Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here 
 

 భూమి పు(శ)త్రులు

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ఈ తరం గుర్తించినట్టు - ఒకడుగు ముందుకు వేసి చెపితే గుర్తించవలసి వచ్చినట్టు - మరెప్పుడూ రాలేదు. 193 దేశాలకు చెందిన 8000 మంది ప్రతినిధులు 19 రోజులపాటు - తమ తరం చేస్తున్న ఘోర తప్పిదాలను లేదా తమ తరం తప్పనిసరిగా అవలంభించక తప్పని కనీస మర్యాదలను హైదరాబాదులో జరిగే సదస్సులో చర్చించుకుంటారు. ఇది మానవుడి మనుగడకు సంబంధించిన అతి విలువయిన - అవసరమయిన, తప్పనిసరయిన - ఇంకా తెగించి చెప్పాలంటే ఇప్పటికే ఆలశ్యమయిన, చెయ్యక తప్పని పని. మానవుడి మనుగడను అతలాకుతలం చేసే ఎన్నో పనులను మనం ఏనాడో ప్రారంభించేశాం. మన మధ్య తిరిగే పిచ్చుక ఇవాళ కనుమరుగు కావడానికి, రుతుక్రమం తప్పకుండా వర్షాలు కురవకపోవడానికి, అతివృష్టికీ, ఆ వ్యవస్థకి, త్సునామీలకు - అన్నిటికీ ప్రముఖంగా మన పాత్రే ఉన్నదని మనం గుర్తించాం. కాని గుర్తించనట్టు నటిస్తున్నం. ఏం చెయ్యలో మనకి తెలుసు. చెయ్యకపోవడం ఎలాగో కూడా మనకి తెలుసు. మానవుడి అభ్యుదయానికి అర్రులు చాచడంలో ఆత్మవంచన ఉంది. ముందు తరాల దోపిడీ ఉంది. బాధ్యతల్ని విదిలించుకునే అలక్ష్యం ఉంది. వెరసి భయంకరమైన భవిష్యత్తు తొంగిచూస్తోంది.
ఒకాయన - బొత్తిగా సంప్రదాయంలో వేళ్ళున్న వ్యక్తి అన్నాడు. మనం ముందు తరాలకి ఏమీ మిగల్చడంలేదు. ఇలాగే భూమి వనర్లను ఊహించలేనంత వేగంగా, క్రూరంగా కబలించుకుంటూ పోతే మరో 70 సంవత్సరాల తర్వాత - మానవుడి ప్రాధమికమయిన వనర్లు ఉండవు. నీరుండదు. పరిశుభ్రమయిన గాలి ఉండదు. ఆరోగ్యం ఉండదు.
బతుకు మీద ఆశ ఉండదు. చచ్చిపోతే బాగుణ్ణనే ధ్యాస ఎక్కువవుతుంది. చావు సుఖంగా ఉండదు. తమ ముందు తరాలు తమని ఎంత దారుణంగా దోచుకున్నాయో అర్ధమౌతుంది. అన్నిటికన్నా భయంకరమైన నిజం - పునర్జన్మల్ని - కర్మ పరిపాకాన్ని నమ్మే ఈయన - అప్పుడూ మనమే పుడతాం కనుక - ఈ నరకాన్ని అనుభవిస్తాం - అన్నాడు.
ఈ సమావేశాలకి వందకోట్లు ఖర్చుపెడుతున్నారట. ఇలాంటి వృధా సమావేశాలకి ఖర్చుచేసే బదులు - గిరిజనులకు గోచీలు, పురజనులకు వాచీలూ ఇవ్వవచ్చుకదా అని ఓ నాయకుడు వాపోయాడు. ప్రజల్ని మురిపించే కబుర్లు చెప్పే ఈ నాయకులే ఇలాంటి వినాశానికి మూల పురుషులు. నిజానికి ఆ మేళ్ళు జరగాల్సిందే. కానీ అంతకంటే అవసరమైన - ఈ భూమి మీద మానవుని ఉనికినే సరిదిద్దాల్సిన కృషికి ఈ ప్రయత్నం. మనం పదవుల కోసం, ఎన్నికల కోసం, విగ్రహాల కోసం, సీట్ల కోస్మ నోట్ల కోసం కొట్టుకు చస్తున్నాం. కానీ నిశ్శబ్దంగా మన దారుణమయిన చావుకి పునాదులు వేసుకుంటున్నామని చాలామందికి తెలియదు.
ఒక చిన్న - కేవలం నమూనా ఉదాహరణ. ఒక కారు రోడ్డు మీద నూరు కిలోమీటర్లు నడిస్తే - ఓ మనిషి జీవితకాలం సరిపోయే ప్రాణవాయువు ఖర్చు అవుతుంది. ఈ లెక్కన - పారిస్, బీజింగ్, వాషింగ్టన్, ముంబై, కలకత్తా రోడ్ల మీద గంటకి ఎన్నివేల లక్షల మందికి సరిపోయే ప్రాణవాయువు ఖర్చవుతుందో ఎవరయినా ఊహించగలరా?
ఈ సమావేశాలలో పాల్గొంటున్న 193 దేశాల ప్రతినిధులలో కనీసం 6,000 మందయినా ఈ అనర్ధాన్ని గుర్తుపట్టి ఉంటారు. మరి మిగతా 2,000 మంది? వారు మన నయకులు, మన మంత్రులు, మన ప్రభువులు. వీరంతా ఎవరో రాసిచ్చిన భాషణలు చదువుతారు. వారికి ఆ చదివే విషయాలు అర్ధం కాలేదని మనకి అర్ధమవుతూంటుంది. అర్ధమయే నిపుణులు వింటారు. వారికి ఏం చెయ్యాలో తెలుసు. వీరికి ఎందుకు చెయ్యకూడదో తెలుసు. ఈ రెండు వర్గాల అంతరంతో ఫాటు అభివృద్ది దేశాల పొగరూ, పెద్దరికం, దబాయించే గడుసుదనం - ఇవాళ తప్పనిసరిగా ఆలోచించ్పజేసే త్సునామిలు, అనావృష్టి, అకాలంలో వృక్ష, పక్షి, క్రిమి, జలచరాల వినాశనం - ఇదంతా రాజకీయ విషవలయం. మనవుడు తెలిసి తెలిసి - తనంతట తానే మునిగిపోతున్న ఊబి.
మనిషి తెలివైన వాడు. జంతువు విజ్నత గలది. ఒకటి విజ్నత (ఇంటలెక్ట్). రెండోది విజ్నానం (ఇంటలిజెన్స్ ) ఒకటి జన్మతహ వచ్చిన శక్తి. 80 శాతం మానవాళి అర్ధంలేని వైరుధ్యాలతో, అవసరంలేని బంధాలతో సతమతమౌతూ సమూహికమైన విణాశానికి, విధ్వంసానికీ హేతుభూతమౌతున్నాడు - అన్నారు స్వామి పార్ధసారధి, అడవిలో సింహం ఆకలివేసినప్పుడే జంతువుని వేటాడుతుంది. తిన్నాక ఎనిమిది రోజులు తన చుట్టూ తిరిగే సాధుజంతువుల్ని పట్టించుకోనయినా పట్టించుకోదు. అది తినగా వదిలేసిన ఆహారాన్ని నక్కలు, దుమ్ముల గొండీ, తోడేళ్ళూ తింటాయి. ఇంకా మిగిలిన వాటిని గద్దలూ, రాబందులూ తింటాయి. ఇంకా మిగిలినవాటిని చీమలు, సూక్ష్మక్రిములూ తింటాయి. ఇది ఒక అపూర్వమైన జీవన వలయం (లైఫ్ సైకిల్). ఇది సహజీవనానికి ప్రకృతిలోనే ఏర్పడిన క్రమశిక్షన. మనవుడు మేధావి. దురాశ, దుర్మార్గం అతను పెంచుకున్న లక్షణాలు.
ఏనుగు అంతం కోసం కొన్ని వ్మదల ఏనుగుల్ని మట్టుబెట్టిన ఒక్క వీరప్పన్ ఉదాహరన ఇందుకు చాలు.
ఎన్ని వందల ఎకరాల అరణ్యం ఎస్ ఈ జెడ్ ల పేరిట స్వాహా అవుతోంది? ఎన్ని వందల జంతుజాలానికి రక్షణ లేక కాలగమనంలో అంతరించిపోతున్నాయి. సిమ్మెంటు జనరణ్యాల మధ్య మృగ్యమౌతున్న వృక్ష సంపదలేమికి మన చిన్నతనంలో మన మధ్య తారట్లాడిన పిచ్చుక ఏమయింది? పువ్వు ఫలం కావడంలో సీతాకొక చిలుక ఎంత గొప్ప పాత్ర వహిస్తోందో ఎందరికి తెలుసు?
మన పక్కన పెరిగే చెట్టుకీ, మన పక్కన తిరిగే బల్లికీ, మన ఉనికికీ సంబంధం ఉంది. సమస్త జీవకోటీ పరస్పరాశ్రయంతో జీవిస్తున్నాయి. ఈ మాటని పురాణాలు చెప్పాయి. పెద్దలు చెప్పారు. శాంతియుత సహజీవనం ఔదార్యం కాదు. అవసరం. ప్రతీ జీవరాశికీ హక్కు. మన ముత్తాతలు పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచించలేదేం? వాళ్ళ జీవన సరళి పొరుగు జీవిని కబళించేది కాదు కనుక. కానీ మనం ఉంటున్న చలువ గది - ఎంత భయంకరమైన పర్యావరణ కాలుష్య హేతువో ఎందరీ తెలుసు? తెలిసినా ఎందరు ఒప్పుకుంటారు? తెలిసి చర్య తీసుకోవాలంటే ఎన్ని పరిశ్రమలు మూతబడతాయి? ఎన్ని బలమైన లాబీలు కత్తులు దూస్తాయి?
అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి అనుబంధంగా ఓ బృహత్తర ప్రణాళిక - భూమిపై జీవన పరిరక్షణ శక్తుల గుర్తింపుకు (ఇది సరైన అనువాదం కాదు - ఎర్త్ లైఫ్ సపోర్టింగ్ సిస్టంస్ EOLSS) కృషి జరుగుతోంది.
ప్రపంచ మేధావుల పరిశోధనలు, పరిశీలనలను గ్రంధ బద్దం చేసే ఈ అనూహ్యమైన, అసాధారణమైన కార్యక్రమంలో 18 విజ్నాన సర్వస్వాలను - రూపొందిస్తోంది. ఇప్పటికి 800 గ్రంధాలు (ఈబుక్స్) ఇంటర్నెట్ లో ఉన్నాయి. ప్రపంచంలో ఎన్నో దేశాల శాస్త్రజ్నులు, మేధావులు ఉన్న ఈ స్మస్థ సంపాదక మండలిలో - అదృష్టవశాత్తూ నేనూ ఒక సంపాదకుదిని. అంతేకాదు. ఈ సంస్థ ప్రణాళికను సిద్ధం చేసే జాయింట్ కమిటీలో ప్రపంచంలో కేవలం 14 మందే ఉంటారు. అందులో నేనొకడిని. ఈ విమర్శ బాధ్యతారహితమని తోచిపుచ్చుతారేమొనని నన్ను నేను సమర్ధించుకోడానికి ఈ విషయాన్ని సాక్ష్యం తెచ్చుకుంటున్నాను నా గొప్పలు చెప్పుకోడానికి కాదు.
ఇది చాలా అవసరమైన , మనల్ని మనం - పొరపాటు మనల్ని మనం ఎలాగూ దోచుకుంటున్నాం( నేను స్కాంల గురించీ, పదవుల గురించీ మాట్లాడడం లేదు - కొందరయినా భుజలు తడువుకుంటున్నారని నాకు తెలుసు) ముందు తరాల వనరలను రక్షించాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. 70 ఏళ్ళ తర్వాత 'స్నాసం' అంటే ఏమీటో తెలియని పరిస్థితి వస్తుందని నిరూపించిన ఒక నిపుణుడి రిపోర్ట్ నా దగ్గర ఉంది.
మనసుంటే - చేతనయితే ప్రముఖ దర్శకుదు యాన్ ఆర్తస్ బెర్ర్టాండ్ తీసిన "హోం" అనే అద్భుతమైన పరిశోధనాత్మక చిత్రాన్ని చూడండి. 35 దేశాలలో చిత్రించిన ఈ అపూర్వమైన చిత్రానికి ప్రముఖ హాలీవుడ్ నటి గ్లెన్ క్లోస్ కామెంటరీ చెప్పింది. ఈ భూగ్రహం రూపుదాల్చడం, అపూర్వమైన ప్రకృతి పరిణామం, వైభవం, క్రమంగా శిధిలమౌతున్న వనర్లు, జరుగుతున్న దోపిడీ - ఇంకా ఇంకా ఎన్నో తెలుస్తాయి. దీనిని ఫ్రెంచి, ఇంగ్లీష్, జర్మనీ, స్పెయిన్, రష్యన్, అరబిక్ భాషల్లో తర్జుమా చేశారు. ఇక్క ఇంటర్నెట్ లోనే 320 లక్షల మంది చూశారు. ఒక్క గ్రాన్స్ లోనే 83 లక్షల మంది చూశారు. గొప్ప చిత్రాలు చూసే అవసరం మనకు ఎలాగూ లేదు కనుక - తెలుగులోకి తర్జుమా కాలేదు.
జరిగే అన్యాయానికి జరిపే మన తరం 'ఎరుక ' కూడా ఒక చికిత్సకి ప్రారంభమే. ఆ ప్రయత్నమే హైదరాబాదులొ ఈ 19 రోజుల సదస్సు చేయగలదని ఆశిద్దాం.
 


      gmrsivani@gmail.com  

 
                                                                           అక్టోబర్  08, 2012

   ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage