిగిపోతోంది. ఇప్పుడేం చెయ్యాలి? అతన్ని ఎలా ఓదార్చాలి? ఆలోచించి, ఇద్దరు వయొలినిస్టులను స్టుడియోలోకి పంపి అతని దుఃఖాన్ని సంగీతంతో అలంకరించారు. నేడు మన దేశంలో చాలామంది మూర్తిగారి వంటివారున్నారు. అయితే వారు గత్యంతరం లేక చేశారు. కాని నేటి తరం మూర్తులు- తెలిసి దుఃఖాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. హిరోషిమా, నాగసాకీ మీద ఆటంబాంబులు పడితే జపాన్ ప్రభుత్వం ముందు చూపుతో సరైన జాగ్రత్త తీసుకోలేదని మైకు ముందు మాట్లాడవచ్చు. 116 సంవత్సరాల చరిత్రలో కృష్ణా నదికి కనీ వినీ ఎరగని వరదలొస్తే ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్త తీసుకోలేదని మాట్లాడినవారున్నారు. నేను కాంగ్రెసువాదిని కాదు. ఏ పార్టీ తరఫునా మాట్లాడబోవడం లేదు. సమాచార యంత్రాంగం ధర్మమాంటూ ఇవాళ రాబోయే విపత్తు నుంచి ప్రాణాలను కాపాడ గలిగారు. సమాచార యంత్రాంగం లేని రోజుల్లో- శ్రీశైలం నుంచి వచ్చే నీరు 36 గంటల్లో ప్రకాశం వంతెన చేరుతుందని చెప్పే మార్గం ఇదివరకు లేదు. టెలిఫోన్ల ద్వారా అధికారులకు చెప్తే వారు టముకు వెయ్యడమో, స్థానికంగా ప్రకటనలో చేసేవారు. అర్ధం చేసుకున్నవారు జాగ్రత్త పడేవారు. మీదకు విపత్తు ముంచుకొచ్చేదాకా కొందరు కదిలేవారు కాదు. ఫలితం ప్రాణ నష్టం. ఇవాళ ఇన్ని ఛానళ్ళు గోలపెడుతూంటేనే ఇళ్ళు వదిలి రానివారున్నారు. ఏమయినా సమాచార యంత్రాంగం పుణ్యమాంటూ ప్ర్రాణ నష్టం తప్పింది. అయినా ఈ విపత్తులో ప్రజల ప్రాణాలను కాపాడడం సాధ్యమయింది. ఇది గొప్ప విషయం. తర్వాతి భాధ్యత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం. తర్వాత ఆస్తుల మాట. బతికుంటే బలుసాకు సామెతకదా? ఇలాంటి సందర్భంలో ఛానళ్ళ బాధ్యత- ప్రజలు భీతావహులుకాకుండా వారిని సముదాయించడం. ఒకవేళ పరిస్థితి విషమంగా వున్నా- ప్రాణం పోయే రోగికి డాక్టర్ ఇచ్చే సముదాయింపులాంటిదది. ఛానళ్ళు నెగిటివ్ ఆలోచనని ఫిల్టర్ చేసి, వీలయినంత ఆశనీ, ఉపకార ధోరణినీ కలిగించాలి. కారణం కోట్ల మంది చూసే ఒక ప్రసార మాధ్యమం సమాజాన్ని కకావికలు చెయ్యగలదు. కష్టంలో చేతులు కలిపి నిలబెట్టనూ గలదు. పుంఖాను పుంఖంగా పెరిగిపోతున్న ఛానళ్ళకు నేటి స్థితి కోతికి కొబ్బరికాయలాగ దొరికింది. కొన్ని చానళ్ళు ఆయా పార్టీలవి. కనుక వారికి ఉపకారం కంటె ప్రచారం ప్రదమ లక్ష్యం. కాని మిగతా ఛానళ్ళూ దాదాపు ఆ పనే చేశాయి. Sensationalism undercuts the truth and spreads panic. ఒక ఛానల్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసింది. మరో ఛానల్ తాము కనీ వినీ ఎరగని సేవ చేస్తున్నామని రొమ్ము విరుచుకుంది. మరో ఛానల్ సినీమా ప్రోగ్రాంల మధ్య వరద భీభత్సాన్ని నంజుకుంది. కాని సరదా అయిన విషయాలు ఇక్కడ చెప్పాలని వుంది: ఒకావిడ మైకు ముందు చెప్తోంది: మాకు పంచిన అన్నం పొట్లాలలో ఉప్పు ఎక్కువయిందండీ. మరొకావిడ: అల్లక్కడ ఎక్కడో పంచుతున్నారండి. మేం వెళ్ళి తీసుకోవాలంటండీ. ఒకావిడ: ఆ పొట్లాలు తింటే మా పిల్లలు ఏమయిపోతారోనని భయంగా వుందండీ. ఓ ఇంటి డాబా మీద తలదాచుకొన్న బాధితుడు: ఈ ప్రభుత్వం ఒక్కరూ మా దగ్గరికి రాలేదు. మరొకడు: ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని అడుగుతున్నాను! నారా చంద్రబాబు నాయుడు: (లక్షల గ్రామాలు నీటిపాలయి, వందల గ్రామాలు ముంపు అయాక) కనకదుర్గమ్మ ఈ జిల్లాను, మల్లిఖార్జునస్వామి కర్నూలు జిల్లాను కాపాడారు. అయితే అందరిలోకీ నా అభిమాన నాయకులు తెలంగాణా రాష్ట్ర సమితి అద్యక్షులు కె.చంద్రశేఖరరావుగారు. వారెప్పుడు, ఏది మాట్లాడినా నాకు కితకితలు పెట్టినట్టుంటుంది. వారి ఉవాచ: "నా కొడుకుల్లార.... దమ్ముంటే నా సవాలును స్వీకరించండి... దమ్ముంటే రండి” ఎందుకట? పబ్లిక్ గార్డెన్ లో లక్షమందితో సభ చేసి ఛీఫ్ ఇంజనీర్లను పిలిస్తే ప్రాజెక్టులపై బహిరంగ చర్చ జరుపుతారట. తాను తప్పయితే పబ్లిక్ గా ఉరిపోసుకుంటారట. (తెలంగాణాఉద్యమంలో ఎన్నిసార్లు "ఉరి’ని ఫణంగా పెట్టారు! రాని తెలంగాణాకు ఆయన ప్రాణాలు ఎన్నిసార్లు "ఉరి’ కి గురయేవి!) మిస్టర్ పొన్నాల లక్ష్మయ్యా! నీకు చీములేదు.... నెత్తురులేదు... ఒక్క నాలుక లేదు... ఆరు నాలుకలున్నాయి. -(ప్రదేశ్ కాంగ్రెసు అద్యక్షుడు డి.శ్రీనివాస్ తో) నువ్వు నా కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిమీద చల్లుకున్నా, కాళ్ళు మొక్కినా కాంగ్రెసులోకి వెళ్ళే ఖర్మ నాకు లేదు. (అయితే కాంగ్రెసుతో చెయ్యి కలిపే ఖర్మ వేరే విషయమేమో. దానికి ఎవరూ కాళ్ళు కడగనక్కరలేదేమో!) అన్నిటికన్నా గొప్ప విషయం ఈ కిందది: హిందూపూర్ లో 200 ఇళ్ళు కూలాయి. ఎత్తయిన ప్రదేశంలో 40 ఎకరాల పోరంబోకు ఉన్నదట. బంజారా హిల్స్ లోని తన బంగళాని విక్రయించి హిందూపూర్ లో 200 మందికీ ఇళ్ళు కట్టించి యిస్తారట!!! "నేను ఈ రాత్రే హైదరాబాదు చేరుకుని రాత్రి 10 గంటల్లోపు సీయం రోశయ్యకు ఓ లేఖ రాస్తా. మళ్ళీ తిరిగి వచ్చి నేనే పట్టా సర్టిఫికేట్లు యిస్తా. అప్పుడు కృష్ణా కాదుగదా దాని తాత వచ్చినా యిళ్ళు మునగవు.” ఇంతగా అరిటిపండు వొలిచినట్లు మరే నాయకుడూ నాకు తెలిసి ఉపన్యాసాలు ఇవ్వలేడు. అయితే ఈ పాటికే తెలంగాణాలో ప్రతి వ్యక్తి చేతిలోనూ చంద్రశేఖరరావుగారు వొలిచి పెట్టిన అరిటిపళ్ళు వున్నాయ్. అయితే అవి నోటిదాకా పోవడం లేదు. బోలెడు ఉరితాళ్ళున్నాయి. పట్టా సర్టిఫికేట్ల కోసం ఎదురుచూపులున్నాయ్. ఫలితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపడం ఒక కళ. ఆ కళను వంటబట్టించుకోవడానికి నన్నడిగితే- రోశయ్య, చంద్రబాబు, చిరంజీవి- ఆ మాటకి వస్తే మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ కూడా చంద్రశేఖరరావు బడిలో చేరాల్సిందే. అయితే ఆయన పెట్టుబడి తెలంగాణా తిట్లు. వాటిని వంట బట్టించుకోడానికి ఈ నాయకులు మరో జన్మ నెత్తాలి. అక్టోబర్ 12, 2009
************ ************
************* ************* |