Click Play to listen audio of this column If you have issues with Voice clarity, upgrade your Flash Player Version. Click Here
ఎత్తయిన ఆకాశం
మరో 48 గంటల్లో గాంధీ జయంతి. 143 సంవత్సరాల కిందట గాంధీ పుట్టిన రోజు. 64
సంవత్సరాల కిందట గాంధీ నిర్యాణం. గాంధీ తత్వాన్ని భ్రష్టు పట్టించడం
ప్రారంభమయి అప్పుడే 65 సంవత్సరాలయిపోయింది.
ఈ తరంలో చాలామందికి గాంధీ చరిత్ర. కొందరికి జ్ఞాపకం. మరీ ఇటీవలి
తరానికి గాంధీ ఓ సినిమా. రాజకీయ నాయకులకి గాంధీ కొంగుబంగారం. ఉద్యమకారులకి
సాకు. కాని ఆయా దేశాల చరిత్రల్నే మార్చిన ఇద్దరు ఉద్యమకారులకి గాంధీ
స్ఫూర్తి, ఆదర్శం, ఆకాశం. వారిద్దరూ మార్టిన్ లూధర్‌కింగ్, నెల్సన్
మండేలా. ఓ పాతికేళ్ల కిందట ప్రతి తెలుగు సినిమా మద్రాసులో తయారయేది. ఆ
రోజుల్లో మెరీనా బీచ్‌లో దేవీప్రసాద్ రాయ్ చౌదరీగారి విగ్రహం ముందు ఒక్క
షాటయినా తీయడం సెంటిమెంటు. మరీ బాలచందర్, వి.మధుసూదనరావు వంటి దర్శకులు
పాటల్నే తీశారు. ఇవాళ గాంధీ విగ్రహాలను మనం వెతుక్కోవాలి. నేడు మతాతీత,
కులాతీత వ్యవస్థకోసం జబ్బలు చరుచుకుంటున్న రాజకీయ నాయకులు కోకొల్లలుగా
కనిపిస్తున్న, వినిపిస్తున్న రోజులలో -2012లో -ఇటీవల పేర్లు మారిన పసుంపోం
ముత్తరామలింగ తేవర్ రోడ్డులే కనిపిస్తాయి. (నేను గడుసువాడిని కనుక
తెలుగుపేర్లు ఉటంకించడం లేదు). ఇవాళ గాంధీ విగ్రహాలకు బదులు స్థానిక కుల
వీరులు, ప్రాంతీయ నాయకులు, జాతీయ భావాల ముసుగుకింద రొమ్ము విరుచుకునే
గూండాల విగ్రహాలు కనిపిస్తాయి.
ఇవాళ పదేళ్ల కుర్రాళ్లు పదిమందిని గాంధీ విగ్రహం ముందు నిలబెట్టి ఆయన్ని
గుర్తుపట్టమంటే కనీసం నలుగురయినా నీళ్లు నములుతారు. వాళ్లని మనం
క్షమించవచ్చు. ఆ మధ్య పార్లమెంటు సభ్యులను 'జణగణమణ' వ్రాసిందెవరని అడిగితే
తెల్లమొహాలు వేసిన కార్యక్రమాన్ని టీవీల్లో చూసి ఆనందించాం. ఇవాళ
అజ్ఞానానికి బుకాయింపు అందమయిన తొడుగు. నేడు గాంధీ వెలిసిపోయిన జ్ఞాపకం.
నిజాయితీని -నిజాయితీగా అనుసరిస్తే సత్ఫలితాలు ఉంటాయని నిరూపించిన -గాంధీగిరి
-చిత్రం నేటి ప్రేక్షకులకు వినోదం. చూసి మరిచిపోయారు. అలనాడు అదే నిజానికి
కట్టుబడి కొన్ని లక్షలమంది -గ్రామాలకి గ్రామాలు దండీ యాత్రలో గాంధీజీ వెనుక
నడిచాయి. ఇప్పుడు 'నిజాయితీ' కేవలం వినోదం స్థాయికి పరిమితమయిపోయింది.
గాంధీ అప్పుడెప్పుడో -143 ఏళ్ల కిందట మహాత్ముడిగా పుట్టలేదు. 123 ఏళ్ల
కిందట ఆయన టెంపుల్ ఇన్‌లో బారిస్టరు. 119 సంవత్సరాల కిందట దక్షిణాఫ్రికాలో
పౌరహక్కుల కార్యకర్త. 97 సంవత్సరాల కిందట దేశీయోద్యమంలో పాల్గొనడానికి
షిప్పు దిగిన ఔత్సాహికుడు. తరువాత ప్రపంచం విస్తుపోయి చూసిన స్వాతంత్య్ర
సమరయోధుడు. అటు తర్వాత రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య సింహాసనాన్ని
పునాదుల్తో గజగజలాడించిన శాంతి సమర నాయకుడు. ఆ పైన రాజకీయ సిద్ధాంతాలకూ,
ఆధ్యాత్మిక చింతనకీ ఊహించనయినా ఊహించలేని వంతెనని నిర్మించిన జిజ్ఞాసి.
మతాన్ని మానవ జీవితానికి ఊపిరిగా మలిచిన తత్వజ్ఞుడు. ఒక సమగ్రమైన ఆలోచనా
స్రవంతిని జీవితంలో ప్రతీ దశలోనూ ప్రోదుచేస్తూ సంపూర్ణ వ్యక్తిత్వాన్ని
ఆవిష్కరించాడు మహాత్ముడు.
అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ముందు ఓ చిన్న ఉదాహరణ. మనం
టీవీల్లో ఇంగ్లీషు హాస్య నాటికల్ని చూస్తూంటాం. ప్రతీ హాస్యోక్తికీ
ప్రేక్షకుల నవ్వుల్ని ఆ నాటికలోనే చేరుస్తారు. ఆ హాస్యోక్తి పర్యవసానాన్ని
క్రియాత్మక దశలోనే పొందుపరిచే ప్రయత్నమది. ఒక కళ, ఒక ఉద్యమం, ఒక పాట -ఏదయినా
దాని ఫలితం అవతలి వ్యక్తికి అందినప్పుడే దాని పర్యవసానం. శ్రోతలేని పాటకి
వన్నె లేదు. అలాగే ఒక రాజకీయ ఉద్యమానికి -ఆ ఉద్యమ లక్ష్యాన్ని అర్థం
చేసుకుని తలవొంచే వ్యవస్థ ఉన్నప్పుడే చరితార్థత. గాంధీజీ శాంతియుత పోరాటంలో
బలాన్నీ, సబబునీ, ఆవేశాన్నీ, ఒక జాతి లక్ష్యాన్నీ అర్థం చేసుకుని, వారి
ఆవేశాన్ని గౌరవించి తలవొంచే పెద్ద మనసు, ఆబ్జెక్టివిటీ (ఏ జనరల్ డయ్యర్
వంటివారినో మినహాయిస్తే) అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం రాజనీతిజ్ఞతకి నిదర్శనం.
గాంధీజీ విజయంలో ప్రత్యర్థుల లొంగుబాటు వాటా ఉంది. అలాగే 25 సంవత్సరాలు
నిశ్శబ్దంగా జైల్లో మ్రగ్గిన ఓ శాంతి వీరుని (నెల్సన్ మండేలా)
సంకల్పబలానికి -ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ శాంతియుత పోరాటానికి
దక్షిణాఫ్రికాలో డి క్లార్క్ ప్రభుత్వం తలవొంచింది.
గాంధీజీ ఉద్యమం ఏ నాజీ జర్మనీలోనో, ఏ తాలిబన్ ఆఫ్ఘనిస్థాన్‌లోనో, ఏ సద్దాం
హుస్సేన్ ఇరాక్‌లోనో జరిగివుంటే -నాధూరామ్ గాడ్సేదాకా ఆ ప్రభుత్వాలు
ఆగేవికావు. ఓ ఉద్యమం కృతార్థత దాని పర్యవసానంలో, ప్రత్యర్థుల మన్ననలో
ఉంటుంది. అవగాహనలో ఉంటుంది. గౌరవింపులో ఉంటుంది.
ఎక్కడో తమ మతాన్ని గర్హించే సినిమాని ఎవరో తీస్తే -ఎన్నో దేశాలు
భగ్గుమంటున్నాయి. ఇది మత సంయమనం లేమికి నిదర్శనమంటూ గాంధీజీని ఉదహరించారు
అమెరికా అధ్యక్షులు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో. ఒకే ఒక్క సందర్భాన్ని
గుర్తు చేస్తాను. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక నోఖాలీలో జరిగిన మారణ
హోమంలో నహారీ అనే బీహారీ బాపూజీ దగ్గరికి వచ్చి ''నేనో ముస్లిం పసిబిడ్డని
దారుణంగా చంపాన''ని చెప్పుకున్నాడు. అప్పుడు బాపూజీ మాటలివి: '' నువ్వు నరకం
నుంచి బయటపడడానికి దగ్గర దారి నాకు తెలుసు. వెళ్లి, తల్లిదండ్రులు హత్య
అయిన ఓ ముస్లిం కుర్రాడిని వెదుకు. అతన్ని నీ కొడుకులాగ -కాని ముస్లిం లాగ
పెంచు''. మత సామరస్యం, మానవతా విలువల ఔన్నత్యానికి ఇంతకన్న దగ్గర తోవ
కనిపించదు. ప్రస్తుతం గాంధీజీ అమెరికా ఐక్యరాజ్య సమితిలో వినిపిస్తున్నాడు.
ఆయన పుట్టిన దేశంలో కనిపించడం లేదు.
ఉద్యమాల లక్ష్యాన్ని స్వప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఏకపక్షంగా
నిర్ణయాలు తీసుకునే పాలక వ్యవస్థల నిర్వాకం మనం చూస్తూనే ఉన్నాం. ఏతావాతా
గాంధీజీ ఓ గొప్ప వ్యవస్థకి అభిజ్ఞ. ఆయన్ని ఒక లేబుల్‌గా, చాకలి మార్కుగా,
బ్రాండ్‌గా, ఆయన 'శాంతి'ని సాకుగా వాడుకునే తరం వచ్చేసింది. అయితే నాసిరకం
సరుకు లేబుల్‌ని ఎప్పుడూ ఆకాశంలో ఉంచుతుంది. అలాంటి ఎత్తయిన ఆకాశం -గాంధీజీ.