Click Play to listen audio of this column
If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
 
చట్టానికి గాజులు
గొల్లపూడి మారుతీరావు

      gmrsivani@gmail.com

   మన రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ రాక్షస ప్రవృత్తి గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటాం. ఇప్పటికీ ఆ పీడకల నుంచి తేరుకోలేని దేశాలు, వ్యవస్థలు, కుటుంబాలూ, వ్యక్తులూ ఉన్నారు. ఈ పీడకలలను తమ కథల్లో, నవలల్లో, సినిమాల్లో ఇప్పటికీ తల్చుకు దు:ఖిస్తున్న సందర్భాలున్నాయి. మానవాళి చరిత్రలో అది మాయని, మానని గాయం. అంతకన్న పైశాచికమైన 'ఇండియా' మార్కు దౌర్భాగ్యమిది.
అనగా అనగా వాచాతి అనే గ్రామం. తమిళనాడులో ధర్మపురికి 50 కిలోమీటర్ల దూరంలో, హరూర్‌ అనే ఊరుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండూ గుర్తులుగా చెప్పడానికి కారణం హరూర్‌లో పోలీస్‌ స్టేషన్‌ ఉంది. ధర్మపురిలో సెషన్స్‌ కోర్టు ఉంది. ఈ రెండింటితోనూ ఈ కథ ముడిపడివుంది. 19 సంవత్సరాల కిందట సరిగ్గా చెప్పాలంటే 1992 జూన్‌ 20న వాచాతి గ్రామంలోని ఆదివాసులు మంచిగంధం చెట్లను పడగొడుతున్నారని విని ఫారెస్టు విభాగం, పోలీసు విభాగం, రెవిన్యూ విభాగానికి చెందిన వారు దాదాపు 300 మంది ఆ గ్రామం మీద దాడి చేశారు. ఆ గ్రామంలో ఉన్న ప్రతీ ఆడదాన్నీ నిర్దాక్షిణ్యంగా మానభంగం చేశారు.
రెండే రెండు ఉదాహరణలు. ఎనిమిదో క్లాసు చదువుకుంటున్న 13 ఏళ్ల అమ్మాయిని జుత్తు పట్టుకుని గుడిసెలోంచి ఓ పోలీసు రాక్షసుడు ఈడ్చుకొచ్చాడు. బూతులు తిట్టాడు. పక్కన ఉన్న చెరువు గట్టుకి అంతా కలిసి ఈడ్చుకొచ్చారు. ''నేను చదువుకుంటున్న చిన్న పిల్లని బాబూ. నన్ను విడిచిపెట్టండి'' అని ఆ పిల్ల మొత్తుకుంది. ''నువ్వు ఆడదానివి. అదిచాలు నాకు'' అని ఆ కాకీ దగుల్బాజీ సమాధానం. పరంధాయి అనే ఆదివాసి ఈ కథని విప్పింది. తన కళ్లముందే 16 ఏళ్ల కూతుర్ని ఈడ్చుకొచ్చి ఆవిడ కళ్లముందే బట్టలు ఊడదీశారు. బట్టల్లేని ఆ పిల్లని మధ్యాహ్నం 2.45 కి తీసుకుపోయారు.
సగం స్పృహతో ఉన్న పిల్లని 9 గంటలకి వెనక్కి తీసుకొచ్చారు. ఇంటిదగ్గర వదిలిపెట్టడానికి కాదు. ఆ రాత్రి ఫారెస్టు బంగళాలో ఆఫీసర్ల పక్కలోకి చేర్చారు ఈ తార్పుడుగాళ్లు. ఈ అరాచకాన్ని తట్టుకుని ఇప్పటికీ బతికే ఉందీ అమ్మాయి. ఆమెకి పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. పైన చెప్పిన చదువుకంటున్న పిల్లనీ ఓ ఆదివాసి పెళ్లి చేసుకున్నాడు. మానవత్వానికి మరో బంగారు అంచు ఈ ఔదార్యం. గత 19 సంవత్సరాలుగా ధర్మపురి కోర్టులో జరుగుతున్న విచారణకి ఈ కుటుంబాలన్నీ వచ్చిపోతున్నాయి. సాక్ష్యాలు చెప్తూనే ఉన్నాయి. ఏనాటికయినా న్యాయం జరగదా అని ఎదురుచూస్తున్నాయి.
అంతకు ముందు కథ మచ్చుకి. ఈ దురన్యాయం, కీచకుల దారుణ నేరకాండ బయటి ప్రపంచానికి 15 రోజుల దాకా తెలియలేదు. గిరిజనులు హరూర్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు ఇయ్యబోయారు. కాని ఫిర్యాదు తీసుకోవలసిన పోలీసు నీచుడికీ ఇందులో పాత్ర ఉంది. అందుకని కేసు నమోదు కాలేదు. గిరిజనుల తరఫున కమ్యూనిస్టు మార్క్సిస్టు కార్యకర్తలు పూనుకున్నారు. ఈ అరాచకాన్ని బయటపెట్టడంలో వారి కృషి గొప్పది. వారు కార్యరంగంలోకి దిగారు. నాలుగు నెలలకి కేసు నమోదు అయింది.
అప్పటికి ఈ పీడితులు ఎక్కడ ఉన్నారు? తమ స్త్రీల మీద జరిగిన దురన్యాయాలకు హడలెత్తి వాళ్లని తీసుకుని అడవుల్లోకి చెట్టుకొకరు పుట్టకొకరుగా పారిపోయి తలలు దాచుకున్నారు. వాళ్లందరినీ పార్టీ కార్యకర్తలు సముదాయించి వారి గుడిసెలకు చేర్చారు. పల్లె అంతా అస్తవ్యస్థమై కిరసనాయిలు వాసనకొడుతోంది. వీళ్లని, 18 మంది మానభంగం పాలయిన వారినీ తీసుకుని ఒకనాటి అర్ధరాత్రి ధర్మపురి జిల్లా కలెక్టరుని లేపి చర్య తీసుకోవలసిందని నిలదీశారు. అలా కార్యాచరణ ప్రారంభమయింది. మరో నాలుగు నెలల తర్వాత అంటే జనవరి 1993న హైకోర్టు సిబిఐకి ఈ కేసుని అప్పగించింది. ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు? 269 మీద. ఇది ఈ దేశపు చరిత్రలో రికార్డు. ఈ కేసులో నలుగురు ఐఎఫ్‌ఎస్‌ ఫారెస్టు ఆఫీసర్లు ఉన్నారు. పశుత్వాన్ని పంచుకోడానికి అన్ని డిపార్టుమెంటులూ కలిశాయి. 126 మంది అటవీ శాఖవారు, 84 మంది పోలీసు శాఖవారూ, అయిదుగురు రెవిన్యూ శాఖవారూ -ఈ పాపాన్ని పంచుకున్నారు. 19 సంవత్సరాలు ఈ కేసు నడిచింది. ఈ వ్యవధిలో 54 మంది చచ్చిపోయారు. చాలామంది ఉద్యోగాలనుంచి రిటైరయారు. ఇద్దరికి పక్షవాతం వచ్చి కాళ్లు చచ్చుబడ్డాయి. మొన్న తీర్పుని కోర్టు ప్రకటించిననాడు వీరంతా కోర్టుకి హాజరయ్యారు. నడవలేని ఈ ఇద్దరు కోర్టు మెట్లమీద చతికిల బడ్డారు. కోర్టు గుమాస్తా న్యాయమూర్తి ఆదేశం మీద వీరికి శిక్షల్ని చదివి వినిపించారు. బంధువులతో వచ్చిన 17 మందిని అప్పటికప్పుడు 19 సంవత్సరాల తర్వాత జైలుకి తరలించారు. మిగతా వాళ్లకి పై కోర్టులకు అప్పీలు చేసుకోడానికి నెలరోజులు వ్యవధి ఇచ్చింది కోర్టు. కొందరికి రెండు నుంచి పదేళ్ల దాకా జైలుశిక్షలు పడ్డాయి. ఇంత ముమ్మరంగా శిక్షలు విధించడం భారత దేశ చరిత్రలోనే మొదటిసారి.
ఈ దారుణానికి బలయినవారికి ప్రభుత్వం 15 వేలు నష్టపరిహారం ఇచ్చింది. ఈ 19 సంవత్సరాలూ తమకు జరిగిన అన్యాయానికి ముద్దాయిలు శిక్ష అనుభవించాలని ఎదురుచూస్తూ కోర్టుల్ను పట్టుకు తిరుగుతూ ఈ దారుణాన్ని ఎప్పటికప్పుడు పునశ్చరణ చేస్తూ, సాక్ష్యాలు చెప్తూ గిరిజనులు బతికారు. ఇది వారికి యావజ్జీవ కారాగార శిక్ష. ఇంకా ఇప్పటికీ కథ ముగియలేదు. ముద్దాయిలు పైకోర్టులకి వెళ్తారు. మళ్లీ విచారణ సాగుతుంది. మళ్లీ ఈ నిస్సహాయులు తమకు జరిగిన అన్యాయాల గోడుని పై కోర్టుల్లో చెప్పుకుంటారు. మరికొందరు చచ్చిపోతారు. ఇంకొందరికి పక్షవాతం రావచ్చు.
కాని ఈ దేశంలో న్యాయానికి పట్టిన దురవస్థ ఇది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎస్‌.మోహన్‌ అన్నారు: ఎన్నికల కేసుల విచారణ ముగించడానికి నిర్దిష్టమైన గడువుంది. కాని ఇలాంటి కేసులకి లేదు వీటికీ ఉండాలి. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ పి.ఎస్‌.రామన్‌ మాట: నేరచట్టాలు నేరస్థుల్ని శిక్షించడానికి, వారిని ఆపు జెయ్యడానికి ఉపయోగిస్తాయి. కాని నిర్ణీత సమయంలో శిక్షలు పడకపోతే న్యాయవ్యవస్థ ఉద్దేశమే మంటగలిసిపోతుంది. ముంబై హైకోర్టు న్యాయమూర్తి హెచ్‌.సురేష్‌, నేరం జరిగిన 8 -10 ఏళ్ల దాకా శిక్షలు పడకపోతే నేరస్థులకి గుండె ధైర్యం పెరుగుతుంది. వాళ్లకి కొమ్ములు మొలుస్తాయి. దారుణమైన నేరం చేసి చచ్చినవాళ్లు తృప్తిగా నవ్వుకుంటూ చచ్చివుంటారు. కోర్టు గుమ్మం దగ్గర నడవలేక చతికిల బడ్డ దౌర్భాగ్యులిద్దరికీ కాళ్లా వేళ్లా పడిన 13 ఏళ్ల అమ్మాయి కన్నీళ్లు ఒక్కసారయినా మనస్సులో కదిలివుంటాయి.
కాని మిగతా 199 మంది మాటేమిటి?
సుప్రీం కోర్టు ఖరారు చేసిన మరణ దండనల్ని ఆపాలని రాష్ట్ర శాసనసభలు (తమిళనాడు, కాశ్మీర్‌) రెచ్చిపోతున్న నేపథ్యంలో చట్టానికి గాజులు తొడిగే నాయకత్వం ఈ దేశంలో పెచ్చురేగిపోతోంది. దౌర్భాగ్యుడిని కాలం శిక్షిస్తుందని సరిపెట్టుకోవడం నిస్సహాయుడు నమ్మే మెలోడ్రామా. చట్టాన్ని చవటని చేయడం నేటి నాయకత్వం కొనసాగిస్తున్న కొత్త మెలోడ్రామా. చట్టానికి ఈ మాత్రం చెల్లుబాటూ లేనినాడు ఊరుకొక వాచాతీ దర్శమిచ్చినా ఆశ్చర్యం లేదు. ఇది నిరాశావాది ఆక్రోశం కాదు. చేతకాని చట్టాలకు తలవొంచిన ఈ వ్యవస్థ దౌర్భాగ్యానికి దారి తోచని ఓ నిస్సహాయుడి ఆవేశం. ఇందులో వాచాతీ గిరిజనుల కన్నీరు ఉంది. ఆవేశం ఉంది. నిస్సహాయత ఉంది. గాయపడిన గుండెలతో జీవికల్ని నడుపుకుంటున్న వారి దయనీయమైన జీవనయాత్ర ఉంది. ఈ దేశం సిగ్గుతో తలవొంచుకోవలసిన భయంకరమైన పీడన ఉంది.


                                               అక్టోబర్ 03,2011

       ************               ************           *************          *************
Also meet Maruthi Rao Garu in his telugu blog gollapudimaruthirao.blogspot.com
Read all the columns from Gollapudi  గొల్లపూడి గారి మిగతా కాలంస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


KOUMUDI HomePage